వ్యక్తినైనా, ఉద్యమానైనా అర్థం చేసుకోవాలంటే సామాజికమార్పు దశల ఆధారంగానే అంచనా వేయాలని చారిత్రకభౌతికవాద సిద్ధాంతం చెబుతుంది. ఒకవేళ అద్భుతమైన త్యాగాలు చేసినప్పటికీ, చారిత్రిక అవసరాలకు భిన్నంగా వారి కార్యాచరణ ఉంటే, సరైన ఫలితాలను రాబట్టలేకపోవడమో లేక బలహీనపడటమో జరుగుతుంది. ఇలాంటి గతితార్కిక నియమానుసారం గద్దర్ ని ఎలా అర్థంచేసుకోవాలంటే ఆయన కలిసి నడిచిన రాజకీయ ఉద్యమాల్ని పరిశీలించుకుంటూ పోవలసి ఉంటుంది.
గద్దర్ చెప్పుకున్నట్లు, ఆయన బౌద్ధఅంబేద్కరిస్టు యొక్క కొడుకు. ఈ గుమ్మడి విఠల్రావు ఆనాటికే ఇంజనీరింగ్ విద్యార్థి. తర్వాత బ్యాంకు ఉద్యోగి. కానీ ఆయనలోని కళాకారుడు మరియు కవి, బి. నర్సింగరావు సాంగత్యంతో నక్సలైట్ ఉద్యమకారుడుగా మారాడు. 1972లో జననాట్యమండలి నిర్మాతగా మారి 1994 వరకు తన యవ్వనకాలమంతా పీపుల్స్ వార్ జకీయాలతో నడిచాడు. ప్రజాయుద్ధనౌకగా పేరు వచ్చింది. అయితే ఈ ప్రజాయుద్ధం ఎటువంటి రాజకీయ డిమాండ్లతో కొనసాగింది?.
Also read: మందకృష్ణ విద్వేష రాజకీయాలు ఎంతకాలం?
నేటికీ అన్ని కమ్యూనిస్టుపార్టీలవారూ వ్యవసాయక విప్లవమే ఇరుసుగా పనిచేస్తున్నారు. కొందరు సాయుధ పోరాట పందాలో మరికొందరు పార్లమెంటరీ పందాలో పని చేస్తున్నారు. ఇందులో భూపంపిణీ ప్రధానంగా ఎజెండాగా ఉంది. ఆ రకంగా వ్యవసాయ రంగంలో అగ్రకులాల ఆధిపత్యం పోయి ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది. మరి పారిశ్రామికరంగంలో వారి డిమాండ్ ఏమిటి? సేవారంగంలోకి క్రింది కులాల ప్రజలు వెళ్లటానికి వారి డిమాండ్ ఏమిటి? అలాగే నేటికీ 66 శాతం రాజకీయాలు అగ్రకులాల చేతుల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. ఆ రాజకీయాలను బహుజనులకు అందుబాటులో తేవటానికి వారి డిమాండ్స్ ఏమిటనే విషయంలో అందుకు సంబంధించిన రాజకీయ కార్యచరణ వారు కలిగి లేరు. ఇవికదా మన చారిత్రక అవసరాలు. పోనీ వారు చేసిన భూపారాటల వల్ల దళితులకు భూమి బదలాయింపు జరిగిందా? అంటే లేదనీ గద్దరే అన్నాడు. ఏం? ఎందుకని? వారు చేసిన పోరాటాలు ఏమి సాధించలేదా?
వారి పోరాటాల వల్ల భూస్వాములు పట్టణాలకు తరలి పారిశ్రామికవేత్తలుగా, రాజకీయవేత్తలుగా అవతారం ఎత్తారు. ఈ రకంగా వారు బూరెల బుట్టలో పడ్డారు. అయితే ఆ మేరకు ప్రజలకు కొంత స్వేచ్ఛ లభించింది. కానీ భూములు చట్టబద్ధంగా బదిలీ జరగలేదు. ఈ రకంగా అరకొర ఫలితాల దగ్గరే ఆగిపోయింది. వారి రాజకీయాలకు ఇలాంటి పరిమితి ఉన్నప్పటికీ గద్దర్ మాత్రం వారి భావజాలాన్నిఅద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాడు.
మరి విప్లమంటే ఒక రంగంలో మార్పులేనా? పారిశ్రామిక, సేవ, రాజకీయరంగాల్లో బహుజనుల ప్రజాస్వామ్యం మాటేమిటి? ఈ రంగాల్లో ప్రజాస్వామ్య అవకాశాలకు మనం అంటున్న బూర్జువ రాజ్యాంగమే ఇచ్చింది కదా, అంతకంటే ఎక్కువగా కాకపోయినా, కనీసం దాని స్థాయిలోనైనా విప్లవకారులు ఇలాంటి అవకాశాలను ప్రజలకు అందుబాటులోకి తేవటానికి ఎందుకు ప్రయత్నించటం లేదు? విప్లవ మంటే రాజకీయ, ఆర్థిక ,సామాజిక రంగాలలో తీసుకొచ్చే మార్పే కదా, అన్ని రంగాలలో మార్పులు అవసరంలేదా? ఆ రంగాలలో అగ్రకులాల ఆధిపత్యం అలాగే ఉండిపోవాలా? ఇలాంటి ప్రశ్నలకు ఆపార్టీల దగ్గరజవాబులు లేవు.
Also read: బంగారు తెలంగాణలో ఎయిడెడ్ కళాశాలలకు సమాధి!?
అయినప్పటికీ గద్దర్ మాత్రం 1994 తర్వాత కూడా పీపుల్స్ వార్ పార్ట సమర్థించిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సీరియస్ గా పాల్గొన్నాడు. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలనే సంకల్పంతో సీతమ్మవారిని దర్శించుకోవడం విమర్శకు తావిచ్చింది. కానీ మనకు ప్రాంతీయ అస్తిత్వ ఏర్పాటు వాద ఉద్యమాల వల్ల అణగారిన కులాల పేదలకు ప్రత్యేక ప్రయోజనం జరగదని అనుభవంలోకి కూడా తెలియ వచ్చింది. మరి ఇలాంటి అస్తిత్వ ఉద్యమాలకు విప్లవకారులు మద్దతు ఇవ్వటం ఏమిటనే ప్రశ్న రావడం న్యాయం.
ఇక గద్దరన్నకు సంబంధించి అనుసరిస్తూ వస్తున్న రాజకీయాలకు భిన్నమైన మాటలను చూద్దాం. అది 2011లోRPI, ఎస్సీఎస్టీ సంఘాలు ఏర్పాటు చేసిన, 75 ఏళ్ల దళిత రాజకీయాలు ఎటు వెళ్లాలి? ఎటు వెళ్తున్నాయి? అని జాతీయ సదస్సులో మాట్లాడుతూ ‘‘నేను మా అయ్యా దగ్గరికిపోతా, మా అయ్యా బుద్ధిష్టు, అంబేద్కరైట్” అనీ పేర్కొన్నాడు. దీన్నిబట్టి ఆయన అంబేద్కరైట్ బహుజన రాజకీయాలు చేయబోతున్నాడని అనుకుంటాం. కానీ అలా జరగలేదు. అంతెందుకు, 1994లో పీపుల్స్ వార్ కురాజీనామా చేసి బయటకువచ్చే నాటికి దేశంలో BSP రాజకీయాలు ప్రారంభమై ఉన్నాయి. ఇందులో చేరకుండా పీపుల్స్ వార్ మద్దతు ఇచ్చిన తెలంగాణ ఉద్యమంలో మునిగి పోయాడు. మరొక దగ్గర ‘‘ఇవాళ అమెరికన్ సామ్రాజ్యవాద స్ట్రక్చరల్ వైలెన్స్ పెరుగుతున్నది. దీనికి వ్యతిరేకంగా సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మిస్తాను’’ అని అంటాడు. ఈ రకంగా ఆయనలో ఉన్న ముందటి రాజకీయాలతోనే ప్రయాణం సాగించాడు. ఇక యాదగిరిగుట్టను దర్శించటం, రామానుజన్ పై ఆటపాటలతో ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యవాదిననిపించుకుంటూ, అదే సమయంలో అన్నిరాజకీయపార్టీల నాయకులను కలుస్తూ ఒక లిబరల్ ప్రజాస్వామ్యవాదిగా కనబడుతాడు. ఇవి ఆయన గతం నుండి కొనసాగించిన రాజకీయాలకు అదనంగా వచ్చి చేరాయి. అయితే ప్రలోభాల కోసం ఏదో ఒక అధికార పార్టీలో చేరకుండా మరణించే వరకు ప్రజాక్షేత్రంలో కళాకారుడుగా ఉండటం గొప్ప విషయం. రాజకీయంగా చూసినప్పుడు పరిమిత ఏ జెండాతో ప్రారంభమైన ఆయన ఉద్యమ ప్రస్థానం పరిమిత రాజకీయాలతోనే ముగిసింది.
Also read: లాల్-నీల్ సమస్య?
కానీ మార్క్సిస్టు మేధావి ప్రభాస్ పట్నాయక్ పేర్కొన్నట్లు, మన దేశంలో భారత రాజ్యాంగం అమలుతో దీర్ఘకాలిక విప్లవం ప్రారంభమైంది.ఈ దీర్ఘకాలిక విప్లవల క్ష్యాల ఫలితాలను ప్రజలకు మరింతగా అందుబాటులోకి చేర్చాల్సిన మన బుద్ధిస్ట్,అంబేద్కరైట్ అయిన గుమ్మడి విఠల్ రావు స్వల్ప రాజకీయ డిమాండ్లకు పరాయిీకరించబడి, అంటే తన వర్గాల సమగ్ర డిమాండ్ లేని ఆట, పాటలతో తుపాకి తూటాకు గురి కాబడినప్పటికీ, అదే కమ్యూనిస్టుల చేత మునిగిపోయిన యుద్ధనౌకగా విమర్శలకు గురి కావటం ఒకగుణపాఠంగా మిగిలి పోతున్నది. కేజీ సత్యమూర్తిది కూడా ఇదే పరిస్థితి. అందుకే ఆయన,”నేను చేసింది ఏమి మిగలకపోగా, రాసిందే మిగిలింది” అని వాపోయాడు. ఇలాంటి యోధులు ఆ ఉద్యమంలో ఎందుకు నిలబడలేని పరిస్థితులు వచ్చాయనే దానిపై వారు సమీక్షించుకుంటే మంచిదేమో?కాబట్టి మార్పు కోరే శక్తులు ఎవరైనా కానీ చారిత్రక భౌతికవాద సూత్రాల ఆధారంగా విప్లవ దశను, ఆ దశలో జరగాల్సిన సామాజిక మార్పుల గురించి, దానికి సంబంధించిన రాజకీయ కార్యచరణ, పోరాటాలపై నిర్దిష్ట అంచనా కలిగి ఉండకపోతే, అరకొర ఫలితాలతో వెనక్కు నెట్టబడి, బలహీనపడతాడారని చరిత్ర నిరూపిస్తూనే వుంది. గద్దర్ జీవిత పాఠం ఇదే మనకు నేర్పు తున్నది.
Also read: భక్తులతోనేదేవుడికిముప్పు, నాస్తికులతో కాదు!
డాక్టర్ పట్టా వెంకటేశ్వర్లు. అసోసియేట్ ప్రొఫెసర్, 9959649097