వైఎస్ షర్మిల బుధవారంనాడు విలేఖరులతో మనసు విప్పి మట్లాడటం తొందరపాటా? పార్టీ పేరు కూడా ప్రకటించకమూదే, రాజకీయాలలో కాలూనకముందే విలేఖరులతో మాట్లాడటం, ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం తెలివైన పనేనా? అప్పుడే అన్ని విషయాలూ విలేఖరులకు చెప్పవలసిన అవసరం ఏమొచ్చింది? ఆచితూచి మాట్లాడే నాయకులకే గౌరవం ఉంటుంది. జయలలితతో తనను పోల్చుకున్న షర్మిల ఆమె లాగా సంయమనం పాటించారా? జయలలిత ఎప్పుడైనా ఇన్ని విషయాలు విలేఖరుల గోష్ఠిలో మాట్లాడారా? ఇప్పుడే అంతగా మాట్లాడవలసిన తొందర ఏముంది?
తెలంగాణలోని విశ్వవిద్యాలయాలనుంచి వచ్చిన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన తర్వాత షర్మిల విలేఖరులతో మాట్లాడారు. విద్యార్థుల మాదిరే తాను కూడా తన కెరీర్ (వృత్తి జీవితం) ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాననీ, విద్యార్థుల ఆశలూ, ఆశయాలూ నెరవేర్చడానికి కృషి చేస్తాననీ హామీ ఇచ్చారు.
Also Read: కేసీఆర్ వ్యూహం లో పీవీ ఓటు బ్యాంక్…?
షర్మిల ప్రత్యేకత:
విద్యార్థులతో మాట్లాడటంలో విశేషం లేదు. యువతరాన్ని ఆకట్టుకోవడానికి ఆమె ప్రయత్నించవలసిందే. ఇప్పుడున్న రాజకీయ నాయకులలో ఆమెకు ఒక ప్రత్యేకత ఉన్నది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ స్వయంశక్తిపైన ఆదారపడి పార్టీ పెట్టుకొని రాజకీయం చేయాలనే ఉత్సాహంతో ఉన్నది. ఒక మహిళ రాజకీయ పార్టీ స్థాపించడం తెలంగాణలో ఇదే ప్రథమం. లోగడ లక్ష్మేపార్వతి ఎన్ టీఆర్ వారసత్వం కోసం జరిగిన పోరులో సొంతపార్టీ పెట్టి 1996 ఎన్నికలలో పోటీ చేశారు. ఓడి పోయిన కొద్ది రోజులలో పార్టీ నీరుకారిపోయింది. షర్మిల విషయం వేరు. ఒక యువతి, వైఎస్ కుమార్తె తెలంగాణలో పార్టీ పెట్టడం అనేది ఆసక్తి కలిగించే అంశం. ఎంతవరకూ విజయం సాధించగలరోనన్న అనుమానాలు ఉండవచ్చును కానీ రాజకీయ పార్టీ పెట్టే హక్కు, అర్హత షర్మిలకు ఉన్నాయనడంలో ఎవ్వరికీ సందేహం లేదు. షర్మిల వంటి యువతి రాజకీయాలలో తలమునకలు కావడమే ఒక ఆకర్షణ. యువతతో కలసిపోగల నాయకురాలు షర్మిల. యువత కూడా బాగానే స్పందించారు.
రకరకాల అనుమానాలూ, విశ్లేషణలూ:
యువతతో మాట్లాడిన తర్వాత విలేఖరులతో మాట్లాడటం, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) పైన విమర్శనాస్త్రాలు సంధించడం ఇప్పుడే అవసరమా? షర్మిల రాజకీయరంగ ప్రవేశం ఫిబ్రవరి 9న ప్రకటించినప్పుడు రకరకాల అనుమానాలు తలెత్తాయి. తాను రాజకీయాలలోకి రావాలసనుకుంటే, అన్నను సవాలు చేయాలనుకుంటే పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలి కానీ తెలంగాణలో ఎందుకు? ఆంధ్రామహిళ వచ్చి తెలంగాణ లో పార్టీ పెట్టడంలో అర్థం ఏముంది? తెలంగాణ సెంటిమెంట్ విపరీతంగా ఉన్న దశలో తగుదునమ్మా అంటూ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ తెలంగాణలో పార్టీ పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుందా? ఆమె పార్టీకి ఎవరు ఓటు వేస్తారు?క్రైస్తవులు వేయవచ్చు. రెడ్లు వేస్తారా? వారంతా కాంగ్రెస్ ను వదిలిపెట్టి షర్మిల పెట్టబోయే పార్టీలో చేరుతారా? ఆ విధంగా చేరితే వారికి తెలంగాణ ప్రజల ఆదరణ లభిస్తుందా?
Also Read: అభిమానులకు షర్మిల ప్రశ్నావళి
వైఎస్ పట్ల సద్భావం ఒక సానుకూలమైన అంశం:
షర్మిల ఆధారపడేది తన తండ్రి వైఎస్ పట్ల తెలంగాణ ప్రజలలో ఇప్పటికీ ఉన్న సుహృద్భావంపైన. అది ఎంత శాతం ఉంది? వైఎస్ 02 సెప్టెటంబర్ 2009న హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందినప్పుడు తట్టుకోలేక గుండె ఆగి మరణించినవారు తెలంగాణలోనూ కూడా ఉన్నారు. వారిని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు కూడా. వైఎస్ మరణించి పదకొండు సంవత్సరాలు అవుతోంది. ఇప్పుడు ఇంకా వైఎస్ పేరు మీద రాజకీయాలు చేస్తే ఫలితం ఉంటుందా? రాజమండ్రి మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెప్పారు. ‘సకలం’ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ, వైఎస్ జీవించి ఉన్నప్పుడు వేరనీ, మృతి చెందిన విధానం కారణంగా వైఎస్ దేవుడైనాడనీ, ఆయనకు సానుభూతి ఓటు ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో సైతం గణనీయంగా ఉంటుందనీ సమాధానం చెప్పారు. వైఎస్ పట్ల సానుభూతి ఉన్నప్పటికీ 2023లో జరగబోయే శాసనసభ ఎన్నికలలో షర్మిల పార్టీ అభ్యర్థుల విజయానికి అవసరమైనన్ని ఓట్లు లభిస్తాయా?
ఎవరో విడిచిన బాణం కాదు:
ఇటువంటి అనేక ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది. షర్మిల విలేఖరుల గోష్ఠిలో మాట్లాడటానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, తాను ఎవరో విడిచిన బాణం అనే అపప్రథను తొలగించడం. తనను కేసీఆర్, జగన్ కలిసి తెలంగాణలో ప్రయోగించారనీ, 2023లో జరగబోయే ఎన్నికలలో పాలకపక్ష వ్యతిరేక ఓట్లను చీల్చడానికి సాధనంగా తన పార్టీని వియోగించాలని కేసీఆర్ పథకం పన్నారనీ, ఆ పథకం ప్రకారం తనను ప్రయోగించారనీ వస్తున్న విశ్లేషణలను షర్మిల గమనించారు. ఇటువంటి విశ్లేషణలను పూర్వపక్షం చేయాలనీ, ఈ విషయంలో ఆమె మౌనంగా ఉంటే తనను కేసీఆర్, జగన్ వదిలిన బాణంగా ప్రజలు భావించే ప్రమాదం ఉందనీ భయపడ్డారు. పైగా తనపైన కేసీఆర్ ఒక్క విమర్శ కూడా చేయడంలేదు. తాను ఆయన తరఫున రాజకీయం చేస్తున్నట్టు ప్రజలు విశ్వసించే అవకాశం ఉన్నది. ఈ అభిప్రాయాన్ని తొలగించడానికి కేసీఆర్ ని సాధ్యమైనంత నిశితంగా విమర్శించడం ఒక్కటే మార్గం. అదే సమయంలో జగన్ కూ, తనకూ పార్టీ పెట్టే విషయంలో విభేదాలు ఉన్నాయని స్పష్టం చేయడం కూడా అవసరం. ఈ రెండు లక్ష్యాలనూ విలేఖరుల సమావేశం ద్వారా స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రజల సంక్షేమాన్ని విస్మరించారనీ, వ్యవసాయ క్షేత్రానికే పరిమితమైనారనీ, తన తండ్రి వైఎస్ విధానాలను కాపీ కొట్టారనీ, ఆరోగ్యశ్రీని నీరుగార్చారనీ ఘాటుగానే విమర్శించారు. ఈ విమర్శలకు ప్రతివిమర్శగా తనదైన శైలిలో కేసీఆర్ సమాధానం ఇవ్వాలి. ఇస్తే షర్మిల లక్ష్యం నెరవేరినట్టే. కేసీఆర్ షర్మిల విమర్శలకు పట్టించుకోకుండా మౌనంగా ఉన్నప్పటికీ షర్మిలకు నష్టం లేదు. తన విమర్శలను సందర్భం వచ్చినప్పుడల్లా కొనసాగిస్తే తాను కేసీఆర్ విడిచిన బాణం కాదని తెలంగాణ ప్రజలకు అర్థం అవుతుంది.
Also Read: ఇంతకీ ఆమె ఎవరు వదిలిన ‘బాణం?’
అవసరమైతే సొదరుడు జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడుతాననీ, పోలవరం నుంచి పోతిరెడ్డిపాడు వరకూ తనకు తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమనీ, తెలంగాణ ప్రయోజనాల కోసం మనస్పూర్తిగా పోరాడుతాననీ స్పష్టం చేయడం ద్వారా తాను తెలంగాణ తరఫున పూర్తిగా నిలబడతాననీ, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు తనకు అనవసరమనీ తెలిజయేశారు.
తెలంగాణ బిడ్డనే:
ఆంధ్రప్రదేశ్ బిడ్డ తెలంగాణ గడ్డమీద పార్టీ ఎట్లా పెడతారనే విమర్శకు కూడా షర్మిల సముచితమైన రీతిలో బలమైన సమాధానం చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, విజయమ్మ హైదరాబాద్ లో కాపురం ఉన్న రోజులలోనే షర్మిలను కన్నారు. షర్మిల భర్త అనీల్ హైదరాబాద్ లోనే పుట్టాడు. వారి సంతానం కూడా హైదరాబాద్ లోనే పుట్టి పెరిగారు. అటువంటి తనను తెలంగాణ బిడ్డ కాదని ఎట్లా అనగలరనే షర్మిల వాదనను తెలంగాణ ప్రజలు అంగీకరించే అవకాశం ఎంతో కొంత ఉంటుంది. అందుకని తన పుట్టుపూర్వోత్తరాల గురించి షర్మిల బుధవారంనాటి విలేఖరుల గోష్ఠిలో చెప్పడం మంచిదే.
కాంగ్రెస్ నాయకులకు సందేశం:
తాను ఎవరో విడిచిన బాణం కాదనీ, తనకూ కేసీఆర్ కూ, జగన్ కూ రాజకీయంగా ఎటువంటి సంబంధాలు లేవనీ, తెలంగాణ ప్రయోజనాలకు కట్టుబడి రాజకీయం చేస్తాననీ, తెలంగాణ కోడలిగా, బిడ్డగా తనకు ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టే అధికారం నూటికి నూరు పాళ్ళూ ఉన్నదనీ స్పష్టం చేయడం షర్మిల విలేఖరుల గోష్టి ద్వారా సాధించిన మొదటి ప్రయోజనం. రెండవ ప్రయోజనం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీకి సంకేతాలు పంపడం. కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తు పై అనుమానాలతో, నిరాశానిస్పృహలతో కాలక్షేపం చేస్తున్న నాయకులు తన పార్టీలో చేరతారని షర్మిల అంచనా. ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గం వారు తనవైపు నడుస్తారని ఆమె భావిస్తున్నారు. వారిలో అందరినీ చేర్చుకోకుండా పలుకు ఉన్నవారినీ, పలుకుబడి ఉన్నవారినీ, మంచిపేరు ఉన్నవారినీ తన పార్టీలోకి ఆహ్వానించాలని ఆమె భావిస్తున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. మరో వైపు బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులకు వల వేసి పట్టుకుంటోంది. హైదరాబాద్ లో శ్రీశైలం, ఆదిలాబాద్ లో పట్టున్న నాయకుడూ కాంగ్రెస్ కు బైబై చెప్పి బీజేపీలో చేరిపోయారు. ఇదే రకంగా బీజేపీ వలసలు కొనసాగుతే తన పార్టీలోకి రావాలనుకున్న కాంగ్రెస్ నాయకులు కూడా బీజేపీలోకి పోయే అవకాశం ఉన్నదని షర్మిల గ్రహించి పార్టీ వ్యవస్థాపనను వేగిరం చేయాలని సంకల్పించారు. అందుకే త్వరలో పార్టీ నెలకొల్పుతాననీ, పార్టీ తరఫున మాట్లాడే ప్రతినిధుల పేర్లు కూడా వెల్లడిస్తాననీ చెప్పారు. కొద్ది వారాలలో పార్టీ పెట్టబోతున్నాననే సంకేతాలు పంపడం ద్వారా బీజేపీ వైపు చూస్తున్న కాంగ్రెస్ వాదులకూ, వైఎస్ అభిమానులకూ షర్మిల సకారాత్మకమైన సంకేతాలు పంపారు.
Also Read: ‘షర్మిల ఫ్యాక్టర్’: కొన్ని మౌలిక భావనలు!
విలేఖరుల గోష్ఠివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నష్టం ఏమీ లేదు. కనుక షర్మిల విలేఖరులతో మాట్లాడటం తొందరపాటు చర్య కాదనీ, బాగా ఆలోచించే ఆ పని చేశారనీ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.