అయోధ్యలో 22 జనవరి 2024 మధ్యాహ్నం గం. 12.20లకు చరిత్ర సృష్టి జరిగింది. రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ ఈ చారిత్రక కార్యక్రమానికి సారథ్యం వహించారు. ఇక నుంచి చరిత్ర గురించి మాట్లాడుకునే సమయంలో అయోధ్య రామాలయం ప్రతిష్ఠకు పూర్వం, తర్వాత అని అనవలసి ఉంటుంది. విగ్రహ ప్రతిష్ఠ జరిగిన సందర్భంలో రామాలయ గర్భగుడిలో ప్రధాని మోదీతోపాటు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్, ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, కొంతమంది పూజారులూ ఉన్నారు. బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ తర్వాత బయటికి వచ్చి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచీ ఆహ్వానంపైన వచ్చిన ప్రముఖులను ఉద్దేశించి ముగ్గురు నాయకులూ మాట్లాడారు.
ప్రధాని మోదీ భారత జాతీయతకు కొత్త అర్థం చెప్పారు. ఇంతవరకూ నెహ్రూ చెప్పిందే వేదం అనుకున్నాం. మతానికీ, రాజ్యానికీ మధ్య భేదం పాటించాలని నెహ్రూ చెప్పాడు. ‘సర్వధర్మ్ సమభావన’ అన్నది మన విశ్వాసం. అన్ని మతాలనూ సమానంగా చూడాలి. అన్ని మతాచారాలనూ గౌవరించుకోవాలి. ఎవరికి తోచినట్టు వారు తమ మతప్రార్థనలూ, కార్యక్రమాలూ చేసుకోవడానికి అనుమతించాలి. ఇవన్నీ మన రాజ్యాంగంలో పొందుపరచినవే. ఇందుకు భిన్నంగా దేవ్ నుంచి దేశ్ అనీ, రామ్ నుంచి రాష్ట్ర అనీ ప్రధాని మోదీ కొత్త భాష్యం చెప్పారు. దేశాభివృద్ధి రాముడిపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. దేశ ప్రజల ఆశలూ, అభిలాషలూ రాముడి దయతోనే నెరవేరాలని ఆయన చెప్పారు.
అంతేకాదు. కొత్త కాలచక్రం మొదలయిందన్నారు. అంటే ఇప్పటి నుంచి కొత్త వాతావరణం, కొత్త రాజకీయం, కొత్త ఆధ్యాత్మికభావజాలం ఉండబోతున్నాయని అర్థం. ఇది వేయి సంవత్సరాలకుపైగా ఉంటుందని కూడా అన్నారు. సరిగ్గా వెయ్యి సంవత్సరాల క్రితం ముస్లిం దురాక్రమణదారులు భారత దేశంపై కన్నువేశారు. ఖాసిం, గజనీలు, అనంతరం మొఘలాయీలు, తర్వాత బ్రిటిషర్లు ఈ దేశాన్ని ఆక్రమించి, పరిపాలించి, బానిసత్వంలో ఉంచారు. ఇది ఆర్ఎస్ఎస్ ఆలోచనా ధోరణి. అదే కాంగ్రెస్ నాయకులు ముస్లిం పరిపాలనను బానిసత్వంగా భావించరు. ముస్లింలు దండయాత్ర చేసినప్పటికీ వారు ఈ దేశంలోనే నివసించారు. ఇక్కడే జీవించారు. ఇక్కడే చనిపోయారు. ఇక్కడే పరిపాలించారు. వలస పాలకులైన బ్రిటిషర్ల పాలనలో మాత్రమే భారతీయులు బానిసలుగా ఉన్నారని భావిస్తారు.
రాముడు సమస్య కాదనీ, సమాధానమనీ మోదీ అన్నారు. రాముడు వర్తమానం మాత్రమే కాదనీ భవిష్యత్తు కూడా అనీ అన్నారు. రాముడే మనకు రాజ్యాంగం ఇచ్చినట్టు అర్థం వచ్చే విధంగా మోదీ మాట్లాడారు. అంటే ఇదే రాజ్యాంగంతో తాము అనుకున్న రాష్ట్రాన్ని అనుకున్న విధంగా నడిపించవచ్చునని అర్థం.
ఇక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భాగవత్ సమన్వయం గురించి మాట్లాడారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఇక మీదట అయోధ్యలో గొడవలు జరగవనీ, కర్ఫ్యూ ఉండదనీ, కాల్పులు జరగబోవనీ అన్నారు. అంటే ముస్లింలతో సత్సంబంధాలు పెట్టుకుంటారా? వారిని కూడా పౌరులుగా గుర్తించి సమంగా చూస్తారా? అన్నిటికంటే ముఖ్యమైనది మథుర, కాశీ వివాదాలను అట్లా వదిలేస్తారా? వాటిని కూడా స్వాధీనం చేసుకొని అక్కడ కూడా కృష్ణుడినీ, శంకరుడినీ ప్రతిష్ఠిస్తారా?
హిందూత్వ నినాదం ఓట్లు ఎప్పటివరకూ రాల్చుతుందో అప్పటివరకూ ఈ వివాదాలను బీజేపీ వదిలిపెట్టదనీ, రగిలిస్తూనే ఉంటుందనీ భావించవచ్చు. ఎంతవరకూ ఓట్లు రాలుతాయో తేల్చవలసింది భారత పౌరులు. వారికి నచ్చజెప్పవలసిన బాధ్యత కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలపైన ఉంది.
మథుర, కాశీ విషయంలో 1993లో పీవీ నరసింహారావు ప్రభుత్వం తెచ్చిన చట్టం గురించి ఒక్కరూ మాట్లాడరేమిటి? అయోధ్యలో బాబరీ మసీదు కూలిన తర్వాత అటువంటి కార్యక్రమం మరొకటి జరగకూడదనే ఉద్దేశంతో పీవీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చట్టం చేసింది. అది ఇప్పటికీ రాజ్యాంగంలో భద్రంగా ఉంది. కానీ దాని గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు. మాట్లాడితే మథుర, కాశీలపైన వాదనలను న్యాయస్థానాలు అంగీకరించకూడదు. మధుర, కాశీలే కాదు ఇండియాలో ఏ మసీదునూ ప్రశ్నించడానికి వీలులేదు. గతం గతః అని అనుకోవాలి. చరిత్రను తిరగతోడ కూడదు.
బాబరీ విధ్వంసం మీదట రామమందిరం నిర్మాణం జరిగింది. బాబరీ మసీదు కూలిపోయిన తర్వాత జరిగిన అల్లర్లలో చాలామంది మరణించారు. వారిలో ముస్లింలు ఎక్కువ. అంటే రామాలయ నిర్మాణం వెనుక రక్తచరిత్ర ఉంది.
అయోధ్యతో వివాదాలన్నిటికీ స్వస్తి చెప్పి, ఇకనైనా మోహన్ భాగవత్ చెప్పిన సంయమనం పాటిస్తే, మోదీ చెప్పిన రామరాజ్యం చూపిస్తే, యోగీ లాంటి నాయకులు బుల్డోజర్లు ఉపయోగించి ముస్లింలను భయకంపితులను చేయకుండా ఉంటే భారతీయులు అదృష్టవంతులు.