భరాగో గారు ( భమిడిపాటి రాం గోపాలం) గొప్ప కథకుడు. వంటొచ్చిన మగాడు,
ఇట్లు మీ విధేయుడు… ఇలా ఎన్నో!
నాకు అత్యంత ఆత్మీయులు.
మా కొప్పరపు కళాపీఠం మొదటి ప్రచురణ(2002) ఆయన నిర్వహణలోనే జరిగింది.పీఠం లోగో రూపకల్పనలో బాపుగారితో మాట్లాడి నాకు సహాయంగా నిలిచారు.’116 గొప్ప సినిమా పాటలు’ రెండో ముద్రణకు మా పీఠం సౌజన్యం వహించింది.ఆ పుస్తకం ఆవిష్కరణ సభ కూడా మేమే నిర్వహించాము.
చిన్న చిన్న పనులలో నేను ఆయనకు చేదోడు వాదోడుగా ఉండేవాడిని.2002 నుంచి 2010 వరకూ దాదాపు ప్రతి రోజూ వాళ్ళ ఇంటికి వెళ్లి ఆయనతో గడిపేవాడిని.తద్వారా ఎన్నో విషయాలు,విశేషాలు,చమత్కార భాషణలు, జోకులు,రహస్యాలు,ఆ నాటి సంగతులు తెలుసుకోగలిగాను.
ఆయనతో మాట్లాడడమే ఓ ఎడ్యుకేషన్!
ఆయన మీద ఆయనే జోకులు వేసుకొనేవారు.
భరాగో అంటే… భ రించ రా ని గో ల… అని ఆయనే చెప్పుకున్నాడు. ” నా జీవిత సారాంశం మొత్తం అప్పులు చెయ్యడం… అడుక్కు తినడం ” అని చెప్పేసుకున్నారు. సైగల్ ను అద్భుతంగా మిమిక్రీ చేసేవారు. విజయనగరం అంటే ఆయనకు చాలా ఇష్టం. బాపు రమణలతో మంచి స్నేహం.
ఎందరో రచయితలు,కవులు,కళాకారులు,
జర్నలిస్టులతో గొప్ప మైత్రి ఉండేది.
పీసపాటి నరసింహమూర్తిగారికి కొప్పరపు కవుల ప్రతిభా పురస్కారం ఇచ్చిన సందర్భంలో(2003) పీసపాటివారిని ఏరికోరి ఇంట్లో ఉంచుకొని ఆతిధ్యం ఇచ్చి,ఆయనతో రాత్రిపవలు ఎన్నో పద్యాలు పాడించుకున్నారు.’భారద్వాజ విందు’ పొందానని ఎంతో అనందం పొందారు.
భరాగో చేతిరాతపై బాపు గారి ప్రభావం ఎక్కువ.వాళ్ళింట్లో కొన్ని వందల సార్లు
మంచి ఫిల్టర్ కాఫీ తాగాను.
భరాగో గారు నాకు పితృ సమానులు.
కొన్ని అంశాల్లో స్ఫూర్తిప్రదాత.
(మార్చి 6 వ తేదీ భరాగో పుట్టినరోజు సందర్భంగా)