Tuesday, January 21, 2025

అసలు అమ్మకేమయింది?

మాడభూషి శ్రీధర్

అమ్మ స్నానాలగదిలోకి పోవడం మామూలే… కాని కొంచెం సేపటికి ఢామ్మని కింద పడ్డ శబ్దం. రాతివెండి బకీటు దొర్లిన చప్పుడు. చెంబు పడిపోయిన చప్పుడు పెద్దగా వినిపించింది. కాని అమ్మ అరిచిన చప్పుడు వినబడలేదు. లోపల చప్పుడు వినబడగానే కొడుకు బయట కేకపెట్టినాడు.

నాన్న పరుగెత్తుకు వచ్చినాడు. బాత్రూం లోపల గొళ్లెం ఉన్నా రేకు తలుపు పీకడానికి సమయం పట్టలేదు. నాన్నకు ఆవేశం ఆగ్రహం బాధ ఆవేదన, హయ్యో మళ్లీ జరిగిందా అనే ఆక్రోశం అన్నీ కలసి వస్తున్నాయి. బాత్రూం తలుపు మీద వేసిన చీరను లంగాను ఆమె మీద పరిచి, ఎత్తుకుని తీసుకు వచ్చినాడు నాన్న. ‘ఆ మంచం మీద పరుపు తీయిరా’ అని అరిచినాడు.. వణుకుతున్న కొడుకు పరుపు పీకి పక్కన పడేసినాడు.  అమ్మను పడుకోబెట్టాడు. అమ్మ మాట్లాడడం లేదు. కళ్లు తేలవేసినట్టు ఉన్నాయి. భయం భయంగా ఉన్నది. అమ్మకేమయింది? మళ్లీ ఎందుకు పడిపోయింది? అసలు ఇదేమిటి? కొడుక్కు అర్థం కావడం లేదు.  ఇనుప తాళపు చేతుల గుత్తి, ఇనుప గంటె తెచ్చి అమ్మచేతిలో ఇరికిస్తున్నారు. అది ఎందుకో తెలియడం లేదు.

తల్లీ కొడుకు

అందరం భయపడుతున్నాం. కొంచెంసేపయిన తరువాత అమ్మ కళ్లు తిప్పింది. పక్కన ఇద్దరు పిల్లలు, చిన్న కూతురు ఆందోళనతో చూస్తున్నారు. అమ్మ నాకేమయిందని బలహీనంగా అడుగుతున్నది.

‘‘చలి. కాగపెట్టుకున్న నీళ్లతో స్నానం చేయక తప్పదు. వేడినీళ్లు తోడిపెట్టుకున్నది అమ్మ.  ఎక్కువ వేడి చేయద్దు అని నీకు తెలుసు కదా… వేడి ఎంత ఉండాలో చూసుకోవలసిన పని లేదా. నేను ఉన్నాను గనుక సరిపోయింది. లేకపోతే నీ గతి ఏమిటో ఎప్పుడైనా ఆలోచించినవా… నువ్వు స్నానం చేయకపోయినా మంచిదే కాని వేడినీళ్లు పోసుకుని పడిపోకు అని ఎన్ని సార్లు చెప్పినా..’’ అని నాన్న కోపం, బాధ కలగలిపిన విసుగుతో మాట్లాడుతున్నాడు. పిల్లలకు ఏమీ తెలియడం లేదు. వేడినీళ్లకు పడిపోవడానికి మధ్య సంబంధం ఏమిటి?

బాత్రూంలో అమ్మ ఎందుకు పడిపోయింది? స్నానం చేస్తే పడిపోతారా? చిన్నపిల్లల మనస్సుల్లో ఇవీ సమాధానం లేని ప్రశ్నలు. నాన్నను అడగాలంటే భయం, అమ్మను అడగాలంటే కూడా ఏమవుతుందో అని భయమే. అమ్మ నీరసంగా పడుకున్నది. కొంత సేపడితరువాత లేచింది. బకీటు కొట్టుకుపోయిన గాయాలు, తలకు భుజాలకు రాసుకుపోయిన దెబ్బలు..అవన్నీ చూసుకుంటూ ఉంటే .. పిల్లలకు ఏడుపు వస్తూనే ఉంది..  అబ్బా నొప్పి అని బాధపడుతున్నది అమ్మ. .

అమ్మ బాత్రూంలోకి పోతున్నదంటే చాలు గుండె దడదడలాడిపోయేది. 

నాన్న …. ‘అరేయ్ వేడి ఎక్కువ లేకుండా చూడ్రా…’ అని తీక్షణంగా అరిచే వాడు…

అమ్మయ్య అమ్మ పడిపోలేదు…అని ఊపిరి పీల్చుకునేది ..

….

ఎపిలెప్సీ బాధితుల హక్కులు, వారి పట్ల బాధ్యతలు అనే అంశంపైన చట్టపరమైన అంశాలుచెప్పమని ఒక సారి అంతర్జాతీయ ఎపిలెప్సీ వైద్యనిపుణుల సదస్సు వారు నన్ను కోరారు. అప్పుడు ఈ దృశ్యాలన్నీ కళ్లలో మెదిలాయి. కళ్లు చెమర్చాయి. అమ్మకు ఈ లక్షణాలు ఉన్నాయని తెలియదు. దీనికి చికిత్స ఉంటుందనీ తెలియదు. తెలిసినా డాక్లర్లకు చూపించి నయం చేయించే ఆలోచన రావాలంటే దానికి కావలసిన డబ్బు ఉండేది కాదు. ఎవరు బతికిస్తారు…? ఏ విధంగా..? అని నన్ను నేను అడుక్కుంటూ నా కుటుంబం పరిస్థితే ఇట్లా ఉంటే పేదలను కాపాడేదెవరు?  అని ఆలోచిస్తూనే నా ప్రసంగం ముగించాను.  ఈ విషయాన్ని కూడా ప్రస్తావించాను. తరువాత డాక్టర్లు నాకు శాస్త్రీయంగా ఈ జబ్బుగురించి చెప్పారు.  కాని అప్పడికీ ఆ జబ్బు పోయింది. అమ్మ ఆ జబ్బును ఏమందులూ మాకులూ లేకుండానే జయించింది. ఇవన్నీ తలుచుకుని బాధ పడే దీనురాలు కాదు అమ్మ. నేనే అప్పుడప్పుడు ఈ గాధ తలుచుకుని ఏడుస్తుంటాను. పిచ్చివాడిని. నేను స్నానం చేసేప్పుడు నీళ్లు ఎక్కువ వేడైతే నాకు ఈ ఘట్టాలన్నీ కళ్లముందు కనబడి ఒక్కోసారి ఫ్లాష్ బాక్ లోకి వెళ్లిపోతాను. ఒక్కణ్ణే ఉంటే ఆఫీసుకు ఆలస్యమే.

నాకు  ఇదిరాయలన్నా కష్టమే. కాని నేను కాకపోతే ఎవరు రాస్తారు? నేను ఎందుకు రాయొద్దు? కన్నీళ్లతో అలుక్కు పోయిన అక్షరాల తో ఈ జీవన పోరాట గాధ రూపు దిద్దుకున్నది. …..

ఆ రెండు ఘడియలు.. ఓ రెండు పుట్టుకలు

‘‘ఓ సిస్టర్ నా కొడుకును తెచ్చి ఇస్తవా…. ఓ బెహన్ మీరా బేటా కహా హై… ’’అని ఆ తల్లి వచ్చీపోయే ప్రతి నర్సును వార్డ్ బాయ్ నీ  బతిమాలుతున్నది. ఒక్కడూ పట్టించుకోవడం లేదు. జవాబు చెప్పడం లేదు. ఒకడికి కరుణించి ఏమైందని అడిగాడు.

‘‘నేను మగబిడ్డను కన్న తల్లీ…… గంటా గంటన్నరయిందనుకుంటా. తీసుకుపోయినారు…స్నానం చేయించడానికని చెప్పినారు. మళ్లీ ఇవ్వలేదు’’.  అని  ఆ తల్లి అడుగుతున్నది. 

‘‘సరే సరే చూస్తాను..’’ అంటూ పత్తా లేకుండా పోయినాడు.  మళ్లీ రాలేదు…

ఆమె పచ్చి బాలింత. అప్పుడప్పడే బిడ్డను కన్నది. కదలడం సాధ్యం కాదు. మాట్లాడడం కూడా కష్టమే. తన బిడ్డను ఎక్కడ వదిలిపెట్టారో, ఎవరు తీసుకుపోయారో తెలియదు. ఎవరూ చెప్పడం లేదు. తోడుగా ఉండవలసిన వారెవరూ అక్కడ అప్పుడు లేరు.

.. .. ..

చిన్నారి కొడుకు

వరంగల్ నుంచి కాన్పుకోసం హైదరాబాద్ పాతబస్తీకి వచ్చింది. అది నవంబర్ నెల, 1954, చాలా చలి. మదీనా దగ్గర హైకోర్ట్ పక్కన ప్రభుత్వం ప్రసూతి హాస్పటల్.

ప్రసవం మామూలుగానే అయింది. మగ పిల్లవాడని చెప్పినారు. ఎప్పుడో తీసుకుపోయి ఇంకా తెచ్చి ఇవ్వడం లేదు. చలి కొరికేస్తున్నది. ఒకవైపు వణుకు, ఆపైన భయం, ఇంకా ఆందోళన… ఎవరిని అడగాలె, ఎవరికి చెప్పాలె…

నా బిడ్డ నాకు దక్కేనా. ఎవరైనా ఎత్తుకుపోలేదుకదా…

పరిపరివిధాల ఆలోచిస్తున్నది ఆ తల్లి…

‘ఉండమ్మా ఊరికే అల్లరి చేస్తావ్’ అని అరిచి విసుక్కునే వారే కాని నిలబడి మాట్లాడే వారు లేరు…

బాబు, తన తమ్ముడున్నా బాగుండు..వాడు వీళ్ల వెంటబడేది. కొడుకు ను వెతికి తెచ్చేది…..ఏం చేయాల్రా భగవంతుడా అని తల్లి బాధపడుతున్నది.

గంటయింది, ఇంకో అరగంట దాటిది…

అక్కడ గడియారం కూడా లేదు. వాడు ఎన్నింటికి పుట్టినాడో కూడా చెప్పేవారు లేరు.

చెప్పకపోతే పోనీ…కనీసం వాడ్ని తెచ్చివ్వకపోతే, మా అత్తగారింట్లో నేనేం చెప్పను. నీ కొడుకేడంటే ఏమని చెప్పేది…

ఆమె కు ఏడ్చే సత్తువ కూడా లేదు. కాన్పు కష్టాలు. నొప్పి. చాలా చలి.

నొప్పుల గదిలో మరో కాన్పు చేయించిన సిస్టర్ ఒకామె చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ చేరుకున్నది. ఆ తొట్టిలో అక్కడ ఒక మగశిశువు పడి ఉన్నాడు, నీళ్లతో తడిసిపోయింది, గడ్డకట్టుకుపోతున్నడు.  సిస్టర్ గుండె గుభేలన్నది. ఎవరో ఈ పిల్లగాడు, స్నానానికి తెచ్చి వీణ్ణిక్కడ మరిచిపోయినట్టుంది. ఇంకేమయినా ఉన్నదా….

ఆ అవునవును, ఒకామె దీనంగా నా కొడుకును తెచ్చివ్వండి అని బతిమాలుతున్నది….  ఈ పాపడు ఆమె కొడుకే అయి ఉంటాడు… హయ్యో ఆమెకు తీసుకుపోయి ఇవ్వాలె. …

ఆమెమనసులో ఏ దేవుడు దూరాడో… బిడ్డను తెచ్చి ఆ తల్లికి ఇవ్వాలనిపించింది…

‘‘ఓ తల్లీ వీడు నీ బిడ్డడేనా.. చూసుకో ……..నీ కడుపులో బెట్టుకో…… బిడ్డడు చలికి వణుకుతున్నడు……..అని ఆ కన్నతల్లిచేతికి ఇచ్చిందామె.  చంద్రాయణ గుట్ట కేశవుడే బతికించినాడు అని రంగమ్మ సంతోషించింది.

కొడుకు దొరికినందుకు సంతోషించాల్నో లేక వాడి స్థితి చూసి ఏడ్వాల్నో తెలియని పరిస్థితి ఆమెది. కొడుకు చలి గడ్డ కట్టుతున్నది. తల్లికి కూడా చలి సమస్య. 

వీడిగాడికి ఇప్పుడు కావలసింది వేడిదనం. ఏ విధంగా ఇవ్వడం… ఎసి గదులు హీటర్లు ఉన్న గొప్ప హాస్పటల్ కాదు.. అంతటి పెద్ద దవాఖానలో చేరేంత ఉన్న వారూ కాదు.  తన కడుపులో వేడిని పంచి ఇచ్చిందా తల్లి. తాను చలికి వణుకుతూ, అది కోపమో బడబానలమో లేక మరొకటో కాని అది రగులుతున్నది. ఆ వేడి ఈ చిన్నవాడిని బతికించింది. వాడికి జన్మనిచ్చిన కొద్ది గంటల్లోనే మరో జన్మనిచ్చిన తల్లి ఆమె.

.. .. ..

ఇంకా జ్జాపకాలు పుట్టని దశ కనుక ఆ పసికందుకు బాధలు తెలిసే అవకాశం లేదు. బహుశా అది వరమేమో.. బతికించుకున్న తల్లి మాత్రం దేవతే. తల్లి మౌనంగా చంద్రాయణగుట్ట కేశవుడికి దండం పెట్టింది. రోజూ పూజల్లో వినిపించే వేయిదేవుళ్లకు వీలైనన్ని మొక్కులు మొక్కింది.

దాన్ని జజీఖానా అంటారు.  పాత బస్తీలో సామాన్యకుటుంబాలలో తల్లులు భావితరాలనుప్రసవించే జన్మభూమి. పక్కనే హైకోర్టు. ఆ పక్కన సిటీ కాలేజి…ముందు మూసీనది, అప్జల్ గంజ్. అటు నయాపూల్ ఇటు పురానాపూల్. అక్కడ పిల్లలు పుడతారు సరే. ఎట్లా బతుకుతారా అని ఆశ్చర్యం వేస్తుంది.  ఆ తల్లి నా తల్లి. రెండు సార్లు పుట్టిన వాడిని నేను.  తల్లులకు ఇన్ని కష్టాలుంటాయా… అని నాకు అనిపిస్తూ ఉంటుంది. 

తరువాత ప్రసంగిస్తూ ఆయన తన కడుపులో కాపాడుకుని కాపుకున్నతల్లిని వందనాలు. బాగానే ఉంది కాని, జజీఖానాలో ప్రసవాలు ఎన్నో వచ్చి ఉండవచ్చు కదా. బాత్ బాక్స్ లోనో లేబర్ వార్డ్ లో ఒక్కడో ఎవరో ఉన్నవాడెవడో??  పిల్లవాడి డిఎన్ డే టెస్ట్ చేయడం ఆ కాలంలో తెలియదు.

ఆ రోజు అమ్మల గురించి నా వంటి చాలా మంది గురించి ఒక సమావేశంలో ప్రసంగాలు వివరించారు.  నా పుట్టుక కథ కూడా వివరించాను. నాతో పాటు ఒక జడ్జి గారు విన్నాడు. అయితే ఆ పిల్లవాడు వరంగల్ లో పుట్టిన అమ్మ ఎవరో ఏ విధంగా పోల్చుకున్నాడు? అతనే కొడుకని తన భర్తకు ఏ విధంగా చెప్పింది అని సరదాగా చెప్పాడు జడ్జిగారు. నిజంగా రుజువు ఎవరిస్తారు? నన్ను జవాబు ఇవ్వాలని అడిగారు. నేను మాత్రం ఏ విధంగా చెప్పగలను. సరైన జవాబు చెప్పగలనా? అని.

కాని చంద్రాయణ్ గుట్ట దేవుడు సమాధానం చెప్పించుకున్నాడు. వాక్ సరస్వతీ దేవత సాయం స్ఫురింపజేసాడు. మా నాన్న పాత్రికేయుడు నేర్పిన  ఆనాటి జర్నలిస్టునే నేనే అని చెప్పడం అవసరమా?  అమ్మ పోలికలు చాలవా? స్వాతంత్ర్య యోధుడు అయిన మా నాన్న వలెనే నేను కూడా వార్తా రచయిత అని నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమా అని అడిగాను. ఆ సమావేశం నిర్వహించిన నడింపల్లి సీతారామరాజు గారుతో సహా చప్పళ్లతొ  నా మాటలతో హోరెత్తింది.

కవితా గీతం ద్వారా అమ్మకు నా నివాళి 

నేను రేణువును

వాడి ఇనుప బూట్ల కింద నలిగిపోతావు జాగ్రత్త

తొక్కకుండా పక్కనించి పోవడం వాడిబాధ్యత కాదా..

చెప్పుకున్నా ఎవరూ వినరు కనుక తప్పుకోవడమే బాధ్యత

అంతలో అతని కాలు నెత్తిమీదే పడింది.

తొక్కి అట్లాగే నిలబడ్డాడు,

అంతా చీకటి.

బతుకుతానో లేదో తెలియదు.

హమ్మయ్య కాలుతీసి కదిలాడా రక్కసి మనిషి

చెప్తే వినలేదు, నలిగిపోయావా నేస్తం

మాట రావడం లేదు,

కళ్లుతెరవలేనంత నీరసం

కళ్లుతెరిచినా ఏదీ కనిపించడం లేదు.

కొనఊపిరి కొంత కొట్టుమిట్టాడుతున్నది.

అల్లంత దూరంనుంచి అమ్మ చూసింది.

చల్లని అలల చేతులతో తలనిమిరింది

తల స్నానం చేయించి జీవం పోసింది..

లోపల బడబానలం రగులుతున్నా..

పైనుంచి నాన్న చూసినట్టుంది

వెలుగు రేక పంపాడు

వళ్లంతా తడిమి కంట తడి తుడిచినాడు,

వెచ్చదనం నింపాడు..లోపల అగ్నిగోళాలు పగులుతున్నా.

ఇలా వళ్లంతా నీలి చీర కట్టుకున్న అమ్మ

అలా నింగంత కాషాయపు శాలువతో నాన్న

తొక్కిళ్లనుంచి తప్పించి పొత్తిళ్ల దాచిన ధరిత్రి

తడలనుంచి రక్షించి వెలుగులిచ్చిన రవి

తిన్నెలమీద తన్నులు తింటున్న నన్నే కాదు

కోట్లాది జీవరాశిని కాస్తున్న మాతా పితరులు

ఇంకనేను ఊరుకోను

మదమత్తులై కళ్లుమూసుకుపోయి.జీవుల్ని తొక్కేస్తున్న రాక్షసుల కళ్లల్లో ఎగిరి పడతాను.

ఇసుక తుఫాను సృష్టించి ముష్కరుల్ని తరుముతాను.

ఆగ్రహోదగ్ర ఉత్తుంగ తరంగ సునామీ రచిస్తాను

నేను అణువును,

ఇసుక రేణువును

సిలికాన్ లోయల్లో రాగాలు పలికే వేణువును

మహతోమహీయమైన అంతరిక్షానికి ప్రణమిల్లే

అణోరణీయమైన పరమాణువును.

చైతన్యానికి నూక్లియస్ ను

పోరాటంలో నూక్లియర్ బాంబును

నేను అణువును

ఇసుక రేణువును. 

(ఆ తల్లి నా తల్లి. రెండు సార్లు పుట్టిన వాడిని నేను.  తల్లులకు ఇన్ని కష్టాలుంటాయా… అని నాకు అనిపిస్తూ ఉంటుంది.  అందుకే నేనుగంభీరోత్తుంగ తరంగ సాగర మంత లోతున్న అమ్మ ముందు ఇసుక రేణువునన్నాను. నా ఆ కవిత వెనుక కథలు ఇవి. చెన్నయ్ సముద్రం ఒడ్డున అందరూ తడిపి తొక్కుతున్న ఇసుక రేణువు వలె  జజీఖానా దవాఖానలో వాష్ బేసిన్ లో తడిసి గొంతు తడారిపోతున్నప్పుడు కడుపులో పెట్టుకుని కాపాడిన తల్లి… ఇంకెవరికైనా ఉండగలదా.. ఉంటుంది. ఆ అవసరమే రాకూడదు…. .. ఏ దేశం పిల్లల్ని ఇట్లా దీవిస్తుంది. ఏ తల్లి ఇట్లా బతికిస్తుంది. ఆ బిడ్డడు ఆ తల్లికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలడు… మాడభూషి శ్రీధర్ 8.4.2015)
Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles