(సమాలోచన సమావేశం సంక్షిప్త వ్యాఖ్య)
‘భారతీయ సాంస్కృతిక వికాసంలో బౌద్ధం’ ఒక విశిష్ట ప్రయోగం. బౌద్ధం, మార్క్సిజం, అంబేద్కరిజం వంటి ప్రత్యా మ్నాయ సైద్ధాంతిక సామాజిక కార్యాచరణకు ఊతమిచ్చేందుకు, తాత్వికత గురించి చర్చించేందుకు సుమారు నలభై నాలుగు మంది విలక్షణమైన ప్రజాపక్ష ఆలోచనాపరులు స్వచ్చందంగా వచ్చి పాల్గొన్న విలక్షణ సమాలోచన సమావేశం!
ఆహ్వాన కరపత్రం చూసి ఆహా ఓహో అన్న వాళ్ళు అంబేద్కర్, మార్క్స్, బౌద్ధం కోసం చొక్కాలు చించుకునే వాళ్ళూ, వస్తామని మాటిచ్చిన వక్తలూ కూడా కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం వంటి చోట్లకి వేరే కార్యక్రమాలకి వెళ్ళిపోయార ని తెలిసింది. అది వాళ్ళ సంస్కారం. దానికో నమస్కారం పెట్టి ఊరుకోవడం తప్పా చేసేదేం లేదు!
ఐనా సరే, దూరభారాలను కూడా లెక్క చేయకుండా, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వరంగల్, విజయవాడ, తణుకు, కోరుకొండ, జగన్నాథగిరి, జంగా రెడ్డిగూడెం, రావులపాలెం, నవుడుజంక్షన్, కడియం, ముమ్మిడివరం, బొమ్మూరు, పిఠాపురం, దుళ్ళ వంటి పది ప్రాంతాలకు పైబడి మా కార్యక్రమం కోసం వచ్చిన ప్రతి ఒక్కరి నిబద్ధతకి నిర్వాహకుల తరపున పేరుపేరునా మా సలామ్!
బహుజన బౌద్ధ సమాఖ్య సారధ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘమిత్ర ఫౌండేషన్, మైత్రేయి బుద్ద విహార, ప్రశ్న అధ్యయన వేదిక, సహవాసి స్వాభిమాన వేదిక, విపశ్యన కేంద్రం, రాజమహేంద్రి ఆలోచనా వేదిక, సహృదయ మిత్రమండలి, ప్రగతిశీల పాత్రికేయ వేదిక, పర్యావరణ పరిరక్షణ సమాఖ్య, బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వంటి సంస్థల నుండి పాల్గోవడం ఆశ్చర్యకరం!
డా. బి. ఆర్. అంబేద్కర్ బౌద్ధ ధర్మ స్వీకార సందర్భాన్ని పురస్కరించుకొని ప్రచురించిన ‘అడుగుజాడ’ పత్రిక ప్రత్యేక సంచిక, మహా మానవుడు, దార్శనికుడు డా. రామ్ మనోహర్ లోహియా వర్ధంతి సందర్భంగా లోహియా విజ్ఞాన సమితి హైద్రాబాద్ వారు ఇరువురు సోషలిస్టు మహా మహులు మధులి మాయే, మధూ దండావతేల శత జయంతి సందర్భంగా ముద్రించిన “మధుద్వయం” గ్రంథాన్ని ఆవిష్కరించడం జరిగింది !
ఇన్నింటిలోకీ సంతృప్తినిచ్చిన విషయం ఏకవ్యక్తి సైన్యంలా పనిచేసుకు పోతున్న మహోదయ 69వ జన్మ దినోత్సవాన్ని అందరం కలిసి ఆయనకి చిరు అభినందన సత్కారం చేయడం. ఆశ్రమం లో ఉన్న అబ్దుల్ కలాం విగ్రహానికి కూడా జయంతి సందర్భంగా యువత నివాళులు అర్పించడం. ఎటకారాలు, ఏడుపులూ ఎలాగో ఉంటాయ్ కానీ, ఆచరణాత్మకంగా ఒక మహాసంకల్పానికి ప్రతీకగా నిల్చిన మంచి మనిషి కృషిని సమిష్టిగా గుర్తించడమే కదా నిజమైన సంతోషమంటే!
అందులో భాగంగా ఈ మధ్య జరిగిన కార్యక్రమాల్లోకెల్లా నాకు సంతృప్తిని ఇచ్చిన ఈ సమాలోచన సమావేశం గురించిన సంక్షిప్త రిపోర్టు మాత్రమే ఇది. ఇందులో సహకరించిన ప్రతీ వ్యక్తికి పేరుపేరునా అభినందనలు తెలుపుకుంటున్నాను. సమయాభావం వల్ల మాట్లాడే అవకాశం లేకపోయిన మిత్రులకి నిజాయితీగా క్షమాపణలు తెలుపుతూ కొన్ని అమూల్య మైన ఫొటో జ్ఞాపకాలతో ప్రస్తుతానికి ఇలా ఈ చిన్న రైటప్!
(వచ్చిన ఆహుతులు విశాలమైన ఆశ్రమ ప్రాంగణమంతా తిరుగుతూ సందడి చేశారు. మహోదయని ఆశ్రమ చరిత్ర గురించి, మహనీయుల విగ్రహాల స్థాపన నేపథ్యం గురించి ఎన్నో విష యాల్ని ఆసక్తిగా అడిగి తెల్సుకున్నారు. ఆ జ్ఞాపకాల్ని ఫొటోలుగా మల్చుకున్నారు. అను భూతుల్ని ఆత్మీయులకి వీడియో కాల్స్ చేసి మరీ పంచుకున్నారు. మళ్ళీ తప్పని సరిగా మరింతమందిని తీసుకు వస్తామని సంతోషంగా సెలవు తీసికొని వెళ్ళారు. ఆ సంగతులన్నీ మరోసారి!)
– గౌరవ్