చేతులు పనులు చేస్తూ ఉంటాయి. ఆలోచనలు మాత్రం – అటు ఇటూ ఎటో పరిభ్రమిస్తూ ఉంటాయి. అనుభవంలో ఇది చాలా సార్లు నాకు పరిపాటి. నేను చేసే బయటి పనులకీ నాలోపలి స్పందనలకీ అనేకసార్లు పొంతన ఉండదు. అయినా వాటి మధ్య ఉండే ఆ సయోధ్య మాత్రం – సదా నన్ను ఆశ్చర్య పరుస్తూనే ఉంటుంది. పరస్పర విరుద్ధాలైన భావావేశాలని వహించగల ఈ శరీరానికి ఉన్న ఆ శక్తి అమోఘం! శరీరం ఎన్ని అనుభవాలనిస్తుంది. ఎన్ని సంక్లిష్టాలని అతి మామూలుగా గ్రహిస్తూ … నన్ను అనుగ్రహిస్తూ … మళ్ళీ మళ్ళీ ముందుకి నడిపిస్తుంది! అలిసిపోతూనే ఉన్నా … శక్తిని అలా సరఫరా చేసే నిరంతర చైతన్యమే కదా శరీరం!
లోపల జడివాన కురియడం నాకు అనుభవమే! నిప్పులు కురియడమూ తెలిసిన విషయమే! ఒక సుడిగాలిలో సుళ్ళు తిరిగిన క్షణాలెన్నో శరీరంలో! వరదలూ … మెరుపులూ … చిత్తడి నేలలూ .. భూకంపాలూ తెలిసినవే! ఇన్నిటికీ ఆలవాలం దేహం!
శరీరం అంటే కేవలం జీవ రసాయనాల సమ్మేళనమేనా? శరీరం ఉత్త అవయవాల సమాహారమా? అస్థి రక్త మాంసమయమా? శరీరం – ఆరోగ్యమా? రోగమా? శరీరమే చిత్కళ! ఇదే భ్రమ కూడా! శరీరం అహంకారమూ … మమకారమూను! మౌనమూ … జ్ఞానమూనూ! ఆగమనమూ – నిష్క్రమణమూ… సహజం దీనికి! శరీరం ఒక్కోసారి అంధకారమే!! బాధామయ సొరంగమే! వయోభారమే!
కానీ, చాలా సార్లు శరీరం ఒక నది! మరొకసారి ఉత్తుంగ ఉదధి! శరీరం ఆలోచనల మొలకల భూమి! అనురాగ ఆవేశ ద్వేష వర్ణమయ గగనం! శరీరం ఎప్పుడూ నవ జీవనం!
మృత కణాలు రాలి పడుతూ … నవ్య జీవ కణాలని కూర్చుకుంటూ … రక్తాన్ని పరుగులు పెట్టిస్తూ … నాసికా నాళ సంగ్రహిత ప్రాణవాయువుతో, ఊపిరిని ఉచ్చ్వాస నిశ్వాస సంయుతంగా పరిరక్షించుకుంటూ, దివా రాత్రాల లోనూ అవిశ్రాoతమై ప్రకాశించే ఒక ఉజ్వల కాంతి పుంజం – ఈ శరీరం! ఔను, శరీరం సుఖ దుఃఖ మయం! వియోగ భరితం! భావనల మనసుకి ఇదే కదా కేంద్రం! ఏ అణువు ఇప్పుడు నాలో ఈ అక్షరాన్ని లిపిగా ఒలికిస్తోందో నాకు తెలియదు! శరీరం లోపల అసలు ఏమి దాగి ఉన్నదో స్పష్టం కాదు! సృష్టికర్తకు తప్ప అన్యులకు అర్ధం కాని ఒక మోహ మంత్రం శరీరం!
శరీరంలో చేతులు సాటి మనిషికి నమస్కరిస్తాయి. ఆప్యాయంగా ఈ నాలుక నలుగురినీ పలకరిస్తుంది. ఉద్రేకంలో ఇదే నాలుక తిడుతుంది. సాదర స్వాగతం కోసం రెండు పాదాలు ముందుకి చలిస్తాయి. కోపం వస్తే, ఇవే చేతులు చంచలమై అవమానించే వారి చెంపలని సాచి కొడతాయి. శాంతమూ రౌద్రమూ తానైన శరీరం లో – ఆఖరి ఊపిరి దాకా ఈ ప్రయాణం మాత్రం ఆగనిది!
ఈ తనువు సువిశాల ఆకాశాన్ని నేత్రద్వయంలో అందంగా పొదువుకుంటుంది. భూమిని తన చర్మంగా మార్చుకుంటుంది. గాలిని శ్వాసగా ధరిస్తుంది. అగ్ని తానై వెలుగుతుంది! కళ్ళు – అరుణారుణ ప్రతి బింబాలు! మబ్బుల సంచలనాలు! బాష్పకణాలుగా కురిసే తొలకరి కాలాలు! భౌతిక ప్రపంచపు మాయల ప్రతిసీర మీది ప్రతిబింబాలని, మనసుకి సూటిగా అందించే రెండు వార్తాహరులు! కళ్ళు! ప్రపంచపు చీకటిని మనముందు ఎంతో కొంతగా తొలగిస్తూ… విపరీత దృశ్యాలని చూపే, కాంతి నెగళ్లు! వెలుగు అన్నిసార్లూ ఏమీ బాగుండదని … చీకటి కొన్ని సార్లు శరీరానికి మెత్తనిదని వివరించే మెదడుకి, కళ్ళు – మూసుకున్న తలుపులు కూడా!
వాన పడుతుంది మనసులో! గ్రీష్మతాపాన్ని తలదన్నేలాంటి ఎండ కాస్తుంది! ఋతువుల సమ్మేళనమే శరీరం! ఎన్నో శిశిరాలు … మరెన్నో వసంతాలు ఈ శరీరానివి! శీతలమై ఘనీభవించిన జ్ఞాపకాలు అనేకం! చిన్నపాటి ఆత్మీయతకే కరిగి ప్రవహించే, కాసార తనువు కదా ఇది! జీవంతో నిండిన రక్త ప్రసారమే – శరీరం!
మేఘ గర్జనలు వినిపించే అంబరమూ … పూల స్పర్శలోని సుతిమెత్తదనమూ రెండూ సాధ్యమే శరీరంలో! ఒకపట్ఠానా అలిసిపోని అణువుల తాంత్రికతే శరీరం!
శరీరం! సృష్టికి ప్రతి బింబం – కోపోద్రిక్తలకు కాణాచి! సంరంభానికి ఆటపట్టు! సౌరభాలకు ఉనికి! చీము నెత్తురుల పురిటి గడ్డ! ఛీ! ఈ శరీరం! ఆహా! ఈ శరీరం! ఔరా! ఈ శరీరం!!
దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు. శక్తికి మారు రూపమై … జ్ఞానానికి నిలువెత్తు నిదర్శనమై – స్పర్శ సంతకంగా ఈ శరీరం — అచ్చంగా నాదే అయి ఉన్నప్పుడు – దీనిని ఇచ్చిన నా తల్లికి … పంచ భూతాత్మకమై దీనిని సంరక్షించే ఈ సృష్టికి, మొక్కడం ఒక్కటే నాకు తెలిసిన విషయం!
జయప్రభ,
జూలై 25 , 2020.