ఉత్పత్తి విధానపరంగా ఇండియా పెట్టుబడిదారి దశలో ఉన్నది. అలాగని పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రధానంగా ఉండే వర్గాలు కార్మికవర్గం పెట్టుబడిదారులు మాత్రమేఉన్నారా? అంటే లేదు. ఇప్పటికీ కుల, మత, ప్రాంత, గిరిజన తెగల విచిత్ర సంగమంగా ఉంది. వాటి ప్రభావం నేటికీ తీవ్రంగానే ఉంది. మరి ఇలాంటి వైవిధ్యం గల భారతదేశంపై మార్క్స్అంచనా ఏమిటనేది మార్పు కొరే వ్యక్తులకు ఆసక్తికరమైన అంశంగా ఉంటుంది. ఇక ఆయన సైదాంతిక పరిశీలన ప్రధానంగా ఐరోపాఖండం ఆధారంగా జరిగినప్పటికీ, వివిధ దేశాల మార్పులను పరిశీలించలేదని కాదు.
Also read: ప్రేమికుల రోజు వర్ధిల్లాలి!
భారతదేశానికి సంబంధించినంత వరకు కుల వ్యవస్థ ప్రభావాన్నిఉత్పత్తి సంబంధాలలో దాని పాత్రను విశ్లేషించిన తొలిసిద్ధాంతకర్త మార్క్సే. 1853లో రాసిన ‘భారతదేశ భవిష్యత్తుపై వలస పాలన ప్రభావం’ అనే ప్రసిద్ధ వ్యాసములో కుల వ్యవస్థ భారతదేశంలో శ్రామికులను వంశపారంపర్యంగా విభజిస్తుందని భావించాడు. భారతీయ సమాజం సాంకేతిక మార్పుల ప్రభావంలోకి రాకపోవటమే దీనికి కారణమని, ‘‘స్వయంపోషక ఆర్థికవ్యవస్థకు పరిమితమై పోవడంవల్లనే ఈ రకమైన వంశపారంపర్యమైన శ్రామిక విభజనకు తెర తీసి స్తబ్దతకు లోనయి పోయింది. దీన్ని ఆసియా తరహా ఉత్పత్తి విధానంగా గుర్తిస్తాడు.
అయితే, భారత గ్రామీణ వ్యవస్థ గురించి మార్క్స్ మరింతగా విశ్లేషిస్తూ అక్కడి ప్రజాసమూహాలు తమలో తాముముడుచుకుపోయే స్వభావం కలవిగా విమర్శించారు. వ్యక్తిని తన భవిష్యత్తుకు తాను నిర్ణాయకుడు కాకుండా ఈ గ్రామాలు మనిషిని ప్రకృతి ఇష్టాయిష్టాలకు బలిచేశాయని అంటాడు. “ప్రశాంతమైన ఈ గ్రామ సముదాయాలు… ఎల్లపుడూ తూర్పు దేశాల నియంతృత్వానికి పటిష్టమైన పునాదులుగా నిలబడ్డాయి. అవి మానవమేధస్సును అతి కనిష్టస్థాయికి పరిమితం చేశాయి. ఎటువంటి ప్రతిఘటనా లేకుండా చేశాయి. సాంప్రదాయక నమ్మకాలకు బానిసలను చేశాయి. ఈ చిన్నచిన్న సమూహాలు కుల అంతరాలతో, బానిసత్వంతో కలుషితమయ్యాయని, అవి మనుషులను బాహ్యపరిస్థితులకు లోబడేటట్లు చేశాయనే వాస్తవాన్నిమనం మర్చిపోరాదు. మనిషిని పరిస్థితులకు సార్వభౌమాధికారిగా ఉన్నతీకరించడానికి బదులు స్వీయాభివృద్ధి చెందవలసిన సామాజిక నిర్మాణాల్ని ఎన్నటికీ మారక పోవడమే వాటి సహజమైన గమ్యంగా పరిణమింప చేశాయి.”
Also read: దారితప్పిన దళితోద్యమం!?
‘గృండ్రిస్సే’ గ్రంధంలో కూడా మార్క్స్ ఈ వ్యవస్థ లక్షణాలను గుర్తించారు. ఏ రకమైన మార్పునైనా ప్రతిఘటించడం, వ్యవస్థను ధ్వంసం చేయడానికి అవసరమైన ఆంతరంగిక వైరుధ్యాలు లేకపోవమేనని అంటాడు. అలాగే ఈ లక్షణాలను ఆయన ‘కాపిటల్’ మొదటి వాల్యుంలో గ్రామీణ కమ్యూన్ ఉనికి గురించి, వ్యక్తిగత ఆస్తి లేకపోవడం గురించి, సాముదాయక యాజమాన్యం గురించి, స్వయం పోషకఉత్పత్తి, వ్యవసాయం, చేతివృత్తుల గురించి రాశారు. ఇది గ్రామీణ సముదాయాల “సహజ ఆర్థిక వ్యవస్థ’’ కున్న నిరాడంబరతగా ఆయన వర్ణించారు. “ఆసియా తరహా సమాజాలు మార్పుకు గురి కాకుండా ఉండటంలో రహస్యం ఇదేనని”రాశారు. కుల వ్యవస్థకు ఒక భౌతిక పునాది, ఒక శాసన సంబంధమైన పునాది ఉన్నాయని కూడా మార్క్స్ అర్థం చేసుకున్నారు. వస్తు ఉత్పత్తి శ్రమ విభజనకు దారి తీసింది. తదనంతరం ఈ స్థితిని సమాజంలోని ఆధిపత్య వర్గాలు చట్టాలుగా క్రోడీకరించాయి. అందుకు ‘మనుస్మృతి’వంటివి సాంఘిక నిర్మాణానికి పునాదిగా మారాయి.
“తత్వశాస్త్రదారిద్ర్యం”అనే గ్రంథంలో ఆయన ఇంకా ఇలా రాశారు. “పితృస్వామ్య వ్యవస్థలో, కులవ్యవస్థలో, భూస్వామ్య వ్యవస్థలో సమాజ మంతటా నిర్ధారించబడిన నియమాలకు అనుకూలంగా శ్రమ విభజన జరిగింది. భౌతిక వస్తువుల ఉత్పత్తికి అవసరమైన పరిస్థితుల నుండి తలెత్తిన ఈ నియమాలను చాలా కాలం తరవాత మాత్రమే చట్టపరమైన నిబంధనలుగా మార్చారు. ఈ పద్ధతిలో వివిధ రూపాలలో వున్న శ్రమ విభజన సామాజిక నిర్మాణంలో అనేక పునాదులుగా మారింది.” ఒకటి వారసత్వపు పునాది మీద భూమిపై యాజమాన్యాన్ని కలిగివుండి దాని ద్వారా సంపదను, అధికారాన్ని పొందిన సమూహం. రెండవది వారసత్వపు పునాది మీద ఆధారపడి శ్రమ మాత్రమే కేటాయించబడి మొదటి సమూహానికి సేవచేయకతప్పని స్థితికి నెట్టబడ్డ సమూహం మధ్య భిన్నత్వానికి కుల వ్యవస్థే కారణమని ఆయన అర్థంచేసుకున్నారు.
వారసత్వపు విభజన
ఇదేగ్రంథంలో “చట్టాలు కొన్ని కుటుంబాల చేతుల్లోనే భూయాజమాన్యాలు వుండేలా చేయవచ్చు. లేదా శ్రమ చేయటమే కొందరికి వారసత్వపు సౌకర్యంగా చేయవచ్చు.ఈ విధంగా కుల వ్యవస్థను సంఘటితం చేయవచ్చును.” భూయాజమాన్యానికి, శ్రమకు మధ్య మార్క్స్ స్పష్టంగా చెప్పిన ఈ వారసత్వపు విభజనే ఇప్పటికీ భారతదేశంలో దళితులు అగ్రకులాలకు మధ్య విభజనకు పునాది. అగ్రకులాలు భూమిపై తమకున్న యాజమాన్యాన్నితమకు అప్పగిస్తే తాము వారసత్వంగా కొనసాగిస్తున్న పశువుల మృతకళేబరాల చర్మాన్ని వలచటం అనే వారసత్వపు శ్రమను వదులుకుంటామని గుజరాత్ లోని దళిత ఉద్యమం డిమాండ్ చేయడం కుల వ్యవస్థపై మార్క్స్ అగాహనను రుజువు చేస్తున్నది..
వివిధ సమాజాలలో వారసత్వపు శ్రమ విభజనలు ప్రారంభం కావడాన్ని శోధించే క్రమంలో మార్క్ భారత దేశంలో వారసత్వపు వృత్తులు ఎలా ఘనీభవించిన కులాలుగా మార్చబడినాయో వివరించారు. అలానే ప్రాచీన ఈజిప్టులో అలాంటి పరిస్థితులే వుండగా అక్కడ అవి దృఢమైన గిల్డులుగా మారిన వైనాన్ని, తరవాత కాలంలో అవి యూరోప్ లో ఏర్పడిన శ్రేణులకు(గిల్డ్) నమూనాలుగా మారిన వైనాన్ని వివరించారు. “జీవితంలో అప్పుడప్పుడూ చేయవలసిన పని జీవితాంతపు వృత్తిగా మారి పోవడానికి గత సమాజాలలో వృత్తులను వారసత్వంగా మార్చేధోరణికి, వాటిని కులాలుగా ఘనీభవింపచేసే ధోరణికి మధ్య సంబంధం వుంది.
Also read: బహుజన రాజ్యాధికారంతో ఎస్సీలకేంపని?
మన గ్రామీణ వ్యవస్థ ప్రత్యేక లక్షణం
అయితే, భారతీయ గ్రామీణ సమాజం ఒక్కటి మాత్రమే స్వయంపోషక వ్యవస్థ కాదు. ఇతరదే శాలలోని ప్రాచీన మధ్య యుగాల గ్రామీణ వ్యవస్థలు కూడా స్వయంపోషకంగానే ఉండేవి. కానీ మనదేశంలో సామాజిక శ్రమ విభజన కులాల ప్రాతిపదిక మీద ఉండటం, అది మార్పు చేయటానికి వీళ్లేనంతగా దృఢంగా ఉండటం మన గ్రామీణ వ్యవస్థ ప్రత్యేక లక్షణం. అంటే శ్రామిక కులాలకు రాజ్యాధికారం, సంపద, విద్య, గౌరవాన్ని పొందే హక్కులు లేకుండా చేయటంతో పాటు ఈ రెండు కులాల మధ్య వివాహ సంబంధాలను నిరాకరించే అడ్డుగోడలను నిర్మించారు. కాబట్టి భారతదేశంలో జరిగిన యుద్ధాలు దండయాత్రలు విజయాలు కరువుకాటకాలు గ్రామీణ వ్యవస్థను మార్చలేకపోయాయి.
కానీ, బ్రిటిష్ వాడు ప్రవేశపెట్టిన ఆవిరి ఇంజన్ వ్యాపార విధానం స్వయం పోషక గ్రామీణ వ్యవస్థను ధ్వంసం చేస్తున్న దానిని చూసి మార్క్స్”,… ఈ విధంగా బ్రిటిష్ వారు చొరబాటు ఆసియాలోకెల్లా పెద్దదైన నిజం చెప్పవలసి వస్తే ఆసియాలో ఏకైక సామాజిక విప్లవాన్నితట్టిలేపింది”. ఈ వ్యాఖ్యానం ఏ కార్మిక వర్గమో, సామాజిక వర్గమో చేసిన తిరుగుబాటు వల్ల సంభవించిన మార్పు గురించి కాదు, ఉత్పత్తి శక్తుల్లో వచ్చిన మార్పుల ఆధారంగానేనని మనం గ్రహించాలి.
ఆసియాలో సామాజిక విప్లవం
అదే సమయంలో ఒక మౌలిక ప్రశ్నవేస్తాడు. ఆసియా సామాజిక స్థితిలో మౌలిక విప్లవం తీసుకురాకుండా మానవాళి తన కర్తవ్యాన్ని సంపూర్ణం చేసుకోగలదా? అనే ప్రశ్న చూస్తే ఇండియా సమాజానికి ఉన్నసంక్లిష్టత పట్ల ఆయనకుఉన్నస్పష్టత అవగతం అవుతుంది ఈ విధంగా. స్వయం పోషణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు ఆధారమైన సాంకేతిక ఆర్థిక పునాదులు వలస పాలనలో ప్రత్యేకించి రైల్వే వ్యవస్థ విస్తరణ వంటి చర్యల ద్వారా సడలింపుకు గురవుతున్నాయి’’ అని మార్క్స్ అంచనాకు వచ్చాడు. రైల్వేల విస్తరణతో పాటు జరిగే పారిశ్రామికీకరణ, వాణిజ్య విస్తరణతో సాంప్రదాయక గ్రామీణ సమాజం దాని పునాదిపై నిలబడ్డ కులవ్యవస్థ బద్దలవుతుందని కూడా అంచనా వేశాడు. ఈ విధంగా పారిశ్రామికీకరణ కారణంగా కుల వ్యవస్థ పట్టు సడలుతుందన్న మార్క్స్ అభిప్రాయము సరైనదే. అక్కడి నుండే భారతీయ తరహా వర్గ సమాజం (దడికట్టుకున్న వర్గం) ఐరోపా తరహా వర్గ సమాజం వైపు పరివర్తన చెందుతున్నదని గ్రహించాలి.
Also read: కులాన్ని పట్టించుకోవటం అంటే ఏమిటి?
డాక్టర్ పట్టా వెంకటేశ్వర్లు
9959649097