వోలేటి దివాకర్
ఈనాడు పత్రికలో వచ్చిన వార్తలు, కథనాలపై ప్రత్యేక పగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ వెల్లడించారు. తన వ్యతిరేకులను ఈనాడు దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తూ వార్తలను ఎలా వక్రీకరిస్తుందో…భావ వ్యక్తీకరణను ఎలా అణగదొక్కుతుందో వెల్లడిస్తానన్నారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వుల గురించి ఆయన విలేఖర్ల సమావేశంలో వివరించారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఆర్‌బిఐ చట్టంలోని 45 ఎస్ నిబంధనలకు విరుద్ధంగా రూ. 2600 కోట్లు డిజిపాజిట్లు స్వీకరించిందన్న తన వాదనను సుప్రీంకోర్టు సమర్థించిందన్నారు. 45 ఎస్ ప్రకారం ఇన్ కార్పొరేట్ కంపెనీలు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించ కూడదన్నారు. హిందూ అవిభక్త కుటుంబ సంస్థలు కూడా నిర్దేశించిన కుటుంబ సభ్యుల నుంచి మినహా మిగిలిన వారి నుంచి డిపాజిట్లు సేకరించ రాదన్నారు. అలాగే చిట్ ఫండ్ కంపెనీలు ఇతర వ్యాపారాలు చేయరాదని వివరించారు.
ఈ కేసును 6నెలల్లోగా విచారించి, వాస్తవాలు నిగ్గు తేల్చాలని తెలంగాణా హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. ఈ కేసులో 2006 నుంచి న్యాయపోరాటం చేస్తున్నానన్నారు. 27 వాయిదాలకు న్యాయవాదిగా హాజరయ్యానన్నారు. ఈ కేసులో తీర్పును వెలువరించిన సమయంలో న్యాయమూర్తులకు ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆవహించి ఉండవచ్చని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఈ కేసులో తనకు సహకరించి, ప్రోత్సహించిన న్యాయనిపుణులు పొడిపిరెడ్డి అచ్యుతదేశాయ్, తన న్యాయవాదులు అల్లంకి రమేష్ తదితరులకు ఉండవల్లి కృతజ్ఞతలు తెలియజేశారు.
రామోజీరావు జైలుకేనా…
దేశంలో అతిశక్తివంతుడైన ఈనాడు అధిపతి రామోజీరావును ఏదో చేయాలన్నది తన ఉద్దేశం కాదని ఉండవల్లి పురుద్ఘాటించారు. చట్టాన్ని బడా వ్యక్తులే ఉల్లంఘిస్తే సమాజం అదుపుతప్పుతుందని, అందుకే న్యాయపోరాటం చేశానన్నారు.
ఈ కేసులో రామోజీరావు దోషిగా తేలితే అక్రమంగా వసూలు చేసిన రూ. 2600 కోట్ల డిపాజిట్లకు అంతే మొత్తం జరిమానా కింద చెల్లించాల్సి ఉంటుందని, 2ఏళ్లు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయన్నారు.
డిపాజిటర్ల కోసం ఈ మెయిల్
మార్గదర్శి ఫైనాన్సియర్స్ వసూలు చేసిన రూ. 2600 కోట్ల డిపాజిట్లను తిరిగి చెల్లించినట్లు సంస్థ తెలిపిందన్నారు. డిపాజిటర్లకు 9.5 శాతం వార్షిక వడ్డీ కింద రూ. 55 కోట్లకు పైగా చెల్లించినట్లు కోర్టుకు తెలిపిందన్నారు. అయితే చెల్లింపులపై తనకు కొన్ని అనుమానాలు ఉన్నాయన్నారు. వడ్డీ కింద రూ. 900 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ కేసులో తెలంగాణా హైకోర్టుకు సహకరించాల్సిందింగా సుప్రీంకోర్టు తనకు సూచించిందని, ఈ నేపథ్యంలో డిపాజిటర్లకు న్యాయం చేసేందుకు [email protected] ప్రత్యేక ఈమెయిల్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. డిపాజిటర్లు తమ వివరాలతో ఈమెయిల్ చేస్తే తగిన న్యాయం జరిగేలా కోర్టు దృష్టికి తీసుకెళతానన్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్పందించేందుకు ఉండవల్లి నిరాకరించారు. అన్ని పార్టీల్లోనూ తనకు మిత్రులు ఉన్నారన్నారు. అయితే తాను బిజెపి విధానాలకు బద్ధ వ్యతిరేకినని స్పష్టం చేశారు.