Thursday, November 21, 2024

ఆరు నెలల ముందే బెంగాల్ దంగల్ షురూ

  • రాజకీయ చదరంగంలో ఎవరిది పై చేయి
  • బెంగాల్ మార్పును కోరుకుంటుందా?

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం మిగిలి ఉండగానే పార్టీలు రాజకీయ చదరంగంలో ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ రణరంగంలో ఎవరిది పైచేయి అవుతుందనేది ప్రశ్నార్థకమే. కేంద్ర హోంమంత్రి అపర చాణక్యుడు అమిత్ షా రెండు రోజులు బెంగాల్ లో పర్యటించారు. మొదటిరోజు బెంగాల్లోని పదిమంది ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఒక మంత్రి, ఒక ఎంపీ అమిత్ షా సమక్షంలో బిజెపిలో చేరారు. ఇందులో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుత మంత్రి  సువేందు అధికారి తో పాటు, బర్ధమాన్ తూర్పు నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టిఎంసి సిట్టింగ్ ఎంపీ సునీల్  మండల్ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.

ఆరుగురు తృణమూల్ ఎంఎల్ఏల కాషాయతీర్థం

బిజెపి పార్టీ లోకి ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలలో ఆరుగురు అధికార తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన వారు కావడం విశేషం. వారితో పాటు మరో నలుగురు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీల ఎమ్మెల్యేలు కావడం  కూడా మరో విశేషం. రాష్ట్రంలోని అన్ని పార్టీలను విడవకుండా ఎడాపెడా ఫిరాయింపులు ప్రోత్సహించి ఎన్నికలకు ముందు బిజెపి తమ రాజకీయ పునాదిని పటిష్ట పరుచుకుంది. రెండవ రోజు కూడా అమిత్ షా బెంగాల్ లో పర్యటిస్తూ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్న హింసను ప్రస్తావించారు. గత పదేళ్లుగా బిజెపి పార్టీకి చెందిన మూడు వందల మంది కార్యకర్తలను తృణమూల్ కాంగ్రెస్  కార్యకర్తలు హత్య చేశారని ఆయన ఆరోపించారు.

Also Read : తృణమూల్ కాంగ్రెస్ లో భారీ కుదుపు

‘దీదీ ఒంటరిగా మిగిలిపోతారు’

బెంగాల్ హింసా రాజకీయయాలను ప్రస్తావిస్తూ ఇటీవల తమ పార్టీ అధ్యక్షుడైన జేపీ నడ్డా పైన దాడిని కూడా ఆయన ప్రస్తావించారు. ఇలాంటి హింసా రాజకీయాలకు ఇకముందు చరమగీతం పాడతామని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మెల్లమెల్లగా ఖాళీ అయిపోయి రేపటి ఎన్నికల్లో “దీదీ” గా పిలవబడే మమతా బెనర్జీ ఒక్కరే తన పార్టీలో ఒంటరిగా మిగిలిపోతారని ఆయన ఎద్దేవా చేశారు. బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని రాష్ట్రంలోని మొత్తం 294 స్థానాలకు గాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 200 కు పైగా అసెంబ్లీ సీట్లు గెలుచుకుని అధికారంలోకి వస్తామని ఆయన తేల్చి పారేశారు.

ఎంఐఎం ప్రవేశం ఓట్ల పోలరైజేషన్ కు దారి తీస్తుందా?

బెంగాల్ లో ఒక వంక బీజేపీ పార్టీ బలం పుంజుకుంటుంటే మరో వైపు నుంచి హైదరాబాదీ పార్టీ గా పేరుగాంచిన అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలోని ఎంఐఎం పార్టీ బెంగాల్ రాజకీయాల్లో ప్రవేశిస్తోంది. దీనికి బలమైన కారణం ఉంది. బీజేపీకి ఎంఐఎం “బి” టీం గా వ్యవహరిస్తుందని ఇప్పటికే అన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. బిజెపి, ఎంఐఎం ఇద్దరూ ఎన్నికల్లో పోటీ చేసి ఆయా మతాలను రెచ్చగొట్టి లాభం పొందుతున్నాయని  ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఐదు  సీట్ల గెలుపుతో కొంతవరకు నిజమే అనిపిస్తుంది.

Also Read : బెంగాల్ పై పట్టు బిగిస్తున్న బీజేపీ

30 శాతం మంది ముస్లింలు

ఓటర్ల విషయానికి వస్తే బెంగాల్ ఓటర్లలో లో సుమారు ముప్పై శాతం పైగా ముస్లింలు ఉన్నారు. వందకు పైగా నియోజకవర్గాలలో వీరి ప్రభావం ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఈ దశలో బీజేపీ ఎంఐఎం,మతతత్వ రాజకీయాలు ఓటర్ల “పోలరైజేషన్” కు దారి తీస్తుందా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. ఈ నేపథ్యంలో ఎంఐఎం పార్టీ పుట్టిన హైదరాబాద్ నుండి  పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ,ఉత్తర ప్రదేశ్, బీహార్  రాజకీయాల్లో ఇప్పటికే రంగ ప్రవేశం చేసింది. కొంత వరకు సక్సెస్ కూడా అయ్యింది. అదే ఒరవడిలో పశ్చిమ బెంగాల్ తమిళనాడు ఎన్నికలలో కూడా పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. దేశ రాజకీయాల్లో పెను మార్పులకు ఇది మరొక సంకేతంగా మారింది.*

 బీటలు వారిన కాంగ్రెస్, కమ్యూనిస్టుల కంచు కోట

స్వాతంత్ర్యానంతరం మొదట మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న బెంగాల్ రాష్ట్రం ఆ తర్వాత మరొక 27 సంవత్సరాల పాటు కమ్యూనిస్టుల కంచు కోట గా ఉంది. కాంగ్రెస్ నుండి విడిపోయి సొంత పార్టీ పెట్టుకున్న మమతా బెనర్జీ కాంగ్రెస్ ను వెనక్కు నెట్టి తన తన తృణమూల్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకురాలు మమతా బెనర్జీ పార్టీని మరింత పటిష్ట పరచుకున్నారు. ఏదైనా తాను అనుకున్నది సాధించేదాకా పట్టువదలని గట్టి మహిళగా పేరు ఉన్న మమతా బెనర్జీ ప్రస్తుతం బిజెపి పార్టీ రాజకీయంగా పెట్రేగి పోవడంతో రాజకీయంగా డిఫెన్స్ లో పడిపోయారు. నిన్నటి దాకా తన చుట్టూ తిరిగిన వారే, తనకు వెన్నుదన్నుగా ఉన్న వారే పార్టీని విడిపోతుంటే కాపాడుకుందామని ఆమె చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

Also Read : చిక్కుల్లో మమత

గతమెంతో ఘనకీర్తి -నేడు అపకీర్తి

బెంగాల్ ఘనమైన చరిత్రను ఒకసారి పరిశీలిస్తే చాలా విషయాలు అవగతమవుతాయి. కలకత్తా కేంద్రంగా అలనాటి ఈస్టిండియా కంపెనీ ద్వారానే బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చారు. వ్యాపారానికి వచ్చిన వ్యాపారులే ఆ తర్వాత  మన దేశానికి పాలకులుగా మారి రెండు వందల సంవత్సరాలు పాలించారు. ఒక నాడు భారతదేశ సాంస్కృతిక, సాహిత్య, ఆర్థిక ,రాజకీయ రంగంలో ధ్రువతారగా వెలిగిన బెంగాల్ ఈరోజు దేశ రాజకీయాల్లో కానీ ఆర్థిక సామాజిక రంగాల్లో చాలా వెనకబడి పోయింది. దానికి కమ్యూనిస్టులే కారణమని కాంగ్రెసు, స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో మూడు దశాబ్దాలపాటు మీరే పాలించారుగా అని కమ్యూనిస్టులు ఒకరినొకరు  దెప్పి పొడుచుకున్నారు. ఇక ఈ రెండు పార్టీలను ఎదిరించిన మమతా బెనర్జీ తన ప్రాంతీయ పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ తో వీరిద్దరిని మట్టికరిపించింది. ఆ తర్వాత కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల నుండి తన పార్టీలోకి ఎంతో మందిని ఆకర్షించింది. “తాడిని తన్నే వాడుంటే వాడిని కూడా తలదన్నే వ్యక్తి వస్తారన్నట్లుగా” మమతా బెనర్జీ రాజకీయాలను తలదన్నే బిజెపి ఇవాళ అటు కమ్యూనిస్టు, కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ నుంచి  ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది.*

కోల్ కతా పురాతన నగరమా?

కలకత్తా నగరం గురించి ఒక నానుడి బహుళ ప్రచారంలో ఉంది. ఒక యాభై సంవత్సరాల క్రితం కలకత్తా నగరానికి వెళ్లిన వారు మళ్లీ ఇప్పుడు వెళ్తే అప్పటి పాతకాలం నాటి భవనాలు ఎలాంటి మార్పు లేని రోడ్లు కనిపిస్తాయని వారంటారు. ఒక పురాతన నగరాన్ని చూసిన అనుభూతి కలకత్తా నగరాన్ని చూస్తే కలుగుతుంది. దానికి సాక్ష్యంగా ఇటీవలనే కలకత్తా నగరపాలక సంస్థ తమ పౌరులకు ఒక విజ్ఞప్తి చేసింది. అది ఏమిటంటే తమ నగరంలో ఉన్న ఇళ్లకు ఎవరైతే కొత్తగా రంగులు వేసుకుంటారో వారికి ఆ సంవత్సరం పూర్తిగా పన్ను మాఫీ చేస్తాం అని ఆ ప్రకటన సారాంశం.

రంగులు వేసుకుంటే రాయితీ

అంటే కలకత్తా నగరంలోని పౌరుల ఆర్థిక స్థితిగతులు ఎంత  అద్వాన్నంగా ఉన్నాయో దీన్ని బట్టి అర్థం అవుతుంది. ఎవరైనా కొత్తవారు వస్తే తమ నగరం అందవిహీనంగా కనబడుతుందని, అందంగా కనపడాలంటే మొత్తం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలంటే  తమ సంవత్సర పన్నుల బడ్జెట్ సరిపోదని నగరపాలక సంస్థ ఈ ఉపాయం ఆలోచించింది. ఎవరికి వారు రంగు రంగులు వేసుకుంటే వారికి పన్ను రాయితీ ప్రకటించింది. ఇలాంటి దుస్థితికి బెంగాల్ రాష్ట్ర రాజధాని చేరుకోవడం చూస్తే గతంలోనే కాంగ్రెస్ కమ్యూనిస్టు కాంగ్రెస్ పరిపాలన ఏవిధంగా ఉందో అర్థమవుతుంది. అందుకే దేశ రాజకీయాల్లో ఆర్థిక సామాజిక రంగాలలో ఇవ్వాళ బెంగాల్ రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది. తమ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేదని కమ్యూనిస్టుల మీద మండిపడిన మమతా బెనర్జీ తన పదేళ్ల పాలన తర్వాత సరిగ్గా అవే ఆరోపణలు బీజేపీ నుంచి ఎదుర్కొంటోంది. అటు కాంగ్రెస్ ఇటు కమ్యూనిస్టులు చేసిన హింసా రాజకీయాలనే మమతాబెనర్జీ కొన సాగిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. మొత్తం మీద ఈ విషయంలో ఎవరేమీ తక్కువ తినలేదని  అందరూ అందరే అని బెంగాల్ ప్రజలు విసుక్కుంటున్నారు.

పాత అంటేనే బెంగాలీ బాబులకు మోజా?

బెంగాలీ బాబులు, బెంగాలీ ప్రజలు అంత త్వరగా మారరని ఒకసారి ఓటు వేస్తే అధికారంలోకి వచ్చిన పార్టీ వారికే దశాబ్దాలపాటు ఓటు వేసి వారినే కొనసాగిస్తారని పేరుంది. అలాగే కొత్త ను అంత త్వరగా ఆమోదించరని  కూడా అంటారు. అందుకే బెంగాల్ రాష్ట్రం అధోగతి పాలు అయిందని రాజకీయ విమర్శకులు అంటున్నారు. ఈ స్థితిలో బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారనడానికి ఒకటి రెండు సాక్ష్యాలు కనబడుతున్నాయి. మొదటిది 2019 పార్లమెంటు ఎన్నికలలో పశ్చిమ బెంగాల్లో ఉన్న 42 పార్లమెంటు స్థానాలు 18 స్థానాలు బిజెపి గెలుచుకుంది. దీంతో బీజేపీ కి ఎక్కడలేని బలం వచ్చింది. ఆ తర్వాత గత 18 నెలలుగా బిజెపి పెద్ద ఎత్తున రాష్ట్రంలోకి చొచ్చుకుపోతోంది. కేంద్రంలో అధికారంలో ఉండడం కూడా బిజెపికి కలిసి వచ్చింది.

కాంగ్రెస్, కమ్యూనిస్ట్, తృణమూల్ అసంతృప్త నేతలు జంప్

కాంగ్రెసు, కమ్యూనిస్టు తృణమూల్ కాంగ్రెస్ లో బలంగా ఉన్న  పెద్దపెద్ద అసంతృప్తి నాయకులను తమ పార్టీ లోకి ఆహ్వానించడంలో బిజెపి నాయకులు సఫలం అవుతున్నారు. ఈ దిశలో ఇప్పటిదాకా ఒకరినొకరు రాజకీయంగా తుదముట్టించి చుకున్న కమ్యూనిస్టు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు పునరాలోచనలో పడ్డాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ,కమ్యూనిస్టు, తృణమూల్ కాంగ్రెస్ నాయకులకు తమ ఉనికికే ప్రమాదం వచ్చే విధంగా బిజెపి రాజకీయాలు నడుపుతుంది. అందుకే బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారా లేక వెనక్కి వెళ్లి పాత పార్టీలకే పట్టం కడతారా అన్నది రేపటి 2021 లో జరిగిన ఎన్నికలలో తేలుతోంది.

హింసా రాజకీయాలకు చరమగీతమెప్పుడు?

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బెంగాల్ రాష్ట్రంలో మరిన్ని హింసా రాజకీయాలు పెరిగిపోయే ప్రమాదం ఉంది. దీనికి అధికారంలో ఉన్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకరిని ఒకరు ఇలా చంపుకుంటూ పోతే మిగిలేది ఎవరు ఉండరు. ఒక ఆదర్శవంతమైన రాజకీయాలకు నెలవుగా ఉన్న రాష్ట్రం ఈ రకంగా హింసా రాజకీయాల రావణకాష్టంగా మిగిలిపోవడానికి “తిలా పాపం తలా పిడికెడు” అన్నట్లు అన్ని పార్టీల బాధ్యత అని విమర్శకులు అంటున్నారు. ఇప్పటికైనా బెంగాల్ రాష్ట్రంలో నిబద్ధతగల రాజకీయాలు నడపడానికి అవసరమైన కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉంది. ఈ పాత రాజకీయాలకు చరమగీతం పాడితేనే బెంగాల్ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుంది. లేకపోతే ఎన్నికల్లో ఎవరు గెలిచినా ప్రజలు పెనం మీద నుండి  పొయ్యిలోకి పడ్డట్టే లెక్క. పొయ్యిలో పడతారో “సోయి” లో ఉంటారో బెంగాల్ ప్రజలు రేపటి ఎన్నికల్లో తమ ఓటు ద్వారా నిరూపించాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles