- సుప్రీంకోర్టులో ఉండవల్లి తాజా పిటిషన్
- ప్రధాని, దేశీయాంగమంత్రి ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందన్న నేపథ్యంలో
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తిరిగి విలీనమయ్యే ప్రసక్తి లేదు
రాష్ట్ర విభజన జరిగిన తీరును వ్యతిరేకిస్తూ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా అత్యవసర విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర విభజన జరిగి శుక్రవారం నాటికి ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాలు రాష్ట్ర విభజన సందర్భంగా ఎపికి చేసిన అన్యాయం పై పార్లమెంటులోనే ఆవేదన వ్యక్తం చేశారు . ఈనేపథ్యంలో విభజనకు సంబంధించిన అదనపు సమాచారంతో తన న్యాయవాది అల్లంకి రమేష్ ద్వారా ఉండవల్లి పిటిషన్ దాఖలు చేశారు. విభజన బిల్లు ఆమోదం పొందే నాటికి పార్లమెంటులో మెజార్టీ సభ్యులు దానికి వ్యతిరేకంగా ఉన్నారనీ, దీంతో పార్లమెంటు తలుపులు మూసి, రాజ్యాంగ విరుద్ధంగా బిల్లును ఆమోదించారని ఉండవల్లి ఆది నుంచి వాదిస్తున్నారు. ఈ మేరకు గతంలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆనాటి అన్యాయం పై ఆయన తగిన ఆధారాలు కూడా సమీకరించారు. ఆయనతో పాటు 110 మంది విభజనకు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేసినా ఉండవల్లి మాత్రమే పట్టువదలని విక్రమార్కుడిలా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. పార్లమెంటులో మోదీ , అమిషా ద్వయం ఎపికి అన్యాయం జరిగిందని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు విచారణలో భాగమై, రాష్ట్రానికి న్యాయం జరిగేలా కృషిచేయాలని ఉండవల్లి కోరుతున్నారు. అలాగే పార్లమెంటులో ఈ అంశం చర్చకు వచ్చేలా పట్టుబట్టాలన్నారు. ఈ విషయంలో అధికార వైసిపికి, టిడిపి కూడా మద్దతు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఉండవల్లి ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంటులో రాష్ట్ర విభజనపై ఆందోళన జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంపిగా తమతో పాటే ఉన్నారనీ, ఆయన కూడా సస్పెన్షన్ కు గురయ్యారనీ ఉండవల్లి గుర్తుచేసుకున్నారు. ఆ నాటి విషయాలను జగన్ గుర్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Also read: గోరంట్ల మళ్లీ రాజమహేంద్రవరం రాజకీయాల్లో చక్రం తిప్పుతారా?!
ప్రత్యేక హోదా తొలగింపు వట్టిదేనట
రాష్ట్ర విభజన సందర్భంగా నష్టపోయిన ఎపికి ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే పూర్తి వ్యయం భరిస్తామనీ, ఆర్థిక లోటు భర్తీ చేస్తామనీ, పన్ను రాయితీలు కల్పిస్తామనీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో కూడా తీర్మానించారు. అయితే, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ఆధ్వర్యంలోని నీతి ఆయోగ్ ప్రత్యేక హోదా దేశంలో ఏరాష్ట్రానికి లేదనీ, పన్ను రాయితీలు కల్పించలేమనీ, రైల్వేజోన్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే, డిసెంబర్ 2015 లో అమలాపురానికి చెందిన న్యాయవాది రమేష్ చంద్ర వర్మ ఆర్టిఐ ప్రకారం సమాచారం కోరగా, అప్పటికీ ప్రత్యేకహోదా అమల్లో ఉన్నట్లు నీతి ఆయోగ్ వెల్లడించిందని ఉండవల్లి తెలిపారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ప్రధాని మోడీ, బిజెపి నేతలు ఒకవైపు చెబుతూనే మరోవైపు ఏపికి న్యాయం చేయకపోవడం దారుణమని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు రాష్ట్ర విభజన చర్చ సందర్భంగా రాష్ట్రానికి ఐదేళ్లు కాదు …10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారనీ, ఈ అంశాన్ని బిజేపి తన ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా చేర్చిందనీ ఉండవల్లి గుర్తుచేశారు.
Also read: రాజమహేంద్రవరంలో ఉజ్జయిని తరహా మహా కాళేశ్వరాలయం
కెసిఆర్ నోరు విప్పాలి …
కేంద్రంలోని బిజెపి విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలను కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నోరువిప్పి ఎపికి మద్దతు ప్రకటించాలని ఉండవల్లి అరుణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజనపై చర్చ సందర్భంగా డిఎంకె, టిఎంసి, సమాజ్వాదీ పార్టీ, సిపిఎం, ఆర్జీడీ వంటి పార్టీలు వ్యతిరేకించాయని ఉండవల్లి గుర్తుచేస్తూ, ఎపికి జరిగిన అన్యాయంపై కెసిఆర్ మద్దతు ప్రకటిస్తే ఆయా పార్టీలు కూడా ఈ అంశానికి మద్దతు తెలిపే అవకాశం ఉంటుందని, తద్వారా కెసిఆర్ కు దేశవ్యాప్తంగా రాజకీయ మద్దతు పెరుగుతుందని విశ్లేషించారు. తెలంగాణా, ఆంధ్రా మళ్లీ కలవడం అసాధ్యం అని, ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
వివేకా హత్య కేసుపై వదంతులు తగవు
ముఖ్యమంత్రి జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డి హత్యపై వదంతులు తగవనీ, ఆ హత్యపై సిబిఐ తన పని తాను చేస్తోందని, ఈ విషయంలో వదంతులు సృష్టించడం, తెలుగుదేశం అనుకూల మీడియా సంస్థలు ఏకంగా శిక్షలు కూడా ఖరారు చేస్తూ వార్తలు వండటం తగదని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ కేసులో చార్జిషీటు దాఖలైన తరువాత న్యాయపరంగా వాదనలు వినిపించే అవకాశం ఉంటుందన్నారు.
Also read; ఎపికి అన్యాయం జరిగి ఎనిమిదేళ్లు… చారిత్రాత్మక తప్పిదంలో బిజెపికీ వాటా!