- చైనా, రష్యా, అమెరికాలతో కుటిల దౌత్యం నెరపుతున్న పాకిస్తాన్
- రెండు దేశాలతో ఒక సారి యుద్ధం వచ్చే ప్రమాదం
- కశ్మీరంపై పాక్. లదాఖ్ పై చైనా కన్ను
దాడులు- ప్రతిదాడులతో సుందర కశ్మీరం మళ్ళీ రగులుతోంది. యుద్ధ వాతావరణం అలుముకుంటోంది. కొత్త బలాన్ని పోగుచేసుకొని ఉగ్రమూక చెలరేగుతోంది. భారత సైన్యం ప్రతిదాడులతో వీరప్రతాపం ప్రదర్శిస్తోంది. ఇస్లామిక్ ఉగ్రవాదం తీవ్రతరమవుతోందని చెప్పడానికి తాజా పరిణామాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
Also read: వంద కోట్ల మందికి టీకాలు
పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఏదో జరుగబోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. భీకర యుద్ధం చేసైనా దురాక్రమణకు గురైన భూభాగాన్ని తిరిగి సొంతం చేసుకొనే దిశగా భారత సైన్యం కదిలే అవకాశాలు సమీప భవిష్యత్తులోనే ఉన్నాయని కొందరు జోస్యం చెబుతున్నారు. ఈ ఆపరేషన్ ను ఆరంభించడానికి ఎక్కువ కాలం పట్టదనీ అంటున్నారు. చైనా, తాలిబాన్, మిగిలిన ఉగ్రమూకల అండతో కశ్మీర్ ను పూర్తిగా ఆక్రమించడానికి పాకిస్తాన్ తన చర్యలను మరింత వేగవంతం చేసే పనిలో ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అవసరమైతే, చైనా మధ్యవర్తిత్వంతో రష్యా సహకారాన్ని కూడా పొందే దిశగానూ పాకిస్తాన్ పావులు కదుపుతోంది. మొత్తంమీద కశ్మీర్ విషయంలో తాడోపేడో తేల్చుకోడానికే రెండు దేశాలు సిద్ధమవుతున్నాయని పరిశీలకుల అభిప్రాయం. రెండు దేశాల వైఖరులు ఇదివరకటి కంటే భిన్నంగా, వేగంగా ఉండే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ సంబంధాల పండితులు అంచనా వేస్తున్నారు. ఈ ఆపరేషన్ లో విజయం ఎవరి వైపు ఉంటుందో ప్రస్తుతానికి అంచనా వేయలేము. అమెరికా మద్దతు భారత్ వైపే ఎక్కువగా ఉన్నట్లు కనిపించినా, ఆ దేశాన్ని పూర్తిగా నమ్మలేము.
Also read: పారదర్శకతకు సరైన రూటు ఈ-ఓటు
పాకిస్తాన్ తో తెగని అమెరికా స్నేహం
అమెరికా -పాకిస్తాన్ మధ్య స్నేహం ఇంకా ముగియలేదు. అనేక సందర్భాల్లో పాకిస్తాన్ నుంచి అమెరికా సహకారాన్ని పొందిందని చరిత్ర చెబుతోంది. అమెరికా నుంచి పాకిస్తాన్ కూడా ఆర్ధిక ప్రయోజనాలను రుచి చూసింది. అఫ్ఘానిస్థాన్ నుంచి సైన్యాన్ని పూర్తిగా నిష్క్రమింపచేయడం అమెరికా చేసిన పెద్ద తప్పు. ఈ వైఖరి వల్ల పలు దేశాలు అమెరికాను అనుమానిస్తున్నాయి. ఈ దుష్ప్రభావాలు మనమీద పడుతున్నాయి. అమెరికాతో భారతదేశం చేస్తున్న స్నేహంలో స్వచ్ఛత ఉంది. పాకిస్తాన్ తీరు అటువంటిది కాదు. అమెరికా తీరు కూడా అంతే. ఆ రెండు దేశాలు పూర్తి అవకాశవాద దృక్పథంతోనే మెలుగుతున్నాయి. ఒకరితో మరొకరికి అవసరాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే భారత్ తోనే అమెరికాకు ఎక్కువ అవసరం ఉంది. వాణిజ్యపరంగానూ, మానవవనరుల పరంగానూ భారతదేశంతో సత్ సంబంధాలను పెంచుకోవడం అమెరికాకు అత్యంత కీలకం. జనాభా పరంగా, మార్కెట్ పరంగా, వనరుల పరంగా భారతదేశం స్థాయి, స్థానం చాలా పెద్దవి. అగ్రరాజ్య స్థానాన్ని ఆక్రమించుకునే దిశగా చైనా దూకుడు పెంచింది. ఇస్లామిక్ దేశాలతో బంధాలను బలోపేతం చేసుకోవడం, అమెరికా వ్యతిరేక దేశాలన్నింటినీ ఏకం చేయడం, ఉగ్రవాదులకు అండదండలు అందించడం, కొన్ని దేశాలకు ఆర్ధిక సహాయాలు చెయ్యడం మొదలైన వ్యూహాలతో చైనా ముందుకు వెళ్తోంది. చైనా, అమెరికా తీరుతెన్నులను, అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ రెండు దేశాలతో పాకిస్తాన్ చాలా తెలివిగా దౌత్యం నడుపుతోంది. ఈ కుటిల రాజనీతిలో మనం వెనకబడ్డామనే అనుకోవాలి. మన బంధాలలో పవిత్రత, రాజనీతి, యుద్ధనీతిలో నీతి ఉన్నాయి.
Also read: తెరపైకి మళ్ళీ శశికళ
ప్రపంచ చిత్రపటం మారుతుందా?
ప్రపంచ చిత్రపటం మారబోతోంది. దేశాల మధ్య సంబంధాలు కొత్తరూపు తీసుకుంటున్నాయి. వాటికి తగ్గట్టుగా మనం సరికొత్త దౌత్యరచనను, యుద్ధనీతిని లిఖించుకోవాలి. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అటు చైనాతోనూ – ఇటు పాకిస్తాన్ తోనూ మనకు యుద్ధం తప్పేట్లు లేదు. అది ఏ సమయంలోనైనా సంభవించవచ్చు. రెండు దేశాల సరిహద్దుల్లో యుద్ధవాతావరణం అలుముకొని ఉంది. భారత భూభాగాల దురాక్రమణల పర్వం కొనసాగుతోంది. చైనా భారీ స్థాయిలో బలగాలను మోహరిస్తోంది. రెండు దేశాల మధ్య నెలకొని వున్న సరిహద్దుల వివాదంపై చర్చలు సమాంతరంగా జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే రెండు దేశాల కోర్ కమాండర్స్ మధ్య 13వ విడత భేటీ జరిగింది. ఒప్పందాలను మరచి వ్యవహరించడం చైనాకు పరిపాటిగా మారింది. శాంతి సందేశాలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ లో చైనా ఒక గ్రామాన్నే నిర్మించింది. సుమారు 100కు పైగా ఇళ్లతో ఈ గ్రామం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ఎన్నిగ్రామాలు నిర్మాణమవుతాయో చెప్పలేము. కశ్మీర్ ను ఆక్రమించాలని పాకిస్తాన్ – అరుణాచల్ ప్రదేశ్,లడాఖ్ ను ఆక్రమించాలని చైనా తీవ్రంగా కుటిల ప్రయత్నాలు చేస్తున్నాయి. ధర్మానికి -అధర్మానికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో గెలుపు భారత్ వైపే ఉంటుందని విశ్వసిద్దాం.
Also read: కాంగ్రెస్ పునరుద్ధరణ ప్రారంభమైందా?