Wednesday, December 25, 2024

రాట్నం తిప్పడం – నూలు వడకడం!

నేను 1999 జూలై లో లండన్ లో గూటాల కృష్ణమూర్తిగారి కి అతిథి గా ఉన్నాను. కృష్ణమూర్తి గారు గాంధేయ వాది. రోజూ  రాట్నం మీద  ఒక రెండు గంటలు నూలు వడికేవారు. ఆయన దగ్గర ఉన్న రాట్నం  కఱ్ఱ చక్రం కాదు. వయోలీన్  పెట్టె మాదిరి కాస్త పొడవుగా ఉండేది అది. మూతని గనక మూస్తే చక్కగా ఆ మెషీన్ రాట్నం కాస్తా   ఆ పెట్టెలో పొందికగా  ఇమిడిపోయేది. నూలుదారం దానికి చుట్టి .. నెమ్మదిగా ఒక చేత్తో చక్రాన్ని తిప్పుతూ పత్తిని కాస్త కాస్తగా చేతితో  చక్రానికి ఉన్న బంధానికి అందిస్తూ ఉంటే … ఆ పత్తి  నెమ్మదిగా సన్నటి దారంగా మారడాన్ని చూడటం కనులకి  భలే వేడుక.

Also read: అంతా అంతే!

చూడముచ్చటగా  నూలు  దారం  తయారవడాన్ని గమనించిన నేను … నేను కూడా నూలు వడుకుతానని తయారయ్యేను. కృష్ణమూర్తి గారు చిన్నగా నవ్వి ఆ రాట్నాన్ని నాకు అందించి ఎలా చక్రం తిప్పాలో ఎలా పత్తిని అందిస్తూ ఉండాలో … వివరించి చెప్పేరు. నేను ఆయన వడికిన పద్ధతిని అప్పటిదాకా గమనిస్తూ ఉన్నాను కదా! నాకూ  వచ్చేస్తుంది  అన్న గాఢమైన నమ్మకం .. చేసేద్దామన్న  ఒక బలమైన  ఉత్సాహంతో ఆ  రాట్నం ముందు కూర్చుని చేతిలోకి చక్రం తీసుకుని  నెమ్మదిగా దాన్ని అలా ఒకసారి తిప్పేను. దారం కాస్తా పుటుక్కున తెగింది. ఆయన వైపు ఒక బేల చూపు చూసేను. ‘‘ఏమీ కాదు అదే వస్తుంది. నెమ్మదిగా తిప్పండి’’ అని అన్నారు కృష్ణమూర్తి గారు. నేను మళ్ళీ ప్రయత్నం చేసేను. అది మళ్ళీ తెగింది. మళ్ళీ చక్రం తిప్పేను. నేను వీలైనంత నెమ్మదిగానే తిప్పేను చక్రాన్ని. అయినా  నా చేతిలో తయారవుతున్న  దారం మళ్ళీ పుటుక్కున తెగింది.  అయితే ఆయన చేతిలో చక్రం తిరిగినప్పుడు ఒక్కసారైనా తెగని దారం నా చేతిలో అలా మాటికి మాటికీ పుటుక్కున తెగడం ఏమిటన్న చికాకు .. ఉక్రోషం .. ఉద్వేగం .. ఆత్రుత .. అవమానం లాంటి భావాలు  నన్ను కమ్మేస్తూ ఉన్నాయి వడివడిగా. నేను ఓడిపోతున్నట్టుగా ఒక అనుభవం ఎదో నా మనసుని పీడిస్తోంది. నేను ఎలాగైనా బాగా  రాట్నాన్ని తిప్పి కృష్ణమూర్తి  గారి  మెప్పు పొందాలి అన్న ఒక్క ఊహ తప్ప నాలో ఆక్షణాన మరొక ఆలోచన లేదు. నా ఉద్వేగాల మధ్య రాట్నం అస్సలు సరిగ్గా తిరగడం లేదు. దారం మళ్ళీ పుటుక్కు మంటూనే ఉంది. తెగిపోతూనే ఉంది.  నాకు కళ్ళనీళ్ళొచ్చేటంత నిస్సహాయత ఆవరించింది! నాకు నూలు వడకడం ఇంక చాతకాదని అనిపించింది కూడా!

Also read: అమ్మా, నీకు వందనమే!

నా స్థితిని గమనించిన కృష్ణమూర్తిగారు —‘‘అలా నిరాశ పడకూడదు . మీరింకా ఇప్పుడే కదా రాట్నాన్ని చేతపట్టేరు . వస్తుంది మీకు . కాస్త ఓర్పుతో చక్రాన్ని తిప్పాలి. మరీ వేగంగా తిప్పినా దారం తెగిపోతుంది. మరీ నెమ్మదిగా తిప్పినా దారం తెగిపోతుంది –’’ అని అన్నారు . మరీ వేగం కాక మరీ నెమ్మది కాక ఓర్పుగా … ఈ విశేషణాలేవీ నా స్వభావానికి అతకవే !! ఆయనకీ నా కవిత్వమూ … నా స్వభావమూ తెలుసు. ఆయన మళ్ళీ చిన్నగా నవ్వేరు. ‘‘వస్తుంది. కాస్త ఓర్పు, అంతే!’’ అని అన్నారు . ఎలాగైనా దారాన్ని తెగకుండా చక్రాన్ని తిప్పాలి అన్న పట్టుదల నాలో పెరిగింది . దీర్ఘంగా ఊపిరి తీసుకుని .. స్థిమితపడి … నెమ్మదిగా ఒకే రిథమ్ తో ఈ సారి రాట్నాన్ని తిప్పేను. ఆశ్చర్యం దారం తెగలేదు. ఒక ఆవర్తనం అయింది. ఇంకోటి అయింది. మూడు నాలుగు చుట్లూ పూర్తీ అయ్యేయి. నేను చక్రాన్ని తిప్పుతూనే ఉన్నాను. నాకే తెలియకుండా నేను రాట్నం మీద దారం తియ్యడంలో నిమగ్నమైపోయాను. మళ్ళీ ఒక మూడు నిమిషాల దాకా తల ఎత్తలేదు. అప్పటికి మళ్ళీ దారం తెగింది. ఇప్పుడు నాకు ఆ ఒడుపు ఏమిటో  కాస్తగా అర్ధం అయ్యింది. ఓర్పు ఎందుకో  కూడా అర్ధం అయ్యింది. నేను మళ్ళీ గూటాల కృష్ణమూర్తిగారి వైపు చూసేను. ఆయన దీక్షగా నేను రాట్నాన్ని తిప్పడాన్నే గమనిస్తున్నారు. నేను ఆయన వైపు చూసినప్పుడు నన్ను చూసి మళ్ళీ  ఆయన చిన్నగా నవ్వేరు.  ‘ఇంతే జీవితం కూడా’ అన్నట్టు! ప్రతీ అక్టోబర్ రెండు నాడూ లండన్ నగరంలోని గాంధీ విగ్రహం ముందు కూర్చుని రోజంతా రాట్నాన్ని తిప్పుతూ నూలుదారం వడకడాన్ని ఆయన అక్కడ ఉన్నన్ని సంవత్సరాలూ చేసేరు. మన భారతీయతకు.. మన చేనేతకు …   మన దేశస్వాతంత్ర్యానికీ … మన గాంధీకి ఆయన అలా  తనదైన పద్ధతిలో నివాళి సమర్పించారు.

Also read: కొడవటిగంటి  కుటుంబరావు  అక్షరం

చివరగా చెప్పొచ్చేదేమంటే — ఏపనైనా చూసినదానికీ చేసినదానికీ మధ్య అనుభవంలో చాలా తేడా ఉంటుంది. రాట్నం మీద నూలు వడకడం  నిజంగానే ఒక తపస్సు లాంటిది. చాలా ఓర్పు కావాలి దానికి. చాలా ఏకాగ్రత  కూడా కావాలి దానికి. ఈసారి చేనేత వస్త్రాన్ని ఎవరైనా చూసినప్పుడు ఆ వస్త్రాన్ని నేసిన వాళ్ళ వేళ్ళ  శ్రమనీ… ఆ పనిలోని వారి ఏకాగ్రతనీ … వారి కష్టాన్నీ తప్పనిసరిగా గుర్తించండి. ఆ కష్టానికి విలువనివ్వండి. చేనేతలని  మాత్రమే కట్టండి!  రాట్నం మన స్వాతంత్రానికి  అందుకే ప్రతీక! మన స్వేచ్చని మనం ఒక ఓర్పుతోనీ .. ఒక దీక్షపూని సాధించుకున్నామని సదా అది  మనకి గుర్తు చేస్తుంది . అలాంటి రాట్నం మూలబడే పరిస్థితి ఈ ఆధునిక కాలంలో రావడం అంటే మనం మన మూలాల్ని మరిచిపోవడమే అవుతుంది. రాట్నం భారతీయుల శ్రమకి.. స్వాభిమానానికీ  నిదర్శనం!  ఇవాళ డబ్బులో ఓలలాడే తల్లి తండ్రులకి డ్రగ్స్ కి బానిసలైన వారి పిల్లలికి వారికి దొరికిన సంపదా స్వేచ్చ వెనక  వెనకటితరాలు పడిన  ఇన్ని కష్టనిష్ఠురాలున్నాయనీ .. ఇన్ని త్యాగాలున్నాయనీ ఒకసారి తెలుసుకోమని చెప్పండి. ఇలాంటి భారతం కోసం గాంధీ చరఖాని చేత పట్టలేదని చెప్పండి.  వెనకటితరాలు మనకోసం అనుభవించిన కష్టాలకి మనం వారికి ఋణపడిఉండాలి. వాళ్ళ త్యాగాలని మనం వృధాపోనివ్వరాదు. వాళ్ళు సాధించిన దేశపు సమగ్రతని నిలబెట్టుకోవలసిన అవసరం   సదా అందుకే అందరిమీదా ఉంది!

జీవితంలో ఒకసారైనా రాట్నాన్ని చేత పట్టి ..  నూలు దారం తీస్తే ఎవరికైనా  ఆ శ్రమ  విలువ తెలుస్తుంది. గాంధీ ఈ దేశప్రజల చేతిలో రాట్నాన్ని  మాత్రమే ఎందుకని పెట్టాడో కూడా అందరికీ స్పష్టంగా నే  అర్ధం అవుతుంది.

Also read: కవిత్వంతో చిరునవ్వులు పూయించగల కొంటెదనం పఠాభి సొంతం: జయప్రభ

జయప్రభ.

18 august 2017

Jayaprabha Anipindi
Jayaprabha Anipindi
జయప్రభ ప్రఖ్యాత కవి, స్త్రీవాద రచయిత్రి. విమర్శకురాలు. కథలూ, వ్యాసాలూ అనేకం రాశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles