- 89 సంవత్సరాలలో 123 టెస్టులు
- ఇంగ్లండ్ పై 26 విజయాల భారత్
- భారత్ పై ఇంగ్లండ్ 48 విజయాలు
పెద్దమనుషుల క్రీడ క్రికెట్ కు చిరునామాగా నిలిచే దేశాలు రెండేరెండు. అవి ఇంగ్లండ్, భారత్. క్రికెట్ ను ఇంగ్లండ్ లో ఓ సాంప్రదాయంగా చూస్తే…భారత్ లోని కోట్లాదిమంది అభిమానులు ఓ మతంగా భావిస్తారు.బ్రిటీష్ వలసపాలిత దేశంగా ఉన్న సమయంలోనే భారత్ లోకి ఇంగ్లండ్ అధికారుల ద్వారా క్రికెట్ అడుగుపెట్టింది. స్వాతంత్ర్యపోరాటంతో భారత్ నుంచి బ్రిటీష్ పాలకులు నిష్క్ర్రమించిన క్రికెట్ మాత్రం అలానే పాతుకుపోయింది. అనధికారిక జాతీయక్రీడగా మారిపోయింది.తెలుగుతేజం కర్నల్ కఠారి కనకయ్యనాయుడు సారథ్యంలో భారతజట్టు…తనకు క్రికెట్ నేర్పిన ఇంగ్లండ్ తో 1932లో తొలి అధికారిక టెస్ట్ మ్యాచ్ ఆడిన నాటి నుంచి..ఇరుదేశాల మధ్య క్రికెట్ బంధం ఏడాది ఏడాదికీ బలపడుతూనే వస్తోంది.
89 ఏళ్లు-123 టెస్టులు…
1932 ప్రారంభ సిరీస్ నుంచి ప్రస్తుత నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని తొలి టెస్టువరకూ …భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య 123 టెస్టుమ్యాచ్ లు జరిగాయి. భారత్ 26 మ్యాచ్‌లు నెగ్గితే, ఇంగ్లండ్ 48 విజయాలు నమోదు చేసింది. మరో 49 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
Also Read: భారత్ తొలి ఓటమికి కారణాలు ఎన్నెన్నో!
547 టెస్టుల భారత్….
భారత జట్టు గత 89 సంవత్సరాల కాలంలో టెస్టు హోదా పొందిన వివిధ దేశాలతో ప్రస్తుత సిరీస్ లోని తొలిటెస్టువరకూ 547 మ్యాచ్ లు ఆడింది.ఇందులో 159 విజయాలు, 169 పరాజయాలు ఉన్నాయి.. 218 టెస్టులు డ్రా ల పద్దులో చేరాయి ఇక 18వ శతాబ్దం నుంచి టెస్టు క్రికెట్ ఆడుతూ వస్తున్న ఇంగ్లండ్ జట్టు … ప్రస్తుత చెన్నై తొలిటెస్టు వరకూ మొత్తం 1031 మ్యాచ్ లు ఆడింది. వీటిలో 377 మ్యాచ్ లు నెగ్గి, 305 టెస్టుల్లో పరాజయాలు చవిచూసింది. మరో 349 టెస్టులను డ్రాగా ముగించింది.గత ఎనిమిది సంవత్సరాలలో భారత గడ్డపై ఇంగ్లండ్ కు చెన్నైటెస్టు విజయమే తొలిగెలుపుకాగా… చెపాక్ వేదికగా గత నాలుగేళ్ళలో భారత్ కు తొలిటెస్టు ఓటమే… తొలి పరాజయంగా రికార్డుల్లో చేరింది.
సుదీర్ఘ విరామం తర్వాత….
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయం నేపథ్యంలో భారతగడ్డపై 10 నెలల 26 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ల సిరీస్ తిరిగి చెన్నైటెస్టు రూపంలో ప్రారంభమైంది.గత 28 సంవత్సరాల కాలంలో… దేశంలో రెండు అంతర్జాతీయ మ్యాచ్‌ల మధ్య భారీ అంతరం ఇదే కావడం విశేషం. భారతగడ్డపై చిట్టచివరి అంతర్జాతీయ మ్యాచ్ 2020 మార్చి 10 న గ్రేటర్ నోయిడాలో ఐర్లాండ్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగింది. దీని తరువాత కరోనా కారణంగా క్రికెట్ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు 2020 జనవరి 19 న ఆస్ట్రేలియాతో స్వదేశంలో చివరి మ్యాచ్ ఆడింది. బెంగళూరు వన్డేలో భారత జట్టు విజేతగా నిలిచింది. అయితే.. 350 రోజులకుపైగా విరామం తర్వాత భారతగడ్డపై జరిగిన మొట్టమొదటి అంత్జాతీయ క్రికెట్ మ్యాచ్ లో విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు 227 పరుగుల భారీతేడాతో ప్రత్యర్థి ఇంగ్లండ్ చేతిలో ఓటమి చవిచూడక తప్పలేదు. కొత్తసంవత్సరాన్నివిదేశీగడ్డపై సంచలనవిజయంతో ప్రారంభించిన భారత్ సొంత గడ్డపై ఘోరపరాజయంతో మొదలుపెట్టడం అభిమానుల్లో ఆందోళన రేకెత్తించింది.
Also Read: భారత్ కు డూ ఆర్ డై టెస్ట్