- ముఖ్యమంత్రి సిద్దరామయ్యా, శివకుమారా?
- తెలంగాణపై కర్ణాటక ఫలితాల ప్రభావం ఉంటుందా?
మెజారిటీ ఎగ్జిట్ పోల్స్, విశ్లేషకులు, పరిశీలకులుతో పాటు సామాన్యులు కూడా చెబుతున్నట్లుగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును నమోదు చేసుకుంది. ఇప్పటిదాకా అధికారంలో ఉన్న బిజెపి పరాజయం పాలైంది. ఈ రెండింటికీ సమాంతరంగా నిల్చొని చక్రం తిప్పాలని కలలుగన్న జేడీఎస్ ఘోరంగా దెబ్బతింది. కాంగ్రెస్ విజయం, బిజెపి అపజయం అనూహ్యమైన రీతిలో జరిగి అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించిన ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ అధికార పీఠంపై కూర్చోడం ఇక లాంఛనమే. మరో సంవత్సరం లోపే సార్వత్రిక ఎన్నికలు జరగాల్సివున్న నేపథ్యంలో, కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు బిజెపికి పెద్ద షాక్ నే ఇచ్చాయి. ఆదేసమయంలో, కాంగ్రెస్ కు గొప్ప జోష్ నిచ్చాయి. నరాలను పొంగించి, ఉద్వేగాలను పెంచి పోషించే అంశాల కంటే సగటు మనిషి బాగోగులే రాజకీయాలను శాసిస్తాయని కర్ణాటక ఫలితాలు చెప్పాయి. కర్ణుడు చావుకు ఆరు శాపాల్లా బిజెపి ఓటమికి అనేక ప్రతికూల అంశాలు ఎదురుగా నిలిచాయి. ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై పాలనలోని మితిమీరిన అవినీతి, అధిక ధరలు, ప్రబలిన నిరుద్యోగం, రగిలిన రిజర్వేషన్ల విధానాలు, గురువృద్ధుడైన యడ్యూరప్పను ముఖ్యమంత్రిగా దించి, దూరంగా పెట్టడం, వారి సంతానానికీ పెద్ద ప్రాముఖ్యత లేకుండా చేయడం, సామాజిక సమీకరణాలలో సరియైన వ్యూహాలను అవలంబించక పోవడం, తద్వారా చాలా సామాజిక వర్గాలను దూరం చేసుకోవడం, గెలుపు పట్ల అతివిశ్వాసం కలిగివుండడం, ప్రాంతీయ తత్త్వానికి, స్థానికతకు సరియైన ప్రాతినిధ్యాన్ని చూపించలేకపోవడం, కాంగ్రెస్ కూటమిని కూల్చి అధికారాన్ని లాక్కొన్నారనే చెడ్డపేరు మొదలైన అనేక ప్రతికూల అంశాలు బిజెపి కొంప ముంచాయి.
Also read: పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కత్తులు
బీజేపీకి ఎదురు దెబ్బ
దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న బిజెపి సంకల్పానికి ఈ ఫలితాలతో గట్టి దెబ్బే తగిలింది. ఇక్కడ అధికారంలో ఉన్న ఆ ఒక్క రాష్ట్రాన్ని కూడా కోల్పోయింది. కర్ణాటకలో మరమ్మత్తులు చేసుకొని రేపటి లోక్ సభ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాబట్టుకోవడం సవాల్ గానే మిగలనుంది. తెలంగాణలో అధికారం చేపట్టాలన్న దూకుడుపైనా కళ్లాలు పడే వాతావరణాన్ని కొట్టి పారేయలేం. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ లో ఎదుగుదల అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కర్ణాటకలో గెలుపును సొంతం చేసుకున్న కాంగ్రెస్… జాతీయ పార్టీయే ఐనప్పటికీ, స్థానికత ప్రధానంగా పనిచేసింది. గొప్ప ఫలితాలను మూటగట్టుకున్న కాంగ్రెస్ కు అనేక అంశాలు కలిసొచ్చాయి. గతంలో అధికారాన్ని కోల్పోయినందుకు ప్రజల సెంటిమెంట్ కూడా అదనంగా ఉపయోగపడింది. రాహుల్ ‘జోడో యాత్ర’ ప్రభావం గట్టిగానే పనిచేసింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య – రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ కలిసి సాగి తమ ఐకమత్యాన్ని చాటిచెప్పడం, అదే రాష్ట్రానికి చెందిన మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడుగా ఎన్నికకావడం, హిమాచల్ ప్రదేశ్ లో గెలుపుకు దోహదంగా నిలిచిన పథకాలను కర్ణాటకలోనూ ప్రకటించడం, వెనుకబడిన సామాజిక వర్గాలు, మైనారిటీని అక్కున చేర్చుకొనేలా పథకాలను రూపకల్పన చేయడం, సెక్యూలర్ విధానాన్ని బలంగా చాటి చెప్పడం, బిజెపి నుంచి కొందరు కీలక నాయకులు కాంగ్రెస్ లోకి వలసరావడం మొదలైన అనుకూల అంశాలు కాంగ్రెస్ గెలుపునకు అస్త్రాల్లా పనిచేశాయి.
Also read: భారాస భవిష్యత్తు ఎమిటి?
ముఖ్యమంత్రి ఎవరు?
ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలాల్సివుంది. ఎక్కువమంది సిద్ధరామయ్య వైపే మొగ్గు చూపిస్తున్నారు. దేవరాజ్ అర్స్ తర్వాత అయిదేళ్ళ పూర్తికాలం ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న చరిత్ర సిద్ధరామయ్యది. పార్టీకి పరమ విధేయుడు, సోనియా గాంధీ కుటుంబానికి ఆంతరంగికుడుగా డీకే శివకుమార్ కు మంచిపేరుంది. అధికార పార్టీ నుంచి అనేక కష్టాలు ఎదుర్కున్నాడు. ఎన్ని ఇబ్బందులు, ఒత్తిళ్లు ఎదురైనా పార్టీని వీడలేదు. కింగ్ మేకర్ గా చక్రం తిప్పుదామనుకున్న జెడి(ఎస్) కూడా సామాజిక సమీకరణాల వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది. హిమాచల్ ప్రదేశ్ విజయం తర్వాత కర్ణాటకలో ఘన విజయాన్ని సాధించుకున్న కాంగ్రెస్ కు గొప్ప నైతికబలం కూడా జత కలిసింది. రేపు జరుగబోయే సార్వత్రిక ఎన్నికలపై ఈ గెలుపు ప్రభావం ఎంతోకొంత ఉండకమానదు. బిజెపికి అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు వచ్చేశాయి. కాంగ్రెస్ లో చీలిక తెచ్చి మళ్ళీ అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తే బిజెపి చాలా చెడ్డపేరు మూటకట్టుకుంటుంది. రాజమార్గంలో గెలవడమే యుద్ధనీతి.
Also read: విపక్షాలఐక్యత సంభవమేనా?