సంపద సృష్టిద్దాం -05
(కిందటివారం తరువాయి)
ఈజీమనీ అంటే ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా! కొంతమందికి ఈ మాట వింటేనే చిరాకు పుడుతుంది. ఈజీమనీ అంటే ఆయాచితంగా వచ్చే డబ్బు అనుకుంటారు. అంటే ఎటువంటి శ్రమ పడకుండా, ఎవరినీ అడగకుండా ఉచితంగా వచ్చే డబ్బు అనుకుంటారు. అదొక చెడుమాటగా భావిస్తారు. డబ్బు సులభంగా రాదని, లక్ష్మి కటాక్షం కావాలంటే తలకిందులు తపస్సు చేయాలని ఇంకొందరు తలపోస్తారు. పగలూరాత్రీ అనకుండా, సుఖం తెలియకుండా కఠిన పరిశ్రమ చేస్తేనే డబ్బు గడించగలమని మరికొందరు విశ్వసిస్తారు. ఇలాంటి ఆలోచనలే మీకుంటే గనుక మీరు సంపద సృష్టించలేరు. ఈ ఆలోచనలు మార్చుకుంటేనే సంపద సృష్టించే సాహసవీరుల ప్రపంచంలోకి మీకు ప్రవేశం లభిస్తుంది. ఈజీమనీ అంటే ఉచితంగా వచ్చే డబ్బు కాదు. అన్యాయం, అక్రమాలు చేసి సంపాదించే డబ్బు కాదు. దొంగతనం చేసి, మోసం చేసి సంపాదించే డబ్బు కాదు.
Also read: ఆకర్షణ సిద్ధాంతమా!
చాలామందికి దీనికి భిన్నమైన ఊహ వస్తుంది. ఈజీ మనీ అంటే వారసత్వంగా వచ్చే ఆస్తిపాస్తులనుకుంటారు. అవి కొందరు అదృష్టవంతులకు ఆయాచితంగా లభించే వరంలాగా వస్తాయి. తాతతండ్రుల ఆస్తులు వారికి అప్పనంగా అందుతాయి. ఇంటి స్థలాలు, పంట భూములు, బంగారు నగలు, నోట్ల కట్టలు, మేడలు మిద్దెలతో పాటు లాభాలు వండి వార్చే వ్యాపారాలు కూడా వారసత్వంగా అందుతాయి. దీనిని ఈజీమనీగా పొరబడకూడదు.
అంతులేని సంపద
ఈజీమనీ అంటే ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మన శ్రమకు దక్కే ప్రతిఫలం. మనకు డబ్బుకు మధ్య ఎటువంటి అంతరాయం లేకుండా చేసే ఒక ఆలోచన ధోరణి. మనం ఒక పనిని మనస్ఫూర్తిగా పూర్తి చేసినప్పుడు, శ్రమతో పూర్తిచేసిన పనికి అందే గౌరవమే ఈజీమనీ. మనం పడిన కష్టానికి తగిన గుర్తింపు. ఈజీమనీ ఒక ఆలోచన ధోరణి. ఇది అలవరచుకున్నట్లయితే మన ధన లావాదేవీలు పాదరసంలాగా చురుగ్గా సాగుతాయి. మనకు రావలసిన ప్రతిఫలాలు ఇబ్బడిముబ్బడిగా సమయానుసారం అందిపోతాయి. మనకు చెల్లించాల్సిన డబ్బును ఇతరులు సరైన సమయానికి చెల్లిస్తారు. ఈ ఆలోచన ధోరణిని అలవరచుకున్న మన పూర్వీకులు ఎంతో శ్రమించి, వారికి తగిన సంపద సృష్టించడంలో కృతకృత్యులయ్యారు. మనం చేయాల్సిందల్లా ఆ ఆలోచన ధోరణిని అలవరచుకోవడమే. తద్వారా అంతకు మించిన అంతులేని సంపద సృష్టించడమే.
Also read: కృతజ్ఞత చెప్తున్నారా!?
ఈ ఈజీమనీ ఆలోచనకు మన మనసును సిద్ధం చేయకపోతే జరిగే అనర్థాలెన్నో. మాయమాటలు చెప్పి మనల్ని ఇతరులు దోచుకోగలుగుతారు. మన డబ్బునే కాదు, మన శ్రమను కూడా కొల్లగొడతారు. మనకు రావలసిన డబ్బుల కోసం కూడా పది మంది చుట్టూ పదిసార్లు తిరగవలసి వస్తుంది. న్యాయం కోసం దేబరించవలసిన పరిస్థితి. లాభాలు తప్పక రావలసిన వ్యాపారం చేస్తున్నా. కనిపించని డబ్బు మిమ్మల్ని నిరాశకు గురి చేస్తుంటే మీరు ఈజీమనీ ఆలోచన ధోరణి అలవరచుకోనట్లే. దీనివల్ల మన యజమానులు, గౌరవ ఖాతాదారులు, వినియోగదారులు, చివరకు మన స్నేహితులు కూడా మన శ్రమకు, కృషికి, సమర్ధతకు, తెలివితేటలకు, నైపుణ్యాలకు విలువ లేకుండా చేస్తారు. తక్కువ ప్రతిఫలం ముట్టచెపుతారు. మనల్ని ఎంత పొగిడినా, తగిన ప్రతిఫలం ఇవ్వనపుడు మీకు కోపం వస్తుంది. మీరు నిరాశ చెంది, అక్కడ పనిచేయడం మానేస్తారు. దానివల్ల ఏం లాభం? కొత్తచోట కూడా అదే పునరావృతం అవుతుంది. కాని మీరు చేయాల్సింది మీ ఆలోచణ ధోరణి మార్చుకోవడం. డబ్బు, సంపద, ఐశ్వర్యాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, కష్టపడకుండా మనల్ని చేరుకుంటాయని నమ్మడమే ముఖ్యం. అంతులేని సంపద ఆయాచితంగా లభించగలదని విశ్వాన్ని బలంగా, స్థిరంగా, దృఢంగా కోరడమే మనం చేయవలసింది.
మీ జీవితంలోకి డబ్బు సహజసిద్ధంగా, సునాయాసంగా రాకపోతే అందుకు మరెవరో బాధ్యులు కారు. మీరు మీ జీవితాన్ని గడుపుతున్న తీరులో, ఆలోచనలు చేస్తున్న ధోరణిలో ఎక్కడో ఏదో పెద్ద తప్పు ఉందని తెలుసుకోండి. ఈజీమనీ పట్ల ఆలోచనలు మార్చుకోండి. ఈజీ మనీకి స్వాగతం.
Also read: పోరాటంలోనే విజయం
అడుగు – నమ్ము – పొందు
‘పరసువేది’ (ది ఆల్కెమిస్ట్) నవలలో రచయిత పాల్ ఖెలో గట్టిగా ఒక మాట చెప్తాడు. మనం కోరుకున్న దానిని మనకు అందించటానికి ఈ విశ్వం చాలా భయంకరమైన కుట్ర పన్నుతుందని అంటాడు. మన జీవితం మన చేతుల్లో ఉండదని మనకు తెలుసు. కాని, మన ఆలోచనలు మన నియంత్రణలోనే ఉంటాయని గుర్తించండి. మనకు ఏదైనా ఒక పాజిటివ్ సంఘటన జరిగినప్పుడు పాజిటివ్ భావాలు, ఆలోచనలు, విశ్వాసాలు, పనులు చేయగలుగుతాము కాని, నెగటివ్(అననుకూల) సంఘట నలు చుట్టుముట్టినపుడు కూడా పాజిటివ్ గా ఉండడం చాలా కష్టం. కాని, ఈ నెగటివ్ ఆలోచనలు మనచుట్టూ మరింత నెగటివ్ వాతావరణం ఏర్పడడానికి దోహదం చేస్తాయి. కాబట్టి ఎంతో ప్రయత్నపూర్వకంగా మనల్ని నిరంతరం పాజిటివ్ వాతావరణం వైఫైలా చుట్టిముట్టి ఉండేటట్టు చూసుకోవాలి. అందుకోసం గట్టిగా ప్రయత్నించాలి. బుర్ర విదిలించి పాజిటివ్ ఆలోచనలు చేయడంతో దీనికి శ్రీకారం చుట్టాలి. ఇదొక నిరంతర ప్రయత్నం.
తప్పక చేయండి: రాత్రిపూట పడుకునే ముందు 300 మిల్లీలీటర్ల రాగి గ్లాసులో లేదా రాగి చెంబులో మంచి నీళ్లు పోసి, అందులో రెండు తులసి ఆకులు దొరికితే వేసి, వాటిని రాత్రంతా కదపకుండా ఉంచండి. తెల్లవారి బ్రష్ చేసుకోవడం పూర్తికాగానే తొలి ఆహారంగా ఆ మంచినీటిని తాగండి. పాజిటివ్ ఎనర్జీకి ఇది మేలు దారి.
(ఇంకా ఉంది)
Also read: అంతా మన మనసులోనే…
–దుప్పల రవికుమార్