• దుమారం రేపుతున్న బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడి వ్యాఖ్యలు
• రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదన్న కైలాష్ విజయ్ వార్గియా
• కర్రలతో కొట్టుకున్న బీజేపీ, తృణమూల్ కార్యకర్తలు
రాజకీయ నాయకులు ఆవేశంతో మాట్లాడితే దాని వల్ల జరిగే నష్టాన్ని అంచనావేయలేం. ప్రజాసేవలో ఉన్న అధికారులను దూషిస్తే దాని పర్యవసానం తీవ్రంగా ఉంటుంది. అధికారంలో ఏ పార్టీ ఉన్నా పోలీసులు ఇతర ఉన్నతాధికారులు ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకోవాల్సిందే.
దుమారం రేపుతున్న రాజు బెనర్జీ వ్యాఖ్యలు
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు బెనర్జీ చేసిన వ్యాఖ్యాలు పెను దుమారాన్నే రేపుతున్నాయి. బెంగాల్ పోలీసులు ప్రజల కోసం పనిచేయడం లేదని మమతా బెనర్జీ కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లు నాకిస్తామని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులు రాష్ట్రంలో జరిగే నేరాలను అరికట్టకుండా ప్రభుత్వం చెప్పుచేతల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో జరిగే నేరాలపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని రాజు బెనర్జీ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లు నాకిస్తామని అనడం తీవ్ర విమర్శలకు కారణమయింది.
బెంగాల్ లో గత కొన్ని రోజులుగా అధికార తృణమూల్ కాంగ్రెస్ కు బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యమంత్రిగా మహిళా నేత ఉన్నా రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వార్గియా మమత ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.
బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ
బెంగాల్ బిర్భుమ్లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు విచక్షణారహితంగా కర్రలతో చితకబాదుకున్నారు. ఈ క్రమంలో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను అదుపు చేశారు.