వొలేటి దివాకర్
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై మాజీ ముఖ్యమంత్రి , టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు గానీ , ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు గానీ సరైన అవగాహన లేదని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. కాఫర్ డ్యామ్ నిర్మించకుండానే డయాఫ్రంవాల్ నిర్మించారని , దీంతో గోదావరి వరద ఉధృతికి కాఫర్ డ్యామ్ కొట్టుకొనిపోవడంతో పాటు , డయాల్ ఫ్రంవాల్ దెబ్బతిందని ఆయన చెప్పారు. వీటి నిర్మాణానికి రూ. 2 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారన్నారు. ప్రజాధనం 2 వేల కోట్లు దుర్వినియోగానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఈ విషయంలో బాధ్యులను తేల్చాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు . ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రగతి, నిధుల వినియోగంపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని మరోసారి డిమాండ్ చేశారు.
Also read: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే…..
భద్రాచలం ఎలా మునుగుతుంది?
పోలవరం ప్రాజెక్టు ప్రాథమిక దశలో ఉండగానే భద్రాచలం మునిగిపోతుందని తెలంగాణా ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందని ఉండవల్లి వ్యాఖ్యానించారు . జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంను ఇంజనీరింగ్ నిపుణులు అంత ఆషామాషీగా కట్టరని స్పష్టం చేశారు .
ఈడీ ..మోడీ …. ఎవరిపైనైనా దాడి
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ను నరేంద్రమోడీ ప్రభుత్వం తీవ్రంగా దుర్వినియోగం చేస్తోందని, అందుకే ఈ మధ్య ఈడీ మోడీ అన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా సాగుతోందన్నారు. ఈడి తలుచుకుంటే ఆధారాలు లేకుండా రూ. 20 వేలు దాటి చెల్లింపులు, కొనుగోళ్లు జరిపిన సామాన్య ప్రజలపై కూడా దాడులు చేయవచ్చని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఈడి కేసులు ఎదుర్కొంటున్న నేతలు బిజెపిలో చేరగానే పునీతులవుతున్నారని ఎద్దేవా చేశారు. కంపెనీ చట్టం కింద నమోదై ట్రస్టు తరహాలో నడుస్తున్న నేషనల్ హెరాల్డ్ సంస్థలో ఒక్క రూపాయి నిధుల దుర్వినియోగానికి అవకాశం లేదన్నారు. అయినా మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, యువేనత రాహుల్ గాంధీలను ఇబ్బందులకు గురిచేసేందుకు ఈడి కేసులు నమోదు చేసి, వేధిస్తోందన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిందని, దాని నిర్వాహకులైన జవహర్ లాల్ నెహ్రూ, ఇతర కాంగ్రెస్ నేతలు జైళ్లకు కూడా వెళ్లారని ఉండవల్లి గుర్తు చేశారు. ఈడి దుర్వినియోగాన్ని ప్రజలకు వివరించడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు.
Also read: సార్వత్రిక ఎన్నికల సారథి సోము వీర్రాజే ? !
మార్గదర్శికి రూ. 6 వేల కోట్ల జరిమానా … రామోజీకి 2 ఏళ్ల జైలు
నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిన కేసులో నేరం రుజువైతే మార్గదర్శి సంస్థకు రూ. 6 వేల కోట్ల జరిమానా, మార్గదర్శి అధినేత రామోజీరావుకు 2 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని ఉండవల్లి అరుణ్ కుమార్ వెల్లడించారు. అయితే పరిస్థితులు ఎదురుతిరిగితే ఈకేసులో తానే జైలుకు వెళ్లాల్సి రావచ్చని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉన్న ఈకేసులో ఇప్పటి వరకు రామోజీరావు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలేదని, ఉభయ తెలుగు రాష్ట్రాలను ప్రతివాదులుగా చేర్చలేదని, అయినా ఈ కేసును త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నాలు జరగడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. రామోజీరావు అంతటి శక్తివంతుడని, మోడీ ప్రభుత్వం ఆయనకు త్వరలో భారతరత్న పురస్కారాన్ని ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి హైకోర్టులో హడావుడిగా ఈ కేసును విచారించి, ముగించే ప్రయత్నాలు చేయగా తాను సుప్రీంకోర్టులో స్పెషల్ లీవు పిటిషన్ దాఖలు చేశానని చెప్పారు. మార్గదర్శి నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు స్వీకరించినట్లు 2005 లోనే గుర్తించి నోటీసులు జారీ చేసినట్లు మాజీ రిజర్వుబ్యాంకు గవర్నర్ వైవి రెడ్డి తన ఆత్మకధలో రాశారని చెప్పారు. మార్గదర్శి కుంభకోణాన్ని వెలికితీయగానే రామోజీరావు రిలయన్స్ సంస్థ సహకారంతో డిపాజిట్లను తిరిగి చెల్లించారని, ఈ వ్యవహారంలో కొన్నీ సూట్ కేసు కంపెనీలను ఆర్ ఓ సీ గుర్తించిందని ఉండవల్లి వెల్లడించారు .
Also read: పోలవరం కొట్టుకుపోతే ….. ఆ నివేదిక ఏం చెప్పింది?
జయప్రకాష్ సిద్ధాంతంతో సర్వనాశనం
దేశ ఆర్థికాభివృద్ధితో పాటు , ప్రజా సంక్షేమం కోసం సమ్మిళిత పెట్టుబడిదారీ విధానాన్ని నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టారని ఉండవల్లి తెలిపారు . అయితే దేశానికి పెట్టుబడిదారీ విధానమే మేలని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ సమర్థించడం తగదన్నారు. ఇటీవల జిఎస్ఎల్ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరైన జయప్రకాష్ విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణను సమర్థించారని ఈ సందర్భంగా ఆయన వాదనను తాను తీవ్రంగా వ్యతిరేకించానని వెల్లడించారు. పెట్టుబడిదారీ విధానంపై చర్చకు సిద్ధమని తాను ప్రటించానని త్వరలోనే ఆయన ఈ అంశంపై చర్చకు రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన పెట్టుబడిదారీ విధానం వల్ల దేశం సర్వనాశనమవుతుందని, కార్మికులకు అన్యాయం జరుగుతుందని ఉండవల్లి విశ్లేషించారు. ప్రభుత్వరంగ సంస్థ ఎస్ఐసిని దాని విలువలో 3.2 శాతానికే విక్రయించారని ఉండవల్లి గుర్తుచేశారు. ఎపి ప్రభుత్వ అప్పులపై గగ్గోలు పెడుతున్నారని, అయితే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడేళ్లలోనే అంతకు మునుపుకన్నా రెట్టింపు అప్పులు తెచ్చిందని ఉండవల్లి వెల్లడించారు.