Tuesday, January 21, 2025

‘కాంట్ సే…’ అంటున్నవారి కన్ఫ్యూజన్ ఏమిటి?

జాన్ సన్ చోరగుడి

వొక సంస్థ  చేసిన ‘సర్వే’లో ‘కాంట్ సే…’ అన్నవారి శాతం 4.9 అని వెల్లడించింది. వీళ్ళే తటస్థ వోటర్లు. మన రాష్ట్రం వాస్తవ స్థితి ఏమిటో తెలియకపోతే, రేపు ‘నోటా’కు వోటు వేసేది వీళ్ళే!    

భివృద్ధి ఏది? అంటూ ఇటీవల అందరూ మాట్లాడుతున్నారు గానీ, “ఆంధ్రప్రదేశ్ వంటి సముద్రతీర రాష్ట్రంలో ఆభివృద్ధి ప్రణాళికలు ఎలా వుండాలి అని మీరు అనుకుంటున్నారు?” అని అడిగితే బహుశా ఇలా అడిగేవారికి తెలిసింది కేవలం ఐటి కంపెనీలు వంటివి కావొచ్చు. ఒక కొత్త రాష్ట్రం అభివృద్ధి ‘ప్లాన్స్’ విషయంలో ప్రభుత్వం దృక్పధం ఎలా ఉండాలి? అనే విషయంగా ముఖ్యమంత్రి, మంత్రిమండలి, సీనియర్ అధికారులు చేసే కసరత్తు ఎలా ఉంటుంది అనే ప్రాధమిక అవగాహన లేనివారు తేలిగ్గా- ‘అభివృద్ధి ఏది?’ వంటి మాటలు ‘మీడియా’ ముందు చెబుతున్నారు.

వారి అవగాహనా లేమిని తప్పు పట్టనక్కరలేదు గానీ, మన రాష్ట్రం వరకు పరిమితమై అభివృద్ధి అనే దాన్ని మనం ఎలా చూడాలి అనే విషయం ఈ వ్యాసంలో చర్చించే ప్రయత్నం చేద్దాం. మార్చి 17న చిలకలూరిపేట ఎన్నికల సభ తర్వాత ఒక విషయం అయితే స్పష్టం అయింది. అదేమంటే, పదేళ్ల క్రితం ఏర్పడిన మన రాష్ట్రం హితం విషయంలో ఆ వేదికపై కలిసిన మూడు పార్టీల నాయకులకు ఎటువంటి ప్రత్యేక శ్రద్ద లేదని.

‘గ్రీన్ ఫీల్డ్ స్టేట్’

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ఒక ‘లైన్’ కనుక వారికి ఉంటే, అది ఎటువంటిదో కీలకమైన ఆ ఎన్నికల సభ వేదికపై తమ రాజకీయ అంశాలతో పాటుగా, అది కూడా వారి మాటల్లో వ్యక్తం అయ్యేది. పైగా మన రాష్ట్రానికి మేము చేశామని ప్రధాని మోడీ చెప్పింది కూడా విభజన చట్టంలోని అంశాలు మాత్రమే. కనుక, వందేళ్లకు చేరువ అవుతున్న దేశంలో… కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్- ‘ప్రాంతము’ ‘ప్రజల’ విషయంలో పదేళ్లుగా దేశాధినేతగా ఉన్న ప్రధానమంత్రి, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఇరువురి వైఖరి ఏమిటో స్పష్టం అయింది కనుక; ఇప్పుడు మనమొక నిర్ణయం తీసుకోవడం తేలిక.

అయితే అది ఎటువంటి నిర్ణయం కావాలంటే, దేశం దక్షిణ సరిహద్దున ఉన్న తీరాంధ్ర రాష్ట్రం ప్రత్యేక అవసరాల కోసం, ఇదొక- ‘గ్రీన్ ఫీల్డ్ స్టేట్’ అన్నట్టుగా పూర్తిగా నూతన ప్రణాళికలతో ముందుకు వెళుతున్న ప్రస్తుత ప్రభుత్వాన్ని బలపర్చడం. ఇది ఎన్నికల సీజన్ అని ఈ మాట అనడం కాదు. మన చుట్టూ నెట్టుకొస్తున్న అనివార్యతలను చూసాక, అంటున్న మాట ఇది.

పెరుగుతున్న ఒత్తిడి

ఆదివారం చిలకలూరిపేటలో నరేంద్రమోడీ సభ జరిగిన ప్రాంతానికి 40 కి.మీ. దూరంలో సోమవారం (18.3.2014) ఉదయం ఏమి జరిగిందో మనకు తెలియడం అవసరం. బాపట్ల జిల్లాలో జాతీయ రహదారికి సమాంతరంగా భారత రక్షణశాఖ కోసం నిర్మించిన- ‘ఎమర్జెన్సీ ల్యాండింగ్ రన్ వే’ పైకి- ‘ఇండియన్ ఎయిర్ ఫోర్స్’ కు చెందిన ‘సుఖోయ్-సు 30’ యుద్ధ విమానాలు, రవాణా విమానాలు దిగాయి. దీనికి ఒక ఏడాది ముందు, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో, సముద్ర తీరాన ఉండే బాపట్ల లోకసభ నియోజకవర్గం కొత్తగా జిల్లా కేంద్రం అయింది.

ఇది జరిగాక- “అత్యవసర పరిస్థితుల్లో ఇకముందు ఎప్పుడు అయినా ఇక్కడి- ‘ఎమర్జెన్సీ ల్యాండింగ్ రన్ వే’ను మన ‘ఎయిర్ ఫోర్స్’  విమానాలు వినియోగించుకోవచ్చు” అని అధికారులు అన్నట్టుగా, ఇటువంటివి 19 వరకు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ‘ఆపరేషన్’కు సిద్దమయింది బాపట్లలోనే అని ఆర్ధిక వ్యవహారాల పత్రిక ‘మింట్’ రాసింది. రాష్ట్రంలో మన సముద్ర తీరం వెంట రక్షణశాఖ నుంచి మన పరిసరాల్లో పెరుగుతున్న ఒత్తిడి బాపట్ల వద్ద ఇలా ఉంటే, మున్ముందు బంగాళాఖాతం నుంచి జరిగే నౌకా వాణిజ్యం సంబంధిత ‘ట్రేడ్’ వాతావరణంతో మన తీరం మీద పెరుగుతున్న ఒత్తిడి ఎలా ఉండబోతున్నదో… కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ గత ఏడాది 4 మార్చిన విశాఖపట్టణంలో జరిగిన ‘పెట్టుబడుదారుల సదస్సు’ లో చెప్పిన మాటల్లో వెతికితే అర్ధమవుతుంది. 

వాణిజ్య సాంద్రత

కేంద్రం చూపు ఢిల్లీ నుంచి క్రిందికి దక్షిణాది వైపుకు దిగడం, అయితే ఆ దిగే క్రమం తూర్పు తీరం చేరడం లక్ష్యంగా ఉంది, అంటారాయన. మన దేశం ఆగ్నేయ ఆసియా దేశాలతో చేసుకున్న ‘ఆసియాన్’ ఒప్పందంతో నౌకా వాణిజ్యం మన పోర్టుల నుంచి ఎలా ఉండబోతున్నది ఆయన మాటల్లో తెలుస్తూనే వుంది. తన శాఖ పరిధిలో నిర్మాణంలో ఉన్న ‘నేషనల్ హైవేస్’ అన్నీ డిసెంబర్ 2024 నాటికి పూర్తి అవుతాయని ఉపరితల రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ అంటున్నారు.

అవి పూర్తి అయితే, వాటిలో ఒకటైన- ‘రాయపూర్-విశాఖపట్టణం’ జాతీయ రహదారి ద్వారా ఖనిజ నిక్షేపాలు అధికంగా ఉన్న ఛత్తీస్ ఘర్ కు ఏ.పి. పోర్టులు అందుబాటులోకి వస్తాయని గడ్కరీ అంటున్నారు. అది నిజమే అన్నట్టుగా, ఆంధ్రప్రదేశ్ లో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు  శరవేగంగా సిద్ధమవుతున్నాయి. కేంద్ర-రాష్ట్రాలు ఇలా వేర్వేరుగా అవి తమ కార్యకలాపాల్లో ఉన్నప్పటికీ, అందులో ఉన్న ఏకీకృత లక్ష్యాన్ని ఇక్కడ మనం గమనించాలి.

వాళ్ళు ‘ పే ‘ చేస్తారు…

అభివృద్ధి అంతిమ దశ- ‘వృద్ధి’ (గ్రోత్) గా నమోదు అవుతున్నప్పుడు, అది ప్రాంతీయ దృష్టితో స్థానికంగా చూసేది కాదు. రాజకీయ కారణాలతో ఒక కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు, రాష్ట్ర పరిధిలో భౌగోళిక వికేంద్రీకరణ దృష్టితో అభివృద్ధి ప్రణాళిక రచన జరగాలి. ఎపి విషయమే చూస్తే ఇక్కడ కొత్త పోర్టులు సిద్ధమైతే, మరో పదేళ్లలో మన రాష్ట్రంలో జరిగే వాణిజ్య సాంద్రత గణనీయంగా పెరుగుతుంది.

అందుకే ఎప్పుడైతే ఈ ప్రభుత్వం తీరాంధ్ర అభివృద్ధిపై దృష్టి పెట్టిందో, ఇక్కడ పెరిగే వాణిజ్య అవసరాలు గుర్తించి మన రైల్వేలు అప్రమత్తం అయ్యాయి. విజయవాడ డివిజన్ లో 460. 98 కోట్లతో- రాజమండ్రి, అనపర్తి, బాపట్ల, చీరాల, గుడివాడ, గుణదల, మచిలీపట్టణం, రాయనపాడు, సామర్లకోట, యలమంచిలి స్టేషన్లు ఆధునీకరిస్తున్నారు. ‘అమృత భారత్  స్టేషన్ స్కీమ్’ ద్వారా పలు దశల్లో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 72 రైల్వే స్టేషన్లు 3,141 కోట్లతో ఆధునీకరిస్తున్నారు. వాటిలో తొలి దశలో- 270 కోట్లతో అనకాపల్లి, భీమవరం టౌన్, ఏలూరు, కాకినాడ టౌన్, నరసాపూర్, నిడదవోలు, ఒంగోలు, సింగరాయకొండ, తాడేపల్లిగూడెం, తెనాలి, తుని స్టేషన్ల ఆధునీకరిస్తున్నారు.

రెండవ దశలో వాల్తేర్ డివిజన్లో 149 కోట్లతో సింహాచలం, అరకు, పార్వతీపురం, బొబ్బిలి, కొత్తవలస, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్, నౌపడ స్టేషన్లు ఆధునీకరిస్తారు. వీటిలో ఎంపిక చేసిన స్టేషన్లలో- వెయిటింగ్ హాళ్లు, ‘వైఫై’, ఎస్కలేటర్లు, లిఫ్ట్ సౌకర్యం, ఎగ్జిక్యూటివ్ లాంజ్, ప్రీమియం మాడ్యులర్ టాయిలెట్స్, వాటర్ కియోస్క్స్, ఫ్లాట్ ఫారాలపై పూర్తి రూప్, లైటింగ్ వంటి వసతులు ఉంటాయి. అంటే, ఈ కొత్త సౌకర్యాలకు వెల చెల్లించి వీటిని వాడుకునే మధ్యతరగతి ఈ ప్రాంతంలో పెరుగుతుందని రైల్వే అంచనా కావొచ్చు.

పైకి చెప్పరు అంతే…

అయితే, అభివృద్ధి కోసం జరుగుతున్న విస్తరణతో పాటుగా మన సాంఘిక జీవనంలో వచ్చే మార్పులు, అవి మన కుటుంబ జీవనంలో తెచ్చే కుదుపులు ఎటూ మనకు తప్పవు. ఇటువంటివి ఎదుర్కోవడానికి ప్రజా అవసరాల పట్ల తక్షణం స్పందించే స్థానిక ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థ ఉండాలి. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థతో ఏర్పడ్డ – ‘ఫీల్ గుడ్’ వాతావరణం వల్ల మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాలు పైకి తమ అంతర్యం వ్యక్తం చేయకపోయినా రాష్ట్రమంతా సంతృప్తికరంగానే ఉన్నాయి.

అయితే, తొలుత పడిన ఇసుక దెబ్బ, రెండవదిగా-‘కోవిడ్’ దెబ్బకు కొనసాగింపు అన్నట్టుగా ఉంది మా పట్ల ఈ ప్రభుత్వం ధోరణి అనేది ‘రియల్ ఎస్టేట్’, నిర్మాణ రంగం వ్యాపార వర్గాల అభ్యంతరం. కానీ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన- ‘స్మాల్ టౌన్’ విధాన ప్రోత్సాహకంతో అటువైపుగా బదిలీ అయిన కొత్త ‘మార్కెట్’ను వీరు వీలైనంత వేగిరం గుర్తించాల్సి ఉంది.

వీరు అటు కనుక మళ్లితే ఎప్పటిలా మళ్ళీ వీరు తమ రంగాల్లో పుంజుకోవచ్చు. తీరాంధ్ర ప్రాంతంలో రైల్వే శాఖ అధునీకీకరణకు గుర్తించిన పట్టణాల జాబితా మనకు ఇందుకు ప్రామాణికం అవుతున్నది. ఏదేమైనా, కొంతకాలం పాటు రాజకీయాలకు అతీతంగా ఆలోచించి, ‘బ్లూ ఎకానమీ’ని ప్రోత్సహిస్తూ, దాని పర్యవసానాల పట్ల అప్రమత్తతతో ఉండే  ప్రభుత్వాలను ఎన్నుకోవడం ఇప్పటి అవసరం.

రచయిత: అభివృద్ధి-సామాజిక అంశాల వ్యాఖ్యాత

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles