Tuesday, November 5, 2024

స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందినప్పుడే పండుగ

మరో సంవత్సరంలో స్వాతంత్య్ర వజ్రోత్సవం జరుపుకోవాల్సిన తరుణం ఆసన్నమవుతుంది. ఈ ఆగస్టు 15 కు 74 నిండి 75లోకి అడుగుపెట్టాం.’ఆజాదీ కా అమృత మహోత్సవం’ పేరున జెండా పండుగను 75 వారాల పాటు అట్టహాసంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి జన – భాగీదారి స్ఫూర్తి అంటున్నారు. అంటే  జాతి జనం మొత్తాన్ని భాగస్వామ్యం చెయ్యడం అన్నమాట. కేంద్ర హోం మంత్రి నేతృత్వంలో 250 మందికి పైగా,రాజకీయ, వ్యాపార ప్రముఖులతో జాతీయ అమలు కమిటీ ఏర్పాటు చేసింది. పెద్దల భాగస్వామ్యమే తప్ప, ప్రజల భాగస్వామ్యం కరువైన కాలంలోనే మనం నడుస్తున్నాం. దేశంలోని ప్రఖ్యాత చారిత్రాత్మక ప్రాంతాలు కూడా ఈ వేడుకకు వేదికలవుతాయని అంటున్నారు. లోకానికి పెద్దగా తెలియని జ్ఞాపికా స్థలాలు ఎన్నో ఉన్నాయి. చరిత్రకెక్కని పెద్దలు ఎందరో ఉన్నారు. వీటన్నిటిని గుర్తించే బాధ్యతను కూడా తలకెత్తుకోవాలి.

Also read: ఈ తీరు మారదా?

గతమెంతొ ఘనకీర్తి

జాతీయవాద స్ఫూర్తితో , కులమతప్రాంతాలకు అతీతంగా ప్రజలందరూ ఒకేతాటిపైకి వచ్చిన గొప్పరోజులు గడచిపోయాయి. తెచ్చిన ఆ నాయకులు కాలగర్భంలో కలిసిపోయారు. ఆ త్యాగాల చరిత్ర పుస్తకాల పుటల్లో పాతవాసన కొడుతోంది. శాంతి -అహింస ఆయుధాలుగానే మనం మన స్వాతంత్ర్యాన్ని తెచ్చుకున్నామని చెప్పుకున్నా, సమరం అంత ప్రశాంతంగా ఏమీ సాగలేదు. ఎందరో దేశభక్తుల రక్తం  చిందింది, స్వేదం మండింది. వందలాది ఎకరాల భూమిని, విలువైన ఆస్తులను, అంతకంటే విలువైన కుటుంబాలను, జీవితాలను త్యాగం చేసి స్వాతంత్య్ర సమరంలోకి దుమికిన ఎందరో వీరుల త్యాగఫలం మన స్వాతంత్య్ర సముపార్జనం. ఈ 74 ఏళ్ళ ప్రయాణాన్ని సమీక్ష చేసుకుంటే, మంచిచెడ్డల, గెలుపుఓటముల, సుఖదుఃఖాల గురుతులెన్నో తలపుల్లోకి వస్తాయి. స్వేచ్ఛ మాటున పోగొట్టుకున్నది ఎక్కువేనని బాధపడే జీవులు ఎందరో తారసపడుతూనే ఉన్నారు. స్వేచ్ఛ ఎవరికి దక్కింది? అనే ప్రశ్నలు లక్షల మెదళ్లను తోలుస్తూనే ఉన్నాయి. అది పెద్దల పాలిట కల్పవృక్షమై, పేదలకు విషవృక్షమై నిలిచిందని బావురుమనే హక్కుల ఉద్యమ నేతల రోదనలు ఇంకా వినపడుతూనే ఉన్నాయి. అక్షరాస్యత, ఆధునికత, సాంకేతికత పెరిగిన సమాజంలో శాంతివీచికలు వీయడం లేదని, ప్రగతి పాటలు వినరావడం లేదని అభ్యుదయవాదులు  ఆవేదన పడుతూనే ఉన్నారు. ఆర్ధిక అభివృద్ధి అద్భుతంగా సాధించామని గొప్పగా చెప్పుకొనే మాటల మాటున, నడమంత్రపు సిరిగాళ్ళు ( నీయోరిచ్) పెరిగారు తప్ప, కటిక పేదరికం ఇంకా దేశాన్ని వీడలేదు.

Also read: రామాలయం సరే, రామరాజ్యం ఎప్పుడు?

విలువలకు దూరమైన రాజకీయం

విలువలు కలిగి, సమాజం విలువ ఎరిగిన మహనీయులు రాజకీయాలకు దూరంగా నిల్చొని, మౌనంగా రోదిస్తున్నారు. ఈ డబ్బు సంచుల ఎన్నికల సమరంలో గెలవలేమని, గెలిచినా  ఈ రాజకీయ క్రీడలో నిలవలేమని వారి భయం. ఆ భయం పెరగడమే తప్ప,తరిగే దారులు కనిపించడం లేదు. ‘గాంధీ పుట్టిన దేశమా ఇది ? నెహ్రు కోరిన సంఘమా ఇది ? సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా ?’ అంటూ సరిగ్గా యాభై ఏళ్ళ క్రితం ఆరుద్ర వాపోయాడు. ‘స్వాతంత్య్రం వచ్చెననీ సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి.’. అని శ్రీశ్రీ అరవైఏళ్ళ క్రితమే హెచ్చరించాడు. ‘వందేమాతర గీతం వరస మారుతున్నది.. తరం మారుతున్నది.. ఆ స్వరం మారుతున్నది’ అంటూ,  ‘ముసిముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది,ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది..’ అని డాక్టర్ సి నారాయణరెడ్డి  పాట అలంబనగా తన మనసులోని మాటలు 1985 లోనే పంచుకున్నారు. ఈ మూడు గీతాలు రాసిన కవులు, కాలం వేరువేరైనా నేటి కాలానికి అవి అచ్చుగుద్దినట్లు సరిపోతాయి.  అవసరాలు మారాయి. అవకాశాలు తరిగాయి.అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ఇంకా అల్లంత దూరంలోనే ఉన్నాం. చైనా మనల్ని దాటుకొని ఎన్నో మైళ్ళు ముందుకు దూసుపోయింది. మన కళ్లెదుటే ఏర్పడిన బంగ్లాదేశ్ మనకంటే మెరుగ్గా ఉంది. మనకంటే చిన్నదేశం పాకిస్తాన్ మనల్ని ఇంకా భయపెడుతూనే ఉంది. అగ్రరాజ్యం అమెరికా అడుగులకు మడుగులొత్తే దశలోనే మనం ఇంకా ఉన్నాం. తాలిబన్ భయాలు మనను వీడడం లేదు. రష్యాపై ఇంకా ఆధారపడాల్సి వస్తోంది. భూతాపం దెబ్బకు మన మహా నగరాలు కనుమరుగయ్యే కాలుష్యం నడుమ జీవిస్తున్నాం. ఇక, కరోనా వేసిన కాటు అంతా ఇంత కాదు. పెగాసస్ పెట్టిన పొగ సామాన్యమైంది కాదు. మనది రైతు భారతం కానీ  మన రైతన్నల హృదయం ఇంకా ద్రవిస్తూనే వుంది. భవిత అగమ్య గోచరంగానే ఉంది. కులమత భేదాలు, భాషాద్వేషాలు ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. ఈ డెబ్భై నాలుగేళ్ళల్లో ఎన్నో ప్రభుత్వాలు మారాయి, పాలకులు మారారు. మారనిది సామాన్యుడి బతుకులే. ప్రజాస్వామ్యం, రాజ్యంగ హక్కులు వాస్తవ జగతిలో వేళ్లూనుకపోతే  సాధించుకున్న స్వాతంత్ర్యానికి అర్ధం లేదు. పూర్వులు చేసిన త్యాగాలకు ఫలం లేదు. ప్రగతి ప్రతిమనిషికి చేరువైనప్పుడే, స్వేచ్ఛ ప్రతిజీవి అనుభవించినప్పుడే, శాంతి సమాజంలో కనిపించినప్పుడే, భారతీయుడు ప్రతి రంగంలో తలఎత్తుకొని నిలబడినప్పుడే అసలైన జెండా పండుగ.

Also read: మోదీపై సై అంటున్న దీదీ

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

1 COMMENT

  1. Workers are creating wealth but they are remaing poor , few rich people are yealding the fruits of indipendence and becoming richest by gripping nationl wealth in our indipendent democratic country our politicians are actively planing to divert the streem of riches to corporates account .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles