- ఇదివరకటి వేడీ, వాడీ ఏవీ?
- అవినీతి ఆరోపణలే కారణమా?
- ఈ సారికి తగ్గి ఉండాలన్న ఎత్తుగడా?
- బీజేపీకి సహకరించాలన్న యోచనా?
ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతున్న ఈ వేళల్లో మాజీ ముఖ్యమంత్రి, ‘బహుజన సమాజ్ పార్టీ’ అధినేత్రి మాయావతి ఎందుచేతనో మౌనముద్రలో ఉన్నారు. మిగిలిన విపక్షనేతలైన అఖిలేష్ యాదవ్, ప్రియాంకా గాంధీ చాలా దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఇక అధికారపార్టీ బీజీపీ గురించి చెప్పక్కర్లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొదలు దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యనేతలంతా ఉత్తరప్రదేశ్ పైనే దృష్టి పెట్టారు, సామ దాన భేద దండోపాయాలన్నీ ఉపయోగిస్తున్నారు. 2017 ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ(ఎస్ పీ) కలిసి బరిలో దిగాయి. ఈసారి ఆ ఊసే లేదు. మిగిలిన చిన్నాచితకా పార్టీలన్నింటినీ కలుపుకొని అఖిలేష్ ముందుకు వెళ్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ గతంలో కంటే భిన్నమైన వైఖరితో దూసుకుపోతున్నారు. ఉత్తరప్రదేశ్ లో బీ ఎస్ పీ ఒక్కటే స్తబ్దుగా ఉంది.
Also read: లాక్ డౌన్ అనివార్యమా?
వ్యూహం ఏదైనా ఉందా?
మాయావతి మౌనం వెనకాల ఏదైనా వ్యూహం ఉందా? బిజెపి ఒత్తిడి ఉందా, చేసేది లేక అలా వ్యవహారిస్తున్నారా అనే ప్రశ్నలు ఉత్తరాది రాజకీయ క్షేత్రంలో ఉత్పన్నమవుతున్నాయి. మౌనం వీడి బయటకు రావాలంటూ… మాయావతిపై హోం మంత్రి అమిత్ షా ఇటీవల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల భయంతోనే ప్రచారానికి బయటకు రావడం లేదంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా వ్యాఖ్యలకు ఆమె ప్రతిస్పందించారు. మిగిలినవారిని అనుసరించే అలవాటు తమకు లేదని, ‘మాదైన శైలి మాకు ఉంటుందం’టూ మాయావతి జవాబు చెప్పినప్పటికీ, క్షేత్రంలో ఎటువంటి వాడీవేడీ కనిపించడం లేదు. ప్రచారానికి ఆమె దూరంగానే ఉన్నారు. బహిరంగ సభల కంటే ఇంటింటి ప్రచారమే ఎక్కువ ప్రభావం చూపిస్తుందని, తాము దానినే అనుసరిస్తామని బహుజన సమాజ్ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే తమ అధినేత్రి బయటకు వచ్చి ఎన్నికల కేళిలో పాల్గొంటారని ఆ పార్టీ నేతలు బదులిస్తున్నారు. జోనల్ కో-ఆర్డినేటర్స్ తో ఆమె సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారని చెబుతున్నారు. తమ ఓటుబ్యాంక్ చెక్కుచెదరదనే అతి విశ్వాసంలో మాయావతి ఉన్నట్లు భావించాలి. 2007లో ప్రయోగించిన వ్యూహాన్నే మళ్ళీ అమలు చెయ్యాలనే ఆలోచనలో ఆమె ఉన్నట్టుగా కొందరు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. దళితులు – బ్రాహ్మణులను ఒకచోటకు తెచ్చి 2007 ఎన్నికల బరిలో దిగి, 206 స్థానాలను కైవసం చేసుకొని ముఖ్యమంత్రిగా మాయావతి అధికార పీఠాన్ని అధిరోహించారు. 30 శాతం ఓటుబ్యాంక్ ను కూడా సొంతం చేసుకున్నారు. ఆమె పన్నిన ఈ వ్యూహం అనూహ్యమైన ఎత్తుగడగా రాజకీయ సమరక్షేత్రంలో మాయావతికి విశేషమైన పేరు తెచ్చిపెట్టింది. 2012 వరకూ ఆ ఆధిపత్యం కొనసాగింది. ఆ తర్వాత మెల్లగా ఆ ప్రభకు చీకటిపట్టింది. 2012లో 25 శాతం, 2017 లో 22 శాతంకు ఓటుబ్యాంక్ పడిపోయింది.
Also read: ఎన్నికల నగారా మోగెన్
2012లో 80 సీట్లు దక్కించుకున్న ఆ పార్టీ 2017 లో 19 స్థానాలకే పరిమితమై, చతికిలపడి పోయింది.2014 లోక్ సభ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేక పోయింది. సమాజ్ వాదీ పార్టీతో భాగస్వామ్యం కలవడం వల్ల 2019లో 10 పార్లమెంట్ స్థానాలను దక్కించుకొన్న బీ ఎస్ పీ కాస్త పరువు కాపాడుకుంది. మొత్తంగా ఈ 15 ఏళ్ళ ప్రస్థానాన్ని గమనిస్తే మాయావతి పరపతి అడుగంటి పోయిందనే చెప్పాలి. దానికి తోడు, ఆమెపై పెద్ద ఎత్తున అవినీతి ముద్ర కూడా పడింది. ఈ అవరోహణా క్రమంలో పెద్దనేతలు ఒక్కొక్కరూ పార్టీని వీడడం ప్రారంభించారు. ఈ మధ్యకాలంలో వలసలు ఇంకా జోరందుకున్నాయి. జనానికి, పార్టీ శ్రేణులకు దూరంగా ఉంటున్నారని, పెద్ద మొత్తంలో పార్టీ నిధుల కోసం ఒత్తిడి తెస్తున్నారని మాయావతిపై పార్టీ నుంచి బయటకు వచ్చిన నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. 2019 ఉపఎన్నికలో అంబేద్కర్ నగర్ స్థానాన్ని కూడా ఆ పార్టీ కోల్పోయింది. బీ ఎస్ పీ ని వీడిన నేతలు ఎక్కువమంది సమాజ్ వాదీ పార్టీ, బిజెపిలో చేరిపోయారు. మొన్న 2021లో, ఉన్న కాసిన్నిమంది ముఖ్యనేతలు కూడా పార్టీ వ్యతిరేక చర్యలు చేపడుతున్నారంటూ బహిష్కరణకు గురయ్యారు.
Also read: భద్రతా లోపం, ప్రచార పటాటోపం
పోరు బీజేపీ, ఎస్ పీ మధ్యనే
ప్రస్తుత ఎన్నికల్లో, ప్రధానమైన పోరు బీజీపీ – సమాజ్ వాదీ మధ్యనే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రియాంకా గాంధీ సారథ్యంలో,కాంగ్రెస్ కు గతంలో కంటే కాస్త మెరుగైన ఫలితాలు వస్తాయని వినపడుతోంది. మాయావతికి అండగా నిలిచిన దళితులు, బ్రాహ్మణులు కూడా మిగిలిన పార్టీల వైపే మొగ్గు చూపిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ప్రధానమైన దళిత ఓటుబ్యాంక్ లో కూడా చీలిక రావడం బీ ఎస్ పీ ని వెనక్కు నెట్టేసిందని భావించాలి. అవినీతి కేసుల భయంతోనే బిజెపికి ఎదురు నిలబడడం లేదనే విమర్శలు మాయావతిపై వస్తున్నాయి. ఒంటరిగా పోటీ చేయడం వల్ల, ఓట్ల చీలిక ద్వారా అధికార బిజెపికి ఆమె పరోక్షంగా సహకారాన్ని అందిస్తున్నారనే మాటలు కూడా వినపడుతున్నాయి. దళిత ముఖ్యమంత్రిగా, బ్రాహ్మణులను, దళితులను ఏకం చేసి రాజ్యాధికారంలో భాగస్వామ్యులను చేసిన వినూత్న వ్యూహకర్తగా, బహుజన సమాజ్ పార్టీ అధినేత్రిగా జాతీయ స్థాయిలో ఎంతో పేరు తెచ్చుకున్న మాయావతి నేడు మౌనముద్ర వహిస్తున్నారనే పేరు తెచ్చుకోవడం విచిత్రం. నేటి వాతావరణాన్ని బట్టి, ఆమెను తక్కువ అంచనా వెయ్యలేము. ఉత్తరప్రదేశ్ లో బిజెపి -కాంగ్రెస్ పార్టీలే కలవలేదు. మిగిలిన అన్ని పార్టీలు కలిసిన సందర్భాలు, విడిపోయిన ఉదాహరణలు ఉన్నాయి. రేపటి ఎన్నికల సమయానికి లేదా ఫలితాల తర్వాత ఎవరెవరైనా కలవవచ్చు, విడిపోవచ్చు. ఈ సిద్ధాంతం మాయావతికి కూడా వర్తిస్తుంది. మాయావతి మౌనం ఎటువంటి మలుపులు తిరుగుతుందో వేచి చూద్దాం.
Also read: నవ వసంతానికి స్వాగతం