Sunday, December 22, 2024

నడిచే సంప్రదాయ విజ్ఞాన సర్వస్వం -న.చ. రఘునాథాచార్యులు

వరంగల్ పట్టణంలో శివనగర్ లో ఆయన ఆధ్యాత్మిక రాజధాని శ్రీమాన్ డా. నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యుల స్వామి. అది వారి 98వ జయంతి. (పెద్దలు ఆయనను శ్రీరఘునాథదేశిక తిరునక్షత్రోత్సవం అంటారు.) అయిదేళ్ల కిందట 1924 నుంచి 2018 అక్టోబర్ 13 దాకా ఆయన జీవనయానం సాగింది. ఒక్కడే ఒక విశ్వవిద్యాలయం అంటే అతిశయోక్తి కాదు. కొందరు ఆయన్ని కదిలే విశ్వవిద్యాలయం అంటారు. నడిచే సంప్రదాయ విజ్ఞాన సర్వస్వం అంటారు, సంచార శాస్త్ర సాహిత్య ఉపనిషత్‌ గ్రంథాలయంగా అంటారు. ఆ స్వామి పేరు న. చ. రఘునాథాచార్యుల స్వామి. తర్కశాస్త్రం, సంస్కృతంలో జీయర్ స్వామివారికి  బోధించినవారు. వారి బిరుదులు ‘‘మహా మహోపాధ్యాయ, కవిశాబ్ధిక కేసరి, శాస్త్ర రత్నాకర, ఉభయవేదాంత మహోదధి, ఉ. వే. (అంటే ఉభయ వేదాంత పండితులు, సంస్కృత, తమిళ భాషలలో విద్వాంసులు) శ్రీమాన్ డా. నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యుల స్వామికి శ్రీవైష్ణవ పీఠాధిపతుల్లో చాలామంది ఆయన శిష్యులు ఉన్నారు.

పూర్తి పేరు డాక్టర్‌ శ్రీరంగం నల్లాన్‌ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామి. లేత 18 సంవత్సరాల వయసులోనే వ్యాకరణ, తర్క, వేదాంత, సాహిత్యములలో విశేషమైన పాండిత్యాన్ని రఘునాథాచార్యస్వామి సాధించారు. భద్రకాళి దేవాలయం సమీపంలో ఓరుగల్లు సింహాద్రిభాగ్‌లోని వైదిక కళాశాలలో, శ్రీవిశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలో సుమారు 40 ఏళ్లపాటు అధ్యాపక వృత్తిని నిర్వహించి ఎందరినో సంస్కృతాంధ్ర భాషా పండితులుగా తీర్చిదిద్దారీ స్వామి.

ఓపైపు ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూ, ఆయన ప్రవచన గోష్ఠులను ఏర్పాటుచేసి బ్రహ్మసూత్రభాష్యాన్ని, భగవద్గీతాభాష్యాన్ని, ద్రావిడ, వేదాంత గ్రంథాలను, ఉపనిషద్భాష్యాలను శిష్యులకు ప్రబోధించావారు.  సమాజంలో ధార్మిక వైదిక ధర్మాలను భక్తిప్రపత్తులను నెలకొల్పుటకు విశేషంగా కృషి చేస్తున్న జీయర్‌స్వాములకు, ఉన్నత పదవులలో ఉన్న ఎందరో ప్రముఖులకు రఘునాథాచార్యులు ఆచార్యులుగా ఉన్నారు.  శ్రీశ్రీశ్రీ త్రిదండ చిన జీయర్ స్వామికి పాఠప్రవచన, ధార్మిక వేదాంత శాస్త్ర విషయాలలో గురువు అంటే కొందరికి తెలుస్తుందేమో. ప్రముఖులకు ప్రతి ఏడాది శ్రీరఘునాథదేశిక విశిష్ట పురస్కారాలను ప్రదానం చేస్తున్నారు.

నచ రఘునాథాచార్య స్వామికి జీయర్ స్వామి సన్మాన దృశ్య

న చ రఘునాథాచార్య సత్సంప్రదాయ పరిరక్షణ సభ స్థాపించారు, సంస్కృత విజ్ఞానవర్ధినీ పరిషత్‌ సంస్థను కూడా స్థాపించారు. వారు సృష్టించిన వాజ్ఞ్మయం సామాన్యమైంది కాదు. ఈ పుస్తకనిధి ఒక ఉదాహణ ఇది. తొంభైకి పైగా గ్రంథాలను రచించి ముద్రింపచేశారు. అనేక నూతన దేవాలయాలను, శిథిలావస్థలో ఉన్నదేవాలయాలను ప్రతిష్ఠించారు. సంస్కృత విజ్ఞానవర్ధిని పరిషత్‌ను ద్వారా ఆరు గ్రంథాలను ప్రచురించినారు. కొన్ని పుస్తకాలు ఇవి. శ్రీవిష్ణుసహస్రనామభాష్యమ్‌, ముండకోపనిషత్‌, కఠోపనిషత్‌, ఈశావాస్యోపనిషత్‌, కేనోపనిషత్‌, శ్రీభాష్యము (బ్రహ్మసూత్ర రామానుజ భాష్యమ్‌) నకు తెలుగు వ్యాఖ్యానము, వేదప్రామాణ్యము, ఆధ్యాత్మచింత, వేద సామ్రాజ్యం, సత్సంప్రదాయ సుధ, తత్వోపహారం, శ్రీరంగపతి స్తుతి,క్షమాషోడషి (తెలుగు వివరణ), విశిష్టాద్వైతము (తెలుగు-సంస్కృతం), శ్రీమాలికాస్తుతి, సంప్రదాయసుధాసారం, గోదాపురేశ మహత్యం (తెలుగు అనువాదం), శ్రీవైష్ణవ సౌభాగ్యము,అమృతవర్షిణి, భక్త రసాయనము, బుధరంజని (రెండు భాగాలు), గౌతమధర్మ సూత్రము, శ్రీవైష్ణవ సంప్రదాయ సౌరభము, లక్ష్మీస్తుతి మంజరి (సంస్కృత వ్యాఖ్య), శ్రీవరవరముని వైభవస్తుతి, కేనోపనిషత్‌ (తెలుగు వ్యాఖ్యానం), ఉత్తర రామచరిత్ర, శ్రీకుమార తాతాచార్య వ్యాఖ్య ఇవి కొన్ని. నిజంగా ఈ గ్రంథాలు ఒక్కొక్కటి విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ, డిలిట్‌ వంటి పట్టాలను సంపాదించి పెట్టగలిగేవి.

రఘునాథ స్వామి వారు భగవత్‌కైంకర్యనిధి అను సంస్థను స్థాపించి 28 శ్రీరామక్రతువులను నిర్వహించారు. హన్మకొండ రాగన్నదర్వాజాలో, కృష్ణాజిల్లా మోటూరులోని శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయాలను పునరుద్దరించారు. శ్రీపాంచరాత్ర ఆగమ పాఠశాలను స్థాపించి 60 మందికి పైగా విద్యార్థులకు శిక్షణనిచ్చి దేవాలయ ప్రతిష్ఠ, బ్రహ్మోత్సవాలను, దేవాలయ అర్చకత్వాన్ని సమర్థంగా నిర్వహించగల పండితులుగా తీర్చిదిద్దారు.

నిరాడంబరమైన జీవనశైలి. పాండిత్యానికి వన్నె తెచ్చే వ్యక్తిత్వం. నిరంతరం ధార్మికచింతన. దేవాలయాల జీర్ణోద్ధరణలు, నూతన దేవాలయ ప్రతిష్ఠలు. వేదాంత, పండిత సభల నిర్వహణ, వైదిక, ధార్మిక, ఆధ్యాత్మిక సంప్రదాయ సేవలే నిరంతరం. దశాబ్దాలుగా శాస్త్ర, సంప్రదాయ, సాహిత్య, సేవారంగాలలో విశేషకృషి ఆయనదే.

న. చ. రఘునాథాచార్యులకు అనేకానేక సన్మానాలు జరిగాయి. లెక్కించేదెవరు? కొన్ని ఉదాహరణకు ఇవి: త్రిదండి శ్రీమన్నారాయణ రామనుజ జీయర్‌ స్వామి 1970లో ఉభయ వేదాంతాచార్య బిరుదు ప్రదానం చేశాడు.1972లో రాష్ట్రపతి వి.వి. గిరి చేతులమీదుగా రాష్ట్రపతి పురస్కారం. తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయం 1999లో ‘మహామహోపాధ్యాయ’ పురస్కారాన్ని అందజేసింది. 1966లో కవిశాబ్దికకేసరి, 1972లో రాష్ట్రపతి పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ సంస్కృత పండిత పురస్కారం, కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ లభించాయి. శాస్త్రరత్నాకర, ఉభయవేదాంత మహోదధి, ఉభయవేదాంతాచార్య వంటి బిరుదులు అందాయి. గోపాలోపాయన, గజారోహణ, తులాభార, కనకాభిషేక, ముక్తాభిషేక, బ్రహ్మరథ, గండపెండేర స్వర్ణకంకణ ప్రదానం వంటి సత్కారాలు లభించాయి. అజో-విభో-ఫౌండేషన్‌ వారి పురస్కారం, గోపాలదేశిక పురస్కారం, ఉగాది పురస్కారం, అశ్వారోహణ వంటి సన్మానాలను అందుకున్నారు.

రఘునాథుల వారి శిష్యుడు

అయిదేళ్ల కిందట 2018 అక్టోబరు 13న వరంగల్‌ శివనగరలోని స్వగృహంలో రఘునాథాచార్యుల వారు కాలదర్మం  చెంది శ్రీ కైవల్యానికి చేరారు. అతని భార్య సీతమ్మ. వారికి నలుగురు కుమార్తెలు శేషమ్మ, శ్రీదేవి, నీలాదేవి, గోదాదేవి. కీర్తిశేషులు రఘునాథాచార్యుల శిష్యులు తిరు (అంటే శ్రీయుత) నక్షత్ర (అంటే పుట్టిన తేది) తో 

‘శ్రీవాత్స్యవరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయమ్
తాతార్య తనయం వందే రఘునాథాహ్వయం గురుమ్’’
శ్రీమాన్ నచ రఘునాథ దేశిక గురుభ్యో నమః

అని తనియ అంటూ గురువందనం చేసుకుంటారు. తహశీలుదారు నుంచి డిఆర్ ఓ స్థాయిలో ఉన్నతాధికారిగా గోదావరి జిల్లాలో పదవీ విరమణ చేసిన తరువాత, అంతకుముందుయాదగిరి దగ్గరిలో ఉండే వాడే అయినా,  మరింగంటి శేషాచార్యులు గారు వరంగల్లు శివనగర్ లో ఇల్లు కట్టుకుని, భార్యాభర్తలు ఇద్దరూ సేవ చేసుకుంటూ శ్రీమాన్ రఘనాదేశిక స్వామి శిష్యుడిగా దివ్యప్రబంధం, శ్రీ భాష్యం నేర్చుకున్నారు. శ్రీమాన్ ఆచార్యస్వామి వారిని భాగవత గోష్ఠి కార్యక్రమములలో సేవించుకొనే భాగ్యము కలిగిందని శేషాచార్యులు ఈ రచయితకు చెప్పారు. తన తండ్రి గారు శ్రీమాన్ మరింగంటి రామానుజాచార్యుల వారి ఆజ్ఞ మేరకు శివనగర్ లో ఇల్లు కొనుగోలు చేయడం,  శిష్యుడినై చదువుకోవడం నా అదృష్టం అని, శ్రీమాన్ మోటుపల్లి పార్థసారధి స్వామి వారి వద్ద “తిరువాయ్ మొఙి ప్రబంధమును సంతగా చెప్పుకోవడం, శ్రీమాన్ టి. శ్రీనివాసన్ శ్రీ రాఘవన్ గారితో ( శ్రీమాన్ న.చ.రఘునాథ దేశికుల వారి దౌహిత్రులు) శేషాచార్యులు నేర్చుకోవడం సాధ్యమైందన్నారు. శ్రీన. చ. పట్టాభిరామాచార్య శ్రీ సముద్రాల పురుషోత్తమాచార్య, శ్రీ అయ్యంగారు, శ్రీమాన్ దరూరిమనోహరాచార్య, శ్రీ డా॥ రామాచార్యస్వామి, శ్రీమాన్ సముద్రాల శఠగోపాచార్య వంటి శ్రీరఘునాథదేశిక గురువు గారి చేత శిష్యత్వం  లభించిందని శేషాచార్యులు అన్నారు.

శ్రీశ్రీశ్రీ త్రిదండి రామచంద్ర జియ్యరు స్వామి వారు చాతుర్మాస్యదీక్ష సమయములో శ్రీమాన్ న. చ. రఘునాథ దేశికుల వారి నివాసంలో  శ్రీ భాష్యము పూర్తిచేసుకున్నారు. ఆ సందర్భములో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామచంద్ర జియ్యరు స్వామి తిరుమంత్రార్థం నేర్చుకోవాలని ఆదేశించడం నా భాగ్యము అని శేషాచార్య అన్నారు. కీశే  రఘునాథ దేశీకుల వారికి విజయవాడలో జరిగిన గజారోహణ సన్మానము, మంచిర్యాలలో జరిగిన బ్రహ్మరథోత్సవ సన్మానానికి వెళ్ళి ఆ వైభవాన్ని కన్నులారా సేవించుకొనే భాగ్యము లభించిందని శేషాచార్య వివరించారు.

కీర్తిశేషులు ఆచార్యస్వామి నేతృత్వములో, వారి ధర్మపత్ని న. చ. సీతమ్మ సంత చెప్పించికున్నారు.  ఆచార్యస్వామి తనకు పండిత శాలువలతో ఆశీర్వదించారని శేషాచార్య సంఘటన అనూహ్యమైన భాగ్యమని చెప్పారు.

ఆచార్య స్వామివారు ద్వారా తిరుమంత్రార్ధమును, శరణాగతి గద్యమును, నారాయణోపనిషత్తుతో బాటు అష్టాదశ రహస్యములలోని ప్రమేయ శేఖరము, ప్రపన్న పరిత్రాణము, అర్థపంచకము, నవరత్నమాలై సాంప్రదాయ ప్రబంధములను కాలక్షేప రూపకముగా అనుగ్రహించారని శ్రీమాన్ న.చ. రఘునాథ దేశికుల వారు ఈ కాలములో అవతరించిన శ్రీమణవాళ మహామునులు తమకుఆశీర్వదించారని శేషాచార్యులు అన్నారు.

(శాస్త్ర రత్నాకర 98వ జయంతి సందర్భంగా)

మాడభూషి శ్రీధర్

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles