Sunday, December 22, 2024

చీమకైనా బ్రహ్మకైనా అహంకారం సమానమే

22గోదా గోవింద గీతమ్

అంగణ్ మాజ్ఞాలత్తరశర్ అభిమాన
బజ్ఞ్గమాయ్ నన్దు నిన్ పళ్ళిక్కట్టిల్ కీళే
శజ్ఞ్గమిరుపార్ పోల్ వన్దుతలై ప్పెయ్ దోమ్
కింగిణివాయ్ చ్చెయద తామరప్పూప్పోలే
శెంజ్ఞ్గణ్ శిరిచ్చిరిదే యేమ్మేల్ విళియావో
తింగళు మాదిత్తియను మెళున్దార్పోల్
అజ్ఞ్గణ్ణిరణ్డుం కొండు ఎజ్ఞ్గళ్ మేల్ నోక్కుదియేల్
ఎజ్ఞ్గళ్ మేల్ చాబ మిళన్దేలో రెమ్బావాయ్.

తెలుగు భావార్థ గీతిక

‘విపులాచ పృథ్వి’పై భూములేలెడు రాజులమెల్ల కదలి

పెద్దగుంపుగా వచ్చి నీ పాదపీఠము కింద నిలిచినాము

సింహాసనాహంకారములు వీడి నీవె శరణనికొలిచినాము

చిరుమువ్వ, అరవాయి, అరవిరియు కమలమ్మువోలె

రెండుకన్నుల రవిశశులుఏకకాలన తేజరిల్లినట్టు

వాత్సల్యాన ఎరుపైన ఆ కన్నులరవిచ్చి కాంచవయ్య

 ఆచూపుసోకిన జాలు మాశాపాలు పాపాలు కాలి పోవు

మాయలెరుగని మాకు నీ చూపులే నోముఫలములయ్య

అర్థం:

అమ్ = అందమైన, కణ్ = విశాలము, మా = పెద్దదీ అయిన ఞాలత్తర్ శర్ =ఈ భూమిని పాలించిన, అర్ శర్ = రాజులంతా, అభిమాన భంగమాయ్ =తమఅహంకారం విడిచి, వందు =వచ్చి, నిన్= నీ, పళ్లిక్కట్టిల్ కీజే = మంచం కింద, శఙ్గం =సంఘములుగా, ఇరుప్పార్ పోల్ = దాసులైఉన్నట్టే, వన్దు = వచ్చి తలైప్పెయ్ దోమ్ =మేము కూడా వచ్చి చేరిపోతిమి, కింగిణి =సిరిమువ్వ గజ్జెల వలె, వాయ్ చ్చెయ్ ద = నోరు తెరిచినట్టు, తామరైప్పూప్పోలే = తామర పూవుల వలె, శెమ్ కణ్ = వాత్సల్యచు చేత ఎర్రనైన నేత్రములను, శిణిచ్చిఱిదే = నెమ్మదినెమ్మదిగా కొద్దికొద్దిగా, ఎమ్మేల్ = మాపైన, విజియావో = ప్రసరింపచేయవా, తింగళుం= చంద్రుడూ, అదిత్తియమం= సూర్యుడూ, ఎజన్దార్ పోల్ = ఒకేసారి ఉదయించినట్టు చల్లని కాంతులీనుతూ, ఇరణ్డుం కొండు = రెంటిలోనూ, ఎంగళ్ మేల్ = మాపైన, నొక్కుదియేల్= చూపినట్టయితే, ఎంగళ్ మేల్ = మాపైనున్న, శాపమ్ = పాపములన్నీ నశిస్తాయి, ఏల్ ఓర్ ఎం పావాయ్ = ఇదే మా గొప్ప నోము.

Also read: భగవతం ఇవ్వలేదని పోతన్న మీద రాజద్రోహనేరం మోపిన రాజెవరు?

అంతరార్థం

సుందరమైన విశాలమైన ఈ భూమినేలిన రాజులు తమకంటే గొప్పవారు లేరనే అహంకారం వదులుకుని, తమను జయించిన సార్వభౌముని సింహాసనం కిందకు గుంపులుగుంపులుగా చేరినట్లు, మేము కూడా మా అభిమానాన్నిభంగం చేసుకుని వచ్చిఉన్నాం. చిరుగజ్జె ముఖం వలె, విడియున్న తామరపూవు వలె, వాత్సల్యంతో ఎరుపెక్కిన నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై చూపులను ప్రసరింపజేయి. సూర్య చంద్రులు ఇరువురు ఒకే సారి ఆకాశంలో ఉదయించినట్టున్న నీ రెండు నేత్రాలతో మమ్ము కటాక్షిస్తే మేము అనుభవించక తప్పని శాపములను, కర్మములు కూడూ మమ్మల్ని వీడిపోతాయి అందుకే మా ఈ వ్రతము అని గోపికలు అంటున్నారు.

Also read: శ్రీకృష్ణా మమ్మల్ని రక్షించడానికే అవతరించినావు

విశేషార్థం
చీమకు బ్రహ్మకు కూడా అహంకారం సమంగానే ఉంటుందట. చీమకున్నంతలో చీమ అంతా తనదే ననుకుంటుంది. ‘నేను’ అనుభవిస్తున్నాననీ ‘నేనే’ చేస్తున్నానని అహంభావిస్తుంది. అయితే బ్రహ్మకే లభించని మోక్షం చీమకు ఏ విధంగా లభిస్తుంది? బ్రహ్మ ముందుగా తనకు విశాలమైన సంపద తన వల్లనే ఉందనుకుంటాడు. ఆ సంపదనంతా పరమాత్మకు సమర్పించి మోక్షము పొందాలని కోరుకుంటే, తన అత్యధిక సంపద అంతా సమర్పించడానికి చాలా సమయం పడుతుంది. ఆయన కోరిక ననుసరించి ఫలితంకూడా ఆ విధంగానే ఉంటుంది. ఏమీ లేని సామాన్యుడు ‘‘నాకేమీ లేదు అంతా భగవానుడే’’ అనుకుని నిశ్చింతగా ఉంటాడు. ఇతను ఇచ్చేది ఏమీ లేదు, ఆచరించేదీ ఏమీ లేదు. అంతా ఆయనే అనుకుని అన్నీ ఆయనకే వదిలిన వాడు గనుక భగవంతుడే ఆతని బాధ్యత వహిస్తాడు. అదే శరణాగతి. కనుక వాడు నిశ్చింతగా మోక్షం పొందుతాడు. చీమకే సులువు, సామాన్యుడికే మోక్షం సులువు.ప్రపంచాన్ని రెండేళ్లనుంచి అల్లకల్లోలం చేస్తున్న కోవిడ్ వైరస్ అతి సూక్ష్మజీవి అనుకుంటే దానికెంత అహంకారం ఉండాలి?

Also read: ఔదార్యానికి పరాకాష్ట – పరమాత్ముడు

ఇంత విశాలమైన పృథ్విలో ఓ చిన్న రాజ్యానికి రాజైతే మొత్తం ధరిత్రినే ఏలుతున్నంత గర్వం నెత్తికెక్కుతుంది. పదవి పెరిగినాకొద్దీ అహంకారం అంతకంతకూపెరుగుతూ ఉంటుంది. ఆ పొగరు నశించడం కష్టం. వారిలో కొందరు రాజులు అశాశ్వతమైన ఈ పదవుల హీనత్వాన్ని అర్థం చేసుకుని అహంకారాన్ని వదిలించుకుని నీ రక్షణ కోరి వస్తారు. ఒక్కో రాజు మరింకే రాజుతోనో పరాజితులౌతూ ఉంటాడు. రాజులందరినీ ఓడించగల మహాపరాక్రమశాలివి నీవే కదా అంటూ శ్రీకృష్ణుడి సింహాసనం కిందకు చేరారు ఆ రాజులంతా. రాజ్యాలు అహంకారాలు వదులుకుని వచ్చిన రాజులు మళ్లీ తమకు ఏ హీనమైన పదవులు అంటగడతారో అనే వైరాగ్యంతో నీ శ్రీ చరణాలను ఆశ్రయిస్తున్నారు. మీ రాజ్యాలను మీరు సక్రమంగా పాలిస్తూ ఉండండి అని చెప్పినా నిరాకరించి భగవంతుని సన్నిధానంలోనే గుంపులు గుంపులుగా పడిఉన్నారట. స్వామీ వారి వలెనేమేము కూడా మా స్త్రీత్వాభిమానాన్ని బంధువులను భోగభోగ్యాలను వదులుకని నీ వాకిట నిలిచి ఉన్నాము. వారంతా మీ బాణాలకు గాయపడి ఓడిపోతే మేముం నీ సద్గుణాల ఓడిపోయి ఉన్నాం. మాకు ఏ జ్ఞాని మార్గదర్శకత్వమూ లేదు. జ్ఞానుల ఆచార్యత్వంలో కూడా పొందడం అసాధ్యమైన సర్వోన్నత పదవిని అజ్ఞానులమైన మా గొల్లపిల్లలకు మాకు మీ సన్నిధి లభించడమంటే మాటలా అని వారు ఆశ్చర్య చకితులవుతున్నారు. గోపికలు శత్రువులతో పోలిక తెచ్చుకుని వారి వలె మేమూ నీ శరణు కోరామని అంటే శ్రీ కృష్ణుడు వీరి హృదయాంతరాళములలో ఇంకా ఏముందోనని పరీక్షించాలనుకుంటాడట. అప్పుడు గోపికలు మరోసారి స్వామీ మాకు అన్యథా శరణం నాస్తి. (ప్రత్యామ్నాయం లేదు) ఇది అనన్య గతిత్వం.

Also read: వైష్ణవమతంతో 33 దేవతలెవరు?

దాశరథి రంగాచార్యుల వివరణ

దాశరథి రంగాచార్యులు ‘‘పిడికిలి బిగించి వస్తాడు. చేతులు చాచుకుపోతాడు’’ అంటూ అన్నీ అశాశ్వతం అనే శాశ్వత నియమాన్ని అందంగా చెప్పారు. భూమి చిన్న మట్టి ముద్ద. ఈ మహాసృష్టిలో అది అణువంత: ఈ అణువులో మరింత చిన్న చుక్కంత రాజ్యం కోసం యుధ్దాలు చేస్తున్నారు. గెలుస్తున్నారు అనుభవిస్తున్నారు, అని రాజ్యం వదిలి సుకవి అయిన భర్తృహరి. సుకవితా యద్యస్తిరాజ్యేనకిం? అక్షరాన్ని మించిన అర్థం (సంపద) ఏముంది అంటున్నాడు.  జ్ఞానికి భూమండలం అణువుగా కనిపిస్తుంది. ఎందుకంటే జ్ఞానం భూమండలం కన్న గొప్పది. అజ్ఞానికి తనకున్న అణువంత భూమి అధికారమే మొత్తం భూమండలం అనిపిస్తుంది. అజ్ఞానం అంధకూపం వంటిది. ‘‘కానలేకున్న సింధువు బిందువయ్యే, కాన గల్గిన నా బిందువె సింధువయ్యె’’.  అజ్ఞానులైన అహంకార రాజులు అధికారం కోసం మారణ హోమం చేస్తున్నారు. ప్రజనుచీల్చి హింస విధ్వంసం సృష్టిస్తున్నారు. వారూ కనుమరుగౌతారు, వారి అభిమానాలు భంగమవుతాయి అని గోదమ్మ సుకవి భర్తృహరి మాటను తమిళ పాశురంలో వివరిస్తున్నారు. ఆండాళ్ అమృత భాండాన్ని తిరుప్పావై రూపంలో అందించావు. ప్రతి పాశురం అమృత చషకం, మనముందే ఉంది, కాని మన జ్ఞానం పరిమితం దోసిలి చిన్నది, ఎంత తీసుకోగలం అని దాశరథి ప్రశ్నించారు. అహంకార మమకారాలు తొలగిపోవాలి. తొలగించడానికి స్వామి అనుగ్రహం కావాలి. రాజ్యం స్వచ్ఛందంగా వదులుకున్న వారు రాముడు బుద్ధుడు భరతుడు. రాజ్యాన్ని ఆశ్రయించబోనని పోతన, అన్నమయ్య అహంకారాలను వదిలించుకుని నారాయణుడిని ఆశ్రయించి ఆత్మజ్ఞానం సాధించి చరిత్రలోమిగిలిపోయిన అక్షర సంపన్నులు, మహానుభావులు.

శత్రురాశులు తమ బలాన్ని అభిమానాన్ని కోల్పోయి నీ శరణుజొచ్చినారు, మేము కూడా దేహాత్మాభిమానాలను వదులుకుని భగవంతుని శరణాగతి చేస్తున్నారని ఈ 22వ పాశురంలో ఆండాళ్ వివరిస్తున్నారు.

Also read: దేవతల వలె మేమైనా రాజ్యాలడిగామా?

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles