Tuesday, January 21, 2025

అందరం జ్ఞానం కలిగిన అవివేకులం

నా సంజాయిషీ

                         ———————

                                             లియో టాల్స్టాయ్

తెలుగు అనువాదం:

డా. సి. బి. చంద్ర మోహన్

డా. బి. సత్యవతీ దేవి

                                చాప్టర్ 9

                               ————-

                      My  Confession

                      ————————-

                                              By Leo Tolstoy

ఒక వైరుధ్యం ఏర్పడింది. దాని నుండి నిష్క్రమణకు రెండు దారులు ఉన్నాయి. నేను అనుకున్న హేతువు (కారణం) అంత హేతుబద్ధమైనది కాకపోయి ఉండవచ్చును. (లేదా) నేను హేతుబద్ధం కాదు అనుకున్న దానిలో కొంత హేతుబద్ధత ఉండి ఉండవచ్చును. నా హేతుబద్ధజ్ఞానం యొక్క వాదన మార్గాన్ని పరిశీలించడం మొదలుపెట్టాను.

నా పరిశీలనలో అది పూర్తిగా నిజం అని తేలింది. జీవితం శూన్యం అనే ముగింపు —  అనివార్యం. కానీ దానిలో ఒక తప్పు కనిపెట్టాను. అదేమిటంటే — నా హేతుబద్ధత నా ప్రశ్నకు అనుగుణంగా లేదు. ఆ ప్రశ్న: ” నేనెందుకు బ్రతకాలి? అంటే — భ్రాంతికరమైన, తాత్కాలికమైన జీవితం నుండి —  ఏ నిజమైన, శాశ్వతమైన ఫలితం వస్తుంది? — ఈ అనంత విశ్వంలో అంతమైపోయే ఉనికికి అర్థం ఏమిటి? ” ఆ ప్రశ్నకు సమాధానం కోసం నేను జీవితాన్ని చదివాను.

Also read: అహేతుక జ్ఞానమే విశ్వాసం

అన్ని సాధ్యమైన జీవిత ప్రశ్నల యొక్క సమాధానాలు నన్ను సంతృప్తి పరచలేకపోయాయి ఎందుకంటే — నా ప్రశ్న ముందు చాలా సులభంగా కనపడినా అది కాదనిపించింది. ఆ ప్రశ్న ‘అంతము’  ఐన వాటికి ‘అనంతము’ ఐన వాటికి మధ్య సంబంధం గురించి వివరణను నొక్కి అడిగింది.

నేనడిగాను: ” స్థల కాలాలకు, హేతువుకు ఆవల జీవితానికి అర్థం ఏమిటి?” నేను ఇంకో ప్రశ్నకు సమాధానం ఇచ్చాను. ఆ ప్రశ్న “స్థల కాలాదులలో, హేతువులో నా జీవితార్థం ఏమిటి?” అని. సుదీర్ఘ ఆలోచనా  ప్రయత్నాల తర్వాత నాకు వచ్చిన జవాబు “ఏమీ లేదు” అని.

నా తర్కంలో నేను అంతాన్ని అంతంతోను, అనంతాన్ని అనంతంతోనూ స్థిరంగా పోల్చాను (అదిగాక ఏమీ చేయలేక). ఆ కారణంతో అనివార్యమైన  ముగింపుకు చేరుకున్నాను: శక్తి అంటే శక్తి, పదార్థం — పదార్థమే; సంకల్పం — సంకల్పమే; అనంతం — అనంతమే; శూన్యం —  శూన్యమే. ఇదే చివరకు వచ్చిన ముగింపు. ఇవి గణితంలో జరిగేలాంటిదే. సమీకరణం పరిష్కరించేటప్పుడు మనం ఒక ఐడెంటిటీపై పనిచేస్తాం. అది సహేతుకమే. కానీ సమాధానంలో a–a తో, x — x తో, 0 — 0 తో సమానంగా ఉంటాయి.

 నిజానికి, సైన్సు పరిజ్ఞానం (డె స్కర్ట్ చెప్పినట్లు ఈ జ్ఞానమంతా అన్నిటిపై పూర్తి సందేహంతో ఉంటుంది) విశ్వాసంపై నిలబడిన జ్ఞానాన్ని తిరస్కరించి, సహేతుక సూత్రాలపైన, అనుభవాలపైన నిలబడే జ్ఞానాన్ని నిర్మిస్తుంది. జీవిత ప్రశ్నపై నాకు లభించిన దాని కన్నా ఎక్కువ ఏమీ చెప్పదు: అదేమిటంటే- నిర్వచించలేని సమాధానం. మొదట్లో విజ్ఞానం ఒక అనుకూల సమాధానం ఇచ్చిందనిపించింది ( స్కోపెన్ హైయర్ చెప్పిందే: జీవితానికి అర్థం లేదు. అదొక అనర్థం).

విషయాన్ని తరచి చూస్తే జవాబు  అనుకూలం కాదని అర్థమైంది. అలా అనుకోవడం కేవలం నా భావన మాత్రమే. బ్రాహ్మణుల చేత, సాల్మను, స్కోపెన్ హాయర్ల చేత — గట్టిగా వ్యక్తీకరింపబడిన జవాబు ఏమిటంటే — అది అనిర్వచనీయము (లేక) ఒక ఐడెంటిటీ (గుర్తింపు): థీటా = థీటా , జీవితం శూన్యం. అందుచేత ఆ తాత్విక విజ్ఞానం దేన్నీ తిరస్కరించదు. దానితో ఆ ప్రశ్నకు పరిష్కారం దొరకదు. ఎందుకంటే — దానికి పరిష్కారం నిర్వచింపలేనిది కనుక.

సహేతుక జ్ఞానంలో నా ప్రశ్నకు సమాధానం దొరకదని  నాకు అర్థమైంది. ‘అంతా’ నికీ, ‘అనంతా’ నికీ ఉన్న సంబంధం గురించి కూడా ఆ ప్రశ్నలో వేస్తేనే సరైన సమాధానం లభిస్తుంది. ఎంత  అహేతుకమైనా, వక్రీకరింపబడినా — ‘ విశ్వాసం’ ఇచ్చే సమాధానాలు ‘అంతం — అనంతంల’ సంబంధాన్ని వివరిస్తాయి కాబట్టి (అది లేకుండా పరిష్కారం దొరకదు), ఆ సమాధానాలకు ఒక అనుకూలత ఉంటుంది.

Also read: ఎంతకీ అర్థం కాని జీవితం!

 నేను ఏ రకంగా ప్రశ్న వేసినా గాని ఆ సంబంధం సమాధానంలో కనబడుతుంది.

  ప్రశ్న: నేనెట్లా బ్రతకాలి?

జవాబు: దైవం యొక్క న్యాయాన్ని అనుసరించి.

  ప్రశ్న: నా జీవితం నుండి వచ్చే నిజమైన ఫలితం ఏమిటి?

  జవాబు: శాశ్వతమైన వేదన (లేదా) శాశ్వతమైన ఆనందం

ప్రశ్న: మరణం నశింపచేయని జీవిత పరమార్ధం ఏమిటి?

జవాబు: దైవంలో ఐక్యమవడం: స్వర్గం.

సహేతుక జ్ఞానం ఒక్కటే జ్ఞానము అని తలచిన నాకు — జీవిస్తున్న మానవ కోటి మొత్తానికి వేరే జ్ఞానం ఉన్నదని, అది హేతువు లేని జ్ఞానమని — గుర్తించాల్సి వచ్చింది. అదే ‘ విశ్వాసం ‘

ఆ విశ్వాసమే ఈ మానవకోటి జీవనాన్ని సాధ్యం చేస్తోంది. నాకు  మునుపటి లాగానే విశ్వాసం అనేది హేతు విరుద్ధమే — కానీ అది ఒక్కటే మానవాళి జీవిత ప్రశ్నలకు సమాధానం ఇస్తోంది. తద్వారా జీవించడాన్ని సాధ్యపరుస్తోంది. హేతుబద్ధజ్ఞానం — నన్ను  — జీవితం అర్థం లేనిది అని గుర్తించేటట్లు చేసింది. దానితో నా జీవితం కొనసాగడం నేను ఆగిపోయింది. నన్ను నేను అంతం చేసుకోవాలనే కోరిక కలిగింది. చుట్టూరా మనుషుల్ని పరికిస్తే, వారంతా బాగానే బ్రతుకుతున్నారు. వారికి జీవితార్థం తెలిసినట్లే కనబడుతున్నారు. నేను నాలోకి చూసుకున్నాను. నాకు జీవితానికి అర్థం తెలిసినంతవరకూ బ్రతికాను. జీవించటాన్ని సాధ్యం చేసుకున్నాను.

మిగిలిన దేశాల్లోని ప్రజలను (నా సమకాలీకులను, వారి పూర్వీకులను) చూస్తే నాకు వారిలో కూడా ఇదే కనబడింది. ఎక్కడ జీవితం ఉంటే అక్కడ విశ్వాసం మనిషికి జీవితం గడిపేటట్లు సాధ్యం చేసింది. ఆ విశ్వాసం యొక్క రూపం అన్ని చోట్ల ఉంటుంది. అన్నిచోట్లా ఒకే లాగా ఉంటుంది. ఏ విశ్వాసమైనా గాని, అది ఏ సమాధానం ఇచ్చినా గాని, ఎవరికి ఆ సమాధానం ఇచ్చినా గాని — ప్రతీ సమాధానమూ మనిషి అంతం యొక్క ఉనికికి అనంతమైన అర్థం చెబుతుంది. ఆ అర్థం బాధలు, లేమి (లేదా) మరణం — వీటితో నశించదు. అంటే ‘విశ్వాసం’ లోనే జీవితానికి ఒక అర్థం, సాధ్యమవ్వటం ఉంటాయి. అప్పుడు ఈ ‘విశ్వాసం’  ఏమిటి? నాకు అర్థమైందేమిటంటే —  “విశ్వాసం  కనపడని వాటికి సాక్ష్యం మాత్రమే కాదు,” కనపడని వాటిని బహిరంగపరిచేదీ కాదు. మనిషికి, దేవునికి ఉన్న సంబంధమూ కాదు (ముందు విశ్వాసాన్ని నిర్వచించి తర్వాత దేవుణ్ణి నిర్వచించాలి. అంతేకానీ దేవుని ద్వారా విశ్వాసాన్ని నిర్వచించలేము); అది  ఒక ఒప్పందం మాత్రమే కాదు. అది జీవిత అర్థం గురించిన జ్ఞానం (దేనితోనైతే మనిషి తనకు తాను నాశనం చేసుకోకుండా బ్రతుకుతాడో!) విశ్వాసం జీవితం యొక్క బలం. ఒక మనిషి బ్రతుకుతున్నాడంటే — అతనికి దేనిమీదైనా నమ్మకం ఉండాలి. ఆ నమ్మకమే లేకపోతే అతను బ్రతకలేడు. అతను భ్రమింప చేసే ‘అంతం’ ను చూసి గుర్తించలేకపోతే, ఆ ‘అంతం’  నే నమ్ముతాడు; ఒకవేళ అతడు భ్రాంతికర అంతంను అర్థం చేసుకుంటే, ‘అనంతా’ న్ని నమ్మక తప్పదు. విశ్వాసం లేకుండా మనిషి బ్రతకలేడు.

Also read: శాక్యముని అడిగిన మౌలిక ప్రశ్నలు

నేను పడిన మానసిక శ్రమనంతా ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకున్నాను. చాలా భయం వేసింది. ఇప్పుడు నాకు స్పష్టంగా అనిపించేది ఏమిటంటే — మనిషి బ్రతకాలి అనుకుంటే — అనంతాన్ని చూడకుండా నైనా ఉండాలి (లేదా) అనంతాన్ని అంతాన్ని కలిపే జీవితార్థం యొక్క వివరణ అయినా కావాలి. ఆ వివరణ నాకు ఉండేది; ‘అంతం ‘ లో నమ్మకం ఉంటే ఆ వివరణ అవసరం లేదు. దాన్ని హేతుబుద్ధితో ధ్రువీకరించడం మొదలుపెట్టాను. హేతు జ్ఞానం కాంతిలో నేను ఇంతవరకు ఇచ్చుకున్న వివరణ అంతా తునాతునకలయ్యింది. కానీ ‘అంతం’  ను నమ్మటం మానేసే టైం వచ్చింది. అప్పుడు నేను హేతువు మీద ఆధారపడి, ఆ వివరణ జీవితానికి ఒక అర్థం ఇవ్వగలదేమో అని చూశాను. కానీ ఆ హేతువు పునాదిపై నేనేమీ నిర్మించలేకపోయాను. అత్యుత్తమ మానవ మేధావులతో కలిసి, థీటా తో థీటా సమానం అనే ముగింపుకు వచ్చాను. అది చూసి ఆశ్చర్యపోయాను.

ప్రయోగాత్మక సైన్సుల్లో నాకు సమాధానం కావలసినప్పుడు నేనేం చేస్తున్నాను? నేనెందుకు బ్రతుకుతున్నానో  తెలుసుకోవాలని కోరుకున్నాను. దానికోసం నా చుట్టూరా ఉన్నదంతా చదివాను. దాని మూలంగా నేను చాలా నేర్చుకుని ఉండి ఉండవచ్చు. కానీ నాకు కావాల్సింది నేర్చుకోలేదు.

తాత్విక జ్ఞానంలో సమాధానం కోసం వెతికినప్పుడు నేనేం చేస్తున్నాను? “నేనెందుకు బ్రతుకుతున్నాను?” అనే ప్రశ్నకు నాలాగానే సమాధానం దొరక్క వెతుకులాడే వారి ఆలోచనలు చదువుతున్నాను. స్పష్టంగా, నాకు తెలిసిన దానికన్నా (అంటే ‘ఏమీ తెలియదు’) ఎక్కువ ఏమీ నేర్చుకోలేకపోయాను.

‘నేనేమిటి?’ — అనంతం లో ఒక భాగం. ఆ తక్కువ మాటల్లోనే మొత్తం సమస్య ఉంది.

మానవాళి నిన్నటి నుండే  తనకు తాను ఆ ప్రశ్నను వేసుకుంటోందని అనుకోవడం సాధ్యమా? నాకన్నా ముందు ఆ ప్రశ్న ఎవరూ వేసుకోలేదా? అంత సామాన్యమైన ప్రశ్న ఏ కొంచెం తెలివిగల పిల్లవాడి నాలుక నుంచి అయినా వచ్చి ఉండవచ్చును  కదా!

మనిషి ఆవిర్భవించి నప్పటి నుండి ఆ ప్రశ్న వస్తూనే ఉంది. సహజంగానే ఆ ప్రశ్నకు పరిష్కారం —  ‘అంతం’ ను ‘అంతం’ తోను, ‘అనంతం’ ను  ‘అనంతము’ తోను పోల్చడం సరిపోయేది కాదు. అప్పటినుండి మనిషి  ‘అంతా’ నికి  ‘అనంతా’ నికి సంబంధం వెతికి వ్యక్తీకరించడం మొదలుపెట్టాడు.

‘అంతము’  మరియు ‘అనంతం’ ల మధ్య సర్దుబాటు జరిగినప్పటి నుండి ఈ భావనలన్నీ జీవితానికి ఒక అర్థం సమకూర్చాయి — దైవము అనే భావన, సంకల్పము, మంచితనము . ఈ భావనలన్నీ హేతువాద దృక్పథం యొక్క విమర్శకు నిలబడలేకపోయాయి.

మనం గర్వంతోను, ఆత్మసంతృప్తితోనూ పిల్లల్లాగా, గడియారం ముక్కలుగా చేసి, దాన్నుంచి స్ప్రింగ్ బయటికి లాగి, దానితో ఒక బొమ్మను తయారుచేసి అప్పుడ గడియారం పనిచేయడం లేదని ఆశ్చర్య పోవడం భయానకంగాను, హాస్యాస్పదంగాను ఉంటుంది కదా.

అంతానికి అనంతానికి మధ్య ఉన్న వైరుధ్యం పరిష్కరించడం, మనం బ్రతకడం సాధ్యమయ్యేటట్లు జీవిత ప్రశ్నకు ఒక సమాధానం ఏర్పరచటం ఇవి రెండూ  — అవసరమైనవి మరియు విలువైనవి. మనం అదే పరిష్కారం ప్రతి చోటా, ఎల్లప్పుడూ అన్ని దేశాల ప్రజల్లోనూ కనుగొంటాం. మనిషి జాడలు కనిపించని గత కాలం నుంచి వస్తున్న ఆ పరిష్కారమూ మరలా ఇటువంటి పరిష్కారం దొరకదేమోనన్నంత కష్టమైనదీ – అయిన ఇటువంటి పరిష్కారాన్ని  మరలా అదే ప్రశ్న వేయడానికి (ఆ ప్రశ్న అందరికీ సహజంగా వచ్చేది. ఇంకా జవాబు లేనిది) — ఆషామాషీగా దాన్ని ( ఆ పరిష్కారాన్ని) నాశనం చేస్తున్నాం.

అనంతమైన దైవం, ఆత్మ యొక్క దైవత్వం, దైవంతో మానవ వ్యవహారాల సంబంధం, ఆత్మ యొక్క ఏకత్వము, ఉనికి, మనిషి యొక్క నైతికత — మంచీ చెడూ అనే భావన , —- ఈ

భావనలన్నీ నిగూఢమైన అనంతమైన  మనిషి ఆలోచనలలో రూపుదిద్దుకోబడినాయి. ఈ భావనలే లేకపోతే జీవితము, నేను — ఉనికిలో ఉండం. అయినా, మొత్తం మానవ కోటి శ్రమనంతా త్రోసిపుచ్చుతూ ఈ భావనను  కొత్తగా నా వైపు నుంచి నాకు నేనుగా తయారు చేసుకోవడం కోరుకుంటున్నాను.

Also read: ‘నేనేమిటి?,’ ‘ఈ విశ్వం ఏమిటి?’

అప్పుడు నేను ఆ రకంగా ఆలోచించలేదు. ఈ ఆలోచనల మొలకలు నాలో అప్పటికే ఉన్నాయి. నాకు అర్థమైంది ఏమిటంటే — స్కోపెన్ హాయర్, సాల్మన్ లతో సహా నేను — జ్ఞానం ఉన్నప్పటికీ — అందరం అవివేకులం. జీవితం చెడ్డదని తెలిసి కూడా జీవిస్తూనే ఉంటాం. జీవితం అర్థం లేనిదైతే, నాకు హేతువు చాలా ఇష్టమైనదైతే దానిని నాశనం చేయాలి. దాన్ని ప్రశ్నించడానికి ఎవరూ ఉండరనేది స్పష్టం. రెండోది — ఒకరి తర్కాలన్నీ ఇరుసుతో సంబంధం లేకుండా తిరిగే విషవలయంలో తిరుగుతున్నాయని నాకు అర్థమైంది. మనం ఎంత ప్రయత్నించినా, ఎంత బాగా తర్కించినా గాని మనకు ఆ ప్రశ్నకు సమాధానం దొరకదు; థీటా ఎప్పుడూ థీటా కు సమానమే. కాబట్టి మన మార్గం తప్పై ఉండవచ్చు.

మూడోది — విశ్వాసం ఇచ్చే సమాధానాల్లో చాలా నిగూఢమైన  మానవ జ్ఞానం దాగుందని నాకర్థమైంది. హేతువాదంతో దాన్ని నిరాకరించడానికి నాకు హక్కు లేదు. ఆ సమాధానాలు మాత్రమే జీవిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలవు.

Also read: ఆత్మహత్యవైపు ఆలోచనలు

               ———–  ———–

Dr. C. B. Chandra Mohan
Dr. C. B. Chandra Mohan
మనుషుల్నీ, జీవితాల్నీ, సాహిత్యాన్నీ ప్రేమించేవాళ్ళు మంచి రచయితలు కాగలుగుతారు. ఇన్నిమంచి లక్షణాలూ పుష్కలంగా ఉన్న అరుదైన రచయిత డాక్టర్ సీబీ చంద్రమోహన్. మొబైల్ 9440108149

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles