-ఎం. వీరేశ్వరరావు
ఇక స్వరం లో భాస్వరం నింపుకుని
జ్వలించక తప్పదు !
ఇజాల ప్రిజం రంగుల నుండి
బయట పడక తప్పదు
సిద్ధాంత లోచనాల నుండి
చూసే జీవిత కవనాల
గానాలకు
దూరమవ్వక తప్పదు !
కవి అంటే జనం నాలుక మీద నర్తించే వాడే
జనానికి దూరమై గ్రంథాలయాల లో మూలిగే వాడు కాదు !
గతం ఇసుకలో
తల దూర్చే
ఉష్ట్ర పక్షుల రెక్కలు
ఎప్పటికీ ఎగర లేవు
మౌఢ్యం కుడ్యాల లో
కలలు కనే
ఉలూకాలు
రేపటి కాంతిని కాంచ లేవు
మార్పుని అంగీకరించలేని వాడు
జాతి ని మార్చ లేడు
తానూ మారే లేడు
ప్రశ్నలతో పదునెక్కిన
మేధస్సే
విశ్వ శ్రేయస్సు కోరుతుంది !
ప్రశ్నించలేని
వయస్సు
తమస్సు లో మునిగి పోతుంది !
మిత్రమా రా !
కాలానికి
విజ్ఞాన వంతెన వేద్దాం