వోలేటి దివాకర్
రాష్ట్ర విభజనను ఆమోదిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసి నేటికి పదేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఒకప్పటి కాంగ్రెస్ వాది, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆదివారం విలేఖర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ కు బ్రిటీష్ పాలనాకాలం నాటి కన్నా తీరని అన్యాయం జరిగిందని, అయినా రాష్ట్రంలోని అధికార ప్రతిపక్షాలు నోరుమెదపకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన తీర్మానంలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా, హైదరాబాద్ ను పదేళ్ల పాటు ఉభయ రాష్ట్రాల రాజధానిగా తీర్మానించారన్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు ఇప్పటికీ పునాది దశ దాటలేదని, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విభజన జరిగిన ఏడాదిలోనే వివిధ కారణాల వల్ల హైదరాబాద్ ను వదిలి వచ్చేశారన్నారు. దుగరాజపట్నం పోర్టు, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ వంటి హామీలు ఇప్పటికీ హామీలుగానే మిగిలాయన్నారు. ఎపికి మంజూరైన 6 హైడ్రో పవర్ ప్రాజెక్టులను అదానీకి కట్టబెట్టడాన్ని ఉండవల్లి తప్పుపట్టారు. పైగా విశాఖపట్నం స్టీలు ప్లాంటును కూడా అమ్మేశారన్నారు.
అవిశ్వాసం తీర్మానంపై గళమెత్తండి
దేశంలో కెల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం బలంగా ఉందని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఎపిలో నోటా కన్నా తక్కువగా ఒకశాతం ఓట్లు మాత్రమే బిజెపికి పోలయ్యాయని, అయినా జనసేనతో సహా అధికార వైఎస్సార్సిపి, ప్రతిపక్ష టిడిపి పార్టీలు నరేంద్రమోడీ ప్రభుత్వానికి లొంగిపోయాయని విమర్శించారు. ఎపికి ఇంత అన్యాయం చేసినా మోడీ ప్రభుత్వానికి ఎందుకు మద్దతు ఇస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. మణిపూర్ అంశంపై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని అధికార వై ఎస్సార్సిపి వ్యతిరేకించడంపై విస్మయం వ్యక్తం చేస్తూ….అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో పాల్గొని రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై గళమెత్తాలని వై ఎస్సార్ సిపి, టిడిపి ఎంపీ లకు పిలుపునిచ్చారు.
గుజరాత్ నుంచి మణిపూర్ కు మతతత్వ మంటలు
గుజరాత్ రాష్ట్రంలో గోద్రా తరహాలో హిందూ, ముస్లింల మధ్య వైషమ్యాలు సృష్టించి నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చారని ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. గుజరాత్ అల్లర్లపై ప్రశ్నించిన డిజిని 20 ఏళ్ల తరువాత అరెస్టు చేయించి, జైల్లో పెట్టారని ఉండవల్లి వెల్లడించారు. ఇదే ఫార్ములాను మణిపూర్లో అనుసరిస్తూ, మైనార్టీ గిరిజనులైన కుకీలు, మెజారిటీ మైతీల మధ్య మరణహోమాన్ని సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. క్రైస్తవులైన కుకీలపై మణిపూర్లో తీవ్ర దారుణాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మోడీ మణిపూర్ దారుణాలపై మౌనం వహిస్తున్నారన్నారు.
రవిప్రకాష్ గురించి ఎందుకు ప్రశ్నించలేదు?
మార్గదర్శిలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకుంటే తెలుగుదేశం పార్టీతో సహా అన్ని పార్టీలు మీడియా పై దాడిగా అభివర్ణిస్తున్నాయని అదే ప్రముఖ జర్నలిస్టు టీవీ 9 రవిప్రకాష్ ను అరెస్టు చేసి, జైల్లో పెడితే ఎవరూ ఎందుకు ప్రశ్నించలేదని ఉండవల్లి ఎద్దేవా చేశారు. రవిప్రకాష్ కూడా జర్నలిస్టే కదా అని నిలదీశారు. ఆయనకో న్యాయం..రామోజీరావుకో న్యాయమా అని ప్రశ్నించారు. పైగా రవిప్రకాష్ అరెస్టుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందనీ, అదే మార్గదర్శిపై చర్యల్లో తప్పేముందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సమర్థించారని గుర్తుచేశారు. రాజగురువైన రామోజీరావుకు చెందిన ఈనాడు పత్రిక వచ్చే ఎన్నికల్లో తనకు ఉపయోగపడుతుందని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు భావిస్తున్నట్టున్నారని అభిప్రాయపడ్డారు.
కంబాలచెరువును కప్పెట్టేశారు…
దక్షిణ కాశీగా పేరొందిన రాజమహేంద్రవరం చారిత్రక ఔన్నత్యాన్ని కాపాడాలని స్థానిక ప్రజాప్రతినిధులకు ఉండవల్లి అరుణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. నగరాన్ని ముంపు నుంచి కాపాడే కంబాలచెరువును సగం వరకు కప్పెట్టేశారని,స్వాతంత్ర్య సమరయోధుడు బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం పేరిట ఉన్న చారిత్రాత్మక సుబ్రహ్మణ్య మైదానాన్ని మూసివేసి, రూపుమాపే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆ ప్రయత్నాలను విరమించుకోవాలన్నారు. సుబ్రహ్మణ్య మైదానంతో రాజమహేంద్రవరం ప్రజలకు భావోద్వేగ సంబంధం ఉందన్నారు. అభివృద్ధి అంటే చెరువులు కప్పెట్టడం, మైదానాలు మూసివేయడం కాదని, ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే నిజమైన అభివృద్ధి అని అన్నారు. అగ్నిమాపకశాఖ డిజిగా మాదిరెడ్డి ప్రతాప్ ఆసుపత్రుల నిర్మాణం, నిర్వహణపై తెచ్చిన జిఓ వల్ల ఎలాంటి ప్రమాదాలు, విపత్తులకు ఆస్కారం ఉండదని, జగన్ ప్రభుత్వం ఈ జిఓలోని నిబంధనలను పూర్తిగా నీరుగార్చే ప్రయత్నాలు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ జిఓను యధాతథంగా అమలు చేయాలని ఉండవల్లి సూచించారు.
కామన్ సివిల్ కోడ్ పై జనం-మనం
రాష్ట్ర విభజన సమయంలో దశ దిశ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మాక్ పార్లమెంటులు, చర్చాగోష్టులు నిర్వహించిన ప్రముఖ జర్నలిస్టు కె రామచంద్రమూర్తి ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వం అమల్లోకి తేవాలని భావిస్తున్న కామన్ సివిల్ కోడ్ అంశంపైఆగస్టులో రాజమహేంద్రవరంలో సదస్సును నిర్వహించనున్నట్లు ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. మేము ప్రజలం (వుయ్ ద పీపుల్) పేరుతో మొదలయ్యే రాజ్యాంగంలోని తొలి పదాన్ని స్ఫూర్తిగా తీసుకుని జనం-మనం కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. ప్రజాస్వామిక భారతదేశంలో యుసిసి, మణిపూర్ వంటి అంశాలపై పార్లమెంటులో కూడా చర్చలు జరగడం లేదని, ఈ నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం. తెచ్చేందుకు ఇలాంటి సదస్సులు ఎంతో దోహదం చేస్తాయన్నారు.