- జగన్ కుట్రలను బయటపెడతాం
- ట్విట్టర్ లో చంద్రబాబు విమర్శలు
- ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వట్టర్ వేదికగా విమర్శలు కురిపించారు. ఢిల్లీని ఢీకొడతా, మోదీ మెడలు వంచుతానని ప్రగల్భాలు పలికిన జగన్ మోహన్ రెడ్డీ నీ క్విడ్‌ప్రోకో దోపిడీ బుద్ధిని పక్కనబెట్టు అంటూ చురకలంటించారు. తెలుగువారి ఉద్యమఫలం, విశాఖ మణిహారం ఉక్కు కర్మాగారాన్ని కాపాడాల్సిన బాధ్యత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీపై ఉందని గుర్తుంచుకోమంటూ ట్వీట్ చేశారు.
వికేంద్రీకరణ పేరుతో విధ్వంసం:
గతంలో స్వర్గీయ వాజ్ పాయి ప్రభుత్వంలో ఇదే పరిస్థితి తలెత్తిందని ఆ సమయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విశాఖ ఉక్కును కాపాడింది అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అని చంద్రబాబు తెలిపారు. ప్రత్యక్షంగా 18 వేలమంది శాశ్వత ఉద్యోగులు, 22 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి కల్పించే విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తుంటే, ఒక ముఖ్యమంత్రిగా నీ బాధ్యత ఏంటంటూ ప్రశ్నించారు. అభివృద్ధి వికేంద్రీకరణకే విశాఖలో పరిపాలనా రాజధాని అన్న సీఎం అభివృద్ధి పేరుతో ఇప్పటికే ఆ పేరుతో విశాఖలో కొండలు కొట్టేశావు. గుట్టలు మింగేశావు. భూములు ఆక్రమించేశావు. ఇప్పుడు విశాఖ ఉక్కుపై పడ్డావా అంటూ విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ని తుక్కు కింద కొనేసి లక్షల కోట్లు ట్టేద్దామనుకుంటున్న జగన్‌రెడ్డి గ్యాంగ్ కుతంత్రాన్ని ప్రజల మద్దతుతో టీడీపీ అడ్డుకుంటుందని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు కురిపించారు.
Also Read: విశాఖ ఉక్కు ప్రజల హక్కు కాదా?
గంటా రాజీనామా:
మరోవైపు విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను శాసన సభ స్పీకర్ కు పంపినట్లు తెలిపారు. ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన దానికి కట్టుబడి రాజీనామా చేశానని తెలిపారు.
నీతిఆయోగ్ సూచన మేరకే ప్రైవేటీకరణ :
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ లో నిరసనలు ఎగసిపడుతున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ దీనిపై స్పందించారు. నీతిఆయోగ్ సూచనతోనే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నష్టాల్లో ఉన్న సంస్థలలోని వాటాలనే విక్రయిస్తామని ఠాకూర్ స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందన్న వాదనలను ఆయన ఖండించారు. బడ్జెట్ ను జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చూడాలని అన్నారు.