భగవద్గీత – 27
మెసెడోనియా రాజైన అలెక్జాండర్ జైత్రయాత్రకు బయలుదేరినప్పుడు తన దేశంలోని గొప్ప తత్త్వవేత్తలలో ఒకడైన డియోజినస్ దగ్గరకు వెడతాడు ఆయన ఉపదేశం పొందుదామన్న ఆశతో.
ఆ సమయంలో ఒక పెద్ద మర్రిచెట్టు క్రింద తనలో తానే ఆనందంగా హాయిగా నవ్వుకుంటూ కాలుమీద కాలేసుకుని దర్జాగా సేదతీరుతున్నాడు ఆ మహాత్ముడు. అలెగ్జాండరు వినయంగా ఆయన దగ్గర నిలుచొని తనకేదైనా ఉపదేశించమని ప్రార్ధిస్తాడు.
Also read: బ్రహ్మము తెలిస్తేనే బ్రహ్మర్షి
అప్పుడు ఆ మహానుభావుడు అడుగుతాడు ‘నీవిప్పుడు ఏం చేయదలచుకున్నావు?’ అని! ‘ముందు పర్షియాను జయిస్తాను’ అని చెపుతాడు అలెగ్జాండర్. ‘ఆ తరువాత?’ అని అడుగుతాడు డియోజినస్. తరువాత ఈజిప్టు, తరువాత మెసపొటేమియా ఇట్లా ఆయన అడగటం ఈయన చెప్పటం ప్రపంచంలోని రాజ్యాలన్నీ అయిపోయేదాకా చెపుతూనే ఉంటాడు అలెక్జాండర్.
‘‘ప్రపంచ విజేత అయిన తరువాత ఏం చేస్తావు?’’ అని అడుగుతాడు డియోజనస్. ‘‘మెసడోనియా తిరిగి వచ్చి హాయిగా విశ్రాంతి తీసుకుంటాను’’ అని చెపుతాడు అలెగ్జాండర్.
ఈ సమాధానం విన్న వెంటనే డియోజినస్ తను పడుకున్న చోటినుంచి కాస్త పక్కకు జరిగి, “దా! నా ప్రక్కన పడుకో. విశ్రాంతి తీసుకోవడానికి నీవు అన్ని రాజ్యాలు జయించి అంత రక్తపాతం సృష్టించాలా?“ అని అంటాడు.
ప్రపంచంలో ఇక జయించడానికి ఏమీలేదు అని అనుకునేంతదాక యుద్ధాలు చేస్తూనే ఉండాలి అని అనుకున్నాడు అలెక్జాండర్. అలానే నేడు కొత్తరకం అలెగ్జాండర్లు బయలుదేరారు.
సంపాదన, సంపాదన, సంపాదన ఒకటే సంపాదన. సంపాదించటమే విజయం అనే దృక్పధం పెరిగిపోయింది నేడు!
Also read: సన్యాసి అంటే ఎవరు? కులం, వర్ణం అంటే ఏమిటి?
అందులోని ఒత్తిళ్ళు, వాటి వల్ల వచ్చే రకరకాల రోగాలు! Life style disorders అని పేరు పెట్టుకున్నాం!
ఒక మనిషికి ఎంతకావాలి?
ఈ ప్రశ్న దాదాపుగా మనమెవ్వరమూ ఇంతవరకూ వేసుకోలేదు అని అనుకుంటున్నా. లక్షాధికారి అయిన లవణమన్నమే కాని మెరుగు బంగారమ్ము మింగపోడు!..
ప్రపంచం అంతా జయించాడు. అన్ని దేశాల సుందరీమణులు, అతిలోక సౌందర్యవతులు తనను వరించి వచ్చారు, అయినా రావణునికి కాంక్షతీరలేదు. ఇంకేదో కావాలి! సీతమ్మను చెరబట్టాడు. చెత్తకుండీలోకి విసిరివేయబడ్డాడు.
నోటి దురుసుతనం ప్రాణాంతకమవుతుంది. తన మేనమామ కొడుకు, తన బంధువు అని చూడకుండా పదిమందిలో కృష్ణుడిని అవమానించి ప్రాణం పోగొట్టుకున్నాడు శిశుపాలుడు.
తన పినతండ్రి పిల్లలు వాళ్ళు , తనదగ్గర లేనిది ఏదో వాళ్ళ దగ్గర ఉన్నది అని అనుక్షణం ఈర్ష్యా అసూయలతో మనసు పాడుచేసుకొని చివరకు వాటికే బలి అయిపోయాడు దుర్యోధనుడు.
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు మనలను ఉన్నచోట ఉండనీయవు.
Also read: అంతా ఆత్మస్వరూపమే!
ధగధగా మెరిసే రాగిచెంబులాంటి మనస్సుకు పట్టే మకిలి ఈ ఆరుభావనలు! ఈ భావనలను యోగసాధన అనే చింతపండుతో నిత్యం తోమాల్సిందే. ఏ ఒక్కక్షణం కూడా బద్ధకించకూడదు.
అందుకే ఆమార్గం ‘‘క్షురస్యధారా నిశితా దురత్యయా దుర్గమ్ పధః’’ అని కఠోపనిషత్తు చెపుతుంది! That path is as sharp as Razor’s edge…
మనిషి తనలో చెలరేగే ప్రతి భావాన్ని నిశితంగా గమనించి ఆ భావం ఎక్కడనుండి పుడుతుందో మూలంలోకి వెళ్లి ఎప్పటికప్పుడు పెరికివేయాలి. లేకపోతే కలుపుమొక్కలు పుడుతూనే ఉంటయి. మనలను మనమే ఉద్ధరించుకోవాలి.
మనకు మనమే శత్రువు! మనకు మనమే మిత్రుడు! అని ఎంత అనునయంగా చెపుతున్నారో పరమాత్మ!
ఉద్ధరేదాత్మనాత్మానామ్ నాత్మనమవసాదయేత్
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః
Also read: ఎవరి జాతకం ఏమిటో ఎలా తెలియాలి?