కొన్ని రూపాలు మాయమవుతాయి,
కొన్ని కొనప్రాణం తో కొట్టుకొంటుంటాయి,
కొన్ని రక్తారుణ దుఃఖాన్ని పులుముకొని
జీవచ్చవాలు గా మిగిలిపోతాయి.
కాలం చరిత్రకు మరిన్ని పేజీలను జోడించి
పాప ప్రక్షాళనకు వాన కోసం వేచి చూస్తుంది.
విషపూరితమైన ఆకాశం నెలల తరబడి
అవిరత వమన వేదనతో విలవిలలాడుతుంది.
ఎగిరిపోయిన పక్షులు తిరిగివచ్చి
కాలి బూడిదైన గూడులను వెతుక్కొంటాయి.
కొండలు, గుట్టలు, ముగిసిన యుద్ధం నాటి
కరవాలాల ఖణేల్ ఖణేల్ శబ్దాల
ప్రతిధ్వనులను వినిపిస్తూనే ఉంటాయి.
ఒకప్పటి రేగడి నేలలపై
అగ్ని శిఖలు ఆగక నాట్యం చేస్తూనే ఉంటాయి.
పాపం భూమాత …తనపై చెల్లాచెదురుగా పడివున్న
దుర్గంధభరిత మాంస ఖండాలను
మింగలేక కక్కలేక ఉక్కిరిబిక్కిరి అవుతుంది.
ఎటూ పోలేని గాలులు ఊపిరి బిగబట్టి
అటూ ఇటూ తూలుతూ, తేలుతూ
అక్కడక్కడ సుడులు తిరుగుతాయి.
క్షతగాత్ర అయిన ప్రకృతి, వికృతం గా కనిపిస్తుంది.
వయసు మీద పడ్డ విధాత
ధారలు కడుతున్న కన్నీటిని తుడుచుకొంటు
తనలోకపు తలుపులు మూసివేస్తాడు.
అవును…అన్ని యుద్దాలు ఇలాగే ముగుస్తాయి.
ఉపశృతి:
శవాల గుట్టల మధ్య
సింహాసనాలపై కూర్చుని ఆ నలుగురు,
మద్యం మత్తులో పిచ్చిగా నవ్వుతూ
శాంతి పత్రం పై సంతకాలు పెడతారు.
Also read: ఎరుపు-తెలుపు
Also read: వర్షం
Also read: అమ్మ
Also read: నూతన జీవితం
Also read: ఎవరతను?!