వోలేటి దివాకర్
తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తో ఆదివారం జాతీయ రాజకీయాలపై సుమారు ఐదుగంటల పాటు చర్చించిన మర్నాడు రాజమహేంద్రవరం మాజీ ఎంపి , రాజకీయ మేధావి ఉండవల్లి అరుణ్ కుమార్ హడావుడిగా విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సాధారణంగా ఆయన ఉదయం 11 గంటల తరువాతే విలేఖర్ల సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. సోమవారం రాత్రి 7 గంటలకు ఈసమావేశాన్ని ఏర్పాటు చేయడం, అప్పటికే ఉండవల్లికి కెసిఆర్ జాతీయ స్థాయిలో ప్రారంభించనున్న బీఆర్ ఎస్ పార్టీ లో ఎపి ఇన్చార్జి పదవిని ఇస్తారని, టిఆర్ఎస్ తరుపున రాజ్యసభకు పంపుతారని మీడియాలో ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితుల్లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే, ఉండవల్లి ఊహాగానాలకు చెక్ పెడుతూ , ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న తాను పదవులు, పోస్టులకు దూరమని స్పష్టం చేశారు. గతంలో కూడా ఉండవల్లి పలుసార్లు ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఏది ఏమైనా ఉభయ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఉండవల్లి పేరు మరోసారి మారుమోగింది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన కెసిఆర్ , ఉండవల్లి భేటీ సాయంత్రం 5 గంటల వరకు సుదీర్ఘంగా సాగింది. ఈ చర్చల్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా పాల్గొన్నారు. ఈసందర్భంగా తన కోసం కెసిఆర్ శాఖాహారాన్ని భోజనాన్ని ఏర్పాటు చేశారని ఉండవల్లి వెల్లడించారు. బిఆర్ఎస్ పార్టీ , పదవుల గురించి చర్చ జరగలేదని, బీజేపీని ఎదుర్కొనే అంశంపై పైనే చర్చలు జరిగాయని ఉండవల్లి స్పష్టం చేశారు. బిజెపికి వ్యతిరేకంగా మరింత దూకుడుగా స్వరాన్ని పెంచాలని కెసిఆర్ ఉండవల్లికి సూచించారు.
ఉండవల్లి , కెసిఆర్ అభిప్రాయాలు ఒక్కటే !
బిజెపి , కాంగ్రెస్ పార్టీల విషయంలో కెసిఆర్ , ఉండవల్లి అభిప్రాయాలు కలిశాయి. అందుకే మొదటి నుంచి బిజెపి మతతత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న ఉండవల్లిని కెసిఆర్ ఆహ్వానించి , చర్చలు జరిపారు. దేశంలో బిజెపి బలపడుతుండగా, కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతోందని ఉండవల్లి విశ్లేషించారు. కెసిఆర్ దివంగత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విధానాలకు అనుకూలమని, అయితే, తాను మాత్రం ఇప్పటికీ తనకు ఇష్టమైన నెహ్రూతో పాటు , కాంగ్రెస్ విధానాలకు కట్టుబడే ఉన్నానని తెలిపారు. అలాంటి ఉండవల్లి కాంగ్రెస్ ను వ్యతిరేకించే కెసిఆర్ తో కలిసి పనిచేయడం కాంగ్రెస్ వాదులను ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
దుబ్బాక , హుజరాబాద్ ఉపఎన్నికలు విజయం , హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో అధిక సీట్లు సాధించిన బిజెపి తెలంగాణా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీకి బలమైన ప్రత్యర్థిగా ఎదుగుతోంది. ఇదే కెసిఆర్ కు ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే కెసిఆర్ జాతీయ స్థాయిలో బిజెపిని దీటుగా ఎదుర్కొనేందుకు బిఆర్ఎస్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, తెలంగాణాలో కన్నా ఎపిలోనే బిజెపి బలంగా ఉందని ఉండవల్లి చెప్పారు. ఎపిలో అధికార వైసిపి , ప్రతిపక్ష టిడిపి పార్టీలు బిజెపిని ఎదిరించే పరిస్థితుల్లో లేవని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బిజెపికి మిత్రపక్షంగా ఉన్నారని ఉండవల్లి చెప్పారు. ఈనేపథ్యంలో రాష్ట్రంలోని 25 పార్లమెంటు సీట్లు బిజెపి గుప్పిట్లో ఉన్నట్టేనని ఆయన విశ్లేషించారు.
మమత కన్నా కెసిఆర్ మేలు
బిజెపిని ఎదుర్కోవడంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కన్నా కెసిఆరే మేలని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. మమత బెంగాలీలోనే మాట్లాడగరని, కెసిఆర్ హిందీ, ఇంగ్లీషులో కూడా తన అభిప్రాయాలను ప్రజలకు స్పష్టంగా తెలియజెప్పగలరని ఉండవల్లి పేర్కొన్నారు.
విపక్షాలు విడిపోయి …. బిజెపిని ఎదుర్కోగలవా ?
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని కెసిఆర్ తక్కువగా అంచనా వేస్తున్నా … ఇప్పటికీ బిజెపి కాంగ్రెస్ పార్టీయే తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించేందుకు కాంగ్రెస్ సహా దేశంలోని బిజెపిని వ్యతిరేకించే పార్టీల నేతలతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో ఈనెల 15 న ఢిల్లీలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ పాల్గొనే ఈ సమావేశానికి దూరంగా ఉండాలని కెసిఆర్ భావిస్తున్నారు. కాంగ్రెస్ తదితర పార్టీలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శరద్ పవార్ ను రాష్ట్రపతి బరిలోకి దించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా విపక్షాలు విడిపోయి ఎంత పోరాటం చేసినా అంతిమంగా బిజెపియే విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కీలక విషయాన్ని కెసిఆర్ లాంటి నేతలు విస్మరిస్తారా అన్నది రాజకీయ విశ్లేషకుల అనుమానం.