వోలేటి దివాకర్
స్వాతంత్య్ర సమరంలో భాగంగా సాగిన “ఉప్పు సత్యాగ్రహం” స్పూర్తితో పాన్ ఇండియా స్థాయిలో “ఉక్కు సత్యాగ్రహం” సినిమా రాబోతోంది.. “విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు” పేరిట విశాఖ స్టీల్‌ప్లాంట్ సాధన కోసం ఆనాడు సాగిన పోరాటం, దాని ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ పరిరక్షణ కోసం ఇప్పుడు నడుస్తున్న పోరాటాల ఇతివృత్తంతో రూపొందించిన చిత్రమే “ఉక్కు సత్యాగ్రహం”. జనం ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ తెలుగుసేన బ్యానర్ పై దర్శకుడు సత్యారెడ్డి కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు, సెన్సార్ పూర్తిచేసుకుంది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో డిసెంబర్ రెండవ వారంలో దాదాపు 300 థియేటర్లలో విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్ కీలకపాత్ర పోషించడంతో పాటు నాలుగు పాటలు రాశారని చిత్ర దర్శకుడు సత్యారెడ్డి చెబుతూ వాటిని ఆలపించారు. చిత్రంలో కీలక సన్నివేశాల్లో కూడా గద్దర్ నటించగా, గాజువాక పల్సర్ బైక్ ఝాన్సీ హీరోయిన్ గా నటించిందని, వైజాగ్ ఎంపీ ఎం.వి.వి. సత్యానారాయణ, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మేఘన, స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ నాయకులు అయోధ్య రామ్, ఆదినారాయణ, వెంకట్రావు, ప్రసన్న కుమార్, కెయస్ఎన్ రావ్, మీరా, పల్నాడు శ్రీనివాస రెడ్డి, రమణారెడ్డి, హనుమయ్య, అప్పికొండ అప్పారావ్, బాబాన్న, సింగ్ తదితరులు కీలకపాత్రలు పోషించారని తెలిపారు. కార్మికులు, భూసేకరణకు స్థలం ఇచ్చినవారి పిల్లలు కూడా నటించారు.
దండియాత్రను బ్రిటిషు వారిపై దండయాత్రగా మహాత్మాగాంధీ ప్రకటించి, శాంతియుతంగా నడిపిన “ఉప్పు సత్యాగ్రహం” స్పూర్తితో “ఉక్కు సత్యాగ్రహం” చిత్రాన్ని తెరకెక్కించినట్లు సత్యారెడ్డి తెలిపారు. వాస్తవానికి దగ్గరగా, తెలుగువారి పోరాటాల గురించి యువతరాన్ని ఆలోచింప చేసేలా ఈ చిత్రం తెరకెక్కించామని ఆయన చెప్పుకొచ్చారు. గద్దర్ తో పాటు గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ ఈ చిత్రంలో అద్భుతమైన పాటలు రాశారని సత్యారెడ్డి వివరించారు. తెలుగువారి చరిత్ర, పోరాటాలను చిత్రాల రూపంలో ఇందులో చూపిస్తూ, ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అనే అలనాటి నినాదంతో కూడిన పోరాట పటిమను, ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీ ప్రయివేటీకరణకు నిరసనగా నడిచిన ఉద్యమాన్ని ఈ సినిమా ద్వారా మరోసారి చాటిచెబుతున్నామని ఆయన తెలిపారు. విశాఖ ఉక్కు సాధన కోసం అలనాడు 32మంది అశువులు బాసారని ఆయన గుర్తుచేస్తూ వారికి, గద్దర్ కి ఈ సినిమాను అంకితం ఇస్తున్నట్లు ఆయన చెప్పారు.
హైదరాబాద్ నుంచి ఈ నెల 24న ప్రారంభించిన ఈ చిత్రం ప్రమోషన్ వర్క్ లో భాగంగా చిత్ర దర్శకుడు సత్యారెడ్డి, కో డైరెక్టర్ రంగనాథ్, సహ నిర్మాత చక్రయ్య తో కలిసి రాజమహేంద్రవరంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. గతంలో సర్దార్ చిన్నపరెడ్డి, అయ్యప్ప దీక్ష, వంటి 52 చిత్రాలు నిర్మించిన సత్యారెడ్డి 53వ చిత్రంగా ఉక్కు సత్యాగ్రహం నిర్మించారు.