Tuesday, November 5, 2024

అఫ్ఘానిస్తాన్ పట్ల ఆసక్తి కోల్పోయిన అమెరికా

తాలిబాన్ తో భారత్ ఎట్లా వ్యవహరించాలి-2

అమెరికా పద్దెనిమిది సంవత్సరాల అఫ్ఘానిస్తాన్ వ్యవహారంలో విసిగిపోయింది. ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. సుమారు మూడు వేల మంది (2,400 మంది) అమెరికా, నాటో సైనికులు మరణించారు. ఒబామా హయాంలోనే అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ను పాకిస్తాన్ లో మట్టుబెట్టారు. లాదెన్ ను అప్పగించడానికి తాలిబాన్ ప్రభుత్వం నిరాకరించిన కారణంగానే అమెరికా యుద్ధ విమానాలను 2001లో అఫ్గానిస్తాన్ పైకి పంపింది. అఫ్ఘానిస్తాన్ ఆక్రమణ తర్వాత ఆ దేశం అంతటా గాలించినా లాదెన్ ఆచూకీ తెలియలేదు. చివరికి పాకిస్తాన్ లో తలదాచుకున్నాడని పాకిస్తాన్ సైనికాధికారులలో అమెరికా బంట్లు ఇచ్చిన సమాచారం వల్ల తెలుసుకొని కమాండోలను పంపించి నిరాయుధుడైన లాదెన్ ను ఒబామా ప్రభుత్వం హతమార్చింది. ఏ లాదెన్ కోసం అఫ్ఘానిస్తాన్ పైన దాడి చేసి, అహ్మద్ షా మసౌదీ సహకారంతో రెండు మాసాలు భీకరయుద్ధం చేసి తాలిబాన్ ను పారదోలి అఫ్ఘానిస్తాన్ ను ఆక్రమించుకున్నారో ఆ లాదెన్ అఫ్ఘానిస్తాన్ లో లేడు. పాకిస్తాన్ లో ఉన్నట్టు తెలుసుకొని హతమార్చారు. ఇక అఫ్ఘానిస్తాన్ లో అమెరికాకు కానీ, నాటో దేశాలకు కానీ ఏమి పని? ఎంతకాలం అఫ్ఘానిస్తాన్ లో తిష్ఠవేయాలి? ఎంత డబ్బు ఖర్చు చేయాలి? ఎంతమంది సైనికులను  కోల్పోవాలి? ఎంత చేసినా అఫ్ఘాన్ ప్రజలలో పోరాట పటిమ పెరగడం లేదు. స్వయంశక్తిపైన ఆధారపడే సూచనలు కనిపించడం లేదు. ఎంతకాలం వారికి మద్దతుగా ఉండాలి? తాలిబాన్ అఫ్ఘాన్ వదిలి వెళ్ళారే కానీ పాకిస్తాన్ లో తలదాచుకుంటూ అఫ్ఘానిస్తాన్ లో గెరిల్లా పోరాటం కొనసాగిస్తున్నారు. వారిని నిర్మూలించడం అమెరికా వల్ల కాదని తెలిసిపోయింది. తాలిబాన్ ను తయారు చేసిందే అమెరికా. వారికి మదర్సాలలో ఇస్లాంమతవాదాన్ని బోధిస్తే పోరాటం నేర్పించి ఆయుధాలూ, నిధులూ అందజేసింది అమెరికా. ఈ విషయంలో చైనా కూడా అమెరికాకు తోడుగానే ఉంది. అటువంటి తాలిబాన్ తో అమెరికాకు పోరాడవలసిన అవసరం ఇంకా ఏముంది? 9 సెప్టెంబర్ 2001న న్యూయార్క్ లో అంతర్జాతీయ విపణి శిఖరాలను (ట్రేడ్ టవర్స్) కూల్చి మూడు వేలమంది దుర్మరణానికి కారణమైన అఫ్ఘానిస్తాన్ పైన, లాదెన్ అప్పగించడానికి నిరాకరించిన తాలిబాన్ పైనా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అందుకే అఫ్ఘానిస్తాన్ పైన దాడి చేసి ఆ దేశాన్ని ఆక్రమించుకున్నాం. ఆ లాదెన్ పోయిన తర్వాత తాలిబాన్ తో తగవు ఎందుకు? అప్ఘానిస్తాన్ లో సైనికులను బలిపెట్టడం ఎందుకు? ఇటువంటి ప్రశ్నలు అమెరికా సమాజాన్నీ, అమెరికా అధ్యక్షులనూ వేధించసాగాయి. అందుకని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వ ప్రమేయం లేకుండానే పాకిస్తాన్ సహకారంతో తాలిబాన్ తో చర్చలు ప్రారంభించారు. ఇందుకోసం పాకిస్తాన్ సహకారంతో జాల్మే ఖలీల్జాద్ ను అమెరికా ప్రత్యేక దూతగా దోహా చర్చలకు పంపింది. పాకిస్తాన్ జైలులో పదేళ్ళుగా మగ్గుతున్న అబ్దుల్ ఘనీ బరాదర్ ను విడిపించవలసిందిగా ట్రంప్ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరాడు. బరాదర్ శాంతికోసం, రాజీకోసం ప్రయత్నించే మనస్తత్వం కలిగిన తాలిబాన్ నాయకులలో ముఖ్యుడుగా కనిపించారు అమెరికా అధికారుల కళ్లకు.

ఖతార్ లో శాంతి ప్రయత్నాలు

ఖతార్ లో 2011 నుంచి అఫ్ఘాన్ మిలిటెంట్ నేతలు మకాం పెట్టడం, శాంతికోసం ప్రయత్నిస్తున్నాం అంటూ కబుర్లు చెప్పడం మామూలే. 2013లో ఖతార్ లో తాలిబాన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. జెండాల విషయంలో గొడవ జరిగి అదే సంవత్సరం కార్యాలయాన్ని మూసివేశారు. శాంతికి మార్గం కనుక్కునేందుకు అమెరికా అధికారులతో చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ డిసెంబర్ 2018లో తాలిబాన్ నాయకులు నిర్దిష్టంగా ప్రకటించారు. అయితే, అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాప్ ఘనీని గుర్తించడం కానీ, ఆయన నాయకత్వంలోని ప్రభుత్వంతో చర్చించడం కానీ తమకు ఇష్టం లేదని తాలిబాన్ నాయకులు స్పష్టం చేశారు. అష్రాఫ్ ది అమెరికా చెప్పుచేతలలో ఉండే బానిస ప్రభుత్వమని మిలిటెంట్లు ఎద్దేవా చేశారు. అమెరికాతోనే నేరుగా చర్చలు జరుపుతాం కానీ అమెరికా బంటుతో చర్చలు జరపబోమని కరాఖండిగా చెప్పారు. అమెరికా అనుమతితోనే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అష్రాద్ అమెరికాపైన, అమెరికా సైన్యంపైనా, అమెరికా ఇస్తున్న నిధులపైనా ఆదారపడే అధికారంలో కొనసాగాడు. అన్ని విధాలా తనపైన అధారపడిన అష్రాఫ్ ను కానీ ఆయన నాయకత్వంలోని ప్రభుత్వాన్ని, ఉపాధ్యక్షుడు, ఇంటెలిజెన్స్ వ్యవహారాలలో దక్షుడు అయిన అమ్రుల్లా సాలేని కానీ సంప్రతించకుండా, వారి ప్రమేయం లేకుండా తాలిబాన్ తో నేరుగా చర్చలు జరపాలని ట్రంప్ నిర్ణయించాడు. అమెరికా మీద ఆధారపడిన నాయకులకు కానీ దేశాలకు కానీ ఏ గతి పడుతుందో, స్వీయప్రయోజనాలకోసం ఎవరినైనా ఎట్లా నీటముంచడానికి అమెరికా ఏ మాత్రం సంకోచించదో తెలసుకోవడానికి అష్రాఫ్ ప్రభుత్వంపట్ల ట్రంప్ వైఖరిని అర్థం చేసుకుంటే చాలు. ముఖ్యంగా అమెరికాతో కూటమి కట్టిన భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ విషయం ఎంత త్వరగా గ్రహిస్తే ఆయనకూ, భారత్ కూ అంత మంచిది.

అమెరికా ప్రతినిధులూ, తాలిబాన్ ప్రతినిధుల మధ్య తొమ్మిది విడతల చర్చలు జరిగిన తర్వాత ఒక అంగీకారం కుదిరింది. ఒప్పందంలో భాగంగా అమెరికా మొదటి 20 వారాలలో 5,400 మంది సైనికులను ఉపసంహరించుకుంటుందని అమెరికా ప్రతినిధి ప్రకటించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు తాలిబాన్ చేతిలో ఒక అమెరికా సైనికుడు హతమైనాడు. వెంటనే  చర్చలు విఫలమైనట్టు ట్రంప్ ప్రకటించారు. కొన్ని వారాలలోనే మళ్ళీ చర్చలు ప్రారంభమైనాయి. ఆ లోగా 22 మంది అఫ్ఘాన్ సైనికులనూ, 14  మంది అఫ్ఘాన్  పౌరులనూ తాలిబాన్ చంపివేశారు. అయినా సరే, చనిపోయినవారు అమెరికా పౌరులు కాదు కనుక చర్చలు తిరిగి ప్రారంభించారు.

శ్వేతభవనంలో ట్రంప్ వ్యాఖ్యలు

ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడి నివాసమైన శ్వేతభవనంలో మీడియా గోష్ఠిలో ట్రంప్ తాలిబాన్ తో చర్చల ప్రసక్తి తెచ్చారు. అమెరికాతో ఒప్పందంకోసం తాలిబాన్ చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ‘‘అమెరికా సైనికులు అఫ్ఘానిస్తాన్ లో ఉగ్రవాదులను వేలకొద్దీ చంపుతున్నారు. ఇక ఈ పని వేరే ఎవరైనా చేస్తే బాగుంటుంది. తాలిబాన్ కావచ్చు పొరుగుదేశం వారు కావచ్చు. ఎవరైనా ఈ పని చేయవచ్చు,’’అంటూ అస్పష్టంగా మాట్లాడారు.

‘‘అఫ్గానిస్తాన్ లో చాలా శ్రమతో కూడిన ప్రయాణం సాగింది. మన సైనికులు ఇళ్ళకు తిరిగి రావలసిన సమయం ఆసన్నమైంది’’ అంటూ మరో సందర్భంలో ట్రంప్ ప్రకటించారు. సైనికులను వాపస్ రప్పించాలన్న అభిప్రాయం అమెరికా ప్రజలలో ప్రబలంగా ఉంది.

తాలిబాన్, అమెరికా మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మార్చి 10 కల్లా అఫ్ఘాన్ జైళ్ళలో ఉన్న 500 మంది తాలిబాన్ ఖైదీలనూ, తాలిబాన్ అదుపులో ఉన్న వెయ్యిమంది అఫ్ఘాన్ సైనికులనూ ఇచ్చిపుచ్చుకోవాలి. తాలిబాన్ పైన విధించిన ఆంక్షలకు అమెరికా ఎత్తివేస్తుంది. ఐక్యరాజ్యసమితి విడిగా విధించిన ఆంక్షలను తొలిగించేందుకు సమితితో అమెరికా సంప్రతింపులు జరుపుతుంది.

పద్దెనిమిది సంవత్సరాలకు పైగా పోరాటం సాగిన నేపథ్యంలో అఫ్ఘానిస్తాన్ లో శాంతి స్థాపించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని చెబుతూ శాంతి ఒప్పందంపైన అమెరికా, తాలిబాన్ ప్రతినిధులు సంతకాలు చేశారు. అమెరికా ప్రత్యేక దూత జల్మే ఖలీల్జాద్ , తాలిబాన్ నాయకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ సంతకాలు చేస్తుంటే అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో పర్యవేక్షించారు. ‘‘అల్ ఖాయిదాతో సంబంధాలు తెంచుకుంటామనే వాగ్దానాన్ని మీరు నిలుపుకొని తీరాలి,’’అంటూ మైక్ పాంపియో తాలిబాన్ నాయకులతో అన్నారు.  నాలుగు దశాబ్దాల ఘర్షణ నుంచి అఫ్ఘానిస్తాన్ ఇప్పుడు బయటపడుతోందని, ఇస్లామిక్ రాజ్యం ఏర్పడి అఫ్ఘానిస్తాన్ ని సంపన్న దేశంగా తీర్చిదిద్దుతుందని ఆశిస్తున్నట్టు బరాదర్ వ్యాఖ్యానించారు. అమెరికాతోకలసి 2001లో అఫ్ఘానిస్తాన్ లో ప్రవేశించామనీ, కలిసే తిరిగి బయటికి వస్తామనీ 28 యూరోపియన్ దేశాల కూటమి ‘నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ అలయెన్స్)’ జనరల్ సెక్రటరీ జెన్స్ స్టోల్టెన్ బర్గ్ ప్రకటించారు. ఉగ్రవాదభయం లేకుండా అఫ్ఘానిస్తాన్ శాంతియుతంగా ఉండటానికి  ఈ చిన్న ముందడుగు దోహదం చేస్తుందనే ఆశాభావాన్ని బ్రిటన్ రక్షణమంత్రి బెన్ వాలెస్ వెలిబుచ్చారు. పెక్కు దశాబ్దాలవరకూ అఫ్ఘానిస్తాన్ ని మంచి భాగస్వామిగా నిర్మిస్తామంటూ చెప్పారు. తాలిబాన్ తో ఒప్పందం సందర్భంలో అది అర్థం లేని మాట అంటూ పరిశీలకులు పెదవి విరిచారు.   

సైనికులను ఇంటికి రప్పించాలనే అమెరికా ఆకాంక్ష

సైనికులను ఇంటికి తిరిగి తీసుకురావాలనే కోరిక అమెరికా ప్రభుత్వానికి బలంగా ఉంది. కాబూల్ లో ప్రవేశించాలంటే అమెరికా,నాటో సైన్యంతో పోరాటం కొనసాగించడం కంటే చర్చల ద్వారా తమ లక్ష్యాన్ని సాధించవచ్చునని తాలిబాన్ నాయకత్వం భావించింది, అమెరికా అఫ్ఘానిస్తాన్ నుంచి ఉపసంహరించుకోవాలని తొందరపడుతున్న విషయాన్ని గ్రహించిన తాలిబాన్ ఆ అంశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చర్చలవైపు మొగ్గారు.  ఈ ఒప్పందం ఎటు దారి తీస్తుందోనన్న భయసంకోచాలు మాత్రం అందరికీ ఉన్నాయి. నిరంతర యుద్ధం కంటే అనిశ్చితమైనప్పటికీ చర్చల ద్వారా శాంతికోసం ప్రయత్నించడం ఉత్తమమని రెండు పక్షాలూ తీర్మానించుకున్నాయి కనుకనే ఒప్పందం కుదిరింది. అఫ్ఘాన్ లో మహిళలు తమ పట్ల ఏహ్య భావంతో ఉన్నారనీ, ఆగ్రహంగా ఉన్నారనీ, దానికి 1996నుంచి 2001 వరకూ తమ ప్రభుత్వం వ్యవహరించిన తీరే కారణమని గ్రహించామనీ తాలిబాన్  ప్రతినిధులు అన్నారు. మహిళలను గౌరవించాలనీ, వారి హక్కులకూ, స్వేచ్ఛకూ భంగం కలుగరాదనీ అమెరికా కోరింది.

ఈ ఒప్పందంపైన సంతకాలు జరిగిన రోజునే జహ్రా హుస్సేనీ అనే హక్కుల కార్యకర్త కాబూల్ లో తీవ్రమైన అభ్యంతరం వెలిబుచ్చింది. ‘‘నేను తాలిబాన్ ను నమ్మను. వారు అధికారంలో ఉండగా మహిళలను ఏ విధంగా అణచివేశారో నాకు గుర్తుంది,’’అని28 ఏళ్ళ హూస్సేనీ ఏఎఫ్ పి వార్తాసంస్థతో అన్నది. ఒప్పందంలోని అంశాలను అమెరికా అమలు చేసింది. తాలిబాన్ చేస్తారో లేదో వేచి చూడవలసిందే. వారి పాలన ఏ విధంగా ఉంటుంది? 1996-2001 కంటే భిన్నంగా ఉంటుందా? మహిళల పట్ల, వారి చదువుసంధ్యల పట్ల, వారు ఉద్యోగాలు చేయడం పట్ల ఏ విధమైన వైఖరి తాలిబాన్ ప్రభుత్వం అవలంబిస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు కొన్ని వారాలలో లభిస్తాయి.

Also read: తాలిబాన్ తో భారత్ ఎట్లా వ్యవహరించాలి?

(మిగతా రేపు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles