ఇది యుద్ధమే?
అయినా, మర ఫిరంగుల రణ గొణ ధ్వనిలేదు.
అణు బాంబుల వికృత అట్టహాసం లేదు.
అదృశ్య కరవాలాలు ప్రహారం చేస్తుంటే,
ఒక్క నెత్తురు చుక్క రాలకుండా,
ఒక్క చావు కేక వినపడకుండా,
ఎక్కడి కక్కడ కుప్ప కూలి పోతున్న మానవ శరీరాలు.
ఇప్పుడు నిశ్శబ్దమే ఆయుధం, వెనకడుగే రణ వ్యూహం,
గడపలు సరిహద్దులు, నా ఇల్లు నా అభేద్యమైన కోట
నా సహనం వజ్ర కవచం.
కానీ, సాగనీ ఈ ప్రతిష్టంభన.
ప్రాణం రుచి మరిగిన పరమాణు జీవి
కాలే కడుపు పట్టుకొని
నిర్మానుష్య రహదారుల వెంటఁ తిరుగనీ
తను అశక్తమయ్యేవరకు, ప్రాణం లుప్త మయ్యేవరకు.
ఇవిగో వెలిగిస్తున్నా తమోపహమైన
శతకోటి జ్యోతులను…
“ఆగమార్థంతు దేవానాం
గమనార్థంతు రాక్షసాం…”
అంటూ శత్రు హృదయ దారుణ మైన
ఘంటా నాదం ఇదిగో మ్రోగిస్తున్నా.
నీ బలం ఇంతే కరోనా… నీ ఆయుషూ ఆ కాస్తే.
ఎందుకొచ్చావో, ఎందుకు పోతున్నావో…
భారతీయ సుసంస్కారం తో
శత్రువువైనా మెచ్చుకున్నా…
మళ్ళీ మమ్మల్ని ఒకటి చేసావుr ,
పాతేసిన ఆనాటి నిశ్శబ్ద శాంతి ని వెలికి తెచ్చావు …
పాత పాఠాలను కొత్తగా నేర్పి, ,
మాచే చదివించి, దిద్దించావు. ..
ఇక మరచి పోములే…
క్రొత్త సిరాతో వ్రాసిన పాత నీతి శతకాల ను,
నవీననవనీతం అద్దుకున్న
సనాతన సంస్కృతి సూత్రాలను…
ఇంటికి తిరిగి వచ్చిన మాకైనా,
క్రొత్తగా అడుగిడుతున్న అతిథి కైనా…
“ఇదం అర్ఘ్యం, ఇదం పాద్యం..
ఇదం శుద్ధ ఆచమనీయం!”
Also read: ఎవ్వడు వాడు
Also read: తమ్ముడు
Also read: కోడి
Also read: బొమ్మలు
Also read: పుష్ప వేదన