— డా౹౹ ఎన్. గోపి
యుద్ధం మొత్తం
ఏ పద్యంలోనూ పట్టదు
యుద్ధాన్ని వార్తలుగా చదివితే
మనసుల్ని తట్టదు.
లోకాన్ని కాపాడే పంచభూతాలు
భూతాలై కబళించడమే యుద్ధం.
ఏడు దశాబ్దాల్లో
ఎన్నో యుద్ధాలు చూశాను!
బతుకులు ఛిద్రం ఛిద్రం
అడ్డగోలుగా ప్రాణాల పోకడ
మృత్యు శైథిల్యాల రాకడ.
మొన్న మొన్న
అమెరికా ఇరాక్, వియత్నాం లైనా
ఇవాళ రష్యా ఉక్రెయిన్ లైనా
ఇజ్రాయిల్ పాలస్తీనా లైనా
మిగిలేవి శవాల గుట్టలే!
యుద్ధం ఒక పెట్టుబడి
ప్రాణాల పెట్టుబడి
యుద్ధం ఒక వ్యాపారం
ఆయుధాల వ్యాపారం.
ఒక్క యుద్ధం
చరిత్రను రెండు తరాలను వెనక్కి తీసి కెళ్తుంది.
పైకి కనపడే గాయాల కన్నా
లోపలి గాయాలే చిరస్థాయులు.
యుద్ధంలో హీరోలుండరు
ఇద్దరూ విలన్లే.
ఏ పక్షమూ వహించ లేము
ఇద్దరూ శిక్షార్హులే.
యుద్ధం ఎప్పుడూ
రెండు దృక్పథాల మధ్య జరగదు
రక్తపాత గీతాలతో
ఏమీ వొరగదు.
యుద్ధం బయట నుంచి కాదు
మనసుల్లోంచే పుడుతుంది
మానవ ప్రేమ లోంచే
శాంతి ప్రభవించాలి.
ఆధునిక కాలం
అభివృద్ధికి ఆలవాలం కావాలి
అందరూ
యుద్ధాన్ని అసహ్యించు కోవాలి
గత్యంతరం లేదు.
పాత చరిత్రలను మట్టుపెట్టండి
కొత్త ఇతిహాసాలకు శ్రీకారం చుట్టండి.
Also read: తీరిక
Also read: వఖ్త్