Sunday, December 22, 2024

మాకు నీ నిత్య సాంగత్యమే కావాలి

తిరుప్పావై – 27

మాడభూషి శ్రీధర్

11 జనవరి 2024

కూడారై వెల్లుమ్ శీర్ గోవిందాఉన్ఱనై
ప్పాడి పఱైకొండు యామ్ పెరుసమ్మానమ్
నాడు పుగళుం పరిశినాళ్ నన్ఱాక
శూడగమే తోళ్ వళైయే తోడే శెవి పువ్వే
పాడగమే యెన్ఱనైయ పల్కలనుమ్ యామణివోమ్
ఆడైయుడుప్పోం అదన్ పిన్నే పాల్ శోఱు
మూడనెయ్ పెయ్దు ముళగైవళివార
కూడి ఇరుందు కుళిరుంద్-ఏలోర్ ఎంబావాయ్

తెలుగు భావార్థ గీతిక

ఒల్లని మనసులైన గెల్చెడి గోవింద బిరుదాంకితా

నీ వైభవమ్ము కీర్తించి పఱైనడగ వచ్చినాము, లేక

జగమెల్ల మెచ్చురీతి పెద్దసన్మానమును కోరినాము

బంగారు మణి కంకణములు, కై దండలు కొన్ని

గున్నాలు చెవిపూలు, కాలికై వెండికడియాలు

మేలి వస్త్రములు ఆపైన, మోజేతిదాక నేయి కారెడు

పాలపాయసాన్నములు  నీ చెంత కూర్చుని ఆరగించ

మాకు నీ నిత్య సాంగత్య దివ్యసౌభాగ్య సాకేతమిమ్ము

అర్థం
గోపికలు నిన్నటి పాశురంలో అడిగిన వస్తువులు భౌతికమైనవి కావు. సామాన్యమైనవి కావు. సాక్షాత్తూ వాసుదేవుడు ధరించే శంఖ చక్రాలు అంటే శంఖ చక్రధరుడైన వాసుదేవునే వారు కోరుతున్నారని అర్థమైంది. లేకపోతే శంఖ చక్రాలతో పాటు, గరుడ ధ్వజం,పారతంత్ర్యమనే పఱై కోరుతూ మంగళాశాసనాలు చేసేవారు, మహాలక్ష్మి వంటి మంగళదీపాన్ని కావాలంటున్నారు. చాందినీ, ఆసనం, పడక అని రకరకాలుగా అమరే ఆదిశేషుని కోరుకుంటున్నారు. ఇవి సామాన్యులకు అమరేవికావు. అమరులకు కూడా దొరకవు. అంటే అవన్నీ నిరంతరం కలిగి ఉండే వాసుదేవుడే వారికి కావాలని అర్థం. వాసుదేవుడే దుర్లభుడు. వారి అంతరంగం తననే కోరుకుంటున్నదని వాసుదేవుడు గమనించాడు. సరే మీ వ్రతఫలమేమని మీరు అనుకుంటున్నారు అని ఈ పాశురంలో వాసుదేవుడు సూచించడం, వారు వివరించడం తరువాతి పాశురాలలో జరుగుతుంది.

కూడారై = తనను కూడని వారిని సైతం, వెల్లుమ్= జయించే: శీర్= కళ్యాణగుణసమన్వితుడైన: గోవిందా = గోవింద నామధేయుడా, ఉన్ఱనై= నిన్ను, ప్పాడి = కీర్తించి, పఱైకొండు =పర అనే వాయిద్యాన్ని కోరి, యామ్= మేము,పెరు=  పెద్ద లేదా పొందెడి, శమ్మానమ్=సన్మానమును,నాడు=లోకమంతయు, పుగళం పరిశినాళ్ = మెచ్చుకునే రీతిలో, నన్ఱాకబ శూడగమే= చేతికి ఆభరణాలు, తోళ్ వళైయే= భుజకీర్తులు, తోడే= కర్ణాభరణాలైన దుద్దులు, శెవి ప్పూవే= చెవికి ధరించే పూవులు, పాడకమే = పాదాభారణాలు, యెన్ఱనైయ = అని పిలువ బడే, పల్కలనుమ్=అనేక రకాల ఆభరణాలను, యామ్ = మేము, అణివోమ్= ధరింతుముగాక,ఆడై= వస్త్రములను, ఉడుప్పోం = ధరింతుముగాక, అదన్ పిన్నే= దాని తరువాత, పాల్ శోఱు= పాలతోచేసిన అన్నము, పరమాన్నము, మూడ =నెయ్ పెయ్దు = నేయి పోసి, ముళంగై = మోచేతినుండి, వళివార=కారునట్లుగా, కూడి ఇరుందు= నీతో కలిసియుండి, కుళిరుంద= ఆరగించడమే-ఏలోర్ ఎంబావాయ్= మావ్రతము.‘నిను కీర్తించి పఱై అనే వాయిద్యాన్ని పొందారు. భగవంతుడితో కలిసి భగవన్నామాన్ని కీర్తించడమే వారి లక్ష్యం. నారాయణనే నమక్కే = నారాయణుడే మనకే ఫలము ఇస్తాడని మేం నమ్ముతున్నాము. మాకు సన్మానము కావాలి.

Also read: ఎన్నోకావాలనేది నెపం, నిజం పరమాత్ముడే కావాలి

శ్రీకృష్ణుని పరాక్రమం, సౌశీల్యం

తనతో విభేదించి,కలిసి రాకుండా పోయే శత్రువులను జయించడమనేది ఒక పరాక్రమం, అది కళ్యాణగుణ సంపద. ఆ సంపద గల గోవిందుడా నిను కీర్తించి, ఈ తిరుప్పావై వ్రతం ఫలితంగా పఱై అనే వాయిద్యమును నీనుంచి పొందాలని అనుకుంటున్నాం లేదా ఘన సన్మానము లోకులంతా మెచ్చుకునే విధంగా ఉంటుందని అనుకుంటున్నాం. చేతులకు గాజులు, భుజాలకు కడియాలు, చెవికింద దుద్దులు, పైన చెవిపూలు, కాలికి అందెలు, వంటి అనేకాభరణాలు ధరించాలి. తరువాత మంచి చీరలు కట్టుకోవాలి. పాల అన్నము మునిగేట్టు నేయి పోయాలి. ఆ తీపి పరమాన్నాన్ని మోచేతి వెంట కారునట్టుగా దోసిట్లో పోసుకుని జుర్రుకోవాలి. అదీ నీతో కలిసి కూచుని హాయిగా భుజించాలి, ఇదే మా వ్రతఫలం గోవిందా అంటున్నది గోదమ్మ, అవునని గొంతు కలిపారు గోపికలు.

భగవంతుని అందుకోవడం, ఆయన కళ్యాణ గుణాలను అనుభవించడమే వ్రత ఫలం. పరమాన్నం  తినాలనే కోరిక కాదు, పరమాత్ముడితో కలిసి పరమాన్నపు ఆనందాన్ అనుభవించడమే పరమానందనుకోవడం అద్భుతమైన కోరిక. పరమానందమే మోక్షం. పరమాత్ముడితో కూడి అనుభవించడం, అదే కూడారై.

పరమాత్మను ఆశ్రయించగలమా అని కొందరు విముఖులు, నాకు యోగ్యత ఉందా అనే వారిని కూడా సౌశీల్యముతో సుముఖులను చేసుకుంటారు. రాముడు గుహునితో శబరితో సౌశీల్య గుణంతో ఆశ్రయం ఇస్తాడు. నమ్మాళ్వార్ తనకు పరమాత్మను ఆశ్రయించగలిగే స్థోమత లేదనుకుంటారు. సంజయుడు ఒకసారి కృష్ణుడి అంతరంగ మందిరానికి వస్తాడు. అప్పుడు సత్యభామాది అష్టమహిషులతో చనువుగా ఉన్నదశ. వారంతా సర్దుకోబోగా, ఫరవాలేదు సంజయుడు మనవాడే మీరేం సర్దుకోనవసరం లేదంటా సంజయుడిని లోనికి రమ్మంటారు. అది శ్రీకృష్ణుని సౌలభ్యం సౌశీల్యం.

గోదమ్మ మొక్కు తీర్చిన రామానుజస్వామి

తనను శ్రీరంగనాథుడు స్వీకరించడానికి అంగీకరిస్తే తిరుమాలియుం శోరే  పెరుమాళ్లకు గోదాదేవి వంద కడవల అక్కారవడిశల్  భోగం చేయిస్తానని మొక్కు కున్నారట. కాని ఆ మొక్కు తీర్చేలోగానే శ్రీరంగడు పల్లకీ పంపడం, శ్రీరంగానికి వెళ్లి అక్కడ స్వామి మూలవిరాట్ మూర్తిలో లీనం కావడం జరిగిపోతాయి. మొక్కు తీరదు. ఇక రోజు గోదా వైభవాన్ని తిరుప్పావై ప్రాధాన్యాన్ని వివరిస్తున్న రామానుజుడు ఈ మొక్కు గురించి ప్రస్తావిస్తున్నదశలో అయ్యో ఈ మొక్కు తీరలేదే అని బాధపడి, మొక్కు తీర్చే బాధ్యతను తాను స్వీకరిస్తారు. అక్కారవడిశల్ (పాల పాయసం) మొక్కును రామానుజుడు నెరవేరుస్తాడు, ఒకటికి రెండింతలన్నట్టు వందకడవల పాయసం ఇస్తానని మొక్కితే రామానుజుడు వేయి కడవల పాయసం చేయించి తిరుమాలుం శోరే లో పెరుమాళ్లకు సమర్పిస్తారు. అప్పడినుంచి రామానుజుడు గోదాదేవికి అన్నఅనే బిరుదు పొందారు.

Also read: శ్రీరామకృష్ణులు ఎందుకు గర్భనరకం భరించారో తెలుసా?

రామానుజ అష్టోత్తరనామాలలో గోదాగ్రజాయనమః ఒకటి. ద్రవిడ సాహిత్యంలో పెరుంబూదూరు మామనుక్కు పిన్నానాళ్ వాజియే అనే పేరు కూడా వస్తుంది. తిరుప్పావైని చాలా అభిమానించి విస్త్రుతంగా వ్యాఖ్యానించిన శ్రీమద్రామానుజాచార్యను తిరుప్పావై జీయర్ అని కూడా పిలుస్తారు. 

గోవింద పట్టాభిషేకం

శ్రీ కృష్ణుడికి గోవింద పట్టాభిషేకం ఇంద్రుడే చేస్తాడు. పర్యావరణపరంగా పర్వతమే మనకు వర్షాలు కురిపింప చేస్తున్నది చెప్పి శ్రీకృష్ణుడు ఇంద్రుడి పూజను మాన్పిస్తాడు. కోపించిన ఇంద్రుడు వాయు వారుణ దేవతలను ప్రళయం సృష్ఠించమని ఆదేశిస్తాడు. గోపాల బాలుడైన శ్రీకృష్ణుడు గోవర్ధనాన్ని ఎత్తి గోవులను గోపాలురను కాపాడతాడు క్రిష్ణయ్య. ఏడురోజులపాటు పిడుగులు మెరుపులు కురిపించి దాడి చేసి అలసి పోయిన ఇంద్రుడు, శ్రీకృష్ణుడి పరబ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకుని, అహంకారం వీడి, క్షమాపణ కోరి, శరణువేడి, శ్రీకృష్ణుడిని అక్కడే కూర్చుండ జేసి, యమునా జలాలతో గోవింద పట్టాభిషేకం చేసారని భాగవతంలో ఉంది. ఇందాకా 26 పాశురాల్లోఎక్కడా గోవింద నామం రాలేదు. మొదటి సారి గోవిందా అంటున్నారు గోదమ్మ ఈ పాశురంలో, తరువాత రెండు పాశురాల్లో కూడ గోవిందుని నామ స్మరణ చేస్తారు గోదాదేవి. శ్రీకృష్ణుడు గోవిందుడనే బిరుదు ఏ విధంగా పొందాడనడానికి మరో వివరణ ఉంది. గోవిందా అంటే గోవులను రక్షించచేవాడని అర్థం. ఆ గోవులు తనతప్పులను రక్షించించి తనను కాచాయట. ఆ గోవులను కాపాడడం కోసం గోవింద అయినాడట. ఒక్కోసారి గోవులను దూడలను మేపడానికి వెళ్లిన ఈ గోపాల బాలుడు నాలుగురోజులదాకా ఇంటికి రాడు. గోవులను అడవులకు పంపి, గోపికలతో విహరించడం వల్ల ఆలస్యం అవుతుంది. వ్రేపల్లెకు రాగానే యశోదమ్మ ఏమిటీ ఇన్నిరోజుల తరువాత వస్తావా అని నిలదీస్తుంది. అప్పుడు అమ్మా గోవులన్నీ అడవుల్లో ఎక్కడికో వెళ్లిపోయాయి, వెతికి తేవడానికి నాలుగురోజులు పట్టిందమ్మా అని నెపం గోవుల మీద వేస్తాడట. తమ మీద నెపం వేయడానికి ఉఫయోగపడిన ఆ గోవులను కాపాడవలసిన బాధ్యత తనపై ఉందనుకుంటాడట. అదే గోవింద శబ్దానికి వివరణ.

యామునాచార్యులుప్రార్థన

‘నావంటి అధముడు, తప్పులు చేసిన వాడు, అపవిత్రుడు నీ పరిజనంలో ఉండాలని కోరుకోవడం అందుకు నేను తగిన వాడనా’ అని యామునాచార్యులు ప్రార్థించారట. తమ తక్కువతనము చూపి భగవంతుని స్పర్శలేనిదే బతకలేమని చెప్పి దివ్యమంగళ విగ్రహ సౌందర్యారాధన చేయాలి. తనపై అలిగిన ప్రేయసులను, గోపికలను, తాత్కాలికంగా విముఖులైన వారిని కూడా దారికి తెచ్చుకుంటాడు కృష్ణుడు. ద్వేషముచేత విముఖులైన వారిని పరాక్రమంతో జయిస్తాడు. ఉదాసీనంగా విముఖులైన వారిని కూడా అనుసరించి తన సౌందర్యముచేత ఆకర్షిస్తాడు. నీతో ఉండతగమని విముఖులయ్యే వారు, ప్రణయకోపంచేత విముఖులయ్యే వారు అలిగే వారు, స్నేహమూలేక ద్వేషమూ లేక విముఖులయ్యేవారు, ద్వేషము చేత విముఖులయ్యే వారు అందరినీ ఏదో మార్గం ద్వారా జయిస్తాడు.

మరీ మహాలక్ష్మీనే అడుగుతారా?

గోపికలను ఏంకావాలని ఆయన అడుగుతాడు. అప్పడికే వారు శ్రీకృష్ణుని పరివారానికి చెందిన మహాలక్ష్మిని కోరారు, అనంత గరుడులను, ఆళ్వార్లను, శంఖమును తమవైపు తిప్పుకున్నారట. ‘‘మావారిని మీవారిగా చేసుకుని మమ్ములను ఓడించారు. మిమ్ము నేనొడిస్తాను’’. అన్నాడట గోవిందుడు. ‘‘మీతో కూడము అన్నవారిని మీరు ఓడించాలి గాని కూడేందుకు వస్తున్న మాకు వశులు కావాలి కదా గోవిందా’’ అన్నారు వారు. ‘‘మా స్త్రీత్వాభిమానాన్ని భంగం చేసి రప్పించుకుని నీవారిగా చేసుకున్న గోవిందా’’ అని సంబోధిస్తున్నారట గోపికలు.

గోపికలు నిన్నటి పాశురంలో అడిగిన వస్తువులు భౌతికమైనవి కావు. సామాన్యమైనవి కావు. సాక్షాత్తూ వాసుదేవుడు ధరించే శంఖ చక్రాలు అంటే శంఖ చక్రధరుడైన వాసుదేవునే వారు కోరుతున్నారని అర్థమైంది. లేకపోతే శంఖ చక్రాలతో పాటు, గరుడ ధ్వజం,పారతంత్ర్యమనే పఱై కోరుతూ మంగళాశాసనాలు చేసేవారు, మహాలక్ష్మి వంటి మంగళదీపాన్ని కావాలంటున్నారు. చాందినీ, ఆసనం, పడక అని రకరకాలుగా అమరే ఆదిశేషుని కోరుకుంటున్నారు. ఇవి సామాన్యులకు అమరేవికావు. అమరులకు కూడా దొరకవు. అంటే అవన్నీ నిరంతరం కలిగి ఉండే వాసుదేవుడే వారికి కావాలని అర్థం. వాసుదేవుడే దుర్లభుడు. వారి అంతరంగం తననే కోరుకుంటున్నదని వాసుదేవుడు గమనించాడు. సరే మీ వ్రతఫలమేమని మీరు అనుకుంటున్నారు అని ఈ పాశురంలో వాసుదేవుడు సూచించడం, వారు వివరించడం తరువాతి పాశురాలలో జరుగుతుంది.

Also read: కంసుని గుండెల్లో నిప్పు ఆ లీల

నేను వెన్నదొంగా అంటున్న నమ్మాళ్వార్

ఆళ్వార్లలో ముఖ్యుడై నమ్మాళ్వార్ తన అనర్హతను చాటుకుంటూ, నీవు ఏడేడు లోకాలు పాలించే సమర్థుడిని నిన్ను నేను వెన్నదొంగా అని పిలిచాను. నీళాదేవిని పొందడానికి ఏడు ఎద్దులను మర్దించిన పౌరుషం కలిగిన వాడా అన్నాను కాని  ఆ అర్హత నాకు లేదు. ఆమాట అన వలసింది నీళాదేవి కాని నేనా. యశోద కాక నిన్ను దొంగ అనగల అర్హత నాకెక్కడిది అంటాడు. కాని శ్రీకృష్ణుడు మీకోసమే నేను ఉన్నది అంటూ ఆదరిస్తాడు.ప్రణయకోపంతో పిలిస్తే రాలేదు కనుక నేను మాట్లాడను అని సత్యభామ, రాధ, అలిగితే అలకతీర్చుతాడు.

దేవుడు లేడనే వారినీ కాదనకు

ఉన్నాడో లేడో అని అనుమానించేవారిని కూడా కాదనడు. పరమాత్ముడు లేనే లేడని తానే దేవుడినని అహంకరించే వారినీ వదిలి పెట్టడు. తనదారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. రావణుడివంటి అహంకారిని కూడా తన పరాక్రమంతో పరాజితుడిని చేస్తాడు. తన శౌర్యాన్ని అంగీకరింపజేస్తాడు. రామ రావణ భీకర యుద్ధంలో రావణుడు సొమ్మసిల్లి పడిపోతే సారథి యుద్ధరంగంనుంచి తప్పించి కాపాడతాడు. మేలుకున్నతరువాత రావణుడు ఇన్నాళ్లకు నన్ను ఎదిరించి నిలిచి నా భుజబలాన్నే పరిహసించే వీరుడు దొరికితే ఆతనితో పోరకుండా పారి వస్తావా అని కోప్పడతాడు. 

తనను నమ్మి వచ్చిన విభీషణుడికి లంకాసామ్రాజ్య పట్టాభిషేకం చేస్తాడు రాముడు, అదీ ఎప్పుడు, ఇంకా తాను సముద్రం దాటకముందే, సేతువు ఆలోచన కూడా రాకముందే, యుద్ధం ఆరంభించకముందే. అదీ ఆయన సౌశీల్యం.  శుకసారణులు రావణ సైన్యంపక్షాన వచ్చిన గూఢచారులు. వారిని విభీషణుడు పట్టుకోగలుగుతాడు. రాముడి ముందు నిలబెడతారు. వారిని శిక్షించకుండా, తనసైనిక బలాన్ని విభీషణుడి సహకారాన్ని తెలియజేసే విధంగా సైనిక వివరాలు తెలుసుకోవడానికి  రాముడు వారికి అనుమతిస్తాడు. వారు రావణుడి దగ్గరకు క్షేమంగా వెళ్లిన తరువాత, రాక్షస రాజుతో, ‘‘రాజా నీవు కాదని వెళ్లగొట్టిన విభీషణుడికి నీవు బ్రతికి ఉండగానే లంకారాజ్యం పట్టాభిషేకం చేసారు ప్రభూ’’ అంటూ రాముని గొప్పదనాన్ని రామదండు బలాన్ని వివరిస్తారు.

పెరుశమ్మానం అంటే

సీతా దేవికి పొందిన సన్మానం వంటి ది కావాలట. ప్రపంచ ప్రఖ్యాతం కావాలి. రామా దశరథుడు పిలుస్తున్నాడని సుమంత్రుడు వస్తే. సహజ సుందరుడైన రాముడు యువరాజు అలంకరణలో ద్విగుణీకృత సుందరుడైనాడని సీత దిష్టి తీస్తూ  ద్వారం బయటకు రాముడు వెళ్లేదాకా వెంట వస్తుంది. ఆ ప్రేమకు మురిసి పోయి నీవు భయపడకు నేను తండ్రి దగ్గరకే వెళ్తున్నాకదా అని తన మెడలో ఉన్న హారాన్ని ఆమెకు ఇచ్చి సన్మానిస్తాడట.

భగవద్భక్తులను అర్చించడం భగవంతుడిని సన్మానించడమే. హరి భక్తులను ఉపేక్షించకూడదు. స్వామి పాదతీర్థం కన్న స్వామిని ఆశ్రయించిన వారి పాద తీర్థం చాలా మిన్న. వారిని అర్చించే విషయంలో జాగరూకులై ఉండాలని రామానుజులు చెబుతారు. శ్రీరాముడి పట్టాభిషేకం సందర్భంలో ఇంద్రుడు వాయుదేవుడిద్వారా ఒక దివ్యమైన హారాన్ని కానుకగా పంపిస్తారు. ముందు తాను ధరించి ఆతరువాత తన మెడనుంచి తీసి ఆయన సీతకు ఇస్తాడు. ఎవరికివ్వాలా అని సీత అటూ ఇటూ చూస్తున్నారట. నీకు చాలా సంతోషం కలిగించిన వారెవరో, ఎవరికి  అలంకరించాలని అనిపిస్తుందో వారికి సమర్పించు అని అంటాడు రాముడు. తనను రాముని కలిపిన ఆచార్యుని వంటి హనుమంతునికి ఆ హారాన్నిచ్చి సన్మానిస్తారు. రామాయణం శరణాగతి శాస్త్రం. హనుమ జీవస్వరూపమైన సీతను దైవానికి కలుపుతాడు. ఆచార్యస్థానంలో ఉన్నాడు.

ముక్తపురుషుడికి విరజదాటిస్తారు, తరువాత అయిదువందల మంది అప్సరసలు వారిని అందంగా అలంకరిస్తారు. ఆభరణాలు ధరింప జేసి స్వామి దగ్గరకు తీసుకువెళ్తారు. స్వామికూడా వారికి ఆభరణాలు అలంకరింప జేయడం లేదా సవరించడం వంటి ఆప్యాయమైన పనులు చేస్తారట. మంచి వస్త్రాలు కట్టిన తరువాత స్వామి చాలా చనువుతో ఈ విధంగా కడితే ఇంకా బాగుంటుంది కదా అని సవరిస్తారట. ఆ విధంగా తమకు అన్నీ చేయాలని గోపికలు గోదా కోరుతున్నారు ఈ పాశురంలో.

గోపికలు నిజంగా ఆ వస్తువులు అడుగుతారా?

గోపికలు 26, 27వ తిరుప్పావై పాశురాలలో అడిగిన వస్తువులు భౌతికమైనవి కావు. సామాన్యమైనవి కావు. సాక్షాత్తూ వాసుదేవుడు ధరించే శంఖ చక్రాలు అంటే శంఖ చక్రధరుడైన వాసుదేవునే వారు కోరుతున్నారని అర్థమైంది. లేకపోతే శంఖ చక్రాలతో పాటు, గరుడ ధ్వజం, పారతంత్ర్యమనే పఱై కోరుతూ మంగళాశాసనాలు చేసేవారు, మహాలక్ష్మి వంటి మంగళదీపాన్ని కావాలంటున్నారు. చాందినీ, ఆసనం, పడక అని రకరకాలుగా అమరే ఆదిశేషుని కోరుకుంటున్నారు. ఇవి సామాన్యులకు అమరేవికావు. అమరులకు కూడా దొరకవు. అంటే అవన్నీ నిరంతరం కలిగి ఉండే వాసుదేవుడే వారికి కావాలని అర్థం. వాసుదేవుడే దుర్లభుడు. వారి అంతరంగం తననే కోరుకుంటున్నదని వాసుదేవుడు గమనించాడు. సరే మీ వ్రతఫలమేమని మీరు అనుకుంటున్నారు అని ఈ పాశురంలో వాసుదేవుడు సూచించడం, వారు వివరించడం ఈ పాశురాలలో జరుగుతుంది.

యామునాచార్యుల ప్రార్థన

 ‘నావంటి అధముడు, తప్పులు చేసిన వాడు, అపవిత్రుడు నీ పరిజనంలో ఉండాలని కోరుకుంటున్నాను. అందుకు నేను తగిన వాడనా’ అని యామునాచార్యులు ప్రార్థించారట. తమ తక్కువతనము చూపి భగవంతుని స్పర్శలేనిదే బతకలేమని చెప్పి దివ్యమంగళ విగ్రహ సౌందర్యారాధన చేయాలి.

సీతకు రాముని సన్మానం

         దశరథుడు సుమంత్రుడి ద్వారా రమ్మని ఆదేశిస్తే సీత ద్వారందాకా వచ్చి మంగళాశాసనం పాడితే, రాముడు తనమెడలో మాల తీసి ఇచ్చి ఆమె పాదాలను పట్టి ఆపి ఇక ఆగు అని ఆపినాడట. అదే సన్మానము తమకూ కావాలని గోపికలు అడుగుతున్నారు. ప్రేయసి అయిన ప్రణయిని పాదములను పట్టడం ప్రియునికి తప్పు కాదు. అది ప్రేమకు చిహ్నం. అటువంటి ప్రేమ కావాలంటున్నారు.

అలక తీర్చే శ్రీకృష్ణుడు

తనపై అలిగిన ప్రేయసులను, గోపికలను, తాత్కాలికంగా విముఖులైన వారిని కూడా దారికి తెచ్చుకుంటాడు కృష్ణుడు. ద్వేషముచేత విముఖులైన వారిని పరాక్రమంతో జయిస్తాడు. ఉదాసీనంగా విముఖులైన వారిని కూడా అనుసరించి తన సౌందర్యముచేత ఆకర్షిస్తాడు. నీతో ఉండతగమని విముఖులయ్యే వారు, ప్రణయకోపంచేత విముఖులయ్యే వారు, అలిగే వారు, స్నేహమూలేక ద్వేషమూ లేక విముఖులయ్యేవారు, ద్వేషము చేత విముఖులయ్యే వారు అందరినీ ఏదో మార్గం ద్వారా జయిస్తాడా పరమాత్మ.


         గోపికలను ఏం కావాలని ఆయన అడుగుతాడు. అప్పడికే వారు శ్రీకృష్ణుని పరివారానికి చెందిన మహాలక్ష్మిని కోరారు, అనంత గరుడులను, ఆళ్వార్లను, శంఖమును తమవైపు తిప్పుకున్నారట. ‘‘మావారిని మీవారిగా చేసుకుని మమ్ములను ఓడించారు. మిమ్ము నేనొడిస్తాను’’. అన్నాడట గోవిందుడు. ‘‘మీతో కూడము అన్నవారిని మీరు ఓడించాలి గాని కూడేందుకు వస్తున్న మాకు వశులు కావాలి కదా గోవిందా’’ అన్నారు వారు. ‘‘మా స్త్రీత్వాభిమానాన్ని భంగం చేసి రప్పించుకుని నీవారిగా చేసుకున్న గోవిందా’’ అని సంబోధిస్తున్నారట గోపికలు.

లోకులు మెచ్చే స్నానం అంటే ఏమిటి?


         లోకులు మెచ్చే సన్మానం కావాలట. శ్రీకృష్ణ సహవాసాన్ని సమాగమాన్ని మించిన సన్మానమేముంటుంది. ఆయనతో కలిసి ఉండడానికే మంచి బట్టలు కట్టుకోవడం, మంచి నగలు పెట్టుకోవడం, కలిసి భోజనం చేయడం కావాలని గోపికలు కోరుకుంటున్నారు. కూచుని ఒకరినొకరు తాకుతూ భోజనం చేయడం ఎంత ఆనందంగా ఉంటుంది?  పండుగలు చేసుకోవడం అంటే అందుకే. ఆప్తులు రక్తసంబంధులు, సోదరులు, మిత్రులు కలిసి కొత్త బట్టలు కట్టుకుని, విశేషంగా వండిన మధుర పదార్థాలు తిని హాయిగా మాట్లాడుకుంటూ కాలం గడపడమే పండుగ. సంక్రాంతి, దసరా, దీపావళి ఇవన్నీ భగవానుని దివ్యలీలలతో జోడించి ఆ మిషతో అందరూ కలిసి భగవంతుడి లీలలు తలచుకుని కలసి ప్రేమను పెంచుకునేందుకే పండుగలన్నీ. కలిసి ఉండడమే పండుగ, భగవంతుడితో కలిసి ఉండడం పెద్ద పండుగ. అదే పెద్ద సన్మానం. అదే భగవత్ సంశ్లేషం. అదే ముక్తి, మోక్షం, పరమపదం. వేదాలు ఉపనిషత్తులు తిరుప్పావై కూడా అదే చెబుతుంది.

ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు, సహవీర్యం కరవావహై

తేజస్వినా వధీ తమస్తు మావిద్విషావహై, ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః

ఒకరినొకరు కాపాడుకుందాం, సంపదను అందరం కలిసి అనుభవిద్దాం.  సాహసాలూ కలిసే చేద్దాం, తేజోవంతులమవుదాం, ద్వేషాలు వదిలేయడం శాంతికి దారి ఈ పవిత్ర వాక్యాల అర్థం.

గోదమ్మ అంతరార్థం ఏమిటి?

         గోపికలు నిజంగాకోరుకున్నవేమిటి? అంతరార్థాలు పరిశీలిస్తే, చేతి ఆభరణమంటే సమాశ్రయణానికి ముందు ఆచార్యులు కట్టుకున్నముంజేతి కంకణం. భుజాభరణాలంటే భుజాలపైన శంఖ చక్ర ముద్రలు. చెవిదుద్దులంటే ఎనిమిది రాళ్ల మండలాకార స్వర్ణాభరణము అంటే అష్టాక్షరీ మంత్రము. రెండు చెవిపూలంటే ద్వయమంత్రము, పాదాభరణము అంటే నాలుగు చరణాల ద్వయమంత్రము. అంటే తిరుమంత్రము (ఓం నమో నారాయణాయ = ఆత్మజ్ఞానము), ద్వయం (శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ అనే రెండు మంత్రాలు =భక్తి), చరమశ్లోకము (సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్ష ఇష్యామి మాశుచః అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన వైరాగ్యము)లను ఈ పాశురంలో అనుసంధానం చేస్తున్నారు.

శరీరాలంకారానికి వస్త్రం ఎంత ముఖ్యమో ఆత్మాలంకారముగా శేషత్వము అంతే. పాలన్నము అంటే భోగ్యము, భోజ్యము, కైంకర్యము. నేయి పారతంత్ర్యము. కైంకర్యము మునిగేంత పారతంత్ర్యము ఉండాలి. పాలు అంటే భగవంతుని కల్యాణగుణాలు, అన్నము అంటే ఆ భగవత్ తత్త్వము. నేయి అంటే భగవంతుని ఎడబాటు క్షణమైనా సహించలేని స్నేహము. ఆ ప్రీతి పొంగి చేతులనుంచి కారిపోవడం అంటే చేయు కర్మ. అంటే కర్మలుచేయడం ద్వారా భగవంతుని పట్ల మనకున్న ప్రేమను చూపడం. కలిసి భుజించడమే భాగవత గోష్టిఅని శ్రీమాన్ శ్రీభాష్య అప్పలాచార్యతమ ప్రవచనంలో వివరించారు.

మరిన్ని అంతరార్థాలు

దీనికే మరొక అర్థం. హస్తాభరణం= అంజలి, భుజకీర్తులు=ఫలాన్ని విడవడం, కర్మనేనే చేశాననే బుద్ధి మరవడం, కర్ణాభరణం= భాగవత ప్రసంగాలు వినడం, చెవిపూలు= ద్వయమంత్రము, పాదాభరణము= భగవత్ భాగవత ఆచార్యసన్నిధికి నడిచి వెళ్లడమే. జిహ్వకు కీర్తన, మనసుకు ధ్యానం, చేతులకు అర్చన, నేత్రములకు చూచుట, ముక్కునకు తులసీధామాన్ని ఆఘ్రాణించడం. గోపికలకు భోజనం అంటే ఈ బ్రహ్మానుభవమే అని ఈ పాశురం ద్వారా గోదాదేవి తెలియజేస్తున్నారు. ఇదీ గోదా గోవింద కీర్తన. గోవిందేతి సదా స్నానం..గోవిందేతి సదా జపం..గోవిందేతి సదా ధ్యానం..సదా గోవిందేతి కీర్తనం. గోవిందం పరమానందం
పెద్దలు చెప్పిన మరొక అర్థం ఇది

పరమాన్నం అంటే? ఈ బియ్యపు కణాలే జీవుడు, దానికి ఉండే పొట్టే శరీరం. జీవుల్ని పండించాలని ప్రకృతి అనే క్షేత్రంలో నాటితే మనకీ శరీరం లభించింది. ధాన్యానికి పైన ఎరుపు రంగులో ఉండే పొర మన అనురాగానికి గుర్తు. ధాన్యాన్ని దంపి పైన ఉండే పొట్టుని తీసివేసినట్లే ఈ జీవుడు శరీరంతో సాగించే యాత్రలో సుఖాలు దుఃఖాలు, కామాలు, క్రోధాలు, లాభాలు, అలాభాలు, జయాలు, అపజయాలు, ఐశ్వర్యాలు, అనైశ్వర్యాలు, జ్ఞానం, అజ్ఞానం ఇవన్నీ దంపి మనల్ని పొట్టు వీడేట్టు చేస్తాయి. ఇక అక్కడి నుండి వీడి యాత్ర సాగుతుంది. తరువాత ధాన్యాన్ని కడిగి వేయించి ఉడికించినట్లే, జీవుడు ఆచరించిన శరణాగతి ఫలితంగా ముక్తి ఇలా లభిస్తుందని ఉపనిషత్తులు తెలుపుతాయని భాగవతోత్తములు చెప్పారు.

నేయి నేస్తం స్నేహం

         బియ్యాన్ని నేతిలో వేయించినట్లే అక్కడ స్నేహంతో వేయిస్తారు. భగవంతుడి కళ్యాణగుణాలు పాలవంటివి, స్వచ్చమైనవి. పాలు పశువుల నుండి వస్తాయి, ఉపనిషత్తులను పశువులని అనుకుంటే ఈ కళ్యాణగుణాలనే పాలలో జీవుడు ఉడకాలి. భగవంతుని సేవచేయాలనే రుచి వీడికుండాలి, తన కళ్యాణగుణాలను ఇవ్వాలనే రుచి ఆయనకుండాలి. ఈ రుచి అనేది అంతటా కల్సి ఉండాలి, పరమాన్నంలో వ్యాపించిన తియ్యదనం అంతటా వ్యాపిస్తుందే ఆ విధంగా అన్నమాట. ఇందులో జీవుడూ భగవంతుడూ కలిసి ఉన్నారా లేదా అన్నట్లుగా కలిసి ఉంటారు. కలిసే ఉంటారు. పరమపదాన్ని పోలిన ఈ పాయసమే పరమాన్నం. పరమానందం. పరమాన్నం దీనికి ప్రతీక. ఆ పరమాన్నాన్ని ఆండాళ్ గోపికలు ఈ పాశురంలో కోరుతున్నట్టు వర్ణించారు.

         జీవుడు భగవంతుణ్ణి చేరటానికి లభించిన వస్త్రమే శరీరం, ఇది పాంచభౌతిక శరీరం, పరమపదానికి వెళ్ళే ముందు, విరజానదిలో సూక్ష్మ శరీరం తొలగి పంచ ఉపషణ్మయ దివ్య విగ్రహం లభిస్తుంది. “అదన్ పిన్నే” వేరే శరీరం లభించిన తరువాత ఇక మాకు కావల్సింది “పాల్ శోఱు మూడనెయ్ పెయ్దు మురంగైవరివార” పరమాన్నం, అదే పరమ పదం. “కూడి ఇరుందు” అందరు కలిసి గోష్టిగా (సమిష్టిగా) తినడానికి, “కుళిరుంద్” ఈ కలయికతో మన ఈ సంసార తాపం అంతా తొలగాలన్నది ఈ పాశుర పరమార్థం.

         జ్ఞాన వైరాగ్యాలను తిరుమంత్రము, ద్వయమంత్రము చరమ మంత్రము అనే మూడు మార్గాల ద్వారా బోధిస్తారు. తిరుమంత్రము ఆత్మస్వరూపాన్ని తెలియజేస్తే, ద్వయము కైంకర్యమునకు ముందు వాడే భక్తి ప్రధానమైంది. చరమం ద్వారా వైరాగ్యాన్ని బోధిస్తుందీ శాసనం.

Also read: ఎందుకీ మంగళాశాసనం, జయము జయములు? మంగళ హారతి ఈ గోదా గీత గోవిందమ్?

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles