Friday, January 10, 2025

డబ్బూ డ్రగ్సూ ఒకటే!

సంపద సృష్టిద్దాం- 25

డబ్బనేది నిజంగా ఒక ఆలోచన. దాన్ని కళ్లతో కంటే మనసుతో ఎక్కువగా చూడాలి. ఆర్థిక స్వేచ్ఛ సాధించాలనేది మన అందరి గమ్యం. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి డబ్బు సంపాదన అనే ఆటను నేర్చుకోవలసిందే. అందుకే మనం క్యాష్‌ఫ్లో క్వాడ్రెంటును అర్థం చేసుకోవాలి. ఇ నుంచి ఎస్‌కు, ఎస్‌ నుంచి బికి, బి నుంచి ఐకి మన ప్రయాణం సాగుతున్న కొద్దీ ఈ ఆటను మనం సరిగ్గా ఆడుతున్నట్లు. ఇంతలో ఎన్నో అవాంతరాలు వస్తుంటాయి. వాటిని తట్టుకుని నిలబడగలగాలి. కాని ఈ ప్రయాణంలో డబ్బు కోసం పని చేయడానికి అలవాటు పడకూడదు. డబ్బు అనేది ఒక మత్తు పదార్థం లాంటిది. దానికి అలవాటు పడితే దానినుంచి తప్పించుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. డబ్బు కోసం పని చేయకుండా, డబ్బు సంపాదనకు మనకంటూ ఒక వ్యవస్థను రూపొందించుకోవాలి. ఇదే రహస్యం.

Also read: వారసత్వ జబ్బు

చేయడం కాదు ఉండడం

‘ఇ’లో వ్యక్తులు ఒక వ్యవస్థ కోసం పనిచేస్తారు. ‘ఎస్‌’ అనేది వ్యవస్థలా కనిపించే అవ్యవస్థ. ‘బి’లో వ్యక్తి ఓ వ్యవస్థను సృష్టించి, దాన్ని సొంతం చేసుకుని, తనే నియంత్రిస్తాడు. ‘ఐ’ వ్యవస్థలోకి పెట్టుబడులను ప్రవహింపజేస్తాడు. మనం ఒక విభాగం నుంచి మరో విభాగంలోకి మారటానికి పెనుగులాడవలసి ఉంటుంది. చాలా పెద్ద ప్రయత్నం చేయాలి. మీరు ఇతరులు చేసిన పనులే చేస్తూ, అదే మార్గంలో ముందుకు వెళితే వాళ్లలాగానే మిగిలిపోతారు. అయితే ఆ ఇతరులెవరనేదే ప్రశ్న. జీవితంలో కాపీ అంటే అనుకరణ సహజమైనప్పుడు మనమెవరిని కాపీ చేస్తున్నామన్నదే ముఖ్యమైన విషయం. నువ్వు ఒక విజయవంతమైన ఉద్యోగిని కాపీ చేస్తే నువ్వు ఉద్యోగిగానే తయారవుతావు. పారిశ్రామికవేత్తను కాపీ చేస్తే పారిశ్రామికవేత్తవు మాత్రమే కాగలుగుతావు. అంతా మన ఎంపికలోనే ఉంటుంది. మన ఎంపిక మన ఆలోచనల్లో ఉంటుంది. మీరు సంపన్నులు కావాలంటే గుంపులో ఒకరిగా కాకుండా, స్వతంత్రంగా ఆలోచించగల నేర్పు మీకుండాలి. ధనికులు కాదలచుకున్న వారికుండవలసిన విశిష్ట లక్షణం భిన్నంగా ఆలోచించగలగడమే. ఇ, ఎస్‌ విభాగాల నుంచి ఆర్థిక స్వేచ్ఛ కోసం బి, ఐ విభాగాలలోకి మారటానికి ఏమి చేయాలని మీరడిగితే నేనంటాను కదా ‘‘మార్పు రావలసింది మీరు చేసే పనిలో కాదు. మీ ఆలోచనలో ముందు మార్పు రావాలి’’. ఇది అర్థం కావడానికి ఒక సాధారణ ఉదాహరణ చెప్తాను. యుక్తవయసులో పెళ్లి చేసుకుందామని బయలుదేరుతారు. ఎలాంటి భాగస్వామి కావాలో అందరికీ చాలా ఆలోచనలు ఉంటాయి కదా. ఆ కలను పట్టుకుని ఎక్కడెక్కడో వెతుకుతుంటారు. ముందు తాము సరైన భాగస్వామిగా ఉండడానికి ఏం చేయాలో అన్నదాని మీద దృష్టి పెట్టరు. చివరికి దొరికిన సంబంధంతో పెళ్లయ్యాక వారిని మార్చే ప్రయత్నం చేస్తారు. మన ప్రశ్నకు సమాధానం మన దగ్గరే ఉందన్న విషయం గుర్తించలేరు.

Also read: సాయం చేద్దాం.. సాయం పొందుదాం..

బరువు తగ్గుదామని కొందరు అపసోపాలు పడుతుంటారు. జిమ్‌కు సభ్యత్వాలు కడతారు. డైటింగ్‌ చేస్తారు. అన్నీ కొన్ని వారాలే. ఆ తర్వాత అన్నీ మర్చిపోతారు. ఏడాదికొకసారన్నా వారికి ఈ పూనకం వస్తుంది. మనం ‘ఉండడానికి’ బదులు ‘చేయడం’ వల్ల వచ్చే సమస్య ఇది. క్యాష్‌ఫ్లో క్వాడ్రెంట్‌ అంటే ‘చేయడం’ కాదు, ‘ఉండడం’. పారిశ్రామికవేత్తలు ఏం చేస్తున్నారో చూసి కాపీ కొట్టి మనమదే చేయడంలో అర్థం లేదు. వారు ఎలా ఆలోచిస్తున్నారో మనం అలా ఆలోచించగలగడం అసలైన విషయం. ఆలోచన మార్చుకోవటానికి పెద్ద ఖర్చేం కాదు. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే అది పూర్తిగా ఉచితం. అయితే అంతరాంతరాల్లో మనలో నిక్షిప్తమైన నమ్మకాలను, ఆలోచనలను మార్చుకోవటం అంత సులభమైన విషయం కాదు.

Also read: వైద్యం విఫలమైన వేళ…

అడుగు – నమ్ము -`పొందు

ఏదన్నా కొత్త పనిచేస్తే డబ్బు పోగొట్టుకుంటామేమోనని భయపడుతున్నారా? అయితే డేనియల్‌ గోల్మన్‌ రాసిన ‘ఎమోషనల్‌ ఇంటిలిజెన్స్‌’ పుస్తకం చదవండి. ఈ పుస్తకంలో శతాబ్దాల నాటి సందేహాన్ని గోల్మన్‌ మన ముందుంచారు. చదువుల్లో బాగా రాణించిన వ్యక్తులు నిజ జీవితంలో ఎదగలేకపోవడానికి గల కారణాలను విశ్లేషించారు. చదువుల్లో ఐక్యూతో పోలిస్తే భావోద్వేగాల పరంగా ఐక్యూ మరింత శక్తిమంతమైనదని ఆయన చెప్పుకొచ్చారు. తప్పులు చేస్తే, ముప్పును ఎదుర్కొంటూ వాటినుంచి పాఠాలు నేర్చుకున్న వ్యక్తులు, తప్పులు చేయటానికి భయపడే వారికంటే ఎక్కువ ముందుకెళ్లి ఎన్నో సాధించడాన్ని మనం చూడవచ్చు అంటారు. ఆర్థికంగా నిలదొక్కుకుని స్వేచ్ఛను పొందాలంటే తప్పనిసరిగా తప్పులు చేయటం నేర్చుకోవాలి. రిస్క్‌ను సమర్ధంగా నిభాయించటం తెలుసుకుని తీరాలి. జీవితమంతా డబ్బు పోతుందన్న భయంతో, గుంపు మనస్తత్వానికి అనుగుణంగా వ్యవహరిస్తూ కొత్త తరహాలో పని చేయటానికి సందేహిస్తే సంపన్నులు కావడమనేది కల్ల. మన తెలివి అంటే ఐక్యూ 90 శాతం భావోద్వేగానికి సంబంధించినదైతే, మిగిలిన 10 శాతం మాత్రమే తార్కికతకు సంబంధించినది. అంటే భావోద్వేగాలు ఉచ్ఛస్థితిలో ఉన్నపుడు అది తార్కికమైన మెదడు కంటే 24 రెట్లు అధిక శక్తిమంతంగా పని చేస్తుందని గోల్మన్‌ తీర్మానించాడు. ఇందులో నిజమెలా ఉన్నా తార్కికమైన ఆలోచన ధోరణికంటే భావోద్వేగాలతో ఆలోచించటం మెరుగైన ఫలితాలనిస్తుంది అన్నది మాత్రం నిత్య జీవితంలో మనం చూసేదే.

Also read: పారిపోవద్దు, ఫైట్‌ చేద్దాం!

ఇదంతా మనం చిన్నప్పుడు సైకిల్‌ తొక్కడం నేర్చుకోవడం లాంటిది. ఎలాంటి సపోర్ట్‌ లేకుండా తిన్నగా సైకిల్‌ ఎవరైనా నడుపుతుంటే నోరెళ్లబెట్టి చూస్తాం. తర్వాత మెల్లగా సైకిల్‌ తొక్కడానికి ప్రయత్నం చేస్తాం. మంకీ పెడల్‌ వేస్తాం. ఒకరోజు ఏకంగా సీటుమీద కూర్చోవడానికి సాహసిస్తాం. కిందపడతాం. మోచేయి చీరుకుపోతుంది. కిందపడితే అదొక అవమానంగా భావించి కొందరు సైకిల్‌ జోలికి ఎప్పుడూ పోరు. మరికొందరు చీరుకుపోయిన మోచేతిని కూడా పట్టించుకోకుండా మళ్లీ సైకిల్‌ తీస్తారు. కొద్ది రోజులకు పడడం, నడపడం యాంత్రికంగా మారిపోతుంది. పడడం పెద్ద విషయం కాదనిపిస్తుంది. ఎందుకంటే పడినా లేచి సైకిల్‌ నడపడం పెద్ద సమస్య కాదని ఈపాటికి గ్రహించారన్న మాట. ఇదంతా ఒక ఆలోచన ధోరణి. ఉద్యోగ భద్రత ఆలోచన విధానం నుంచి ఆర్థిక స్వేచ్ఛ ఆలోచన విధానానికి మారటంలో కూడా ఒక ఆలోచన ధోరణి.

Also read: సమస్తమూ అంతశ్చేతనతోనే..

– దుప్పల రవికుమార్‌

రవికుమార్ దుప్పల
రవికుమార్ దుప్పల
దుప్పల రవికుమార్ సిక్కోలు బుక్ ట్రస్ట్ ప్రధాన సంపాదకులు. ఆంగ్ల అధ్యాపకులు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. మొబైల్ : 99892 65444

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles