Thursday, November 21, 2024

‘వైఎస్’ పిల్లల రాజకీయాలతో మనకేంటి మేలు?

జాన్ సన్ చోరగుడి

చిన్న ప్రపంచం మనది. అది అక్కడక్కడే తిరుగుతూ ఉంటే, మనమేమో దాన్ని- నిన్న నేడు రేపు అని వేర్వేరు అన్నట్టుగా చూస్తుంటాం. మూడేళ్ళ క్రితం ఇదే ‘వెబ్ సైట్’లో ‘కనుమరుగై… రెండయిన వై.ఎస్.ఆర్.’ శీర్షికతో ఒక వ్యాసం రాశాను. చిత్రం,  మరో సందర్భంలో మరో శీర్షికతో ఒకే విషయం మళ్ళీ మళ్ళీ రాయాల్సి వస్తున్నది.

మళ్ళీ ఇందులో కూడా రెండు ‘రిపిటీషన్స్’ – ఒకటేమో మరో తరం రాష్ట్ర రాజకీయాలు డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి పిల్లలు ఇద్దరి చుట్టూ తిరుగుతూ ఉంటే, మళ్ళీ అదే కాంగ్రెస్ అదే ‘వై.ఎస్. ఫ్యామిలీ’ని వెతుక్కుంటూ వచ్చి వీరిద్దరి చుట్టూ తిరుగుతూ ఉంది. అయితే ఇందులో ‘అవుటాఫ్ ఫోకస్’ కనిపిస్తున్నవి- కాంగ్రెస్ పాత కాపు చెంద్రబాబు తన చివరి రాజకీయ అంకంలో ఇందులో ‘గెస్ట్’ పాత్ర పోషించడం! తెర వెనుక అర్ధంలో ‘ఘోస్ట్’ అని కూడా దీన్ని చదువుకోవచ్చు. 

Also read: ఢిల్లీకి ఇక్కడ ఐదేళ్ళలో అమిరిన ‘సెట్టింగ్’ ఇది…

చమత్కారాలు సంగతి ఆలా ఉంచితే, ఇందులో ‘సీరియస్’ గా పట్టించుకోవలసిన అంశాలు ఉన్నాయి కనుకనే ఈ ఇప్పుడీ అంశం చుట్టూ ఈ కసరత్తు. శ్రీమతి ఇందిరాగాంధీ 1966-77 మధ్య ఒకసారి 1980-84 మధ్య మరొకసారి మన దేశ ప్రధానమంత్రిగా పద్నాలుగు ఏళ్లపాటు పనిచేసారు. డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి 1978లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు.

విజయతీరాలకు

ఆయనకు 2004 ఎన్నికల నాటికి పిసిసి ప్రసిడెంట్, ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీ -పార్లమెంట్ రెండింటికి ఒకేసారి జరిగే ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసే అవకాశం వచ్చింది. అప్పుడాయన చేసింది ఏమిటి? ‘ఇందిరమ్మ రాజ్యం – ఇంటింటా సౌభాగ్యం’ అనే నినాదం ఇచ్చారు.

అప్పటికి ఇరవై ఏళ్ల క్రితం కన్నుమూసిన ‘ఇందిరమ్మను’ ఆమె సంక్షేమ పరిపాలనను మరోసారి గుర్తుచేసే ప్రయోగం వై.ఎస్. చేశారు. అదీ ఎప్పుడు? ‘పోస్ట్- చెంద్రబాబు’ కాలంలో! అటువంటి అరుదైన ప్రయోగంతో ఆయన పార్టీని విజయతీరాలకు చేర్చారు. ఒక కాలపరిధిలో పార్టీలు గెలుస్తాయి ఓడిపోతాయి అందులో విశేషం ఏమి లేదు.

కానీ దేశంలో ఇంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నప్పటికీ, ఒక్క ‘వైఎస్సార్’ కు మాత్రమే ఇన్నేళ్లు తర్వాత కూడా గతం నుంచి ఒక- ‘టైమ్ క్యాప్సూల్’ గా ‘ఇందిర ఫ్యాక్టర్ ‘ను పట్టుకొచ్చి ఎన్నికల రాజకీయానికి దాన్ని ‘అప్లై’ చేయవచ్చు అనే ఆలోచన ఎలా కలిగింది? దీనికి మనకు సమాధానం దొరికితే, ఇప్పుడీ ‘వైఎస్’ పిల్లల రాజకీయ సంవాదం ఎందుకు? అనే విషయంలో ఒక స్పష్టమైన ‘లైన్’ దొరుకుతుంది.

కుటుంబ నేపధ్యం

ఆ కుటుంబంలో మొదటి నుంచి పిల్లలు ఎలా పెరిగారు? అనే ప్రశ్నలో ఆడ-మగ అనే వ్యత్యాసానికి చోటు కనిపించదు. వై.ఎస్. రాజారెడ్డి సోదరి డా. వై.ఎస్ రత్నమ్మ 1923లో పులివెందుల తాలూకా బలపనూరులో ఐదవ తరగతి చదివారు. తర్వాత స్వంత ఊళ్ళో హైస్కూల్ లేకపోవడంతో, ఆమె తండ్రి వై.ఎస్. వెంకట రెడ్డి అప్పట్లో ఆ ఊళ్లోకి గృహదర్శనాలకు వచ్చిన ‘క్రిస్టియన్ మిషినరి’ స్త్రీల విభాగం వారి సలహా మేరకు, ఆమెను జమ్మలమడుగు ‘మిషన్ స్కూల్ బోర్డింగ్’లో చేర్చారు.

Also read: ఈ ప్రభుత్వం ఆ పని పూర్తిచేసింది!

అలా ఆమె మెడ్రాస్ లో పై చదువుల్లోకి వెళ్లి, ఆ తర్వాత రాయ వెల్లూరు క్రిష్టియన్ మెడికల్ కాలేజీలో మెడిసన్ చదివాక, జమ్మలమడుగు మిషన్ హాస్పిటల్లో పనిచేసారు. ఆమె భర్త కూడా అక్కడే డాక్టర్. సర్వీస్ మధ్యలో ఆమె విదేశాల్లో ‘గైనిక్’ పి.జి. చేసి వచ్చాక, పదిమంది తోబుట్టువులు వున్న కుటుంబం నుంచి వచ్చిన ఆమె, తానే అందరికీ స్ఫూర్తి కావాలని, తన సర్జరీకి ఏర్పాట్లు చేసుకుని సిబ్బందికి తగు సూచనలు ఇచ్చి- అక్కడే ఆమె ‘ట్యూబెక్టమి’ ఆపరేషన్ చేయించుకున్నారు. కడప జిల్లాలో 1954 నాటికి అది మొదటి కుటుంబ నియంత్రణ ఆపరేషన్.

‘పబ్లిక్ లైఫ్’లో…

ఇదంతా ఇప్పటికి వందేళ్లనాటి చరిత్ర. అయితే, ఈ ‘సోషల్ మీడియా’ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే, ఎదుటి వ్యక్తుల్ని కొలవడానికి మనవద్ద ఉండే ‘టేప్’ కొలతను మించి, ఎదుటి వాళ్ళు ఏమాత్రం ఎత్తు ఉండరు! ఇదే సూత్రంతో వీరు మీరేంటో మేము చెబుతాం అంటారు. అదేంటి? అంటే అది అంతే, అది వారి రూలు. కనుక ‘పబ్లిక్ లైఫ్’లో ఉండాలి, అనుకునేవారు ఇటువంటి ‘పోస్ట్-ట్రూత్’ కాలపు ‘రివ్యూ’కు సిద్దపడి ముందుకు వస్తేనే మనగలరు.

ఇక్కడ ప్రధానమైన సమస్య ఏమంటే, అది ఏ పరిణామం అయినా దానివల్ల రాష్ట్రంలోని ఒక ప్రాంతానికి లేదా ఒక ప్రజా సమూహానికి కలిగే ప్రయోజనం ఏమిటి? అనే దృష్టి కోణం నుంచి చూడడం అనేది బొత్తిగా దుర్లభంగా మారింది. వైఎస్ పిల్లలు ‘పబ్లిక్ లైఫ్’ లో ఉంటే జరుగుతున్నది అదే! ఉండనివ్వండి, వాళ్ళ నేపధ్యానికి అనుభవానికి తగినట్టుగా వాళ్ళ వల్ల సమాజానికి మేలు కలిగితే మంచిదే కదా. లేదు, వాళ్ళే కనుమరుగు అవుతారు. మనం ఎవ్వరం వాళ్ళ మంచి చెడు గురించి మాట్లాడ్డానికి? 

కుటీర పరిశ్రమ!

‘సోషల్ మీడియా’ సమాచారం తయారీలో పనిచేసేవారు తాము ఎవరి ‘పే రోల్స్’లో ఉంటున్నారో వారికి పూర్తిగా తెలియదు. కొన్నిసార్లు తెలియని ఆ అవతలవాడికి ఏ ‘సర్వీస్’ కావాలంటే దాన్ని అందించడానికి వీళ్లకు అభ్యంతరం ఉండడం లేదు. అంతేకాదు, మనం ఇచ్చే ‘సర్వీస్’ రేపు ఎవరు ఎక్కడ ఎలా వినియోగించుకుంటాడు అనేది మనకు తెలియకపోవడం, దాన్ని అస్సలు ఒక విషయంగా మనం పట్టించుకోకపోవడం ఇప్పుడు మనం చూస్తున్న కొత్త ధోరణి!

Also read: ‘నంది’తో… కళారంగంలో విభజన ప్రతిఫలనాలు మొదలు

ఇలా నాయకుల తయారీ ఇప్పుడు కొత్త కుటీర పరిశ్రమ! అవును, ఈ ‘ప్రొసీజర్’ చాలా సింపుల్. నాలుగు చోట్ల నుంచి నాలుగు రకాల ‘స్పేర్స్’ (దీన్ని ‘సర్వీసులు’ అని కూడా చదువుకోవచ్చు) తెచ్చి ఒక కొత్త ‘పొలిటికల్ పర్సనాలిటీ’ని తయారు చేస్తున్నారు. రేపు దాని పదఘట్టనల క్రిందపడి నలిగేవారిలో మనమూ ఉండొచ్చు. ఇప్పుడది తెలియదు.

పన్నెండేళ్ళు

నడుస్తున్న చరిత్ర చూడండి 2014 లో రాష్ట్ర విభజన జరిగాక, చెంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు వేర్వేరు వైఖరులతో రాష్ట్ర ప్రణాళికల్ని అమలు చేయాలి అనుకుంటున్నారు. ‘ఫిజికల్’గా వీరిద్దరి మధ్య వయస్సులో ఉన్న పన్నెండేళ్ల  వ్యత్యాసం వల్ల, వారి ఆలోచనలు భిన్నంగా ఉండడం సహజం. ఇక వారు పెరిగిన కుటుంబ నేపథ్యం దాని ప్రభావం వారి దృక్పథాల మీద ఎటూ ఉంటుంది.

అయితే, వారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు, వారి అధికారాల పరిధిలో   వ్యత్యాసం ఉండదు. అది ఎవరైనా గాని ‘బుక్’ ప్రకారం చేయాలి. అయితే వీరిద్దరి విషయంలో ఒక ఇంట్లో తండ్రి – కొడుకు ఆలోచనలు మధ్య ఉండే స్పర్ధ దాని నుంచి వచ్చే వ్యత్యాసం అడుగడుగునా కనిపిస్తున్నది. కారణం ఒక తరం ‘గ్యాప్’ వీరిద్దరి మధ్య ఉంది.

అనొచ్చు

ఎందుకంటే, ‘వైఎస్’ – ‘సిబిఎన్’ ఇద్దరు 1978లో మొదటి సారి ఎమ్మెల్యేలు అయినవారే. అయినా వైఎస్ తర్వాత ఆయన కొడుకుతో కూడా ఇంకా చెంద్రబాబే తలపడుతున్నాడు కనుక, లోకేష్ ప్రస్తావన మళ్ళీ ఇక్కడ అక్కర్లేదు. పైగా జగన్ ఇప్పటివరకు ‘లీడర్’గా లోకేష్ పై తన అభిప్రాయం ఏమిటో ఎప్పుడు చెప్పలేదు.

అయితే, ఆలస్యంగా మనకు అర్ధమవుతున్నది ఏమంటే- ఒక తండ్రిగా ఇంట్లోనూ, ఒక ‘లీడర్’ గా బయట, ఇద్దరు యువ నాయకులతోనూ సిబిఎన్ తలపడలేక పోతున్నాడు. ‘అటువంటప్పుడు, ఇంకా వయస్సు మీరిన నువ్వెందుకు నీ కొడుకు చూసుకుంటాడు కదా…’ అనొచ్చు.

అయితే అటువంటి దేశవాళీ సలహా సిబిఎన్ పార్టీకి నప్పటం లేదు. అప్పుడు బాబు ఏమి చేయాలి? తన పార్టీ నుంచి లేదా తమ సామాజిక వర్గం నుంచి ఒక యువ నాయకుణ్ణి … ఒక్కడు ఒద్దు అనుకుంటే, ‘సేఫ్టీ’ కోసం కొత్త తరంతో ఒక ‘సిండికేట్’ను ఇప్పటికే సిద్ధం చేసుకోవాలి. ఏర్పడుతున్న రాజకీయ ఖాళీ జాగాలోకి వారిని దించి, తన పార్టీ ‘అప్ డేట్’ అవుతున్నది అనే సంకేతాలు మనకు ఇవ్వాలి.

దేశవాళీ నమూనా

దేశంలో ఏ రాష్ట్రంలోనూ సిబిఎన్ వయసున్న ఏ నాయకుడు, ఈయన మాదిరి  చిన్నదైన ఏపీ వంటి రాష్ట్రానికి సీఎం కావడానికి, ఇంతగా ఆపసోపాలు పడడం మనం చూడం. సిబిఎన్ సమకాలీకులలో ఎవ్వరూ 70ల తర్వాత కూడా ఈ తరహాలో రాష్ట్ర స్థాయి రాజకీయాలకు పరిమితమై లేరు. వాళ్ళు చాన్నాళ్లుగా- ‘నెక్స్ట్ లెవల్ పాలిటిక్స్’ చేస్తున్నారు. నవీన్ పట్నాయక్ ను చూస్తే ఆయనది ది భిన్నశైలి. ‘కింగ్ మేకర్’గా శరద్ పవార్ ది ‘పవర్ పాలిటిక్స్’ లో దూకుడు శైలి.

Also read: ఏదో తేడా ఉన్నట్టుగా అనిపించడం లేదూ…?!

వీరందరిలో ఒక్క ‘సిబిఎన్’ ది మాత్రమే మొదటి నుంచి ‘టెర్మినేటర్’ (తరహా) రాజకీయ శైలి. ఈయన కొత్త రాజకీయ శక్తుల ఆవిర్భావాన్ని మొగ్గలోనే తుంచుతూ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల్ని నిర్వీర్యం చేస్తూ వచ్చాడు… అందువల్ల ఏమైంది?

విభజిత ఏపీలో చాన్నాళ్లు ఖాళీగా ఉన్న ‘పొలిటికల్ వాక్యూమ్’ ను భర్తీ చేయాల్సిన సమయం 2024 నాటికి ఆసన్నమైతే, అందుకు లెఫ్ట్ పార్టీలతో సహా ఒక్కరు సిద్ధంగా లేరు. దాంతో ఐదేళ్లుగా ‘ఫుల్ టైం’ రాజకీయాలు చేయడం కోసం ‘పొలిటికల్ స్పేస్’ వెతుక్కుంటున్న వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ లేబుల్ తో ఇప్పుడు ఎపి- ‘ఔటర్’ లోకి వచ్చి ఆగింది.

మనకేంటి?

లీడర్ల షర్టు కాలర్ మీద ఉండే పార్టీ లేబుల్ లేదా కండువా సంగతి కాస్సేపు పక్కనబెట్టి ‘అందరూ ఒక్కటే…’ అనుకుని, మరో ముప్పై ఏళ్లకు రాష్ట్రం మేలుకోసం ఎవరు ‘బెటర్’ అని మనం చూద్దాం. ముఖ్యమంత్రి ఎవరు? అనేది ఒక్కటే కాదు, ‘అపోజిషన్’ లీడర్ ఎవరు? అనేది కూడా మనం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.

వైఎస్ ఫ్యామ్లీ పొలిటికల్ ‘నర్సరీ’లో పెరిగిన మొక్కలకు ‘ఈల్డ్’ బాగుంటుంది, రాష్ట్రంలో రాజకీయ పర్యావరణం కూడా బాగుంటుంది అనుకుంటే, రేపు వాళ్ళు ఏ పార్టీ లేబుల్ అంటించుకుని వచ్చి అసెంబ్లీలో- ఏ ‘బెంచి’లో కూర్చుంటే మనదేం పోయింది? అంతిమంగా రాష్ట్రం మేలుకు హామీ ఉన్నప్పుడు…

Also read: ‘వై… ఏ.పి. నీడ్స్ దిస్ గవర్నెన్స్?’   

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles