వోలేటి దివాకర్
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏపార్టీ విజయం సాధిస్తుందన్న విషయమై మాజీ పంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో అధికార వైసిపి, టిడిపి, జనసేన కూటమి చెరో 40శాతం ఓట్లు సాధిస్తాయన్నారు. మిగిలిన 20శాతం ఓట్లలో ఎవరు ఎక్కువ మెజార్టీ సాధిస్తే వారిదే విజయమని విశ్లేషించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విద్యాధికులు మార్పు కోరుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 40శాతంపైగా ఉన్న వివిధ పథకాల లబ్దిదారుల ఓట్లపై ఆశలు పెట్టుకున్నారన్నారు. అయితే, రాష్ట్రం లోటుబడ్జెట్‌లో ఉందని ఒకవైపు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు చెబుతూనే జగన్ కన్నా ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబుపై ప్రజల నమ్మకంపైనే టిడిపి విజయం ఆధారపడి ఉంటుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై టిడిపి, వైసిపి అధికారికంగా ఆరోగ్యకరమైన చర్చకు వస్తే తాను సంధానకర్తగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ముఖ్యమంత్రి జగన్ వ్యవహారశైలిని ఉండవల్లి తప్పుపట్టారు. ఆయన ఎవరి మాటా వినరని, ఈ విషయంలో ఆయన ప్రధాని నరేంద్రమోడీని మించిపోయారని, మోడీ కనీసం అమిత్‌షా మాట వింటారని పద్దేవా చేశారు. జగన్ ఎన్నో తప్పులు చేస్తున్నారని దుయ్యబట్టారు. అభ్యర్థుల మార్పు బెడిసికొట్టే అవకాశాలు ఉన్నాయన్నారు.
Also read: కిక్కిరిసిన విలేఖర్ల సమావేశంలో…..
మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వారసురాలిగా జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్‌లో చేరడం సహజమేనన్నారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు వేరువేరు పార్టీల్లో ఉండటం కొత్తకాదన్నారు. అయితే వాట్సాప్ యూనివర్శిటీకి దూరంగా ఉండాలని షర్మిలకు సలహా ఇచ్చారు.
మహాత్మాగాంధీ తన తండ్రికి పుట్టలేదట!
తప్పుడు వార్తల ప్రచారంలో బిజెపి నేతృత్వంలోని భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం నివేదిక తేల్చిందన్నారు. ఈ విషయంలో అమెరికా, బ్రిటన్ కూడా భారత వెనుక స్థానాల్లోనే ఉన్నాయన్నారు. మహాత్మాగాంధీ తన తండ్రికి పుట్టలేదని గాంధీ వ్యతిరేకులు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారని ఉండవల్లి పరోక్షంగా బిజెపి పార్టీని ఉద్దేశించి ధ్వజమెత్తారు. గాంధీ తల్లిని కాబూలీవాలా వద్ద తాకట్టుపెడితే గర్భంతో తిరిగి వచ్చిందని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. దివాన్ వంశానికి చెందిన గాంధీ వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా ప్రచారం చేయడం తగదన్నారు.
బిజెపి ప్రభుత్వం ‘జై శ్రీరామ్’ అంటూ రాముడ్ని ముందుకు పెట్టి రానున్న ఎన్నికల్లో లబ్దిపొందే ప్రయత్నం చేస్తోందని ఉండవల్లి ధ్వజమెత్తారు. అయోధ్యలో శ్రీరాముడి ఆలయాన్ని నిర్మించకుండానే విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. అయోధ్య రాముడి ప్రసాదం కన్నా భద్రాద్రి రాముడి ప్రసాదమే రుచిగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తప్పుపట్టిన శంకరాచార్య వంటి మహనీయులను బిజెపి వారు దూషించడం తగదన్నారు. దేశంలో ముస్లిం వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాతే దేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదం పెచ్చుమీరాయని, 1999లోనే దీనికి బీజం పడిందన్నారు. మణిపూర్‌లో మారణహోమం గోద్రా అల్లర్ల కన్నా దారుణమన్నారు. హిందుత్వమంటేనే సెక్యులరిజమని ఆయన విశ్లేషించారు.
Also read: వారు పోటీ చేస్తే…మరి వీరేం చేస్తారు?!
పన్నుల ఆధారంగా రాష్ట్రాలకు ఇన్సెంటివ్ ఇవ్వాలి
అధిక పన్నులు చెల్లిస్తున్న రాష్ట్రాలకు ప్రోత్సహాకాలు ఇవ్వాలనీ, తద్వారా ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య అంతరాలను తొలగించవచ్చుననీ అ న్నారు. కాంగ్రెస్ నేత డికె శివకుమార్ సోదరుడు రమేష్ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా దేశం ఉత్తర, దక్షిణ భారతదేశాలుగా విడిపోయే పరిస్థితి తలెత్తిందని వ్యాఖ్యానించడంపై ఉండవల్లి స్పందిస్తూ ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉండాలంటే అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు. బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను బీమారు రాష్ట్రాలుగా పిలుస్తారని, దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి, సంక్షేమానికి 12లక్షల కోట్లు ఖర్చు చేస్తే, ఈ నాలుగు రాష్ట్రాల్లోనే 4లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. అయితే ఈ రాష్ట్రాల నుంచి వచ్చే పన్నుల ఆదాయం మిగిలిన రాష్ట్రాల కన్నా చాలా తక్కువగా ఉంటుందన్నారు. కొత్త పార్లమెంటు భవనంలో సీట్ల కేటాయింపు ప్రకారం పార్లమెంటు సీట్ల సంఖ్య 800కు పెరిగే అవకాశాలు ఉన్నాయని, దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెరగదని ఉండవల్లి చెప్పారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందన్నారు. బిజెపి ప్రభుత్వం కోటి 60లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. కేంద్రబడ్జెట్‌లో పోలవరం, ప్రత్యేక హోదా వంటి ప్రధాన అంశాలకు కేటాయింపులు చేయకపోయినా ఎపికి చెందిన ఎంపిలు ప్రశ్నించకపోవడం శోచనీయమన్నారు. ప్రశ్నిస్తే ఎక్కడ ఇడి వస్తుందోనని భయపడుతున్నారన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ నిర్వహణ అంతా లోపభూయిష్టమనీ, అన్నీ అక్రమాలేననీ తన అధ్యయనంలో తేలిందని, త్వరలోనే ఆ వివరాలు బయటపెడతానన్నారు. చిట్‌ఫండ్ కంపెనీని ఇలా కూడా నడుపుతారా అన్న ఆశ్చర్యం కలుగుతోందన్నారు.
Also read: రాజమహేంద్రవరంనకు ఎంపి అభ్యర్థులు కావలెను!