- బంగ్లాగడ్డపై కీల్ మేయర్స్ సరికొత్త చరిత్ర
- అరంగేట్రం టెస్టు నాలుగో ఇన్నింగ్స్ లో డబుల్
ధూమ్ ధామ్ టీ-20 తుపానులో కొట్టుకుపోతున్న సాంప్రదాయ టెస్టు క్రికెట్ కు మంచిరోజులొచ్చాయి. ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ లీగ్ రెండుటెస్టులు, రెండురోజుల వ్యవధిలో …రెండు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి.
చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా భారత్ తో జరుగుతున్న తొలిటెస్టు రెండోరోజు ఆటలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ తన కెరియర్ లో వందో టెస్టు మ్యాచ్ ఆడుతూ డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పిన 24 గంటల వ్యవధిలోనే కరీబియన్ ఆటగాడు కీల్ మేయర్స్ మరో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు.
Also Read : అంకిత రైనా సరికొత్త చరిత్ర
చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్ తో ముగిసిన తొలిటెస్టు ద్వారా అరంగేట్రం చేసిన కీల్ మేయర్స్ నాలుగో ఇన్నింగ్స్ లో అజేయ డబుల్ సెంచరీ సాధించడం ద్వారా చరిత్ర సృష్టించాడు.
మేయర్స్ డబుల్ తో రికార్డు చేజింగ్
టెస్ట్ మ్యాచ్ నెగ్గాలంటే తమజట్టు రెండో ఇన్నింగ్స్ లో సాధించాల్సిన 395 పరుగుల టార్గెట్ ను వెస్టిండీస్ జట్టు 7 వికెట్ల నష్టానికే సాధించగలిగింది. ఆట ఆఖరి రోజున మిడిలార్డర్లో బ్యాటింగ్ కు దిగిన మేయర్స్ 210 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. టెస్టు అరంగేట్రం మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్ లో అజేయ ద్విశతకం సాధించిన తొలి, ఏకైక క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.
Also Read : చెన్నై టెస్టులో భారత్ ఎదురీత
క్రీజులో మొత్తం 415 నిముషాలపాటు నిలబడి 310 బాల్స్ ఎదుర్కొని 20 బౌండ్రీలు, 7 సిక్సర్లతో 210 పరుగుల నాటౌట్ స్కోరు సాధించడం ద్వారా 144 సంవత్సరాల టెస్టు చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకస్థానం సంపాదించుకోగలిగాడు.
టెస్టు అరంగేట్రం మ్యాచ్ లో డబుల్ సెంచరీలు సాధించిన ఆరో ఆటగాడిగా, నాలుగో ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ బాదిన తొలి క్రికెటర్ గా మేయర్స్ నిలిచాడు. అరంగేట్రం టెస్టు లో ద్విశతకాలు సాధించిన ఆటగాళ్లలో టిప్ ఫాస్టర్, లారెన్స్ రో, బ్రెండన్ కురుప్పు, మాథ్యూ సింక్లెయిర్, జాక్ రుడోల్ఫ్ ఉన్నారు.
Also Read : రూట్ డబుల్.. భారత్ కు ట్రబుల్
28 సంవత్సరాల కీల్ మేయర్స్ కు విండీస్ తరపున మూడు వన్డేలు, రెండు టీ-20 మ్యాచ్ లు ఆడిన అనుభవం మాత్రమే ఉంది. టెస్టు అరంగేట్రం మ్యాచ్ లోనే శతకం బాదడం, ఆ సెంచరీని డబుల్ సెంచరీగా మలచడం, జట్టును విజేతగా నిలపడం తనకు గర్వకారణమని మేయర్స్ పొంగిపోతున్నాడు.