భగవద్గీత – 62
తరంగాలు పుట్టని సముద్రమేది?
ఆలోచనలు పుట్టని అంతరంగమేది?
లేదు కదా!
అలలు ప్రతిక్షణం పుట్టి ఒడ్డును తాకుతున్నంతసేపు ప్రపంచానికి ప్రమాదం లేదు. కానీ ఆ అలలు ఉవ్వెత్తునలేచి సముద్రపు ఒడ్డును దాటితే, అదే ఉప్పెన. ప్రపంచం మునిగి పోతుంది, అలాగే అన్ని రకాల ఆలోచనలు మన మనస్సులో పుడుతూనే ఉంటాయి. ఆ ఆలోచనలు సమాజపు కట్టుబాట్లు అనే చెలియలికట్ట దాటితే , ఆ మనిషి మనుగడే ప్రశ్నార్ధకమవుతుంది.
Also read: శారీరిక తపస్సు అంటే?
మనలో మంచి అని పిలువబడేవి, చెడు అని వేలెత్తి చూపబడేవి ఎన్నో ఆలోచనలు అనుక్షణం తరంగాలలా లేస్తూనే ఉంటాయి. ఈ ఆలోచనలు పుట్టని మనిషి అంటూ ఉండడు.
కానీ ఏ భావాన్ని బయటపెడితే ఏ ఫలితం వస్తుంది? మన వీపుకేమైనా ప్రమాదమా? మన జేబుకేమైనా చిల్లిపడుతుందా? మన పరువు గంగలో కలుస్తుందా? మనకు ఆ వ్యక్తి దూరమవుతాడా? మనము చేయదలుచుకున్న పని విఫలమవుతుందా ?
…ఇలా ఆలోచించి విశ్లేషించి ఏది బయటపెట్టాలో దానిని మాత్రమే బయటపెట్టగల వారు ఎందరు? అలా మనలో పుట్టిన భావాలను బహిర్గతం చేయగలవారు ఎందరు?
పొరపాటు అంటే తెలియక చేసేది. తప్పు అంటే తెలిసి చేసేది. పొరపాటయినా, తప్పయినా మన మనస్సులో పుట్టిన ఒక భావము లేదా ఆలోచన యొక్క బాహ్యవ్యక్తీకరణయే కదా?
నేనీ పని ఎందుకు చేశాను?
Also read: సరి అయిన మాట భవిష్యత్తుకు పెట్టని కోట
నాకు ఈ ఆలోచన ఎందుకు కలిగింది?
ఫలానా వస్తువుమీద నాకు కోరిక ఎందుకు కలిగింది?
ఫలానా వ్యక్తి మీద ఈ మోహం ఎందుకు?
ఈ రోజు నేను ఇలా ఎందుకు ప్రవర్తించాను? ఇలా ప్రవర్తించిఉంటే ఈ సంఘటన జరిగేది కాదుకదా?
అసలు నాకు ఆ క్షణంలో కోపం ఎందుకు వచ్చినది?
వీటికి కారణమేమిటి? అని అనుక్షణం మన అంతరంగపు లోతులలోకి వెళ్ళి మనలను మనము విశ్లేషించుకోవడం జరుగుతున్నదా?
ఈ విధంగా మన మనస్సును నిరంతరం శోధిస్తూ ఉంటూ మనస్సులో ప్రసన్నత సాధించటం, శాంతంగా ఉండటం, మౌనంగా ఉండటం, ఇంద్రియ నిగ్రహం కలిగిఉండటం ఇవన్నీ మానసిక తపస్సుగా చెప్పబడతాయి.
మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః
భావసంశుద్ధిదిత్యేతత్ తపోమానసముచ్యతే!
Also read: ఆహారము, గుణము