Tuesday, January 21, 2025

పసులు పక్షులతోతిని తిరుగుతూ ఉంటాం, ఇవీ మా బతుకులు

28 మొదటి భాగం

తిరుప్పావై – 28

మాడభూషి శ్రీధర్

12 జనవరి 2024

కఱవైగళ్ పిన్ శెన్ఱు కానమ్ శేర్ న్ద్ ఉణ్బోమ్
అఱివొన్ఱు మిల్లాద వాయ్-క్కులత్తు, ఉన్ఱన్నై
ప్పిఱవి పిఱున్దనై పుణ్ణియమ్ యాముడయోమ్
కుఱైవొన్ఱుమిల్లాద గోవిందా, ఉందన్నోడు
ఉఱవేల్ నమక్కు ఇంగొజిక్క వొజియాదు
అఱియాద పిళ్ళైగళోమ్ అంబినాల్, ఉన్ఱన్నై
చ్చిఱు పేర్-అళైత్తనవుం శీఱి యరుళాదే
ఇఱైవా! నీ తారాయ్ పఱై ఏలోర్-ఎంబావాయ్

తెలుగు భావార్థ గీతిక

అడవులందు మేతపశువులకు నేతలము మేము

ఆలమందల వెంట దిరుగు అల్పజీవులమేము

పసులు పక్షులతోడనే మెసలెదము, మెసవెదము,

తెలివి లేమిగల గొల్లలనీవు బుట్టుటే మాభాగ్యమోయి

లోపమేమిలేని లోకాలనాథుడే మాకన్నయ్య అయిన

ఎన్నడెడతెగని కృష్ణ బంధమే మాకెనలేనివరము

మర్యాదలెరుగక ఇన్నాళ్లు చులకనగ పిలిచినాము

అలగక కృష్ణయ్య, ఆశయాల దీర్ప ఆదరించవయ్య

ప్రకృతితో సమాగమమే దైవ సన్నిధానంమాకు

అర్థం

కఱవైగళ్ పిన్ శెన్ఱు = పశువుల వెంట నడిచి,

కానమ్ శేర్ న్ద్ ‌ అడవిలో కలుసుకుని,

ఉణ్బోమ్ ‌= తిని తిరుగుతూ ఉంటాం,

అఱివొన్ఱు మిల్లాద = తెలవేమీలేని పిల్లలం,

వాయ్-క్కులత్తు = యాదవకులంలో, ఉన్ఱన్నై = నిన్ను,

ప్పిఱవి పిఱున్దనై = మా వంశంలో పుట్టిన,పుణ్ణియమ్ = పుణ్యాన్ని,

యాముడయోమ్ =మేం పొందియున్నాము,

కుఱైవొన్ఱుమిల్లాద గోవిందా = లోపమనేదేలేని గోవిందా,

ఉందన్నోడుఱవు = నీతో మా సంబంధం,వేల్ నమక్కు ఇంగు =ఇక్కడ మనకు,

ఒజిక్క ఒజియాదు = పోగొట్టుకుందామన్నా పోయేది కాదు,

అఱియాద పిళ్ళైగళోమ్ = లోకజ్ఞానం లేని పిల్లలం,అంబినాల్ =ప్రేమతో,

ఉన్ఱన్నై=నిన్ను, చ్చిఱు పేర్ అళైత్తనవుం= చిన్నపేరుతోపిలిచినందుకు,

శీఱి యరుళాదే = కోపించి అనుగ్రహించకుండా వదలకు,

ఇఱైవా! నీ తారాయ్ పఱై– = ఓదేవా మేం ఆశించిన ప్రయోజనాన్నిమ్ము,

ఏలోర్-ఎంబావాయ్= అదే మా వ్రతము.

యాదవులు అమాయకులు, ప్రకృతితోనూ, సహజ సిద్ధమైన పశుపక్ష్యాదులతోనూ నిష్కల్మష స్నేహం చేసేవారు, నోరులేని జీవులు, మనను పాలిచ్చి పోషించే తల్లుల వంటి పశువులే సంపద, పశువులే స్నేహితులు. అమ్మ తరువాత మనకు తమ శరీరంలో భాగమైన పాలను పంచుకునేది పశువులే కదా. అవి పశువులా? తల్లులనుకోవలసిందే కదా. ఆ పశువులను మనుషులతో సమానంగా ప్రేమించే అమాయత్వాన్ని మించిన దైవత్వం లేదు. పాడిపశువులను బంధువులగా భావించి సేవించే గొల్లవారికి శారీరక శుచి శుభ్రత తక్కువ అని అనుకుంటారేమో. మాకు ప్రకృతితో సమాగమమే దైవ సన్నిధానం అని పైకి చెప్పడం కూడా రాదు. వారి జీవనంలో అదొక భాగం, అంతే. పశువులకు గడ్డి ఎక్కడ దొరుకుతుందో వెతుక్కుని అక్కడికి పశువులను తోలుకుపోవడం వారి పని, వాటితోనే ఉంటారు వాటితోనే కలిసి తెచ్చుకున్న సద్ధిమూట తింటారు. ఇన్ని లోపాలున్న మాతో ఏ లోపంలేని గోవిందుడు కలిసి తిరుగాడినాడంటే ఎంత ఆనందం, ఎంత అదృష్టం.

Also read: శత్రువులని కూడా జయించే వీరుడు శ్రీకృష్ణుడు

యాదవ కులం పరమ పావనమైంది

యాదవ కులం మొత్తం పరమ పావనమైపోయింది. యుగయుగాల దాకా. కృష్ణుడు యోగులకు కూడా అందనంత ఎత్తున ఉన్నాడని వారికి తెలియదు. తమకు అందుబాటులో తమతో ఉన్న సులభుడనీ తెలియదు. కనుక చిన్ననాటి మిత్రుడిని పిలిచినట్టు, రారా పోరా అని చిన్న చిన్న మాటలతో పిలుచుకున్నాం అంటున్నారు. లౌక్యం తెలియని చిన్న వారమయ్యా, కోపం రాలేదు కదా. చిన్నబుచ్చుకోలేదు కదా. నీతో సహవాసమే, నీతో చెరగని స్నేహమే మాకు తరగని పెన్నిది కన్నయ్యా అంటున్నారు గోల్లవారు గోపికలు, బాలికలు, గోవులు, ఆబాల గోపాలం, అదేమాట, ఇదే ఈ రోజు పాట, గోదమ్మనోట. 

అజ్ఞానులం, దోష పూరితులం

అజ్ఞానులం, దోష పూరితులం, కనుక మనం శ్రీమన్నారాయణుని పొందగలమా అని ఎవరికైనా సందేహాలు కలిగితే, వాటిని పటాపంచలు చేయడానికి ఈ పాశురాన్ని రచించారు గోదమ్మ. మన దోషాలు పోగొట్టగల పరిపూర్ణుడు గోవిందుడు. సులభంగా దొరకడమే అతని లక్షణం. గోవిందుడన్నది ఎంత పెద్ద బిరుదు? దాని ముందు నారాయణ అన్న దెంత చిన్న పేరు? ఆయనతో ఉన్న బంధుత్వం పోయేదేనా?కుటుంబ సభ్యులతో, బంధువులతో తగాదాలు పెట్టుకుని బాంధవ్యాలు తెంచుకోవచ్చునేమో కాని భగవంతుడితో బాంధవ్యం తెంచుకోగలరా ఎవరైనా? సంబంధ జ్ఞానమే అన్ని జ్ఞానాలకన్న గొప్పబంధం. నీ తిరు చరణాలే ఉపాయము ఉపేయమూ. ఇదే శ్రీవైష్ణవ సిద్ధాంతమని గోదాదేవి ఈ పాశురంలో పాడారు. గోదాదేవిలో మనకు జగద్గురువు కనిపిస్తారు. 

ఉపాయాలు రెండు రకాలు, జీయర్ అంతరార్థం

ఉపాయాలు రెండు రకాలు, ఒకటి మనం సాదించాల్సిన కర్మ, జ్ఞానాదులు, ఇక రెండోది, సిద్దమైన ఉన్న పరమాత్మ. అందుకే మనవాళ్ళు కర్మ జ్ఞానాదులపై ఆధారపడిన వాళ్ళు కాదు, నిన్నే ఉపాయంగా కోరుతున్నాం “హే గోవిందా” నిన్నే నమ్మి వచ్చాం అని చెప్పారు. అయితే సిద్దోపాయం కోరిన వారు కూడా ఆరు విషయాలు ఆవిష్కరించాల్సి ఉంటుంది.

అవి ఏమిటంటే

  1. తమంతట తాము ఈ ఫలితాన్ని పొందడానికి ఆర్జించినది ఏమి లేదు అని స్పష్టం చెయ్యాలి.
  2. తమలో ఆ ఫలితాన్ని పొందే యోగ్యతలేమి లేవు కనుక తమ వద్ద లోపం ఉన్నదని స్పష్టం చేయాలి.
  3. ఇక మనల్ని అనుగ్రహించటానికి భగవంతునిలో సమస్త కళ్యాణ గుణ పూర్తి ఉందని అంగీకరించాలి.
  4. ఆయనకీ మనకు విడదీయరాని సంబంధం ఉందని వేదం చెబుతుంది, ఈ విషయం మనకు తెలుసును అని చెప్పాలి.
  5. మన దోషాలని క్షమించమని ప్రార్థించాలి.
  6. వెంటనే వాడి సేవ అనే అనుగ్రహం పొందడానికి మనలోని ఆర్తిని చూపించగలగాలి.
  7. Also read: మాకు నీ నిత్య సాంగత్యమే కావాలి

ఈ ఆరూ లేకుంటే వాడిని చేరే యోగ్యత లేనట్లే!!

గోపికలు ఈ విధంగా అంటున్నారు. మాకై మేం కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి ఇవన్ని ఏమీ ఆర్జించుకోలేదు. ఇవి కావాలంటే అంటే వేదాధ్యయనం చేయాలి, ఒక గురువుని ఆశ్రయించాలి, ఆ గురువు జ్ఞానంచే శీలంచే వృద్దుడై ఉండాలి. అలాంటి గురువు వెంట వెళ్ళితే కదా అవి ప్రాప్తిస్తాయి. మరి మేమేమో కఱవైగళ్ పిన్ శెన్ఱు” పాలిచ్చే పశువుల వెంట నడిచే వాళ్ళం. మా గురువులు పశువులయ్యా. అవి కూడా పాలు ఇస్తేనే మేం పోషిస్తాం. లేకుంటే లేదు.

ఇది కర్మ అని కూడా భావించం, కర్మయోగానికి ఏవో కొన్ని నియమాలు ఉంటాయి.కానమ్ శేర్-నుంద్-ణ్భోమ్”అడవుల వెంట పడి తింటూ తిరిగే వాళ్ళం. ఎలాంటి నియమాలు లేని వాళ్ళం. ఇక మెల్లగా కర్మపై పట్టు తొలగితే కదా జ్ఞానం ఏర్పడేది, ఇక జ్ఞానంలేనప్పుడు భక్తి కలిగే ప్రసక్తే లేదు. మేంఅఱివొన్ఱు మిల్లాద వాయ్-క్కులత్తు”ఎలాంటి జ్ఞానం, భక్తి లేని గొల్ల కులానికి చెందిన వారమయ్యా.మరి స్వామి ఏం లేకుంటే ఎందుకు వచ్చారు అన్నట్టుగా వీళ్ళకేసి చూసాడు. మరి ఇవన్నీ లేని మేం ఎందుకోసం వచ్చామంటే ఉన్ఱన్నై ప్పిఱవి పిఱన్దనై పుణ్ణియమ్ యాముడయోమ్” మాకోసం మమ్మల్ని వెతుక్కుంటూ మా మద్య ఉంటూ మేం పండిచనక్కర లేని ఒక పుణ్యం మావద్ద ఉంది. అది నీవు.

28. రెండో భాగం

శ్రీ భాష్యంఅప్పలాచార్యుల బోధన 

  1. సత్కర్మాభావవిజ్ఞాపనము (భగవంతుని చేరడానికి సాధనంగా నేనే మంచి కర్మా చేయలేదు అని చెప్పుకోవడం)
  2. స్వనికర్షానుసంధానము (అయోగ్యుడనని, తప్పులుచేసానని, అల్సుడనని చెప్పుకోవడం),
  3. ఈశ్వరగుణ పూర్తి (తనకేదయినా పుణ్యం ఉంటే అది భగవంతుడి అనంత కల్యాణ గుణ పరిపూర్ణుడి కరుణే అని నమ్మడం),
  4. సంబంధ జ్ఞానము (మాకే వేరే తెలివేదీ లేదు, శ్రీకృష్ణుడితో విడదీయరాదని సంబంధం తప్ప),
  5. పూర్వాపరాధక్షమాపణము (చేసిన అపచారములకు, ఉపచారభావంతోచేసిన అపచారములకు నీ ఘనత తెలియక నీపట్ల చేసిన తప్పులను మన్నించు),
  6. భగవదేకోపాయత్వ స్వీకారము (నీవు తప్ప మాకు మరొక దారి లేదనినమ్మడం), అనే ఆరు లక్షణాలు మనను భగవంతుడిదరిచేర్చుతాయని గోదమ్మ వివరించారని శ్రీ భాష్యం గారు పేర్కొన్నారు.

“కుఱైవొన్ఱుమిల్లాద గోవిందా” కళ్యాణ గుణ పూర్తి కల వాడివి, ఏలోటు లేని వాడివి మా లోటు తీర్చగలిగే వాడివి గోవిందా. “ఉందన్నో డుఱవేల్ నమక్కు ఇంగొరిక్క వొరియాదు” నీకూ మాకూ ఒక సంబంధం ఉంది, తెంచుకున్నా తొలగేది కాదు. సూర్యుడికి కాంతికి ఉన్న సంబంధం. ఎవరు వద్దు అనుకున్నా తొలగేది కాదు.“అఱియాద పిళ్ళైగళోమ్ అంబినాల్” ఇన్నాళ్ళు తెలియక రక రకాల పేర్లతో పిలిచాం తెలియక, చిన్న పిల్లలం, పట్టించుకుంటారా.“ఉన్ఱన్నై చ్చిఱు పేర్-అళైత్తనవుం” చిన్న పేర్లు అనుకొని పిలిచాం, పొరపాటు చేసాం, నీవు సంపాదించుకున్న గొప్ప పేరు గోవిందా అది మేం ఇప్పుడు తెలుసుకున్నాం. “శీఱియరుళాదే” కోపించక అనుగ్రహించు. “ఇఱైవా! నీ తారాయ్ పఱై” మాకందరికి స్వామివి, మాకు ఏం తెలియదని అనుగ్రహించకుండా ఉండేవు, నీవు నీవాళ్ళను అనుగ్రహిస్తే ఎవరు దూషిస్తారు. అనుగ్రహించమని గోపికలు వేడుకున్నారని జీయర్ స్వామి వారు వివరించారు.


28. మూడో భాగం

శ్రీకృష్ణ గోదా గోపికల సంభాషణం

తెలియక చులకనగ పిలిచాము

సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే మాధవ హే సఖేతి

అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేనవా2పి

శ్రీకృష్ణుని చేత గీతా జ్ఞానాన్ని అందుకున్న తరువాత గాని అర్జునుడికి ఆయన పరమాత్మ తత్వం ఏమిటో అర్థం కాలేదు. అప్పుడు అయ్యో స్నేహితుడిగా భావించి కృష్ణా మాధవా స్నేహితుడా అని ఎన్ని సార్లో నోరుజారాను కదా అని అర్జునుడు బాధ పడ్డాడు. గోదాగోపికలకు గోపాల కృష్ణునికి మధ్య 28వ తిరుప్పావై పాశురంలో సంభాషణ ఈ విధంగా కొనసాగింది, చూడండి.

ఇదీ గోదమ్మ గోపిలకు మధ్య శ్రీకృష్ణ చర్చ

  • గోపికలు, గోద:ఆ విధంగా అర్జునుడు బాధపడినట్టే మేమూ బాధపడుతున్నాం. నీ సౌలభ్యం తెలిపే గోవిందుడి నామం ముందు పరత్వ ప్రకాశమైన నారాయణ నామం ఎంతో చిన్నది. అజ్ఞులకు గోవింద నామం చిన్న అనిపిస్తుంది. కాని సర్వజ్ఞులకు నారాయణ నామ చిన్నగా తోస్తుంది. మేము కూడా ఒకరినొకరు పిచ్చిపిల్లా, చెవిటివా మూగవా అని అనుకున్నాం. అందుకు మాలోమేము క్షమాపణ కోరుకుంటున్నాం. శీరి అరుళాదే ఇఱైవా నీ తారాయ్ పఱై అంటూ సర్వాన్ అశేషతః క్షమస్వ అని శ్రీమద్రామానుజులు ప్రార్థించినట్టు సకల పాపాలను అశేషంగ చేశాం స్వామీ, క్షమించి కటాక్షించాలి శ్రీ కృష్ణా.
  • Also read: దేవుడివైనా సరే బాధ్యత కర్మ వదలకూడదు
  • శ్రీ కృష్ణ: నామీద భక్తి కుదరాలంటే వేల ఏళ్ల పాటు కర్మ భక్తి మార్గాలలో ఒక్కటైనా మీరు అనుష్టించి ఉండాలి కదా.. అదేమైనా ఉందా?
  • గోపికలు: మా తెలివి నడవడికలు చూస్తే కర్మభక్తి మార్గాలలో ఒకటైనా ఉంటుందనే అనుమానం వస్తుందా అసలు. మాకు జ్ఞానం ఎక్కడిది. పుట్టినప్పడినుంచి పశువులే మాకు బంధువులు మిత్రులు. వాటి వెంట అడవులు తిరిగే వాళ్లం.
  • శ్రీ కృష్ణ: అడవుల వెంట తిరిగినా సరే, ఏవైనా పుణ్యక్షేత్రాల్లోనైనా ఉన్నారా, కనీసం ఆ కారణంమీదైనా మీకోరికలు తీర్చవచ్చు.
  • గోపికలు: పశువులకు గడ్డిమేయడానికి ఏది అనుకూలంగా ఉంటే అక్కడ ఆగుతాం. అదే మాకు పుణ్యక్షేత్రం. అయినా అడవుల్లో కర్మయోగాదులు చేయడానికి ఏ సౌకర్యాలుంటాయి. ఆ ప్రసక్తే లేదు.
  • శ్రీకృష్ణ: పోనీ అడవుల్లో వానప్రస్థాశ్రమ ధర్మమైనా పాటించవచ్చుకదా.. ఆ కర్మయోగమైనా ఉందా?
  • గోపికలు: ఎక్కడి వానప్రస్థం. ఆకులు అలమలు తిని శరీరాన్ని కృశింపచేసి తపస్సు చేయడానికి అడవులకు వెళ్ల లేదు. పొట్ట నింపుకోవడానికి తిండి తీసుకుపోయి తినేవాళ్లం. స్నానంలేదు సంధ్య లేదు. అతిధులకు ముందు పెట్టి తినాలన్న నియమాలూ లేవు. తూర్పుకు ఎదురుగా కూచొని తినాలని చెప్పిన వారూ లేరు. చేసే వారూ లేరు. పశువులు కూర్చుంటే మేం కూర్చుంటాం నిలబడితే నిలబడతాం. అవి నడిస్తే మేమూ నడుస్తాం. ఆవులు నెమరు వేయనపుడు కూడా మేం మేస్తూ ఉంటాం. ఎంగిలని, తినకూడదని, పులిసిందనే ఆంక్షలేమీ లేవు. ఇదే కర్మయోగం అనుకుంటే.. అనుకోవచ్చు.
  • శ్రీ కృష్ణ: కర్మ ఏం చేస్తేనేం. అందులో కూడా జ్ఞానయోగం అనుష్టించవచ్చుకదా. మాంసం అమ్ముకునే ధర్మవ్యాధుడు గొప్పజ్ఞాని కాలేదా? మీరు ఆవులను రక్షించిన వారు కదా, నగరంలో ఉండే విదురుడు జ్ఞానాధికుడైతే మీరెందుకు కాకూడదు. మైత్రేయి, శ్రమణి మొదలైన అమ్మాయిలు మంచి జ్ఞానులుగా కీర్తి నొందలేదా. మీరు జ్ఞానయోగాన్ని అవలంబించవచ్చు కదా.
  • గోపికలు: మాకు వివేకం ఉంటే కదా జ్ఞానయోగం. మాకూ జ్ఞానయోగానికి మధ్య సముద్రానికి పర్వతానికి ఉన్నంత తేడా ఉంది.
    • శ్రీ కృష్ణ: సరే జ్ఞానులు వివేకవంతులూ కూడా ఇదే అంటుంటారు. ఇప్పుడు మీలో జ్ఞాన భక్తులు లేకున్నా ఇక ముందు రారని ఎలా అంటారు?
    • గోపికలు: మాకుల పరిస్థితులన్నీ చూస్తే ఎప్పడికైనా వివేకం వస్తుందని ఎవరైనా అనుకుంటారా? భక్తులమై, సర్వజ్ఞులమై మిమ్ము ఆశ్రయించగల సమర్థత లేదు. నీవు తప్ప మరో ఉపాయమే మాకు లేదు. కలలో కూడా తోచదు.
  • శ్రీ కృష్ణ: కర్మ లేదు, జ్ఞానంలేదు, భక్తి లేదు. అయితే ఇక మిమ్మల్ని వదిలేయవలసిందేనా?
  • గోపికలు: అదేం మాట? ‘‘రామో విగ్రహాన్ ధర్మః’’, ‘‘కృష్ణః ధర్మం సనాతనం, పుణ్యానామపి పుణ్యోసౌ’’ అని కీర్తించబడే పుణ్యమూర్తికి పాలు అన్నం పెట్టి పోషించే మాకు పుణ్యం లేకపోవడమేమిటి? స్వార్జిత ఆస్తి లేకపోతే పిత్రార్జితం లేదంటారేం? సాధ్యమైన పుణ్యం లేదేమో కాని సిద్ధమైన పుణ్యం ఉంది కదా. నిన్ను పొందిన మా పుణ్యం చిన్నదా ఆ భాగ్యాన్ని మించిందేదయిన ఉందా కన్నయ్యా.
  • శ్రీ కృష్ణ: వివేకహినులమంటారు, భాగ్యశాలురమనీ అంటారు. పొంతన లేదు కదా.
  • గోపికలు: అదే మరి మా అవివేకం అంటే..
  • శ్రీకృష్ణ: అయితే మిమ్మల్ని పరిత్యజించవలసిందేకదా.
  • గోపికలు: ఏ కొరతా లేని గోవిందుడివి నీవు. కాని మాజ్ఞానహీనతను తొలగించితేనే కదా నీవు పరిపూర్ణుడవయ్యేది.
  • శ్రీ కృష్ణ: ఓహో అయితే భగవానుడే శక్తి జ్ఞాన పూర్ణతలను ఇస్తాడని మీకు తెలుసన్నమాట. అయితే మీరు స్వరూప జ్ఞానము కలవారన్నమాట.
  • గోపికలు: మీకు స్వరూప జ్ఞానముంటేకదా మాకుండేది. నీవు నిత్యసూరులను వదిలి పరమపదాన్ని వదిలి ఈ గోవులమధ్య ఉంటున్నావు. నీవు నీస్వరూపజ్ఞానం మరిచిపోయావు అది మాభాగ్యం. నీ స్వరూపం నీకు జ్ఞాపకమున్నా, మా స్వరూపం మాకు జ్ఞాపకం ఉన్నానీవు మాకు లభించేవాడివే కాదు. మేము అపరాధాల్లో చక్రవర్తులం. నీవో సర్వస్వతంత్రుడివి. పరతత్వంలో లోపం ఉంది. తనతో సామ్యము పొందిన వారికి సమానులకు గానీ ఆయన దర్శనం లభించదు. ఈలోపం శ్రీకృష్ణా నీకు లేదు. పశుప్రాయులమైన మాతో కలిసి మెలిసి ఉంటావు. మాకోసం పశువులకోసం గోవర్ధనం ఎత్తావు. గోవిందుడివైనావు. మాకే జ్ఞాన కర్మ భక్తి మార్గాలు తెలిస్తే మీకు దూరంగా వెళ్లేవాళ్లం. రాక్షసవధ చేసి అమేయుడవైనా నీకు గోవిందనామమే ప్రీతి. ‘‘సర్వధర్మాన్ పరిత్యజ్య మామ్ ఏకమ్ శరణం వ్రజ’’ అని నీవే చెప్పావు కదా. సాధనాలన్నింటినీ సమూలంగా వదలి నన్ను ఒకణ్ణే ఉపాయంగా స్వీకరించు అని ఆదేశించావు కదా. నీవు పరిపూర్ణుడివి. లోపం లేని వాడివి.
  • శ్రీకృష్ణ: నేను పరిపూర్ణుడినైతే మీ కోరికలు తీర్చాలనే నిర్బంధం ఏదీ లేదు కదా.
  • గోపికలు: నీకు మాకు ఉన్న సంబంధం గమనిస్తే మా అభీష్ఠం తీర్చకుండా ఉండలేవు. అయినా ఈ బంధం పొమ్మంటే పోయేదా? మమ్ము వదలి నీవు లేవు. నిన్నువదలి మేమూ లేము. నీవు దయతో పరిపూర్ణుడవుగానూ మేము దయనీయతా పరిపూర్ణులము గాను ఉన్న ఈ సంబంధాన్ని తొలగించడం వీలు గాదు కదా. నేను మీకు బంధువుగా జన్మించి ఉన్నాను. మీరు వేరుగా భావించనవసరం లేదని నీవే హెచ్చరించావు కదా నీవే అన్యథా భావించవచ్చునా.
  • శ్రీకృష్ణ: నారాయణ అనేది పర్వతాన్ని గుర్తుకు తెచ్చే పేరు. నేను విసుగెత్తి వదిలేసిన పర్వతాన్ని నాకు గుర్తు చేస్తూ నారాయణ నామంతో పిలిచారు. ఇప్పుడేమో ఏలోపమూ లేని గోవిందా అనీ కూడారై వెల్లుంగోవిందా అనీ అంటున్నారు.
  • గోపికలు: మేము తెలియక ఆ పేరుతో పిలిచినందుకు కోపగించకుండా సహించడం నీ కర్తవ్యం కదా శ్రీ కృష్ణా. నీ మీద ఉన్న అమితమైన ప్రేమతో ఆ విధంగా పిలిచాం. ప్రేమకలిగిన వారు పక్కపక్కనే పడుకున్నప్పుడు నిద్రలో ఒకరి కాలు మరొకరికి తగిలితే కోపం తెచ్చుకుంటారా? నారాయణా అనీ నారాయణనే నమక్కే పఱైతరువాన్ అని చిన్న పేరుతో పిలవడం తెలియక చేసిన తప్పు. మన్నించు.
  • శ్రీ కృష్ణ: అది సరే మీరు ఫల సిధ్ధి పొందడానికి తగిన సంబంధం మన ఇద్దరి మధ్య ఉందనుకున్నా మీరూ దానికోసం కొంత ప్రయత్నం చేయాలి కదా.
  • గోపికలు: నీవు ఇవ్వదలచుకోకపోతే మేం ఎన్ని ప్రయత్నాలు చేసి ఏంలాభం? కాళ్లు చేతులు తప్పుచేసాయని వాటిమీద కోపం ప్రకటిస్తారా ఎవరైనా? మేం నీ సొత్తు. సొత్తు మరిచినా స్వామి సొత్తును మరవకూడదు కదా. మీ ఆస్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తే మీరు వదులుకొంటారా? నీ శేషత్వం కాపాడుకోవడానికైనా మాకు పఱై ఇవ్వాలి. అర్థించు వాడి అభిమతాన్ని నెరవేర్చడమే సర్వేశ్వరుని ఈశ్వరత్వానికి ఉచితంగా ఉంటుంది. కనుక స్వామీ నీవే మా అభిమతాన్ని పూర్తి చేయి.

ఈ విధంగా సంభాషణారూపంలో సాగిన తత్వబోధ ఈ పాశురంలో విశదం అవుతుంది

28. నాలుగోభాగం

శ్రీమాన్ కె ఇ లక్ష్మీనరసింహన్

గోవుల గోధూళి సరే మరి మేకధూళి పాపం కదా

‘‘నందగోప సుతం దేవి పతింమే కురుతేయంమే’’అన్నదే మా వ్రతం. మీరు శ్రీకృష్ణుడే భర్తగా ఇవ్వాలని కోరుతున్నారు గోదమ్మతోపాటు గోపికలు. ఈ జీవునికి విరజానదీ స్నానంతరువాత ముక్తిజీవిని వైకుంఠానికి మేళతాళాలతో తీసుకువస్తారు. అర్చిరాజి దారిలో ఎన్నిఈ కష్టాలన్నీ అధిగమించి, సాధించి మోక్షం సంపాదించి మమ్మల్ని పరమాత్ముడి సన్నిధికి పంపిస్తారు. ముక్తి సాధించి వచ్చిన వారి కోసం వైకుంఠంలో ఎదురుచూస్తూ ఉంటారు.

నిజంగా ఎవరు ఏ మొక్కు చేసుకున్నా ఆ మొక్కు తీర్చడానికి పరమాత్ముడు కూడా ఎదురుచూస్తూ ఉంటారట. ఉపవాసం చూసిన వారితోపాటు భగవంతుడు కూడా నిన్నటి దాకా (తిరుప్పావై 27వ పాశురంలో) నెయ్యోనోం వెన్నోయోమ్ అంటే నేయి వెన్న వదిలిపోయి వస్తామనే వ్రతం ఇప్పుడు స్వీకరిస్తారు.

గోదమ్మ మొక్కు తీర్చిన రామానుజుడు

గోదాదేవి కూడా రంగనాథుడి వివాహం కోసం మొక్కు మొక్కుకున్నారు. అదేమంటే వంద గంగాళాల అరిక్కా వడిశల్ పాయసం తిరుమాలిరం శోలై దేవాలయంలో సుందరబాహు పెరుమాళ్ స్వామికి ఇస్తామని ఒప్పుకున్నారట. కాని రంగనాథుడు పెళ్లికి పల్లకీ పంపించడం,తీసుకు వెళ్లడం, తండ్రి పెరియఆళ్వార్ స్వయంగా రంగనాథుడు చూస్తూ ఉండగా గోదాదేవి లీనమైపోవడం భక్తులందరికీ తెలిసిందే కదా. కాని మొక్కు అక్కడే ఆమెకు తీర్చలేపోయారు.

శ్రీమద్ రామానుజ యతిరాజు ఈ తిరుప్పావై ప్రసంగ ప్రవచనం చేస్తూఉండగా, ‘‘అరెరే అమ్మగారు గోదమ్మ తల్లి మొక్కు కింద సుందరబాహు పెరిమాళ్ స్వామికి వంద గంగాళాల  అరిక్కా వడిశర్ పాయసం ఇవ్వలేదు, పదండి వెనక్కి బయలుదేరి ఆ మొక్కు ఇప్పుడే చేద్దాం’’ అని వెంటనే తిరుమాలిరం శోలై దేవాలయానికి ఆ కార్యక్రమం ముగించారు.

అరక్కావడిశర్ పాయసం

ఆ విధంగా శ్రీమద్ రామానుజ యతిరాజు స్వామి అరక్కావడిశర్ వ్రతం పూర్తిచేయడం వల్ల గోదాదేవ ఆయనకు సోదరుడివని గోదాదేవి సంతోషించారు.

మోక్షం సాధించడానికి అర్హతలు మీకు ఏమైనా ఉన్నాయో తెలుసా. వినయంగా ఉండాలి గాని అవునండి మాకు నేను ఇదివరకే అనుకున్నాఅంటారంటే సరే అని వదిలేస్తారు. పెద్దల ఆశీస్సులు ఉండాలని మనకు వేరు గతి లేదని చెప్పుకోవాలి. ఏం పని చేసారని అడిగితే మీరే ఏం చేసారు. కర్మయోగం, జ్ఞాన యోగం ఏమీ తెలియదు. అంటే అదీ రాదు. మీరు ఏం చేయగలమంటే చేస్తాం మీరు చేయండి అంటారు. మాకే యోగమూ లేదు. రాదు, మీకే ఆవిషయం తెలియదో ఏమో చెప్పలేను. లేవంగానే బయటకు వస్తాం, పశువులను మేతకు పంపిస్తాం. గోవులు, గేదెలు, మేకలు కూడా తోలుకుని చూసుకుంటూ ఉంటాం. చూడమంటే చూస్తాం, అటువంటే అన్నీ కర్మలు.

గోవుల గోధూళి సరే మరి మేకధూళి పాపం కదా

గోవులు వెంటనే గోధూళి మాకు పుణ్యం అంటారు నిజమే కాని మేక ధూళి పాపం అంటారు. అదీ తెలియదు అని వివరిస్తూ దిలీప చక్రవర్తి విషయం ఒకటి చెప్పారు. నూరు అశ్వమేధయాగాలు చేస్తూ ఉంటే వందో అశ్వమేధ యాగం సాగుతూ ఉండగా ఇంద్రులు ఎవరికీ కనబడకుండా యాగాశ్వాన్నిమాయం చేసారు.  గోధూళి ద్వారా వశిష్టుడు ఆ అశ్వం ఎక్కడుందో చూడగలిగారు. దిలీపుడి కొడుకు రఘు యువరాజు వారి సాయంతో అశ్వమేధయాగం పూర్తి చేసారమని రఘువంశం కావ్యంలో వివరిస్తారు.

చ్యవన రుషివారి గోధూళీ కథ

గోధూళి మహత్యం గురించి మరో కథ చెప్పారు. చ్యవన రుషి గంగాయమున నదీజలాలలో 12 ఏళ్లదాకా తపస్సు చేస్తూ ఉంటే నదిలో చేపలను తాకుతూ చూస్తున్నదశలో జాలర్లు పెద్ద వల పట్టుకున్నారు. ఆ వలలో చేపలతో పాటు ఈ చ్యవన రుషిని కూడా పట్టుకున్నారట. జాలర్లు భయపడ్డారు. ‘‘ఫరవాలేదు. నన్నే కాదు నన్ను పట్టుకున్నవిధంగా చేపలను కూడా రక్షించాలని, వదిలించాలని’’ అనుకున్నాడు. దానికి మూల్యం మీకు ఇస్తామంటాడు. నాకేం ఆ విలువ తెలుసు అని అడిగితే విలువ గురించి రాజును ఆ చేపల విలువ ఏదో చెప్పాలని అర్థించారు. మీరే చెప్పండి చ్యవనరుషిని అడిగారట. మీరే చెప్పండి అంటే వేయి మాడలు అన్నాడట. ఆలోచించి చెప్పండి అన్నాడట. పది వేలన్నాడు. తరువాత లక్ష, కోటి సగం రాజ్యం ఆ తరువాత పూర్తి రాజ్యం కూడా ఆలోచించి చెప్పండి అంటూనే వెళ్లే వాడు. ఏం చెప్పాలో తెలియక పోయింది.

మేధావికవిజాతుడు

ఆ దేశంలో కవిజాతుడనే ఒక మంచి వివేకవంతుడికి అర్థమైంది. ఈ చ్యవన రుషిని కొనడం సాధ్యం కాదని తెలిసింది. దీని మూల్యం గోవు ఒక్కటి సరైన విలువ అని అంటే అవును అని ఓ గోవు ఇస్తానంటాడు. జాలర్లు ఇంకా తెలివిగా నాకు మాత్రం ఈ గోవు విలువేం తెలుసు అని రుషి గారు అన్నాడట. చివరకు ఆ చేప ను వదిలేసి బతికించి ప్రతి జాలరికి సశరీరంతా స్వర్గం చేయవలసిందని అడిగారనీ, అందువల్ల ఆ జాలర్లుందరికీ స్వర్గం దొరికిందని  భీష్ముడు అనుశాసన పర్వంలో ఈ కథ ద్వారా చెప్పారు.

         సరే మీరు గోధూళి కే ఇంత పుణ్యం వస్తే మంచిదే, మరి పాపం ఇచ్చే మేక తొక్కిన ప్రతి సారి స్నానం చేసేవారెక్కడ పాపం కడుగుకోవాలో అని అడుగుతున్నాడు. ఈ పాపాలకు ఎంత పాపం మేము ఏం చేస్తారు అని గోపికలు అడిగారట.  ఆలెక్కన ప్రతిరోజూ చేసే ఈ పాపాలకు రోజంతా స్సానం చేస్తూ ఉండాలి. అంతపాపులం మాకు వస్తుంది కదా. నడుస్తూ కూడా తింటూ ఉంటా తిరుగుతూ తింటూ ఉంటాం. ఏ శాస్త్రం ప్రకారం ఏం చేయాలో ఎక్కడ చేయాలో కూడా మాకు తెలియదు. మాకూ ఏ కొంతైనా జ్ఞానం కూడా మాకు లేదు మరి.

         శ్రద్ధావానం అంటే మాకే జ్ఞానం కూడా తెలియదు. భగవద్గీత 4-39 లో శ్రీకృష్ణుడు “శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః |జ్ఞానం లబ్ధ్వా పరామ్ శాంతిమచిరేణాధిగచ్ఛతి||” (“ ఇంద్రియాలను జయించి శ్రద్ధాసహనాలతో ఏకాగ్ర సాధన చేసేవాడు జ్ఞానాన్నీ, దానిని పొందిన శీఘ్రకాలంలోనే పరమశాంతినీ పొందుతాడు.”) అన్నాడు సరే మాకేం తెలుసు. మేం భగవంతుడిని సాధించడం మాకు తెలియదు. మాదగ్గరికే దేవుడే రావాలి కాని మేమేం చేయగలం, కనుక మీరే అనుగ్రహించాలి అని శ్రీకృష్ణుని గోపికలు అడిగారట.

దానికి మరో ఉదాహరణ శ్రీరాముడి అనుగ్రహం అని చెప్పారు. నీకోసం రోజూ కొన్నేళ్లు ఎదురుచూసాం. మా మతంగ రుషి గురువు గారు శ్రీరామలక్ష్మణులు చూసి వెళ్లిపోతామన్నారు. అందుకు గురువుగారినే అడిగారే కాని మరే పనీ చేయలేదు. మాకు ఆ ఆచార్యుడే భగవంతుడు. శబరి వలె, మతంగ రుషి వారి వలె, గోదమ్మ వలె, గోపికల వలె, అమాయకులైన యాదవుల వలె మాకేమీ తెలియదు, కులం లేదు, గుణం తెలియదు. చిన్నచిన్న మాటలు చేసి గోవిందుడినై వాడకి కూడా మామూలుగా గోకులంలో ఆయనతో తిట్టుకొట్టుకున్నా, అర్జునుడి వలె గోవిందుడిని నానారకాలుగా పనిచేయించుకున్నారు, గుర్రాలకుచెందిన పనులన్నీ శ్రీకృష్ణునితో చేయించుకున్నారు. కనుక క్షమించండి, మీకు ఆ పఱై ఏదో మాకిస్తామని చెప్పినవన్నీ చెప్పండీ స్వామీ అని గోపికలు అన్నారని, టిటిడి వక్త శ్రీమాన్ కె ఇ లక్ష్మీనరసింహన్ అని ఇద్దరు తిరుమల శ్రీశ్రీశ్రీ జీయర్ స్వాములు తిరుమల జీయర్ మఠం సన్నధిలో తిరుప్పావై గోష్టి నిర్వహించిన ఈ 28వ పాశురంలో వివరించారు.

Also read: ఎన్నోకావాలనేది నెపం, నిజం పరమాత్ముడే కావాలి

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles