దివాకర్
ఈ మధ్య కాలంలో మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ సూచనలు, డిమాండ్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పాటిస్తున్నట్లు కన్పిస్తోంది. గతంలో మార్గదర్శి కేసు విషయంలో.. ఇప్పుడు ఏపీ విభజన కేసులో ఉండవల్లి బహిరంగంగా చేసిన సూచనలు, డిమాండ్లను జగన్ ప్రభుత్వం నెరవేర్చడం గమనార్హం. ఏదీ ఏమైనా ఉండవల్లి కృషి ఫలించింది. విభజన కేసును సమాధి చేయాలన్న ఎపి ప్రభుత్వమే దిగి వచ్చి, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడమే ఇందుకు నిదర్శనం. ఉండవల్లి. లేవనెత్తిన అంశాలతో ఏకీభవిస్తూ అఫిడవిట్ దాఖలు చేయడం గమనార్హం. ఈ కేసు తుది విచారణ ఎపి ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే ప్రత్యేకహోదా, ఆర్థిక లోటు భర్తీ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధుల వంటి విభజన హామీలన్నీ అమలయ్యే అవకాశాలు ఉన్నాయని ఉండవల్లి ఆశాభావం వ్యక్తం చేశారు. ఎపి ప్రజలంతా ఇదే కోరుకుంటున్నారు.
అయితే, ఎన్నో సంక్షేమ పధకాల గురించి భారీ ఎత్తున ప్రచారం చేసుకుంటున్న జగన్ ప్రభుత్వం ఎపికి న్యాయం చేయాలని కోరుతూ దాఖలు చేసిన కీలక అఫిడవిట్ గురించి బహిరంగంగా చెప్పుకోలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. వైసిపి ప్రభుత్వానికి అనధికార ప్రతినిధిగా ఉండవల్లి ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం.
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం జరిగిందన్నది నిర్వివాదాంశం. ఎపికి న్యాయం చేసేందుకు తొమ్మిదేళ్లుగా ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో కేసు వేసి పోరాడుతున్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణాతో తంటాలు వస్తాయన్న ఉద్దేశంతో తెలుగుదేశం, మొన్నటి వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారధ్యంలోని వైఎస్సార్ సిపి ప్రభుత్వాలు ఈకేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలేదు. అయితే మొన్నటి విచారణ సందర్భంగా ఎపి తరుపున అభిషేక్ మనుసింఘ్వీ పండోరా ఫైల్స్ లాంటి ఈకేసును సమాధి చేయాలని వాదించడాన్ని ఉండవల్లి బహిరంగంగా తప్పుపట్టడంతో జగన్ సర్కారు దిగిరాక తప్పలేదు. ఫిబ్రవరి 23న ఎపి ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందని ఉండవల్లి చెప్పారు. ఈసందర్భంగా ప్రభుత్వాన్ని అభినందించారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు అంశంపై ఎపి హైకోర్టులో మాజీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు దాఖలు చేసిన పిల్ లో తాను కూడా ఇంప్లీడ్ అయ్యాయనని, ఈ కేసులో కూడా ఎపి ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తే ఎపికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఉండవల్లి చెప్పారు. ఈ కేసును ఏప్రిల్ 11వ తేదీకి వాయిదా వేసినట్లు ఉండవల్లి విలేఖర్ల సమావేశంలో చెప్పారు. అయితే ఈ కేసులో కేంద్రం ఇప్పటి వరకు అఫిడవిట్ దాఖలు చేయకుండానే చేసినట్లు చెబుతోందని, దీనిపై తమ న్యాయవాది అల్లంకి రమేష్ అఫిడవిట్ కాపీ ఇవ్వాల్సిందిగా లేఖ రాశారన్నారు. సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో ఎపికి జరిగిన అన్యాయం, విభజన హామీలపై పార్లమెంటులో చర్చించాలని ఉండవల్లి ఆకాంక్షించారు.
హైదరాబాద్ స్థాయి కష్టమే!
విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ నగరాలకు కేంద్రం ధారాళంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేసినా మరో 25ఏళ్ల వరకు హైదరాబాద్ స్థాయిని అందుకోవడం కష్టమేనని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ప్రత్యేకహోదా, పన్ను రాయితీలు కల్పిస్తే పరిస్థితిలో మార్పు రావచ్చన్నారు. ప్రత్యేక పన్ను రాయితీలు ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదని కేంద్రం అబద్ధాలు చెబుతోందని, ఇప్పటికీ ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ప్రత్యేక పన్ను రాయితీలు అమలు చేస్తున్నారని ఉండవల్లి వెల్లడించారు.
కెసిఆర్ రామోజీకి భయపడుతున్నారా?
తెలంగాణా ఉద్యమ సమయంలో వెయ్యి నాగళ్లతో రామోజీ ఫిలిం సిటీని దున్నేస్తానని ప్రకటించిన తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పుడు పత్రికాధిపతి రామోజీరావుకు భయపడుతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇదే విషయాన్ని ఉండవల్లి ప్రస్తావిస్తూ రామోజీ ఫిలిం సిటీలో భూగరిష్ట పరిమితికి మించి 1900 ఎకరాల భూమి ఉందని, దాన్ని స్వాధీనం చేసుకోకపోతే గతంలో సీలింగ్ చట్టం కింద స్వాధీనం చేసుకున్న భూముల యజమానులు కూడా తమ భూములు తిరిగి ఇప్పించాలని ఉద్యమించే అవకాశాలు ఉన్నాయన్నారు. మార్గదర్శి చిట్ ఫండ్ పై తాను దాఖలు చేసిన కేసు కూడా ఏప్రిల్ 11న విచారణకు వస్తుందని ఉండవల్లి తెలిపారు. ఈకేసును త్వరగా తేల్చాలని మార్గదర్శి తరుపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారన్నారు
అదానిని అంటే అంత పౌరుషం ఎందుకూ?
పారిశ్రామికవేత్త అదానీని, ప్రధాని నరేంద్రమోడీని ముడిపెడుతూ ఇటీవల కాంగ్రెస్ నేత ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనను అరెస్టు చేశారని ఉండవల్లి గుర్తుచేస్తూ ఒక్కసారిగా ప్రపంచస్థాయి కుబేరుడిగా ఎదిగిన గౌతమ్ అదానీని మోడీ ప్రభుత్వం ఎందుకు తన వాడిగా భావిస్తోందో అర్థం కావడం లేదన్నారు. హిండెన్బర్గ్ నివేదిక పై విచారణ జరిపిస్తే తప్పేమిటని ఉండవల్లి ప్రశ్నించారు.