- ఇటు రష్యాతోనూ, అటు అమెరికాతోనూ ఆచితూచి వ్యవహరించాలి
- ఏ విదేశంపైనా ఎక్కువగా ఆధారపడటం శ్రేయస్కరం కాదు
భారత్ -అమెరికా సమిష్టిగా డ్రోన్లను రూపొందించనున్నాయని ఆ దేశ రక్షణ శాఖ ప్రతినిధులు తాజాగా వెల్లడించారు. చైనాకు చెక్ పెట్టేందుకే ఇదంతా అంటూ చెప్పుకొచ్చారు. అమెరికా రక్షణ శాఖ ఇండో -పసిఫిక్ భద్రతా విభాగం అసిస్టెంట్ డిఫెన్స్ సెక్రటరీ ఎలీ రాటర్న్ మీడియా ముందు ఈ అంశాలన్నీ వివరించారు. భారత్ దేశానికి తయారుచేయడమే కాక, మిగిలిన దేశాలకు ఎగుమతి చేసే విధంగా మా సహకారం ఉంటుందని అమెరికా అంటోంది. సహ రూపకల్పన, సహ నిర్మాణంతో పాటు రక్షణ శాఖను స్వంతంత్రంగా ఆధునీకరించుకునేందుకు భారత్ కు సంపూర్ణంగా మద్దతు ఇస్తామని అమెరికా చెబుతోంది. డ్రోన్లు,యాంటీ డ్రోన్ల నిర్మాణంతో పాటు భారీ ఆయుధాలను కూడా కలిసి నిర్మించే ఆలోచనలు తమకు ఉన్నట్లు అమెరికా అంటోంది. మానవ రహిత విమానాల రూపకల్పనకు సంబంధించిన ఒప్పందంపై ఇటీవలే ఇరుదేశాలు సంతకాలు చేసుకున్నాయి. ఈ నెల మొదటి వారంలోనే ఇరు దేశాల ఉన్నతాధికారుల మధ్య ఉన్నత స్థాయి సమావేశం కూడా జరిగింది. ఇవన్నీ మంచి పరిణామాలే. మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయాం. అభివృద్ధి చెందిన దేశంగా సత్వరమే ఎదగాల్సిన చారిత్రక అవసరం కూడా ఉంది.
Also read: రక్తపోటు నియంత్రణలో భారత్ మేటి!
ప్రపంచంలో అన్నింటా తమ ఆధిపత్యాన్ని చూపించుకోడానికి, వివిధ రంగాల్లో తమ సామ్రాజ్యాలను విస్తరించుకోడానికి పెద్ద దేశాలన్నీ పెద్ద ఎత్తున తాపత్రయ పడుతున్నాయి. వాటిల్లో అమెరికా, చైనా ప్రధానమైనవి. అమెరికా ఇప్పటికీ అగ్రరాజ్యంగానే వెలుగొందుతోంది. ఆ స్థానాన్ని ఆక్రమించాలని చైనా శత విధాలా ప్రయత్నం చేస్తోంది. ఉన్న స్థానాన్ని కాపాడుకోడానికి అమెరికా నానా తిప్పలు పడుతోంది. ప్రస్తుతం ఆర్ధిక మాంద్యం భయంతో వణికిపోతున్న దేశాలలో అమెరికా కూడా ఉంది. కరోనా ప్రభావంతో చైనా కూడా బాగా దెబ్బతింది. ముందు ఈ దుష్ప్రభావాల నుంచి, గండాల నుంచి ఈ రెండు పెద్ద దేశాలు కోలుకోవాలి. కరోనా ప్రభావం, మరికొన్ని కారణాల వల్ల భారతదేశం కూడా కొన్ని కష్టాలను ఎదుర్కొంటోంది. ఇక రక్షణ రంగం విషయానికి వస్తే, మనం స్వయం సమృద్ధిని సాధించడం కీలకం. ఈ రంగంలో చాలా వరకూ ఇతర దేశాలపైనే ఆధారపడుతున్నాం. అందులో రష్యా ప్రధానమైంది. పుతిన్ ఏలుబడి లోకి వచ్చిన తర్వాత రష్యా -అమెరికా మధ్య విభేదాలు బాగా పెరిగాయి. రష్యాకు యూరప్ దేశాలతో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ చైనాతో మైత్రి బాగానే సాగింది. ఇప్పుడిప్పుడే కొత్త మాటలు వింటున్నాం. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్ – రష్యా బంధాలు కొంత మెరుగయ్యాయి. రెండు దేశాల మధ్య అగాధం సృష్టించి విడతీయాలని, రక్షణ రంగ సహకారానికి అడ్డుపుల్లలు వేయాలని చైనా గట్టిగానే ప్రయత్నించింది. కొంతవరకూ విజయం సాధించినా, మారిన పరిస్థితుల్లో రష్యా -భారత్ చెలిమికి ప్రస్తుతానికి ఇబ్బంది లేదని అనిపిస్తోంది. చైనా, పాకిస్థాన్ రెండు దేశాలు కలిమిడిగా మనపై కాలుదువ్వుతూనే ఉన్నాయి. యుద్ధ వాతావరణాన్ని కల్పిస్తూనే ఉన్నాయి. మధ్య మధ్యలో చిన్న చిన్న విరామలు తప్ప, ఆ కాష్టం కాలుతూనే ఉంది. ఈ సందర్భంలో రక్షణ రంగ పరంగా, ఆర్ధిక ప్రగతి పరంగా, సంపద సృష్టి పరంగా, బహుముఖ వికాసం పరంగా అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో మనకు ఎన్నో అవసరాలు ఉన్నాయి. జనాభా పరంగా ప్రపంచంలో రెండో స్థానంలో మనం ఉన్నాం. మొదటి స్థానంలో ఉన్న చైనాను సైతం అధిగమించడానికి చేరువలో ఉన్నాం. మానవ వనరులతో పాటు మనకు సహజ వనరులు కూడా పుష్కలంగా ఉన్నాయి. ప్రపంచంలో మనది అతి పెద్ద మార్కెట్. ఈ రహస్యాన్ని పెద్ద దేశాలన్నీ గుర్తించాయి.అందుకే మన వైపు చూస్తున్నాయి. ఈ క్రమంలో మన మార్కెట్ ను మనం సరిగ్గా ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం. అదే సమయంలో అమెరికా వంటి దేశాల సహకారాన్ని అందిపుచ్చుకుంటూ రక్షణ రంగాన్ని ఎన్నో రెట్లు బలోపేతం చేసుకోవాలి. ఈ క్రమంలో అమెరికా పాటిస్తున్న ద్వంద్వనీతి పట్ల అప్రమత్తంగా ఉండడం అత్యంత ముఖ్యం.
Also read: కండగలిగిన కవిరాయడు గురజాడ
ఇటు మనతోనూ – అటు పాకిస్థాన్ తోనూ అమెరికా స్నేహసంబంధాలను నెరపుతూనే ఉంది. ఈ రెండు దేశాలతో అగ్రరాజ్యానికి ఉన్న అవసరాల దృష్ట్యా మిశ్రమ యుద్ధనీతిని అవలంబిస్తోంది. సమాంతరంగా పాకిస్థాన్ తోనూ రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. సహాయ సహకారాలు అందిస్తూనే ఉంది. పాకిస్థాన్ దగ్గర వున్న ఎఫ్ -16 యుద్ధ విమానాలకు అవసరమైన విడి భాగాలు, పరికరాలు అందించేందుకు బైడెన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఒప్పందాల విలువ 45కోట్ల డాలర్లుగా తెలుస్తోంది. అమెరికా -పాకిస్థాన్ మధ్య సాగుతున్న ఈ వ్యవహారాలపై భారత్ పదే పదే అభ్యంతరాలను తెలుపుతున్నా, అమెరికా తన పని తాను చేసుకుంటూ పోతోంది. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు మనతో స్నేహం పెంచుకుంటూనే అనేక సందర్భాల్లో మనల్ని బెదిరించే ప్రయత్నం చేశాడు. కరోనా సమయంలో మందుల ఎగుమతి అంశం అందులో ఒక ఉదాహరణ. ఉక్రెయిన్ – రష్యా యుద్ధ సమయంలో మన వైఖరిపై నేటి అధ్యక్షుడు బైడెన్ కూడా కోపం తెచ్చుకున్నాడు. సహజమైన స్వభావం, ఆర్ధిక ఆధిపత్య అహంకారంతో అగ్రరాజ్యాధినేతలు అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. ఇప్పటి వరకూ జరిగిన చరిత్రను గమనిస్తే ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. దీనిని బట్టి చూస్తే, అమెరికాను మనం పూర్తిగా నమ్మలేం. ఆ దేశాలపై పూర్తిగా ఆధారపడడం కూడా తెలివైన పని కాదు. సందర్భోచితంగా, సమయోచితంగా ప్రవర్తించడమే శరణ్యం. యుద్ధనీతి, రాజనీతిని పునఃలిఖించుకుంటూ సాగడమే వివేకం. మన కౌటిల్యుడి అర్ధశాస్త్రం, చాణుక్యుని రాజనీతి ఎలాగూ ఉన్నాయి కదా.
Also read: ఉన్నత విద్యలో వినూత్న సంస్కరణలు