వోలేటి దివాకర్
రాష్ట్ర విభజన అంశంపై కోర్టులో ఫిబ్రవరి 22న వాయిదా ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ సూచించారు. రాజమహేంద్రవరంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సరిగ్గా ఇదే రోజున తొమ్మిదేళ్ల క్రితం లోక్ సభలో అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ ను విభజించారని గుర్తుచేశారు. సుప్రీంకోర్టులో ఈనెల 22న విభజన కేసుపై వాయిదాకు ఇంకా నాలుగు రోజులే సమయం ఉందని ఆయన అన్నారు. గతంలో తన వాదన సరైందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నందున రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ వెయ్యడానికి ఇదే ఆఖరి అవకాశమని ఆయన పేర్కొన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రస్తుత వైసిపి ప్రభుత్వానికి ఏపీ హక్కుల గురించి పార్లమెంట్ లో చర్చకు పెట్టి, ఓటింగ్ జరిపిస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పానని ఉండవల్లి గుర్తుచేశారు. గతంలో టిడిపి వాళ్ళు చర్చకు పెట్టలేదని, కనీసం వైసిపి ఎంపీల ద్వారా చర్చ పెట్టేలా చూడాలన్నారు.
Also read: ‘వట్టి’కి గురువుగాడు!
మోడీ, అమిత్ షాలే ఒప్పుకున్నారు
రాష్ట్ర విభజన అన్యాయమని, ఏపీని ముంచేశారని సాక్షాత్తూ ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా నిండు సభలో చెప్పినపుడు దానిపైనే చర్చ పెట్టి, నిగ్గు తేల్చాల్సిన అవసరం లేదా అని ఆయన వాపోయారు. కేంద్రంపై పోరాటం చేస్తేనే విభజన హక్కులు సాధిస్తామని గుర్తించాలన్నారు. ఇందుకోసం అన్నిపార్టీలనూ కలుపుకుని వెళ్లాలని ఆయన చెబుతూ ఆ దిశగా రాష్ట్ర సర్కార్ అడుగులు వేస్తుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్ లో ఉన్న ఆఫీసులు మన రాష్ట్రానికి రాకుండా ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదనీ, పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు వస్తారని ఆయన అభిప్రాయ పడ్డారు. టివి చానల్స్ ఆఫీసులు, హెరిటేజ్ వంటి సంస్థల ఆఫీసులు .. ఒకటేమిటి ఇలా అన్నీ హైదరాబాద్ లోనే ఉంటె ఇక్కడికి ఎవరొస్తారని ఆయన అన్నారు. పెట్టుబడులు పెట్టేవాళ్లకు భూములు, నీరు, కరెంట్ ఇలా అన్నీ వసతులు కల్పించాల్సి ఉంటుందనీ, ఇవన్నీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు కేంద్రాన్ని అడగాల్సిన అవసరం ఉందనీ అన్నారు.
Also read: ఎపికి జగన్ ద్రోహం చేస్తారా?! ఉండవల్లి సలహా పాటిస్తారా?
అనపర్తి ఘటన వైసీపీకి మైనస్సే
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటన సందర్బంగా నిన్నటి రోజున అనపర్తిలో చంద్రబాబును అడ్డుకోవడం గురించి అడిగిన ప్రశ్నకు ఉండవల్లి స్పందిస్తూ ఇలాంటి ఘటన వైసీపీకి మైనస్ అవుతుందన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేయడం, చంద్రబాబు, ఆ తర్వాత షర్మిల, తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర, ఇప్పుడు లోకేష్ పాదయాత్ర చేయడం చూస్తున్నామని, అయితే నిన్న చంద్రబాబును అడ్డుకున్న పరిస్థితి ఎప్పుడూ చూడలేదని ఆయన ప్రస్తావించారు. అడ్డుకోవడం వంటి చర్యల వలన ఎదుటివాళ్ళ మైలేజి పెరుగుతుందని గ్రహించాలని ఉండవల్లి పేర్కొంటూ మాజీ ప్రధాని ఇందిరాగాంధీని జైలులో పెట్టడం వలన మళ్ళీ ఆమె నెగ్గి ప్రధాని అయిందని, అంతెందుకు జగన్ ని జైలులో పెట్టడం వల్లే కదా, ప్రజల్లో సానుభూతి వచ్చి, సీఎం అయింది అని అయన గుర్తుచేశారు. రాజకీయాల్లో హత్యలుండవని, ఆత్మహత్యలే ఉంటాయన్నారు.
అప్పుడే బి ఆర్ ఎస్ కు మనుగడ
బి ఆర్ ఎస్ పార్టీ పెట్టి జాతీయ పార్టీగా మార్చిన సీఎం కేసీఆర్ ముందుగా పోలవరం విషయంలో ఏపీకి సహకరించాలని, అలాగే హైదరాబాద్ లో ఉన్న ఆస్తుల్లో ఏపీకి రావాల్సినవి పంచిపెట్టాలని అప్పుడే జాతీయ పార్టీ అని చెప్పుకోడానికి వీలవుతుదని ఉండవల్లి ఒక ప్రశ్నకు సమాధానంగా వ్యాఖ్యానించారు. పక్కనే ఉన్న ఆంద్రప్రదేశ్ తోనే విషయం తేల్చలేనపుడు దేశంలో సమస్యలు ఎలా తీరుస్తారని అనుకోవడం సహజమన్నారు.
Also read: సత్యం రామలింగరాజుకో న్యాయం … రామోజీరావుకో న్యాయమా?!
ఆదానీ ఎదుగుదలపై అనుమానాలు
అదానీ వ్యవహారంలో అనుమానాలు రావడం సహజమని ఉండవల్లి మరో ప్రశ్నకు సమాధానంగా వ్యాఖ్యానించారు. మోడీ ప్రధాని అయ్యే సమయానికి 280 మిలియన్ డాలర్లతో ప్రపంచ కుబేరుల్లో 309వ స్థానంలో ఉన్న అదానీ లక్షకు పైగా కోట్ల డాలర్లతో 5వ స్థానానికి వెళ్లడం చూస్తే ఏమనుకోవాలని ఆయన అన్నారు. పైగా కరోనా సమయంలో అందరూ దెబ్బతింటే అదానీ ఆస్తులు అలా పెరిగిపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. ఆదానీ బొగ్గు దిగుమతి చేసుకుంటున్న సమయంలో రెండున్నర శాతం ఉన్న దిగుమతి సుంకం సున్నా శాతానికి చేయడం, కోల్ ఇండియా ద్వారా 12మిలియన్ టన్నుల బొగ్గు దిగుమతి చేయించడం, ఆ వెనువెంటనే ఎన్టీపిసి నుంచి వేల కోట్ల రూపాయల ఆర్డర్ అదానీకి రావడం చూస్తే, అధికారంలో ఉన్నవాళ్లు సహకరి స్తున్నట్లు అనుమానించడం సహజమని ఉండవల్లి పేర్కొన్నారు. గతంలో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉండగా దుర్గాపూర్ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడానికే ప్రయివేటు వ్యక్తులు వెళ్తే, లాభదాయకమైన ఈ వ్యాపారం ప్రభుత్వమే చేయాలని, ప్రభుత్వం కంటే ఎవరూ ఎక్కువ కాదని ప్రభుత్వ రంగంలో దుర్గాపూర్ ఫ్యాక్టరీ పెట్టారని ఆయన గుర్తుచేశారు.
Also read: ఉండవల్లికి ఊరట…రామోజీకి చుక్కెదురు!