రామాయణమ్ – 181
మాల్యవంతుడు రావణాసురుడి తాత, అతని మంత్రికూడా! ఆయన కూడా నచ్చచెప్పాడు. ‘‘నాయనా, శత్రువు నీకంటే బలవంతుడు. ఇలాంటి సమయాలలో సంధి చేసుకోవాలి అని తెలియని వాడవు కాదు. పైగా నీకున్న వరం దేవదానవులనుండి చావులేనివిధంగా ఉంది. నిన్ను చుట్టుముట్టినవారు మానవయోధులు ఇరువురు, అశేష వానర, ఋక్షజాతి(ఎలుగుబంట్లు), సైన్యబలాలు వారి నుండి నీకు ముప్పు పొంచి ఉన్నది.
Also read: సీతమ్మను రామునికి అప్పగించమని రావణుడికి తల్లి కైకసి హితబోధ
‘‘రాముడు సాధారణ మానవుడు కాదు. సాక్షాత్తు విష్ణువే ఈ రూపంలో నిన్ను తుదముట్టించాలని వచ్చాడని నా అభిప్రాయం. రామునితో సంధిచేసుకో. సీతమ్మను అప్పగించు’’ అని అనునయంగా పలికాడు ….
ఈ మాటలు రావణుడికి నచ్చలేదు. భృకుటి ముడివడింది. కోపం తారస్థాయికి చేరింది ….‘‘తాతా ఏమి హితము ఇది. ఒక మానవమాత్రుడు తన బలగం అంతా శాఖామృగాలు, పైగా తండ్రిచేత వెళ్ళగొట్టబడి అడవులలో కాయకసరులు తిని కాలం గడిపేవాడు నాకు సమ ఉజ్జీనా? నన్ను జయించగలడా? నీవి పిచ్చిమాటలన్నా అయి ఉండాలి లేక నీవు శత్రుపక్షములో అన్నా చేరి ఉండాలి.
Also read: వానరవీరుల వివరాలు తెలుసుకున్న రావణుడు
అంత శ్రమపడి తెచ్చుకున్న అతిలోక సౌందర్యరాశి సీతను ఒక నరాధముడికి భయపడి సమర్పిస్తానా?
‘‘నేను ఎవరికీ లొంగను. నా స్వభావమింతే. ఇక పిచ్చివాగుడు కట్టిపెట్టు’’ అని పరుషముగా రావణుడనగానే మాల్యవంతుడు సిగ్గుతో తలవంచుకొని నిష్క్రమించాడు…..
అంత రావణుడు లంక రక్షణ ఏర్పాట్లు తన మంత్రులతో సుదీర్ఘంగా చర్చించి పటిష్ఠ పరిచాడు
అటు రాముడి మంత్రాంగం సాగుతోంది …
యుద్ధం విషయములో రావణుడి సన్నద్ధత ఎంత?
మన వ్యూహము ఎలా ఉండాలి?
రాఘవుడు వానరయోధులతో కూడి చర్చిస్తున్నాడు.
ఆయన చుట్టూ వానర ప్రముఖులంతా ఆసీనులై ఉన్నారు.
Also read: కోలాహలంగా రామసేతు నిర్మాణం
వారు ..సుగ్రీవుడు ,హనుమంతుడు ,జాంబవంతుడు, మైందుడు, ద్వివిదుడు, నలుడు ,నీలుడు ,పనసుడు, శరభుడు, సుషేణుడు, గజుడు, గవాక్షుడు, కుముదుడు, వానరయువరాజు అంగదుడు, లంకారాజ్యమూర్ధాభిషిక్తుడు విభీషణుడు.
వీరందరి ఆలోచనా ఒకటే. ఏవిధంగా ఎదుర్కోవాలి రావణసేనను ..
విభీషణుడు లేచి, ‘‘రఘురామా, నేను నా నలుగురు మంత్రులను లంకకు పంపాను. వారు అతిరహస్యంగా పక్షి రూపాలలో ఎవరికీ అనుమానము రాకుండా వెళ్లి సకల వివరాలు సేకరించుకు వచ్చారు.
దాని ప్రకారము తూరుపు ద్వారము వద్ద ప్రహస్తుడు మోహరించి ఉన్నాడు.
దక్షిణద్వారము మహోదర మహాపార్శ్వు లచే రక్షింపబడుచున్నది.
పశ్చిమద్వారము ఇంద్రజిత్తు అధీనములో ఉన్నది.
Also read: రావణుడి పనపున సుగ్రీవుడితో శుకుని రాయబారం విఫలం
స్వయముగా రాక్షస సార్వభౌముడు ఉత్తరద్వారం వద్ద నిలచియున్నాడు.
పట్టణ మధ్య భాగమును విరూపాక్షుడు వేయికళ్లతో కాపలా కాయుచున్నాడు.
రావణునికి రెండు కోట్ల కాల్బలమున్నది. ఒక వేయి ఏనుగులు, పదివేల రథములు, ఇరువదివేల గుఱ్ఱములతో పటిష్ఠమైన సైన్యమున్నది. అతను కుబేరుని ఇందులో నాలుగవ వంతు సైన్యముతోనే జయించినాడు.’’
విభీషణుడి వివరణ విన్న వెంటనే తన వ్యూహమును ఎరుకపరచినాడు శ్రీరాముడు.
‘‘తూరుపు దిక్కున ఉన్న ప్రహస్తునిపైకి నీలుడు తన సైన్యముతో దండెత్తవలెను.
దక్షిణ ద్వారము స్వాధీనము చేసుకొనే బాధ్యత యువరాజు అంగదునిది.
హనుమ పడమరలో నిలిచి ఇంద్రజిత్తును ఎదుర్కొనును.
ఇక దుష్ట రావణుని సంగతి నాకు వదిలి వేయండి. అతనిని నేను శిక్షించెదను.
మన సైన్య మధ్య భాగములో సుగ్రీవుడు జాంబవంతుడు విభీషణుడు నిలిచి ఉందురు.
ఇంకొక మాట వానర వీరులెవ్వరూ మనుష్య రూపము ధరించి యుధ్ధము చేయరాదు.
ఎందుకనగా …….’’
Also read: విభీషణుడిని లంకాధిపతిగా చేసిన రాముడు
వూటుకూరు జానకిరామారావు