నెల్లూరు: 17వేల కోట్లు ఖర్చుపెట్టి 55వేల కోట్లలో 70శాతం పూర్తి చేశాం అని తెలుగుదేశంపార్టీ నాయకులు అబద్దాలు ఆడుతున్నారని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మంత్రి అనీల్ కుమార్ యాదవ్ విమర్శించారు.
శుక్రవారంనాడు ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ మంత్రి, ‘55వేల కోట్లలో 17వేల కోట్లు 70శాతం ఎలా అవుతుంది?’ అంటూ ప్రశ్నించారు. ‘2017 కేబినెట్ లో ఏం నోట్ పెట్టాడో మీనాయన అది చదువుకుని మాట్లాడు లోకేష్’ అని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను ఉద్దేశించి మాట్లాడారు.
‘డిసెంబర్-21నాటికి పోలవరం పూర్తి చేస్తామని మాత్రమే చెప్పాము,ఎప్పుడూ కూడా ఏడాదిలోగా పూర్తి చేస్తామని చెప్పలేదు. గతేడాది వరదలు,మార్చి నుండి కరోనా,మళ్ళీ జూన్ నుండి వరదలు వల్ల పోలవరం పనులలో కొంత జాప్యం ఏర్పడింది. అయినా కూడా అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నాము’ అని మంత్రి అనీల్ కుమార్ యాదవ్ పునరుద్ఘాటించారు.