ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి పాలనకు రెండేళ్ళు నిండిన సందర్భంగా సమీక్ష
గత రెండు వారాలుగా తనకు తెలియకుండానే నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజు వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఆయనకు ఎప్పటినుంచో వార్తల్లో వ్యక్తి కావాలని వుందన్న సంగతి మనకు తెలిసిందే. వారి పార్టీ అధినేత మౌనం పాటిస్తే అది వ్యూహాత్మక మౌనమనే మనం అనుకున్నాం. కాని, పుట్టినరోజు నాడే శ్రీకృష్ణ జన్మస్థానానికి చేర్చే వ్యూహమని రఘురామ కూడా ఊహించివుండరు. వైసీపీ బీ ఫారమ్ చివరి క్షణంలో దొరకబుచ్చుకున్న రఘురామ గెలిచిన దగ్గరనుంచే తన అసమ్మతి గళాన్ని దాచుకోలేదు. మొదట్లో పార్టీమీద, క్రమంగా అధినేత మీద తన విమర్శ బాణాలను ఎక్కుబెట్టారు. వైసీపీ నాయకులనే కాదు, జగన్ అభిమానును కూడా బాగా డిస్టర్బ్ చేశారు.
ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎవరి మీదనైనా విమర్శలు చేసుకోవచ్చు. ఆ పనికి వాక్‌స్వాతంత్రపు హక్కు పేరుతో మన రాజ్యాంగం రక్షణ కూడా కల్పించింది. కాబట్టి రఘురామ మాటల ఈటెల పోట్లను చట్టపరంగా తప్పు పట్టలేం.
ముఖం చాటేసుకొని బతుకుతున్నారు
కాని, రాజకీయాలో నైతికత ఇంకా ప్రధానమైనది కదా. తాను గెలిచిన పార్టీ విధానాల మీద, అధినేత తీసుకున్న నిర్ణయాల మీద అభ్యంతరాలున్నప్పుడు ఆ పార్టీ నేతలు బహిరంగంగా విమర్శించడం అనైతికం. తాను అనైతిక చర్యకు పాల్పడుతున్న సంగతి కూడా రఘురామకు తెలుసు. అందుకే గత కొన్ని మాసాలుగా ఆయన తన నియోజకవర్గంలో అడుగు పెట్టలేకపోతున్నారు. సొంతవూరిలో సొంత జనం ఏమనుకుంటున్నారో ఆయనకు తెలుసు. అందుకే తనకు రక్షణ పెంచమని కేంద్రానికి విన్నవించుకున్నారు. దాదాపు కేంద్ర మంత్రులకు ఇచ్చినంత అత్యంత భద్రత కల్పించినప్పటికీ నరసాపురం వచ్చే ధైర్యం చేయలేకపోయారు. దిల్లీ, హైదరాబాద్ పట్టణాల మధ్యనే చక్కెర్లు కొడుతున్నారు గాని, అటు అమరావతికిగాని, ఇటు నరసాపురానికి గాని రాలేకపోయారు. దాదాపుగా ముఖం చాటేసుకుని బతుకుతున్నారు.
రాజీనామా చేసి ఉంటే కథానాయకుడయ్యేవారు
అసంతృప్తులు ఎక్కడున్నా వారిని కెలికి కదిపితే వచ్చే వంకర మాటలే కొన్ని ఛానెళ్లకు ప్రసాదంగా మారిన పరిస్థితి ఎప్పటినుంచో తెలుగు నేలమీద ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలాంటి నోటిదూల ఉన్న ఇద్దరు నాయకుల్లో మరొకరు సబ్బం హరి ఇటీవల కరోనా బారినపడి మరణించారు. వీరిద్దరికీ రెండు చానళ్ళు వారానికి రెండు రోజులు ప్రైమ్ టైమ్ కేటాయించాయి. ఇది కాక రచ్చబండ కార్యక్రమంతో ప్రత్యేక ప్రెస్‌మీట్లు కూడా రఘురామ వీరికి అందించారు. ఎందుకంటే ఆ బైట్లు మిగిలిన ఛానెళ్లలో క్రమంగా తెరమరుగయ్యాయి. పదవికి, పార్టీకి రాజీనామా చేసి రఘురామ ఈ పనులే చేసివుంటే కథానాయకుడయ్యేవాడు. పదవితో వచ్చే సకల సౌకర్యాలు అనుభవిస్తూ పార్టీ అధినాయకుడిని విమర్శించడం వల్ల, తెలుగు నేల మీద కెఏ పాల్‌కు ఇప్పుడు రఘురామ గట్టి పోటీ ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
అలాంటి రఘురామను ఎలా అదుపు చేయగలుగుతారని అభిమానులతో పాటు జగన్ వైరివర్గం కూడా ఆసక్తిగా గమనిస్తోంది.
రాజద్రోహం కేసు అప్రజాస్వామికం
పుట్టినరోజు సంబరం చేసుకుందామని హైదరాబాద్ వచ్చిన రఘురామను సిఐడి పోలీసు రాజద్రోహం కేసులో అరెస్టు చేశారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికం. ఆయనపై పెట్టిన కేసులు నిలిచేవి కావు. అరెస్టు చేసిన పద్ధతి హర్షించదగినది కాదు. ఇప్పుడున్న ‘ప్రత్యేక’ పరిస్థితుల్లో జగన్ చేసే ఎలాంటి పనైనా కోర్టు ద్వారా అడ్డుకోవచ్చు. ఈ సమయంలో రఘురామ అరెస్ట్ యాక్షన్, రివెంజ్ సినిమాలు చూసి సంతృప్తి పడేవారికి మహదానందం కలిగించవచ్చు గాని, ప్రజాస్వామిక వాదులు మాత్రం గగ్గోలు పెట్టవలసిన విషయమిది.
తొమ్మిదేళ్లు పార్టీని అధికారం లేకుండా నడిపించడం గొప్ప విషయమే కావచ్చు. వంద శాతం ఎమ్మెల్యే సీట్లలో పోటీకి నిల్చున్న అభ్యర్థులు రూపాయి ఖర్చు చేయకుండా ఎన్నికను ఎదుర్కోవడం సాహసమే కావచ్చు. ఆంధ్రదేశంలో ఆ మూలనుంచి ఈ మూలవరకూ పాదయాత్రతో నడిచి, జనం కష్టసుఖాలు విని, ప్రజా అజెండాను తయారుచేసుకోవడం అపురూపమే కావచ్చు. ఇచ్చిన వాగ్దానాలలో అధిక శాతం అవినీతిరహితంగా అమలుచేయ బూనడం అద్భుతమే కావచ్చు.
ఎక్కడో తేడా కొడుతోంది!
కాని, ఎక్కడో తేడా కొడుతోంది. జగన్ అది తెలుసుకోకపోతే, ఈ టైటానిక్ పడవకు పడిన చిల్లును కనిపెట్టి, పూడ్చకపోతే పడవ మునిగిపోవడం ఖాయం. పాలనను సమీక్షల పేరుతో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల ఆఫీసు సమయానికి పరిమితమై పని చేసుకుంటానంటే రాజకీయాలో కుదరదు కదా. అయినదానికీ కానిదానికీ సివిల్ సర్వీస్ అధికారులపై ఆధారపడి పాలన సాగిస్తామనుకుంటే కొంప కొల్లేరవడం ఖాయం. బీహార్‌లో ఇంతకంటే ఎక్కువగా సివిల్ సర్వీసు అధికారులపై ఆధారపడి అద్భుతమైన పాలన అందించిన గొప్ప బహుజననేత లాలూ ప్రసాద్‌యాదవ్ ఇంకా జైల్లోనే మగ్గుతుండడం జగన్ అభిమానులను భయపెట్టే తాజా ఉదాహరణ.
జగన్ తన విజయసూత్రమైన ప్రజలతో మమేకమైపోవడాన్ని వీలున్నంత వేగంగా ఆచరణలో చూపించక పోతే దాని దుష్ప్రభావం ఎన్నికల ఫలితాలపై పడుతుందనేది చేదు నిజం. కరోనాకాలంలో కకావికలమైన ప్రజల జీవనయానం జగన్ దృష్టికి తీసుకురాకుండా అధికార యంత్రాంగం మసిపూసి మారేడుకాయ చేస్తున్న వైనం ప్రజలకు తెలుసు. తాము నరకయాతన అనుభవిస్తూ, బాధను పంటి బిగువున భరిస్తున్న వారి ఆగ్రహం ఇంకా జగన్ మోహన్ రెడ్డి వైపు మరలలేదు. ఇంకా జగన్‌ను అవినీతి రహిత పాలన అందించాలని తపన పడుతున్న యువ రాజకీయ నేతగానే ప్రజలు భావిస్తున్నారు.
విపక్షం చల్లిన బురదను ప్రజలు పట్టించుకోలేదు
ప్రధాన ప్రతిపక్షంతో కలసి జగన్‌ను శత్రువులాగా భావించే ఒక వర్గపు మీడియా దాదాపు పదేళ్లపాటు; ‘లక్ష కోట్ల అవినీతిపరుడి’గా ఒక పద్ధతి ప్రకారం బురద జల్లుతూ ఒక ఇమేజ్‌ను తయారుచేసి ప్రజల మైండ్ కంట్రోల్ చేయడానికి ఎంతో ప్రయత్నం చేశాయి. అయినా ఈ రాష్ట్రంలో సగానికిపైగా ప్రజలు ఆ ఆరోపణను అసలు పట్టించుకోలేదు. అద్భుతమైన మెజారిటీ ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్ర పాలన పగ్గాలు అందించారు. కరోనా కల్లోలకాలంలో ఛిద్రమైన తమ బతుకులకు కారణం ప్రభుత్వ నిర్వాకమని ఇంకా అనుకోవట్లేదు. ఏడాదిన్నర తరువాత జరిగిన వివిధ ఎన్నికలో సైతం బ్రహ్మరథం పట్టారు. ప్రజాకోర్టులో తీర్పులు నిఖార్సుగా ఉంటాయి. అధికారులలో అవినీతి యావ లేకపోవచ్చు. సమీక్ష గదిలో ఆయన ఇచ్చిన ఆదేశాలను తిరిగి తమ కార్యాలయాలో దిగువస్థాయి అధికారుకు వల్లె వేయడం, అదే వల్లెవేత అట్టడుగున ప్రజల వద్దకు చేరడంతో పెద్దగా ప్రయోజనాలు సిద్ధించవు.
ఆదర్శాలతో పాటు ఆచరణా ముఖ్యం
ఉత్తమ ఆదర్శాలకు అధమ ఆచరణ తోడైతే ప్రజలు పసిగడతారు. అది తమ నాయకుడి అసమర్ధతగా అంచనా వేసే ప్రమాదముంది. దాని ఫలితం మళ్లీ ఎన్నికల్లోనే తప్ప మరెక్కడా కనిపించదన్న సత్యం బోధపరుచుకోవాలి. అక్రమ కేసులు, అరెస్టులు ప్రతీకార రాజకీయాలకు నిదర్శనం. తాను ప్రతిపక్ష నేతగా అనుభవించిన కష్టాలూ, పరాభవాలూ ప్రస్తుత ప్రతిపక్ష నేతకు ఎదురుకావడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రతిపక్షనేతగా ప్రభుత్వాన్ని విమర్శించడం చంద్రబాబు హక్కు. వాక్సిన్లపై చంద్రబాబు అవాకులు చెవాకులు పేలారని ఆయనపై పలుచోట్ల కేసులు పెట్టించాలన్న ఆలోచన ఇచ్చిన అధికారులైనా, ప్రభుత్వ సలహాదారులైనా జగన్ శత్రువులే. ప్రజలలో జగన్ ఇమేజ్‌ను బద్నాం చేయడానికే ఇలాంటి సలహాలు అందిస్తున్నారని అధినేత గమనించాలి. ఇంతాచేసి నిలబడని కేసులతో జనంలో అభాసు పాలవుతున్నది ఎవరో అధినేత ఆలోచించుకోవాలి. లేకపోతే ముందుంది ముసళ్ల పండగే.
(అభిప్రాయాలు పూర్తిగా రచయితవి)