గాంధీయే మార్గం–9
ఏడున్నర దశాబ్దాల మనదేశ స్వాతంత్ర్యాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి, గర్వించడానికి అమృతోత్సవాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో ఒక జాతిగా, ఒక దేశంగా మనల్ని మనం పరిశీలించుకోవాలి. అలాగే బాపూజీ కన్నుమూసి కూడా ఏడున్నర దశాబ్దాలైందని గమనించాలి.
Also read: అవును… నేడు గాంధీయే మార్గం!
మన సమాజపు ప్రతిబింబాన్ని చూసుకోవడానికి ‘గాంధీ’ని మించిన నిలువుటద్దం మరొకటి మనకక్కరలేదు! తనకు అర్థం కాని ఇంగ్లీషు పదం గురించి తెలుసుకోవడానికి నిఘంటువును సంప్రదించినట్టే, తన నడవడికను తెలుసుకోవడానికి గీత అనే గ్రంథాన్ని సంప్రదిస్తానని గాంధీజీ తన స్వీయచరిత్ర నాలుగోభాగం, ఐదో అధ్యాయంలో వివరిస్తారు. అదే రీతిలో గాంధీజీ ఉద్బోధించిన నియమావళి, వాటిని ఆయన ఆచరించిన విధానం అనే చట్రం ఆధారంగా మన దేశం తన ప్రతిబింబాన్ని తను పరీక్షించుకోవచ్చు.
Also read: రాగద్వేష రహితమైన, వివేకం గల విజ్ఞాన దృష్టి
సకలమతసారం సత్యాగ్రహం
ఇంగ్లండులో మన సంప్రదాయ గ్రంథాల గురించి అక్కడి మేధావులు ఆసక్తి కనబరచిన తరవాత, వాటి అధ్యయనం కొనసాగించి గాంధీజీ తన ఎరుకను పెంచుకున్నారు. భారతదేశంలోని అన్ని మతాల అంతరార్థం అనదగ్గ జీవనసారాన్ని తన సత్యాగ్రహం భావనతో బోధించాడు. ‘మినీ ఇండియా’ లాంటి దక్షిణాఫ్రికా భారతీయ సంతతి సమాజాన్ని పరిశీలించి తప్పనిసరి పరిస్థితులలో నాయకుడైన వ్యక్తి ఆయన. 1915లో భారతదేశం వచ్చిన తర్వాత ఒక సంవత్సరంపాటు ప్రసంగించకుండా, రైలులో దేశాటన చేసి భారతీయ సమాజ హృదయాన్ని అవగతం చేసుకున్నాడు. సగటు భారతీయ రైతు శ్రామిక లక్షణాన్ని ప్రతిబింబించే దుస్తులను ధరించి వారిలో తాను కూడా ఒకడని చేతల ద్వారా చూపాడు.
Also read: గాంధీజీ సార్వత్రికత ఏమిటి?
గాంధీజీ ఉద్యమ పోరాట విజయాలలో మొదటిది దక్షిణాఫ్రికా పోరాటం ప్రథమ ప్రపంచయుద్ధం ముందుకాలంలో జరిగితే, రెండవది రెండవ ప్రపంచయుద్ధం అనంతరం మన దేశంలో సంభవించింది. అప్పటికి అటు ఆఫ్రికా దేశాలలో, ఇటు ఆసియా దేశాలలోనే పారతంత్ర్యం జడలు విచ్చుకుని నృత్యం చేస్తోంది. గాంధీజీ చేసిన రెండు పోరాటాలు కూడా బ్రిటీషు వారి దుష్టపాలనను కడదేర్చడానికే. అదే సమయంలో స్వతంత్ర దేశాలు అమెరికా, యూరోపు ఖండాలలోనే పరిమితంగానే వున్నాయి. కనుక ఈ ఆధునిక సమాజాలు ఒకవైపు యుద్ధ దుష్పరిణామాలతో గుబులు పడుతూనే, తరుణోపాయం చూపించగల ప్రపంచ నాయకుడిగా గాంధీజీని చూడడం ప్రారంభించాయి. చంపారన్ రైతుల ఉద్యమం కానీ, సహాయ నిరాకరణోద్యమం కానీ, దండి సత్యాగ్రహం కానీ అనతి కాలంలోనే ప్రపంచ దృష్టిలో పడ్డాయి. కనుకనే ‘టైం మాగజైన్’ 1930లో ‘మాన్ ఆఫ్ ద ఇయర్’ గా గాంధీజీని గౌరవించింది.
Also read: గాంధీజీ అవసరం నేడు ఎక్కడెక్కడ?
గాంధీజీని మనం మరచిపోయామా? లేదా ఏడున్నర దశాబ్దాల స్వాతంత్ర్య దేశప్రగతి గాంధీజీని గుర్తుంచు కోలేనంత స్థాయికి వెళ్ళిందా? వ్యక్తులకు, సంస్థలకు, యూనివర్సిటీలకు, పథకాలకు, వీధులకు, గ్రామాలకు, పట్టణాలకు గాంధీజీ పేరు ఉండడం అత్యంత సహజమైపోయింది. గాంధీజీ బొమ్మ గీయని చిత్రకారుడు కానీ, గాంధీజీ విగ్రహం తయారు చేయని శిల్పి కానీ మన దేశంలో వుండరేమో! ప్రతిక్షణం మనం వెంపర్లాడే కరెన్సీ కాగితాల పై కూడా గాంధీజీ ఫోటోనే వుంటుంది. చివరకు ఆయన పెట్టుకున్న టోపీ కూడా గాంధీటోపీగానే ప్రచారంలోకి వచ్చింది. అంతేకాదు నాలుగు దశాబ్దాల క్రితం మన దేశంలో పెద్ద సంచలనం కలిగించిన అస్సాం విద్యార్థుల శాంతియుత నిరసన రీతి నుంచి, సుమారు పది నెలలుగా ఢిల్లీ నగర శివార్లలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వందలాదిమంది రైతులు పాటిస్తున్న నిరసన పోకడలు దాకా… ఎన్నో సందర్భాలు గాంధీజీని గుర్తు చేస్తాయి!
Also read: అద్భుతమైన వ్యక్తిత్వం కస్తూర్బా సొంతం
ఆ విషయాలే నేటికీ కీలకం
125 సంవత్సరాలు జీవించాలనుకున్న మహాత్ముడు చివరిదశలో తల్లడిల్లారని మనం గమనించాలి. గాంధీజీ కనుమూసిన రోజూ, దానికి ముందురోజూ ఆయన దృష్టి పెట్టిన విషయాలే నేటికీ కీలకాంశాలు! దేశంలోని 7 లక్షల గ్రామాలలో సాంఘిక, ఆర్థిక, నైతిక స్వాతంత్ర్యాన్ని సాధించడానికి కాంగ్రెసు పార్టీ వ్యవస్థను రద్దు చేసి ‘లోక్ సేవక్ సంఘ్’ పేరున కొత్త సంస్థను ప్రతిపాదించాడు ఆయన. అది జరుగక పోగా ఆ పార్టీ ప్రధాన మంత్రులే ఈ దేశాన్ని ఎక్కువ కాలం ఏలారు. జవహర్ లాల్ నెహ్రూ, వల్లభభాయి పటేల్ మధ్య విబేధాలంటూ 1948 జనవరి 29న ‘లండన్ టైమ్స్’ చేసిన వ్యాఖ్యలు ఆయనను కలవరపరచాయి.
దీనికి సంబంధించి చర్చించడానికి సాయంత్రం నాలుగు గంటలకు సర్దార్ వల్లభభాయి పటేల్ తన కుమార్తె మణిబెన్ పటేల్ తో కలిసి బిర్లా భవన్ కు వచ్చారు, ఆ చర్చ కొనసాగుతోంది, మధ్యలో సాయంకాలపు ప్రార్థన కోసం ఆలస్యంగా గం.5.10 ని.లకు బయల్దేరిన గాంధీజీ మార్గమధ్యంలో నాథూరాం గోడ్సే తుపాకి గుళ్ళకు బలయ్యారు. ఉద్దేశించినట్టు నెహ్రూతో ఆ సమావేశం జరగలేదు. నెహ్రూకి, పటేల్ కి బేధాభిప్రాయాలనే విషయం నేటికీ చర్చింపబడుతోంది. అంతేకాదు గాంధీజీ – అంబేద్కర్, నెహ్రూ – బోస్ అంటూ కూడా ఎన్నో విషయాలతో నిరంతర చర్చలుగా మారాయి. తప్పని సరి పరిస్థితుల్లో మెరుగైన ప్రత్యామ్నాయంగా – మత విద్వేష పరిస్థితుల నేపథ్యంలో నెహ్రూ ప్రధాని అయ్యారు. నెహ్రూకు, పటేల్ కు 14 సంవత్సరాల తేడా కూడా ఉందని గమనించాలి.
Also read: గ్రామీణ భారతానికి అబ్దుల్ కలాం పరిష్కారం
ఏడు నిషిద్ధాంశాల జాబితా
అలాగే 1948 జనవరి 30వ తేదీన మనకు అవాంఛనీయమైనవి, ప్రమాదకరమైనవి అంటూ ఓ ఏడు అంశాలను ఒక జాబితాగా మళ్ళీ రాసి మనవడు అరుణ్ గాంధీకి ఇచ్చారు గాంధీజీ. పనిచేయకుండా లభించే ధనం,
అంతరాత్మ అంగీకరించని విలాస జీవనం, వ్యక్తిత్వాన్ని రూపొందించని జ్ఞానం, నైతికం కాని వ్యాపారం, మానవత్వాన్ని పట్టించుకోని శాస్త్రవిజ్ఞానం, త్యాగభూయిష్టం కాని మతం,
విలువలకు పొసగని రాజకీయ విధానం – ఇవి ఆ ఏడు నియమాలు. ఈ భూగోళం మీద మనిషి చేసే హింసకు ఇవే అసలు కారణాలు. గాంధీజీ చెప్పిన నియమాలు పాటిస్తే సకల భువి సవ్యంగా ఉంటుంది. హిందూమతానికి చెందిన వ్యక్తి చేతిలోనే గాంధీజీ కనుమూయడం మనకు తెలిసినదే! మొత్తం గాంధీజీ జీవితాన్ని కాకుండా కేవలం 1948 జనవరి 30 సంఘటనలను పరిగణించి కూడా మనదేశం తన ఏడున్నర దశాబ్దాల రీతిని తానే బేరీజు వేసుకోవచ్చు!
15 ఆగస్తు 1947న స్వాతంత్ర్యం సిద్ధించినపుడు గాంధీజీకి ఆనందకరమైన ఘడియ కాదు. ఏది సంభవించకూడదో అదే జరిగి, మతం కారణంగా భారత ఉపఖండం రెండు దేశాలుగా విడిపోవడం ఆయనను తీవ్రంగా బాధించింది. కనుకనే ఆ రోజును ఉత్సవంగా జరుపుకోలేదు, పైపెచ్చు భోజనాన్ని త్యజించి ఉపవాసం చేశారు. నాకైతే అది నిరసనలా అనిపిస్తుంది.
గాంధీజీ దృష్టిలో రాజకీయ స్వాతంత్ర్యం అంత కీలకం కాదు. కనుకనే, ఉద్యమంలో కొన్ని ప్రధాన ఘట్టాలలోనే మహాత్ముడి ఛాయ మనకు దర్శనమిస్తుంది. రాజకీయ స్వాతంత్ర్యాన్ని మించిన రీతిలో సామాజిక, నైతిక,ఆర్థిక స్వాతంత్ర్యం ముఖ్యమని పలువిధాలుగా ఆయన కృషి చేయడం గమనించవచ్చు. అవిద్యను, మద్యపానాన్ని, అనారోగ్యాన్ని, అర్థరహితమైన పనులను త్యజించే స్థాయిలో మన సమాజం సంసిద్ధం కావాలని ఆయన ప్రకటించారు. ఫలితం కన్నా , దాన్ని సాధించే మార్గం ముఖ్యమని పదేపదే ఉద్బోధించి మనసా, వాచా, కర్మణా మనం ఒకేరీతిలో ఉండాలని చెప్పడమే కాదు; అలానే ఆయన జీవించారు.
Also read: సామాన్యంగా అనిపించే అసామాన్య పోరాటం దండి సత్యాగ్రహం
అసలు తత్వాన్ని గ్రహించింది కొందరే!
అయితే, చాలా కొద్దిమంది మాత్రమే గాంధీజీ ఆలోచనల అంతరార్థాన్ని, అసలు తత్వాన్ని అందుకోగలిగారు, అవలంభించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, జె.బి.కృపలానీ, జె.సి.కుమారప్ప , కమలాదేవి ఛటోపాధ్యయ వంటి ఎందరో మహానాయకులు మౌనంగా పూర్వపక్షం అయిపోయారు. స్వాతంత్ర్యం రావడానికి ముందే నేతాజీ సుభాస్ అదృశ్యం కాగా, గాంధీజీ కనుమూసిన రెండేళ్ళకు వల్లభభాయి పటేల్ గతించారు. దాంతో నెహ్రూ ఆలోచనా రీతులు దేశంలో కదం తొక్కాయి. చైనాతో యుద్ధం కూడా తప్పని సరి అయ్యింది.
భారత స్వాతంత్ర్య పోరాటం తరువాత ప్రపంచంలో స్వాతంత్ర్యం గడించిన దేశాల సంఖ్య మూడురెట్లయ్యింది. ఈ ప్రపంచ ధోరణి మీద గాంధీజీ ప్రభావం ఉంది. మన దేశంలో మొదటి పంచవర్ష ప్రణాళికకు, రెండవ పంచవర్ష ప్రణాళికకు ఉన్న తేడా క్రమంగా గాంధీజీ అంతర్థానమైన సందర్భాన్ని కూడా విడమర్చి చెబుతుంది. క్రమంగా పంచవర్ష ప్రణాళికలు అదే దిశలో వెళ్తూ పోయాయి. మరోవైపు నర్మదాబచావ్ వంటి ఆందోళనలూ; ఆర్థికపరమైన అసమానతలూ; అంతులేని అవినీతి; ప్రవర్తనలో విచ్చలవిడితనమూ; గ్రామ పట్టణ నగర అంతరాలూ; రైతునీ, వ్యవసాయాన్నీ పట్టించుకోని వ్యవస్థా; కళ్ళు తెలియని కాలుష్యం; వళ్ళు తెలియని లాలసతా, వినియోగధోరణి స్థిరపడ్డాయి. ప్రపంచ దేశాలలో ఇటు పెట్టుబడిదారీ వ్యవస్థ కానీ, అటు సోషలిజం కానీ, అలాగే కమ్యూనిజం కానీ, జనరంజకంగా సాగిన విజయాలుగా నమోదు కాలేదని తాజా కరోనా ఉదంతంతోపాటు చాలాసార్లు తేటతెల్లమయింది.
స్ఫూర్తి లేని ఉత్సవాలు నిరర్థకం
స్వాతంత్ర్య భావనను ప్రతిపాదనను 116వ వార్షికోత్సవం, సహాయనిరాకరణకు శతవార్షికం, దండి సత్యాగ్రహానికి 9 దశాబ్దాలు, క్విట్ ఇండియా ఉద్యమానికి 8 దశాబ్దాలు, ఇప్పుడు భారత స్వాతంత్ర్యానికి అమృతోత్సవాలు అంటూ… చాలా సందర్భాలు మనలను తరుముకుని వస్తున్నాయి. అయితే అసలు స్ఫూర్తి అందుకోకుండా ఎన్ని ఉత్సవాలు జరుపుకున్నా, ఎంత విలాసవంతంగా జీవించినా అది అసంపూర్ణమే, అసమగ్రమే, అర్థరహితమే!!
గాంధీజీ పేరున ఎన్నో సంస్థలు ఉన్నాయి, వాటిద్వారా ఎంతోమంది వివిధ సందర్భాలలో గాంధీజీ విగ్రహాలకు దండలు వేసి, ప్రసంగాలు చేస్తుంటారు. మరోవైపు గాంధీజీ ఆశయాల ద్వారా బలపడిన పార్టీ రాజకీయ అధికారాన్ని హస్తగతం చేసుకుని లాంఛనప్రాయంగా మాటల ద్వారా మాత్రమే గాంధీజీని గుర్తు చేసుకోవడం మరోపార్శ్వం. అంతేకానీ కొరవడిన గాంధీజీ స్ఫూర్తిని గురించి కానీ, దారితప్పించబడిన గాంధీజీ సిద్ధాంతాల ఆచరణ, పోకడల గురించి కానీ నాయకులు తెలుసుకోవడం లేదు, మేధావులు చర్చించడం లేదు. సత్యాగ్రహ భావనను ప్రతిపాదించి శతవార్షికమైన వేళ అప్పుడు (2006 లో) ఈ దేశంలో అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీకి ఆ విషయం అసలు గుర్తుకు రాలేదు. కానీ, ప్రపంచ దేశాలు మాత్రం 2007 సంవత్సరం నుంచీ గాంధీ జయంతిని ‘అహింసా దినోత్సవం’ గా జరుపుకోవడం ప్రారంభించాయి. గత ఏడెనిమిది ఏళ్ళుగా మన దేశంలో, గాంధీజీని విస్మరించిన వర్గాలు కొత్తగా ప్రేమించడం మొదలుపెట్టాయి. అదే సమయంలో కొన్ని ఆచూకీ తెలియని సంస్థలు సోషల్ మీడియా ద్వారా గాంధీజీని హేళన చేయడం కూడా ప్రారంభించాయి! ఇటు వామపక్షాలకు మాత్రమే కాక, అటు ఆర్ ఎస్ ఎస్ కు కూడా గాంధీజీ ఆకర్షణగా మారారు. ‘సిటిజన్ షిప్ అమెండ్మెంట్ యాక్ట్’ వచ్చిన సందర్భంలో వామపక్ష మీడియా సంస్థలు, మేధావులు గాంధీజీని తమకనుకూలంగా విశ్లేషించడం ఒక పార్శ్వం. అలాగే 2021 సంవత్సరం జనవరి 1వ తేదీన గాంధీజీ తొలి రచన ‘హింద్ స్వరాజ్’ గ్రంథాన్ని ఆర్ ఎస్ ఎస్ సంస్థ 2000 రూపాయల ఖరీదు గల పుస్తకంగా పునఃప్రచురణ చేయడాన్ని గమనించాలి.
దేశ భవిష్యత్తును నిర్ణయించే కొలబద్ద
ఈ డిజిటల్ సమాజంలో కూడా గాంధీజీ ప్రపంచ వ్యాప్తంగా అన్వేషాంశంగా, అధ్యయనాంశంగా కొనసాగుతున్నారు. రాహుల్ సాంకృత్యాయన్ చెప్పినట్టు బుద్ధుడి కంటే ఉన్నతమైన వ్యక్తిత్వం గాంధీజీది. అసలు విషాదం ఏమిటంటే బుద్ధుడి లాగానే ప్రపంచ దేశాలు గాంధీజీని ఆరాధిస్తున్నాయి, అక్కున చేర్చుకుంటున్నాయి! మనం మాత్రం మహాత్మునిబాటను పూర్తిగా విస్మరిస్తున్నాం. ఆయన మార్గంలో పయనించి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, నెల్సన్ మండేలా వంటి ఎందరో మహనీయులకు సంబంధించి ఎన్నో స్ఫూర్తికరమైన దృష్టాంతాలు గాంధీజీ సార్వత్రికతకు తార్కాణాలుగా నిలుస్తున్నాయి. గాంధీజీ చెప్పే దేశభక్తి మిగతా ప్రపంచ దేశాల మనుగడకు అవరోధం కాదు, అనర్థం కాదు! అలాగే, గాంధీజీ విధానాలను పాటిస్తే —
రైతుల కడుపు మాడ్చే పంటలు కానీ, పంటల విధానం కానీ అడుగు పెట్టావు! గ్రామాలు, కుగ్రామాలు వంటి జనావాసాలను హేళన చేసే రీతిలో పట్టణాల, నగరాల, ఉపాధుల, పరిశ్రమల అహంకారం తయారు కాదు!! కల్లాకపటం లేని, కాయకష్టం కలగలిసిన జీవన శైలి మనకు సొంతమైతే మనకు సస్టెయినబుల్ గ్రోత్, సెన్సెక్స్ ఇండెక్స్, హ్యూమన్ ఫేస్ తో నడిచే ఎకానమీ వంటి హడావిడి విషయాలు అసలే అవసరం కావు!!
ఈ డెబ్బయి అయిదేళ్ళ స్వాతంత్ర్య దేశపు రీతులను ‘గాంధీజీ ఆచరణ’ అనే నిలువుటద్దంలో సులువుగా తెలుసుకోవచ్చు. తెలుసుకుంటామా? లేదా? –అనేది మన ఇష్టం. అయితే, అదే భవిష్యత్తును నిర్ణయించే కొలబద్ద కూడా!
Also read: గాంధీజీ ఆలోచనలకు విలక్షణ వ్యాఖ్యాత డా.రామమనోహర్ లోహియా
(రచయిత మొబైల్: 9440732392)
Evry sentence is good Expect the comparison betweenBuddha and Gandhiji better to know more and were good.
Write good