Thursday, November 7, 2024

గోవాలో ఏమి జరిగింది? సైన్యాన్ని పంపడంలో నెహ్రూ తాత్సారంపై మోదీ ఆరోపణ నిజమేనా?

 ‘తన అంతర్జాతీయ పరువుప్రతిష్ఠలకు ఎక్కడ భంగం కలుగుతుందోనన్న భయంతో పండిట్ నెహ్రూ గోవాపైన దాడికి మీనమేషాలు లెక్కించారు. స్వాతంత్ర సమరయోధులు మరణించారు. ఆయన తలచుకుంటే గోవా 1947లోనే పోర్చుగీస్ ఆక్రమణ నుంచి విముక్తం అయ్యేది’ అంటూ ఇటీవల రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానం ఇస్తూ ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. నెహ్రూ నిష్క్రియాపరత్వం కారణంగా గోవాలో స్వాతంత్ర్య సమరయోధులు మరణించారనీ, ఆ రాష్ట్రం పోర్చుగీసు నుంచి విముక్తిలో జాప్యం జరిగిందనీ మోదీ ఆరోపించారు. నెహ్రూను ద్వేషించే ప్రవృత్తిలో ఇది కూడా ఒక భాగమా లేక మోదీ ఆరోపణలో నిజం ఉన్నదా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే అరవై, డెబ్బయ్ ఏళ్ళ కిందట గోవాలో ఏమి జరిగిందో తెలుసుకోవాలి.

అఫోన్సో ఆల్బకెరెక్ బీజాపూర్ సుల్తాను అదిల్ షా సైన్యాన్ని1510లో ఓడించిన క్షణం నుంచీ గోవా పోర్చుగీసు కాలనీగానే నాలుగున్నర దశాబ్దాలపాటు ఉన్నది. గోవా  కేంద్రకంగా అంతర్జాతీయ, జాతీయ, స్థానికి శక్తులు దౌత్యరంగంలో ఘర్షణపడ్డాయి. సాంస్కృతిక, మతపరమైన సంక్షోభాలు తలెత్తాయి. వాటన్నిటి ఫలితంగా గోవాకు ఒక ప్రత్యేకమైన సంస్కృతి ఏర్పడింది. దానికి ఒకానొక ప్రత్యేక సాంస్కృతిక ప్రతిపత్తి అంటూ ఉన్నది. ఈ ప్రతిపత్తిపైన ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒక పర్యాటక కేంద్రంగా, విహార స్థలంగా భారతీయుల ఆటవిడుపుకూ, వినోదానికీ, కాలక్షేపానికీ ఆటపట్టుగా గోవా ఎదిగి భారతదేశంలో ఒదిగి విరాజిల్లుతోంది.

గోవాలో స్వాతంత్ర్య సమరం

బ్రిటిష్ వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత్ అంతా స్వాతంత్ర్య పిపాస పెరిగింది. గోవాలో  కూడా పోర్చుగీసు వలస పాలన నుంచి బయడపడేందుకు ఉద్యమం ప్రారంభమైంది. బ్రేగాన్కా కున్హా నాయకత్వంలో పోరాటం తీవ్రతరమైంది. 1928లో కోల్ కతా లో ఏఐసీసీ సమావేశం జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ గోవా విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కున్హా తీర్మానం ప్రవేశపెట్టారు. ఏఐసీసీ ఆమోదించింది. ప్రముఖ సోషలిస్టు నాయకుడు రాంమనోహర్ లోహియా 1946లో గోవాలో పెద్ద ప్రదర్వన చేసి బహిరంగసభ జరిపించారు. పౌరహక్కులూ, స్వాతంత్ర్యం,  ఇండియాతో విలీనం కావాలంటూ లోహియా బహిరంగ సభలో పిలుపునిచ్చారు. ఆ ప్రసంగం గోవా ప్రజలను ఆకట్టుకున్నది. గోవాలో స్వాతంత్ర్య సమరాన్ని మలుపు తిప్పింది. గాంధీ నాయకత్వం, విధానాలపైన అసంతృప్తితో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కొత్త బాట తొక్కినట్టే గోవాలో కూడా శాంతి, అహింసల వల్ల ప్రయోజనం తేదని భావించి సాయుధఘర్షనే ఏకైక మార్గమనే వాదించేవాళ్ళు ఆజాద్ గోమంతక్ దళ్ ఏర్పాటు చేశారు. ఈ దళ్ యోధులు ఆయుధాలతో పోరాటం జరిపి పోర్చుగీస్ భూభాగాలైన దాదర్, నగర్ హవేలీని విముక్తం చేశారు. ఇందుకు గోమంతక్ దళ్ కు భారత్ సాయుద సహకారం రహస్యంగా అందింది. ప్రభాకర్ సినోరీ అనే యోధుడు ఆజాద్ గోమంతక్ దళ్ వ్యవస్థాపక సభ్యులు ఇప్పటికీ గోవాలో నివసిస్తున్న కొద్ది మంది స్వాతంత్ర్య సమర యోధులలో ఒకరని ‘ద ఇండియన్ ఎక్స్ ప్రెస్’ (ముంబయ్ ఎడిషన్)శనివారం సంచిక (ఫిబ్రవరి 12)లో ఎడిట్ పేజీ వ్యాసం రాసిన రాహుల్ త్రిపాఠీ తెలియజేశారు.

స్వాతంత్ర్యం వచ్చిన క్షణాలలోనే విభజన తాలూకు విఫపరిణామాలు సంభవించడం, హిందు-ముస్లింల మధ్య మతకలహాలు రేగడం, అదే సమయంలో కశ్మీర్ లో పాకిస్తాన్ సేనలతో పోరాడవలసి రావడంతో భారత దేశం మరో వైపున సాయుధ ఘర్షణకు దిగలేకపోయింది. ఆ పని చేస్తే పోర్చుగీసుల తరఫున ఇతర విదేశీ శక్తులు పోరాడవచ్చుననీ, అంతకంటే పోర్చుగీసు ప్రభుత్వానికి నచ్చజెప్పడానికి ప్రయత్నించడం మంచిదని నాటి ప్రధాని పండిట్ నెహ్రూ భావించి ఉంటారు.

గోవా రాజ్యాంగం మార్చిన పోర్చుగీసు ప్రభుత్వం

భారత్ స్వతంత్రమైన తర్వాత పదేళ్ళ లోపుగానే 1955లో గోవా రాజ్యాంగాన్ని పోర్చుగీసు వలసాధిపతులు మార్చేశారు. గోవా పోర్చుగీసు రాజ్యంలో ఒక భాగం కాదనీ, అది సముద్రాలకు ఆవల ఉన్న వలస రాజ్యమనీ ఆ మార్పు తాత్పర్యం. దీని ఆంతర్యం ఏమంటే గోవాను ప్రత్యేక రాజ్యంగా చూపడం ద్వారా నార్త్ అంట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) లో భాగం చేయవచ్చుననీ, ఇండియా కానీ మరే దేశమైనాకానీ గోవాపైన దాడి చేస్తే మొత్తం నాటో సైనికబలగాన్ని వినియోగించవచ్చుననీ పోర్చుగీస్ ఎత్తుగడ. కానీ నాటోలోని ఇతర భాగస్వామ్య దేశాలు దీనికి అంగీకరించలేదు.

15 ఆగస్టు 1955నాడు మూడు, నాలుగు వేలమంది నిరాయుధులైన గోవన్లు గోవా సచివాలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు వారిని నిరోధించేందుకు పోర్చుగీసు సైనికులు జరిపిన కాల్పులలో పాతికమంది మరణించారు.

శాంతిదూతగా నెహ్రూ

ఈ లోగా నెహ్రూ ప్రపంచ శాంతిదూతగా మంచి పేరుతెచ్చుకున్నారు. అలీనోద్యమ నాయకుడిగా ఎదిగారు. అలీనోద్యమానికీ, ఆఫ్రో-ఆసియా ఐక్యతకూ కృషి చేస్తున్న నాయకుడిగా వలసాధిపత్యంపైనా, సామ్రాజ్యవాదంపైనా పోరాటం చేస్తున్నారు. భారత్ ఇంత మెత్తగా ఉంటే కుదరదనీ, పోర్చుగీస్ నుంచి గోవాకు ఎంత త్వరగా విముక్తి లభిస్తే పోర్చుగీసు వలసాధిపత్యంపైన తాము చేస్తున్న పోరాటాలు అంత త్వరగా ఫలితాలు ఇస్తాయనీ ఆఫ్రికాదేశాల నాయకులు నెహ్రూకు స్పష్టంగా చెప్పారు. 1961 అక్టోబర్ లో ఈ విజ్ఞప్తులను నెహ్రూ ఆలకించారు.19 డిసెంబర్ 1961న గోవాకు సైన్యాన్ని పంపించి విముక్తం చేశారు.కేవలం రెండు రోజులలో పోర్చుగీసు సైన్యాలు గోవా విడిచి వెళ్ళిపోయాయి.

1946లో రాంమనోహర్ లోహియా గోవా స్వాతంత్ర్యపోరాటానికి బీజం వేసి ఊపు ఇచ్చిన సమయంలో సాయుధపోరాటంతో గోవా విముక్తి చెందాలని నినదించారు. వారిలో సోషలిస్టులూ, కమ్యూనిస్టులూ, ఆర్ఎస్ఎస్ వారూ ప్రముఖులు. గోవా ప్రజలకు స్వాతంత్ర్యం గురించి ఇంకా వివరంగా చెప్పి వారిని శాంతియుత పోరాటానికి సంసిద్ధం చేయవలసి ఉన్నదని అదే సంవత్సరం గాంధీజీ అన్నారు. సత్యాగ్రహం ద్వారా గోవాకు విముక్తి సాధించాలని గాంధీ సంకల్పించారు.

అరవై ఏళ్ళనాటి ముచ్చట ఇప్పుడేల?

అప్పుడు కాలమాన పరిస్థితులకు అనుకూలంగా నాటి నాయకులు నిర్ణయించారు. నాటి నిర్ణయాలను ఇప్పుడు దెప్పుతూ రాజకీయ లబ్ధిపొందాలని మోదీ ప్రయత్నించడాన్ని నాటి ఆజాద్ గోమంతక్ దళ్ వ్యవస్థాపకుడు ప్రభాకర్ సినోరీ సైతం తప్పుపడున్నారు. చివరికి అహింసోద్యమం ద్వారా కానీ, పోర్చుగల్ ప్రభుత్వంతో సంప్రతింపుల ద్వారా కానీ గోవా భారత దేశంలో భాగం కాలేదు. నెహ్రూ సైన్యాన్ని పంపించడం వల్లనే, సాయుధంగానే గోవా విముక్తి చెందింది. అయితే, ఈ విషయంలో తొందరపడకుండా, శాంతియత్నాలు చేస్తూనే, దౌత్యపరంగా పోర్చుగీసు ప్రభుత్వాన్ని ఒప్పించడానికి నిజాయితీగా కృషి చేసి, అన్ని ప్రయత్నాలూ విఫలమైన తర్వాతనే సైన్యాన్ని పంపడం వల్ల రాజనీతిజ్ఞుడుగా, శాంతికాముకుడుగా నెహ్రూ పేరు చెడకుండా, ఇండియాను నష్టం వాటిల్లకుండా సమస్య పరిష్కారమైంది. ఆరు దశాబ్దాల కిందటి ముచ్చటను ఇప్పుడు ప్రస్తావించడం అనవసరమనీ, ప్రస్తుతం గోవాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకొని వాటి పరిష్కారాలు ఏమిటో ఎన్నికల సందర్భంగా చర్చించాలనీ గోవా స్వాతంత్ర్య సమర యోధుడు ప్రభాకర్ సినోరీ సలహా ఇచ్చారు.   

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles