Friday, December 27, 2024

నవనవోన్మేష సాహిత్యోత్సవం

ఫొటో రైటప్: భోపాల్ సాహిత్యోత్సవం ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపదిముర్ము

  • భోపాల్ లో ఉన్మేష సంరంభం
  • అణగారిన వర్గాల భాషలకు ప్రాధాన్యం

“ప్రతిభా నవ నవోన్మేషశాలిని” అన్నది లాక్షణికులు అభివ్యక్తీకరించిన వ్యాఖ్య. దానికి చిరంజీవత్వం వుంటుందని చెప్పడానికి తదనంతర కవుల సృష్టి, అభివ్యక్తి అద్దం పట్టాయి. సహజ ప్రతిభకు తోడుగా వ్యుత్పత్తి, అభ్యాసం కూడా జత కలిస్తే, ఆ సృష్టి, ఆ వృష్టి మరింత పుష్టితో విలసిల్లుతాయని మన మహాకవులంతా నిరూపించారు. లక్ష్యాన్ని చేరుకోవాలనే సులక్షణం కూడా అంతే అవసరం. ఈ లాక్షణిక ప్రస్తావన ఎందుకు చేయాల్సివచ్చిందంటే నవనవోన్మేషాశాలియైన ప్రతిభా సరస్వతికి ప్రతిరూపమైన అనేక సాహిత్య స్వరూపాలకు, విభిన్న  కళాప్రతిరూపాలకు నీరాజనం పట్టే ‘సాహిత్యోత్సవం’ మనందరి మధ్య జరుగుతోంది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ ఈ సంబరాలకు వేదికగా నిలుస్తోంది. ‘ఉన్మేష’ పేరుతో కేంద్ర సాహిత్య అకాడెమి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలు జగదానందకరంగా సాగుతున్నాయి. ఈ నెల 3 వ తేదీ నుంచి 6వ తేదీవరకు జరుగుతున్న ఈ ఉత్సవానికి ప్రపంచం నలుమూలల నుంచి సాహిత్యమూర్తులు, సారస్వత దీప్తులు తరలి వస్తున్నారు. పోయిన సంవత్సరం జూన్ నెలలో 16 వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా వేదికగా జరిగిన ఈ సంరంభం అప్పుడు అందరినీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది.  అదే మొట్టమొదటి మహోత్సవం. దానికి ‘ఉన్మేష’ అని అద్భుతమైన నామకరణం చేశారు.

భోపాల్ సాహిత్య మహోత్సవంలో జావెద్ అఖ్తర్, ఓనీర్ ధార్

అభివ్యక్తికి అగ్రతాంబూలం

ద్వితీయ విఘ్నం లేకుండా ఈ సంవత్సరం అద్వితీయంగా తీర్చిదిద్దారు. పోయిన ఏడాది పండుగ వేళ ప్రాతినిధ్యం వహించిన అంశాలకు ఈసారి కూడా ప్రాముఖ్యతనిస్తూనే, మరిన్ని సరికొత్త అంశాలను జతచేర్చారు. ‘ఫెస్టివల్ అఫ్ ఎక్స్ప్రెషన్’ అని అప్పుడు అన్నారు. ఇప్పుడూ అదే అంటున్నారు. అభివ్యక్తికి అగ్రతాంబూలం ఇస్తున్నారు. తమ భావాలను అభివ్యక్తీకరించే అవకాశం, స్వేచ్ఛ ఏ కొందరికో కాక, ఎందరికో ఇస్తున్నారు. అందులో అందరూ వున్నారు. అందరంటే ప్రపంచమే హద్దు. “విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను” అని మహాకవి శ్రీశ్రీ అన్నట్లుగా విశ్వసాహిత్యానికి ఉన్మేష ఉత్సవంలో పందిర్లు కట్టి కల్యాణం కావిస్తున్నారు. ‘ఉన్మేష’ అని పేరుపెట్టడంలోనే నిర్వాహకుల ప్రజ్ఞ,ఉత్సాహం దర్శనమవుతున్నాయి. ఇది సాహిత్య సరస్వతికి జరుగుతున్న వైభోగమైనా! వేడుకల వేదికలకు సంగీత సరస్వతీ ప్రతిరూపాలైన రాగాలు పేర్లు పెట్టారు. అది విలక్షణం, సులక్షణం. అంజని, గౌరంజని, జయజయావంతి, శివరంజని, నీలాంబరి, మాల్ కౌన్స్ రాగాధిదేవతల పేర్లు పెట్టడం రసరంజితం. ఇందులో హిందూస్థానీ- కర్ణాటక సంగీత సరస్వతుల ప్రాతినిధ్యం ధ్వనింపజేస్తూ జాతి సమగ్రతకు జోహారులర్పించడం  సముచితం, సమున్నతం.

Also read: వేదవిద్యాపారంగతుడు మాణిక్య సోమయాజులు

అరవై అంశాలకు పెద్దపీట

ఈ వేదికలలో సుమారు 60అంశాలకు ప్రాముఖ్యత కల్పించారు.యువత, గిరిజన శ్రేణుల నుంచి తలపండిన జ్ఞానవృద్ధుల వరకూ సమన్యాయం చేస్తూ శీర్షికలను రూపొందించారు. చర్చలకు తావు కల్పించారు. స్వీయ కవితా పఠనాలకు, చిన్నకథల చదివింపులకు, ఇతిహాసపు విశేషాల అభివ్యక్తికి సమసుందరమైన వేదికలను నిర్మించారు. ఒకటేమిటి? అనువాదం, అనుసృజన నుంచి కొత్తగొంతుకల వరకూ చోటివ్వని మాట కనిపించలేదు. దేశంలో ఎన్ని భాషలు ప్రముఖంగా వినవస్తున్నాయో, కనిపిస్తున్నాయో అన్నింటినీ ఈ ఉత్సవంలో భాగస్వామ్యం చేశారు. మన దేశ భాషా సరస్వతికే కాక, ఐర్లాండ్, టిబెట్, మారిషస్, మాల్దీవ్స్, నైజీరియా, నేపాల్, శ్రీలంక, ఫిజీ, జపాన్, పోలాండ్, స్పెయిన్ దేశ భాషలకు కూడా ఆరతి పడుతున్నారు. బోడో, సంతాలి, గోండ్, మిజో, బషేలీ, మాల్వి, నిమాది, డోగ్రీ, కశ్మీరీ, గారో, మణిపురీ వంటి ఎన్నో భాషలు ఇక్కడ వినిపించి వీనుల విందుచేయనున్నాయి. ఈ ఉత్సవం కోసం ఎంపిక చేసుకున్న అంశాలను పరికించి చూస్తే, కొన్ని వేల పరిశోధనా పత్రాలు సృష్టించవచ్చని అనిపిస్తోంది. భిన్న భాషలు, కళలు, సంస్కృతులకు నెలవై, భిన్నత్వంలో ఏకత్వాన్ని అనుభవిస్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న భారతీయతకు ప్రతిబింబంగా ఈ సంబరం సందడి చేస్తోంది. నోరులేనివారికి, అణగారినవారికి, అబలలకు, అల్పసంఖ్యాకులకు ప్రాధాన్యం కల్పించే సత్ సంకల్పానికి శ్రీకారం చుట్టిన సాహిత్య అకాడెమికి అభినందనలు, కృతజ్ఞతలు అందించవచ్చు.

నలుదిక్కులా నినదించాలి

బహు భాషల, బహు విధముల, బహుభంగుల అన్నట్లుగా దైవభక్తి, దేశభక్తి నుంచి సాహిత్యానురక్తి వరకూ అనేక పార్శ్వాల అభివ్యక్తికి చోటుదక్కుతున్న గొప్ప సందర్భం ఈ సంరంభం. రవీంద్ర కవీంద్రుని స్ఫూర్తిగా రవీంద్ర భవన్ వేదికగా ఈ వేడుక ముస్తాబైంది. సినిమా, సాహిత్యం వేరువేరుకాదన్నట్లుగా సినిమా సారస్వతానికి సముచిత స్థానం కల్పించారు. మాతృభాషల అవసరాన్ని, స్థానిక భాషల ఆవశ్యకతను ఈ వేదికల సాక్షిగా చాటిచెబుతున్నారు. ప్రకృతి గురించి, మానవ ప్రకృతి గురించి కూడా చర్చలు చేపట్టారు. వైద్యం కూడా ఇక్కడ వస్తువైంది. పుస్తక ప్రచురణలో నేడు ఎదుర్కొంటున్న కష్టాలు, రానున్న గడ్డురోజులు, అసలు పుస్తకంతోనే అవసరంలేని కాలం చేసే గాయాలు, యంత్రాలు చేసే వింతలు చర్చలకు సరుకుగా మారాయి. పూర్వోత్తరికి కూడా పెద్దపీట వేస్తున్నారు. అస్మితకు గొంతునిస్తున్నారు. యోగవిద్యకు కూడా ఉత్సవంలో చోటునిచ్చారు. ఫాంటసీ, సైన్స్, ఫిక్షన్, మీడియా, విలువలు మొదలైన అన్ని అంశాలపైన, అన్ని రంగాలపైన విస్తృతంగా మాట్లాడడానికి, చర్చించడానికి ఈ ఉత్సవం రంగం సిద్ధం చేసింది.పుస్తకాల ప్రదర్శన, అమ్మకాలతో పాటు మహనీయ రచయితలకు సంబంధించిన డాక్యుమెంటరీ ప్రదర్శన కూడా ఏర్పాటుచేయడం మరో విశేషం. కేంద్ర సాహిత్య అకాడెమి చేపట్టిన ‘ఉన్మేష’ నవనవోన్మేషమై, దేశం నలుదిక్కులా నినదించాలని, భవిష్యత్తులో మారుమూలలా విస్తరించాలని ఆకాంక్షిద్దాం. భాషలు, సాహిత్యం, కళలు, సంస్కృతి సదా విలసిల్లాలి. దేశం విలువ వెలుగులీనుతూ వుండాలి.

Also read: అవిశ్వాస తీర్మానం అనుకున్నది సాధిస్తుందా?

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles